ప్రెస్‌మీట్‌లో క్షమాపణలు అడుగుతున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సాక్షి దినపత్రిక జిల్లా ప్రతినిధి పోలంపల్లి ఆంజనేయులుకు క్షమాపణలు చెప్పారు. నెన్నెల మండలంలో జరుగుతున్న భూ కబ్జాలపై సాక్షిలో వరుస కథనాలు రాసినందుకు గాను ఆంజనేయులుపై ఎమ్మెల్యే చిన్నయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి నిరసనగా జర్నలిస్టు సంఘాలు గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. స్పందించిన ఎమ్మెల్యే చిన్నయ్య తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
తాను సాక్షి ప్రతినిధిపై చేసిన అనుచిత వాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. మనసులో ఉన్న బాధను జర్నలిస్టు మిత్రులతో పంచుకునే క్రమంలో ఒకటి రెండు వ్యాఖ్యలు తప్పుగా దొర్లాయని పేర్కొన్నారు. అలాంటి మాటలు అన్నందుకు చింతిస్తున్నానని, తనను పెద్ద మనసుతో మన్నించాలని చేతులు జోడించి వేడుకున్నారు. ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, ఎవరినీ దూషించాలనేది తన ఉద్దేశం కాదని తెలిపారు. ఇకపై ఎన్నడూ ఎవరి మనసులు నొచ్చుకోవద్దనేది తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిలువేరి నర్సింగం, ఆత్మ బెల్లంపల్లి డివిజన్ అధ్యక్షుడు ఎస్.బాణయ్య, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్.సత్యనారాయణ, కౌన్సిలర్లు బి.రాజేశ్వర్, ఎలిగేటి శ్రీనివాస్, ఎల్.రాములు, జిలకర వాసు, ఎస్‌కే.యూసుఫ్, సముద్రాల శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకులు మునిమంద రమేష్, దెబ్బటి రమేష్, భీమ శంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment