Belampalli
-
అంజన్నా.. మన్నించు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సాక్షి దినపత్రిక జిల్లా ప్రతినిధి పోలంపల్లి ఆంజనేయులుకు క్షమాపణలు చెప్పారు. నెన్నెల మండలంలో జరుగుతున్న భూ కబ్జాలపై సాక్షిలో వరుస కథనాలు రాసినందుకు గాను ఆంజనేయులుపై ఎమ్మెల్యే చిన్నయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి నిరసనగా జర్నలిస్టు సంఘాలు గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. స్పందించిన ఎమ్మెల్యే చిన్నయ్య తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తాను సాక్షి ప్రతినిధిపై చేసిన అనుచిత వాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. మనసులో ఉన్న బాధను జర్నలిస్టు మిత్రులతో పంచుకునే క్రమంలో ఒకటి రెండు వ్యాఖ్యలు తప్పుగా దొర్లాయని పేర్కొన్నారు. అలాంటి మాటలు అన్నందుకు చింతిస్తున్నానని, తనను పెద్ద మనసుతో మన్నించాలని చేతులు జోడించి వేడుకున్నారు. ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, ఎవరినీ దూషించాలనేది తన ఉద్దేశం కాదని తెలిపారు. ఇకపై ఎన్నడూ ఎవరి మనసులు నొచ్చుకోవద్దనేది తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిలువేరి నర్సింగం, ఆత్మ బెల్లంపల్లి డివిజన్ అధ్యక్షుడు ఎస్.బాణయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్.సత్యనారాయణ, కౌన్సిలర్లు బి.రాజేశ్వర్, ఎలిగేటి శ్రీనివాస్, ఎల్.రాములు, జిలకర వాసు, ఎస్కే.యూసుఫ్, సముద్రాల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు మునిమంద రమేష్, దెబ్బటి రమేష్, భీమ శంకర్ పాల్గొన్నారు. -
దిగుబడిపై దిగులు
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : మామిడి తోటల పెంపకానికి తూర్పు ప్రాంతంప్రసిద్ధిగాంచింది. దశేరి, బంగినపల్లి, మల్లిక, తోతపురి తదితర రకాల మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. జిల్లా వ్యా ప్తంగా 23 వేల హెక్టార్లలో మామిడి తోటల పెంపకం జరుగుతోంది. ఇందులో 5 వేల హెక్టార్లలో ఐదేళ్లలోపు మామిడి తోటలు ఉండగా 18 వేల హెక్టార్లలో కాపుకాసే తోటలు ఉన్నాయి. ఏటా జిల్లాలో సుమారు రూ.50 కోట్లకు పైబడి మామిడి వ్యాపారం సాగుతుందనేది అంచనా. అంత పెద్దస్థాయిలో మామిడి వ్యాపారం జరుగుతున్నా స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం రైతులను తీవ్రంగా వేధిస్తోంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాంతానికి తీసుకెళ్లి పంటను అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడుతోంది. పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి మామిడి రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. పగబట్టిన ప్రకృతి మామిడి రైతులు ఐదారేళ్ల నుంచి నష్టాలను చవిచూస్తున్నారు. ఏటా చెట్లకు పూత ఏపుగా రావడం, పూత, పిందె దశలో అకాల వర్షాలు కురిసి, గాలి దుమారం వీయడంతో నష్టం జరుగుతోంది. ఆ ప్రభావం కాపుపై పడుతోంది. ఆ రకంగా దిగుబడి తగ్గిపోయి నష్టపోతున్నారు. ఈ ఏడు కూడా ప్రకృతి మామిడిపై కన్నెర చేసింది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల భారీ వర్షాలు కురిశాయి. ఆ వర్షాలకు చెట్లకు ఏపుగా పూసిన పూత సగానికిపైగా రాలింది. పూత పడిపోయి ప్రస్తుతం చెట్లకు మామిడికాయలు అంతగా కనిపించడం లేదు. ఒక్కో చెట్టుకు సగటున పది నుంచి ఇరవై కాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. కొన్ని తోటల్లో ఆ మాత్రం కాపు కూడా కనిపించడం లేదు. సాధారణంగా ఎకరాకు మూడు టన్నుల మామిడి దిగుబడి వస్తుంది. ఆదిలోనే ప్రకృతి దెబ్బతీయడంతో ప్రస్తుతం ఎకరాకు రెండు నుంచి రెండున్నర టన్నుల పంట దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఉద్యానవన అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ రకంగా మామిడి కాపు పడిపోయి పంట దిగుబడిపై ప్రభావం పడింది. తగ్గిన మామిడి దిగుబడితో వ్యాపారం రూ.50 కోట్ల నుంచి రూ.25 కోట్లకు పడిపోనుందని వ్యాపార, వాణిజ్యవర్గాలు పేర్కొంటున్నాయి. పది రోజుల క్రితం కురిసిన గాలి దుమారానికి కూడా మామిడి కాయలు రాలాయి. ఎంత యత్నించినా.. మామిడి పూత, పిందెను దక్కించుకోవడానికి రైతులు ఎన్ని యత్నాలు చేసిన సత్ఫలితాలు ఇ వ్వడం లేదు. ఏపుగా పూత రావడానికి రైతులు ముందస్తుగానే చెట్ల మొదళ్లలో దుక్కులు దు న్ని, ఎరువులు వేసి నీటి తడులు అందిస్తారు. ఇందుకోసం హెక్టార్‌కు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు అవుతుంది. సాధారణంగా జిల్లా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మామిడి చెట్లకు జనవరి మాసం నుంచి పూత రావడం జరుగుతుంది. మార్చి మొదటి వారం వరకు వచ్చిన పూత పిందె దశకు మారుతుంది. ఏప్రిల్‌లో ఓ మోస్తారు సైజు కాయ చెట్లకు దర్శనమిస్తుంది. ఆ తర్వాత మే మొదటి వారంలో మామిడి కోత పనులు ఆరంభమవుతాయి. అయితే ఈసారి కాపు సగానికి పడిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పూత, పిందె, కాపును దక్కించుకోవడం కోసం ఇన్నాళ్లు రైతు పడిన శ్రమ వృథా కానుంది. ప్రకృతి వంచనకు గురైన మామిడి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.