Begumpet police
-
భయపడకు తల్లీ.. నీ కొడుకు వచ్చేశాడు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : ‘భయపడకు తల్లీ.. నీ కొడుకు వచ్చేశాడు. నిన్ను క్షేమంగా ఆశ్రమానికి చేరుస్తాడు’అంటూ డీజీపీ మహేందర్‌రెడ్డి చేసిన ట్వీట్ పలువురి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ విషయం ఏంటంటే బేగంపేటలో ఓ వృద్ధురాలు ఒంటరిగా నడవలేని స్థితిలో నిస్సహాయంగా కనిపించింది. తన వివరాలేమీ చెప్పలేకపోతోంది. దీంతో స్థానికులు డయల్ 100కు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి వచ్చిన పెట్రోకారు సిబ్బందిలో ఓ కానిస్టేబుల్ ఆ వృద్ధురాలిని కన్నతల్లిని ఎత్తుకున్న విధంగా రెండు చేతులతో మోస్తూ తీసుకెళ్లాడు. ఆమె వివరాలు ఆరా తీసి చివరికి ఇంటికి చేర్చారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న డీజీపీ బేగంపేట పోలీసులను అభినందించారు. ప్రజలు ఎలాంటి ఆపదలో చిక్కుకున్నా కొడుకులా, సోదరుడిలా, తోబుట్టువులా, స్నేహితుడిలా పోలీసులు ఆపద్బాంధవుల్లా వస్తారని అభయమిచ్చారు. -
భర్త ఉన్మాదం.. భార్యపై కత్తివేట్లు
హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భార్యపై కక్షపెంచుకున్న ఓ వ్యక్తి ఆమెపైనా, ఆమె పుట్టింటి బంధువులపైనా విచక్షణారహితంగా కత్తితో దాడిచేశాడు. బేగంపేట పోలీసు స్టేషను ఆవరణలోనే గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటన నగరాన్ని నివ్వెరపరచింది. ఇటీవల జరిగిన అత్తాపూర్, ఎర్రగడ్డ కత్తి దాడి సంఘటనలు మరువక ముందే సాక్షాత్తూ పోలీసుల ఎదుటే జరిగిన ఈ ఉదంతం పలువురిని విస్మయ పరుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఉన్మాదిలా మారిన నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు..బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగెనవర్ తెలిపిన వివరాల మేరకు ఆల్వాల్ యాప్రాల్ సమీప బాలాజీనగర్‌కు చెందిన సయ్యద్ రెహమాన్ పెయింటర్. బేగంపేట రసూల్‌పురాకు చెందిన కౌసర్బేగంను ప్రేమించిన రెహమాన్, 2009లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా మద్యానికి బానిసైన అతను తన భార్యను వేధిస్తున్నాడు. దీంతో ఆమె గత నాలుగైదు నెలల క్రితం పుట్టింటికి చేరింది. ఈ నేపథ్యంలోనే కౌసర్‌బేగం పనిచేసే పాటిగడ్డలోని రాక్‌స్టార్ బట్టల గోదాం వద్దకు గురువారం ఉదయం వెళ్లిన రెహమాన్ ఆమెతో డబ్బులు కావాలని గొడవ పడ్డాడు. తర్వాత బాధితురాలు తల్లి సర్దార్బేగం, అక్క షాకీర్బేగంలతో కలసి బేగంపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ షాకీర్బేగం కుమార్తె మస్తానాబేగం, కౌసర్‌బేగం మరో సోదరి కుమారుడు సల్మాన్‌ఖాన్ కోసం స్టేషన్ బయట వారు వేచి చూస్తుండగా రెహమాన్ అక్కడికి చేరుకున్నాడు. కౌసర్‌బేగం, వారి కుటుంబీకులు కనిపించడంతో వారిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. కౌసర్బేగంతో పాటు ఆమె తల్లి , అక్క , మస్తానాబేగం, సల్మాన్‌ఖాన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకున్న పోలీసుల పైకి సైతం కత్తి ఎత్తి... దసరా పండుగ కావడంతో గురువారం ఉదయం పోలీస్‌స్టేషన్‌లో పూర్తిస్థాయి సిబ్బంది లేరు. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ బుచ్చయ్యతో పాటు ఇద్దరు ఎస్ఐలు, నలుగురైదుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు.వారు రెహమాన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిపైకీ నిందితుడు కత్తి ఎత్తాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయలో పోలీసు సిబ్బందిపై కూడా రక్తం చిందింది. పోలీస్‌స్టేషన్ ఆవరణ రక్తపు మడుగులా మారింది. అయితే తర్వాత పోలీసులు రక్తాన్ని నీటితో శుభ్రపరిచేశారు. గాంధీకి తరలింపు...