అల్పాహారం కోసం విద్యార్థుల ఆందోళన
ఆదిలాబాద్ : వారంతా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు. ఉదయం 10 గంటలు అవుతున్నా... గరుకుల సిబ్బంది అల్పాహారం పెట్టకపోవడంతో విద్యార్థుల కడుపు మండింది. దాంతో విద్యార్థులంతా ధర్నాకు దిగారు.విద్యార్థి సంఘాల నేతలు కూడా వీరికి మద్దతుగా అక్కడికి చేరుకుని గురుకుల సిబ్బందికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఉదయం ఇది చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి.... గురుకుల విద్యార్థులకు ఆహారం అందించే బాధ్యతను ఉన్నతాధికారులు ఓ కాంట్రాక్టర్కు అప్పగించారు. అయితే, తన సిబ్బంది రాలేదంటూ కాంట్రాక్టర్ ఆదివారం ఉదయం విద్యార్థులకు అల్పాహారం అందించలేదు. ఉదయం 10 గం. దాటిన అల్పహారం అందకపోవడంతో విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బందిని నిలదీశారు.
దీంతో పంచాయతీ తాహసీల్దార్కు చేరింది. దాంతో తాహసీల్దార్ కళాశాలకు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి.. కాంట్రక్టర్పై చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. దాంతో విద్యార్థులు శాంతించారు. విద్యార్థులకు ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్ గురుకుల పాఠశాల సిబ్బందిని ఆదేశించారు.