'అలీని చూసి నేర్చుకోండి'
లాస్ ఎంజెల్స్: నేటి తరం, యువత తప్పకుండా తమ తల్లిదండ్రులతో ప్రేమగా నడుచుకోవాలని, వారికి విలువను ఇవ్వాలని ప్రముఖ హాలీవుడ్ సింగర్ టింబర్ లేక్ అన్నాడు. ఫ్యూచర్ సెక్స్/ లవ్ సౌండ్స్ ఆల్బంకు తొలిసారి టీన్ చాయిస్ అవార్డు-2016 పొందిన ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. తనను ఎలా గౌరవించుకోవాలో తన తల్లిదండ్రులు నేర్పించారని.. ప్రతి వ్యక్తి నిర్మాణం అతడి ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని చెప్పాడు.
'మీ గురించి, మీరు తీసుకునే నిర్ణయాల గురించి మీకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీ 20 ఏళ్ల ప్రాయాన్ని వృధా చేయకండి. బయటకు వెళ్లండి. ఏది అసాధ్యమో దాన్నే చేయండి. మంచి బలమైన తరంగా ఎదగండి. మీ అమ్మనాన్నలతో ప్రేమగా ఉండండి. ఇదే విషయాన్ని నా కుమారుడు ఏదో ఒక రోజు తన జీవితంలో చూస్తాడు' అని చెప్పాడు. ఈ సందర్భంగా ప్రముఖ లెజండరీ బాక్సర్ మహ్మద్ అలీని ఆయన తలుచుకున్నాడు. ఒక వ్యక్తిగా ఎదగాలంటే అలీని చూసి నేర్చుకోవాలని అన్నారు.