ఒకరి పరిస్థితి విషమం.. ఈ దాడిలో చేతులు, భుజాలు, కాళ్లకు తీవ్ర గాయాలవ్వడంతో కుప్పకూలిన కౌసర్‌బేగం, ఆమె బంధువులను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.వీరికి సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం తప్పింది. వీరిలో ఒక్క మస్తానాబేగం పరిస్థితి మాత్రం విషమంగా ఉండడంతో కిమ్స్‌కు తరలించారు. నిందితుడిని రిమాండ్‌కు పంపనున్నట్లు ఇన్స్పెక్టర్ బుచ్చయ్య తెలిపారు. రెండేళ్ల కిందటే కేసు...రాజీ... కౌసర్‌బేగం రెండేళ్ల క్రితమే తనను రక్షించాలని బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. వారు బేగం పేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు ఆమెను పంపడంతో 2016 జూలై 20న అక్కడ పిర్యాదు చేసింది.దీంతో మహిళా పోలీసులు కౌన్సెలింగ్ నిమిత్తం సీసీఎస్‌కు పంపించారు. అది పూర్తయిన రెండు నెలలకు సెప్టెంబర్ 27న తామిద్దరం బాగానే ఉంటున్నామని, కేసును ఉపసంహరించుకుంటున్నట్లు కౌసర్‌బేగం పోలీసులకు తెలిపింది. వారిద్దరూ రాజీకి రావడంతో పోలీసులు కూడా కేసును కొట్టివేశారు. -
ముఖేష్‌కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
హైదరాబాద్: ప్రముఖ హాకీ క్రీడాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ముఖేష్‌కుమార్‌పై హైదరాబాద్ బేగంపేట్ పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. సీఎం కప్ అడ్‌హక్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయన తమను హాకీ ఆడేందుకు అనుమతించకపోవడమే కాకుండా కులం పేరుతో దూషించాడని ఆరోపిస్తూ యశ్వంత్, నాగరాజు, వినయ్, మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18 నుంచి 26 ఏళ్ల వారు మాత్రమే హాకీ ఆడాలని నిబంధన విధించారని, అయితే హాకీ ఆడేందుకు ఎలాంటి వయోపరిమితి లేదని, ఇదే విషయంపై తాము ముఖేష్‌కుమార్‌ను నిలదీసి అడిగినందుకు కులం పేరుతో దూషించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
యువతిని దూషించిన టీవీ యాంకర్ అరెస్టు
యువతిని దూషించిన ఓ టీవీ యాంకర్‌ను బేగంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఓ మ్యూజిక్ ఛానల్లో యాంకర్‌గా పనిచేసే మహమ్మద్ ఖయ్యూమ్ అలియాస్ లోబో శుక్రవారం రాత్రి 9 గంటలకు తన బైక్‌పై అమీర్‌పేట నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నాడు. పెట్రోల్‌బంక్ సమీపంలో ముందు స్కూటీపై వెళ్తున్న యువతి తనకు సైడ్ ఇవ్వకపోవడంతో దూషించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అకారణంగా తనను దూషించిన యాంకర్‌పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు లోబోను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
‘తేజ్‌దీప్ కేసులో వారంలో చార్జిషీటు వేయండి’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేమనే అభిప్రాయం ప్రజల్లో కలగరాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఐపీఎస్ అధికారి తేజ్‌దీప్ కౌర్ మీనన్‌పై నమోదైన కేసులో వారం లోపు చార్జిషీట్ దాఖలు చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని డీజీపీకి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తేజ్‌దీప్ కౌర్ మరికొందరు తన ఇంట్లోకి వచ్చి తన పట్ల దురుసుగా ప్రవర్తించి దూషించారంటూ జి.హరిత అనే మహిళ 2003లో బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి పదేళ్లయినా, కేసులో దర్యాప్తు పూర్తయినా కూడా ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదన్న కారణం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, వారం రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.