సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లో కొత్త అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కోవిడ్–19 నేపథ్యంలో మూతబడ్డ సంక్షేమ వసతి గృహాలు ఈనెల 18 నుంచి పునఃప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పోస్టుమెట్రిక్ హాస్టళ్లు మాత్రమే తెరుచుకోగా, వీటిలో కాలేజీ విద్యార్థులు వసతి పొందుతున్నారు. 2020–21 విద్యా సంవత్సరంలో కోర్సు ముగిసిన విద్యార్థులు హాస్టల్ నుంచి రిలీవ్ కాగా.. వారి స్థానంలో ఫ్రెషర్స్‌కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు సంబంధించి 550 పోస్టుమెట్రిక్ వసతి గృహాలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. తాజాగా ఈ హాస్టళ్లలో నూతన అడ్మిషన్లకు ప్రభుత్వం ఆమోదించడంతో దాదాపు 40 వేల మంది విద్యార్థులకు అవకాశం కలగనుంది. ఏయే హాస్టల్‌లో ఎంతమందికి ప్రవేశాలు కల్పించాలనే దానిపై క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
భౌతిక దూరానికి ప్రాధాన్యం..: ఒక్కో కాలేజీ హాస్టల్‌లో 150 నుంచి 220 మంది వరకు విద్యార్థులు వసతి పొందుతున్నారు. పెద్ద భవనం, అధిక సంఖ్యలో గదులున్న చోట ఎక్కువ మంది విద్యార్థులుండగా.. చిన్నపాటి భవనాల్లోని హాస్టళ్లలో 120 నుంచి 150 మంది విద్యార్థులుంటున్నారు. వసతి గృహాల్లో భౌతిక దూరానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో గది విస్తీర్ణాన్ని బట్టి విద్యార్థుల సంఖ్యను ఖరారు చేయాలని సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు పంపారు.
ఈ నేపథ్యంలో వసతి గృహ సంక్షేమాధికారులు శనివారం నాటికి ప్రతిపాదనలు రూపొందించి ఆయా జిల్లాల సంక్షేమాధికారులకు పంపినట్లు సమాచారం. వీటికి జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆమోదం లభించిన తర్వాత కొత్త అడ్మిషన్లు ప్రారంభిస్తారు. అలాగే ప్రీ మెట్రిక్ హాస్టళ్ల ప్రారంభంపైనా అధికారులు దృష్టి సారించారు. వచ్చేనెల 1 నుంచి వీటిని ప్రారంభించేలా అధికారులు ప్రణాళికలు తయారు చేసి రాష్ట్ర కార్యాలయానికి నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment