Bedding industry
-
ఏపీ మార్కెట్లోకి స్లీప్‌వెల్ కంఫర్ట్‌సెల్ పరుపు
లబ్బీపేట(విజయవాడ తూర్పు): స్లీప్‌వెల్ సంస్థ తమ నూతన ఉత్పాదన కంఫర్ట్ సెల్ టెక్నాలజీ మ్యాట్రెసెస్(పరుపులు)ను శనివారం ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భూషన్ పాఠక్ సరికొత్త పరుపులను విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిగా కంఫర్ట్‌సెల్ మ్యాట్రస్ టెక్నాలజీని ప్రవేశ పెట్టినట్లు ప్రకటించారు. ఈ టెక్నాలజీ ద్వారా పరుపులు అత్యంత సౌకర్యాన్ని, ఆహ్లాదకర నిద్రను ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ పరుపులు నిద్రను పాడుచెయ్యకుండా పనిచేయడమే కాకుండా, మీ వెన్నును రాత్రంతా తన సహజసిద్ధ రీతిలో ఉండే విధంగా ఉంచుతుందన్నారు. ఈ కంఫర్ట్ సెల్ శ్రేణిలో నాలుగు ప్రీమియం మోడల్స్ కేవలం సౌకర్యవంతమైన అనుభూతిని ఇవ్వడమే కాకుండా, విలాసవంతమైన ఫ్యాబ్రిక్స్ వాడటం ద్వారా అంతర్జాతీయ సొగసులను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. స్లీప్‌వెల్ సౌత్ ఇండియా జనరల్ మేనేజర్ శ్రీనివాస్ పాండిచ్చేరి మాట్లాడుతూ తమ సంస్థ మానవ శరీర నిర్మాణాన్ని లోతుగా అర్థం చేసుకుంటూ దానిని అత్యంత సౌకర్యవంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉంటారని, గుర్తిస్తూ దానికి అనుగుణంగా ఈ బ్రాండ్ సౌకర్యానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిందన్నారు. -
స్ప్రింగ్ మ్యాట్రెస్‌లో పెప్స్ హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పరుపుల తయారీలో ఉన్న పెప్స్ ఇండస్ట్రీస్ భారత్‌లో స్ప్రింగ్ మ్యాట్రెస్ విభాగంలో తన హవాను కొనసాగిస్తోంది. ఈ విభాగంలో ఐదేళ్లుగా తాము టాప్‌లో ఉన్నామని కంపెనీ జాయింట్ ఎండీ జి.శంకర్ రామ్ చెప్పారు. గురువారం సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో డోర్ హౌజ్ ఏర్పాటు చేసిన పెప్స్ ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్‌ను ప్రారంభించిన సందర్భంగా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో ప్రత్యేకంగా మాట్లాడారు. డిజైనింగ్‌కు పెద్ద పీట వేయడం వల్లే స్ప్రింగ్ మ్యాట్రెస్ అమ్మకాల్లో తొలి స్థానంలో ఉన్నామని చెప్పారు. 90 ఉత్పాదనలకు ట్రేడ్‌మార్క్ ఉందని తెలియజేశారు. ప్రపంచస్థాయి నాణ్యతగల మెమొరీ ఫోమ్ పరుపులను ఇటీవలే ప్రవేశపెట్టామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల పరుపులు విక్రయించామని, 2017–18లో 3.25 లక్షల యూనిట్లను అమ్మాలని లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారాయన. ‘‘కంపెనీని 12 ఏళ్ల క్రితం ప్రారంభించాం. అయిదేళ్లలో రూ.100 కోట్ల స్థాయికి చేరుకున్నాం. మొదట్లో ఎలాంటి ప్రకటనలూ ఇవ్వలేదు. కస్టమర్లే మా బ్రాండ్‌ను ప్రచారం చేశారు’’ అని ఆయన వివరించారు. తెలంగాణలో ప్లాంటు: కంపెనీకి కోయంబత్తూరుతో పాటు ఉత్తరాదిన మరో మూడు ప్లాంట్లున్నాయి. కోయంబత్తూరులో రూ.20 కోట్లతో ఫోమ్ మ్యాట్రెస్ తయారీకై అత్యాధునిక ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. 2016–17లో కంపెనీ టర్నోవరు రూ.254 కోట్లు. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 75 శాతం. 2020 నాటికి టర్నోవరును రూ.750 కోట్లకు చేర్చాలని పెప్స్ కృతనిశ్చయంతో ఉంది. ఇందులో రూ.500 కోట్లు స్ప్రింగ్ మ్యాట్రెస్ విభాగం నుంచే సమకూరుతుందని శంకర్ రామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘2020 కల్లా ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్ల సంఖ్యను 400లుకు చేరుస్తాం. యాక్సెసరీస్ విభాగంలో మరింత విస్తరిస్తాం. మూడేళ్లలో మరో రెండు ప్లాంట్లు నెలకొల్పే అవకాశం ఉంది. ఇందులో ఒకటి తెలంగాణలో పెట్టాలని భావిస్తున్నాం’ అని వెల్లడించారు. -
పరుపుల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పరుపుల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెంకటేశ్వర పరుపుల పరిశ్రమలో వివిధ రకాల పరుపులను తయారు చేస్తుంటారు. పక్కనే గల గోదాంలో తయారు చేసిన పరుపులకు ఫినిషింగ్ చేస్తారు. మధ్యాహ్నం భోజన సమయంలో గోదాములో షార్టుసర్క్యూట్ జరగటంతో మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఫినిషింగ్‌కు ఉపయోగించే మూడు భారీ యంత్రాలు, వెయ్యి వరకు పరుపులు దహనమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని యాజమాన్యం తెలిపింది. పటాన్చెరు, రామచంద్రాపురంల నుంచి శకటాలు వచ్చి మంటలను ఆర్పివేశాయి. బొల్లారం సీఐ సతీష్‌రెడ్డి, ఎస్ఐ సాయిరాం, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు పరిశ్రమను పరిశీలించారు. కార్మికులు గోదాము బయట ఉన్నప్పుడు అగ్నిప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదని సీఐ చెప్పారు.