బెడ్ విధానంతో పసుపులో అధిక దిగుబడి
► హార్టికల్చర్ ఓఎస్డీ కిషన్రెడ్డి, డీడీహెచ్ సంగీత లక్ష్మి
► కోరుట్లలో పసుపు రైతులకు అవగాహన సదస్సు
కోరుట్ల రూరల్ : బెడ్ విధానం సాగుతో పసుపు పంటలో అధిక దిగుబడి సాధించవచ్చని హార్టికల్చర్ ఓఎస్డీ, శాస్త్రవేత్త కిషన్రెడ్డి, డీడీహెచ్ సంగీతలక్ష్మీ అన్నారు. సోమవారం పట్టణంలోని వాసవీ కల్యాణ భవనంలో పసుపు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పసుపులో శాస్త్రీయ విధానం, విత్తనాల ఎంపిక తదితర అంశాలను రైతులకు వివరించారు. ఈ పద్దతిలో 4 అడుగుల వెడల్పులో బోజలు నిర్మించి విత్తనాలు వేయాలన్నారు. ఒక్కో ఎకరానికి 2 క్వింటాళ్ల విత్తనం అవసరమవుతుందని, ఈ విధానం ద్వారా రైతులు ఒక్కో ఎకరానికి సుమారు 40 క్వింటాళ్ల నుంచి 50 క్వింటాళ్ల వరకు పసుపు దిగుబడి సాధించవచ్చన్నారు.
ఈ విధానంలో తేమ శాతం తక్కువ అవసరమన్నారు. దీని కోసం డ్రిప్ సిస్టం తప్పని సరిగా వినియోగించాలన్నారు. ఈ విధానాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం డివిజన్లో మొదటి విడతలో 70 మంది రైతులను ఎంపిక చేసి, వీరికి ఒక ఎకరానికి అయ్యే ఖర్చు రూ.50వేలలో 70 శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు. ఒక్కో రైతుకు రూ.35 నుంచి రూ.38 వేల వరకు రాయితీ అందజేస్తామని వివరించారు. పంటకు ఏమైనా చీడపీడలు ఆశించి నష్టం చేస్తే ఫోటోలను వాట్సప్ ద్వారా తమకు పంపితే నివారణ పద్దతులు సూచిస్తామన్నారు. ఈ విధానాన్ని అమెరికాలో వాట్సప్ అగ్రికల్చర్ అంటారని పేర్కొన్నారు.
రాబోయే కాలంలో ఈ విధానాన్ని మరింత విస్తరించటానికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పలువురు రైతులు మాట్లాడుతూ డ్రిప్ పరికరాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతుందని, ప్రభుత్వం తగినంత బడ్జెట్ కేటాయించి డ్రిప్ పరికరాలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీహెచ్-2 జగిత్యాల మరియన్న, హార్టికల్చర్ అధికారి జావిద్ పాషా, హెచ్ఈఓలు రమేష్, వాసవి, అన్వేష్, అనిల్, హార్టీకల్చర్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.