మక్క దక్కేనా?
ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచే వరుణుడు రైతులతో దోబూచులాడుతున్నాడు. అవసరమైన సమయంలో వర్షాలు లేక ఇప్పటికే చాలా మంది అన్నదాతలు పంటల సాగులో వెనకబడిపోయారు. అడపాదడపా కురిసిన వానలకు ధైర్యం చేసి కొందరు మొక్కజొన్న పంటలు వేశారు. ప్రస్తుతం చేలన్నీ పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ఆరుతడి పంటలకు ప్రస్తుతం వాన చాలా అవసరం. కానీ వరుణుడు ముఖం చాటేశాడు.
దీంతో పంట చేతికి వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి, కూరగాయ పంటలు ప్రస్తుతం కాత దశలో ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు కురిస్తేనే కంకులు విత్తులు పట్టే అవకాశం ఉంది. కీలకమైన ఈ సమయంలో వరుణుడి జాడ లేక అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. ఎండలు మండి పోతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో ఒక్క వాన పడితే చాలు తమ కష్టాలు గట్టెక్కుతాయని భావిస్తున్నారు. లేదంటే ఇన్నాళ్లూ పడిన కష్టం వృథా అవుతుందని వాపోతున్నారు. వర్షం పడాలని కోరుతూ ఆలయాలు, ప్రార్థన మందిరాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వానదేవుడు కరుణించాలని వేడుకుంటున్నారు.