Bella Vista
-
సుందర సౌధం
‘బెల్లా విస్టా’ గురించి నేటి తరం వారికి ఎంత మాత్రం తెలుసో ఎవరికి వారుగానే జవాబివ్వాలి. నేరుగా వారికి తెలియదనడం భావ్యం కాదు కదా!! బెల్లా విస్టా అనికాకుండా, ఆస్కీ అని అంటే, లేదా Administrative Staff College of India (ASCI) గురించి వాకబు చేస్తే చాలామంది సులువుగా గుర్తుపడతారు. ఆస్కీ భవనాలనే, నిజాం కాలంలో బెల్లావిస్టా అని పిలిచేవారు. ‘బెల్లావిస్టా’ లాటిన్ పదం.. అంటేa beautiful view అని అర్థం. తెలుగులో చెప్పాలంటే, చూడచక్కని అందమైన ప్రాంతం. పేరుకు తగ్గట్లే ఎత్తై వృక్షాలు, పచ్చని పచ్చిక బయళ్లతో చల్లని వాతావరణంలో ఖైరతాబాద్ జంక్షన్లో ప్రశాంతంగా ఉండే ఈ అందమైన భవనాలలో సుమారు అర్ధ శతాబ్ద కాలంగా అనేక ప్రభుత్వ-ప్రభుత్వేతర సంస్థల్లోని ఉన్నతాధికారులకు ఆస్కీ పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిజాం కుమారుడి నివాసం.. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, నాటి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ టి.టి. కృష్ణమాచారి ప్రోత్సాహంతో, మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా ఆధునిక రీతిలో ప్రభుత్వ అధికారులకు తగిన శిక్షణ ఇప్పించాల్సిన అవసరాన్ని గుర్తించి ఏర్పాటు చేసిన శిక్షణ సంస్థ ఆస్కీ. 1919 ప్రాంతంలో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆస్థానంలోని ప్రధానమంత్రి సర్ అలీ ఇమామ్ అధికార నివాసంగా ఈ బంగళా నిర్మాణం జరిగింది. ఈ బంగళా ప్రక్కనే వున్న ‘లేక్‌వ్యూ’ గెస్ట్‌హౌస్ ప్రధానమంత్రి అధికార కార్యాలయంగా వుండేది. ప్రధానమంత్రి సర్అలీ ఇమామ్ 1922 ప్రాంతంలో తన పదవీ బాధ్యతల నుంచి తప్పుకుని హైదరాబాద్‌ను వదలిపెట్టి వెళ్లిపోయారు.ఆ తర్వాత, ఈ బంగళాను ఆధునీకరించి నిజాం పెద్ద కుమారుడి నివాసంగా కేటా యించారు. ప్రిన్స్ ఆఫ్ బేరార్, commander in chief of the state's armed forces హోదాలో నిజాం కుమారుడికి ఈ బంగళా కేటాయించారు. ఏడో నిజాం పాలన 1911 నుంచి 1948 వరకు కొనసాగింది. నిజాం నవాబుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడి పేరు మీర్ హిమాయత్ అలీఖాన్(1907). ఈయన్నే ఆజాం ఖాన్‌గా కూడా స్థానికులు పిలిచేవారు. రెండో కొడుకు పేరు - మీర్ సుజాత్ అలీఖాన్. ఈయన్ని ‘మౌజాంగా’ పిలిచేవారు. ఈయన సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు (1912) చైర్మన్‌గా ఉండేవాడు. ఈయన హిల్‌ఫోర్ట్ ప్యాలెస్‌లో ఉండేవాడు. ప్రస్తుతం దీనినే రిడ్జ్ హోటల్‌గా పిలుస్తున్నారు. నిజాం సోదరులు ఇద్దరూ 1931 నవంబర్ 12న ఫ్రాన్స్-దేశంలోని ‘నైస్’ అనే ప్రాంతంలో వివాహం చేసుకున్నారు. నిజాం పెద్ద కుమారుడు టర్కీ దేశపు ఆఖరి సుల్తాన్ అబ్దుల్ మాజిద్, ఏకైక కుమార్తె ప్రిన్సెస్ దారుషెవార్ను వివాహం చేసుకున్నాడు. దారుషెవార్ అంటే ‘మంచి ముత్యం’ అని అర్థం. కాగా, నిజాం రెండో కుమారుడు ప్రిన్సెస్ నిలోఫర్‌ను వివాహమాడారు. నిలోఫర్ అంటే కమలం అని అర్థం. ప్రిన్సెస్ నిలోఫర్‌కు దారుషెవార్తో దగ్గరి బంధుత్వం వుంది. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలకు నిజాం గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ హాజరు కాలేదు. నూతన వధూవరులు నగరానికి తిరిగి వచ్చాక, 1931 డిసెంబర్ 31న, నిజాం ప్రభువు చౌమహల్లా ప్యాలెస్‌లో వైభవోపేతంగా రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. రైలు కూతకు కోత.. ఆ రోజుల్లో బెల్లావిస్టా చాలా ప్రశాంతంగా ఉండేది. బంగళా ఎదురుగా హుస్సేన్‌సాగర్ కనిపిస్తూ వుండేది. ఆ సాగర్ తీరాన రైలు మార్గంపై ఒకే ఒకరైలు ఎలాంటి శబ్దం చేయకుండా, హారన్ మోగించకుండా నిశ్శబ్దంగా ముందుకు సాగేది. ఈ ప్రాంతం చేరువలోకి రాగానే, రైలు ఇంజన్ డ్రైవర్ హారన్ మోగించరాదనే ఆదేశాలు ఉండేవి. అలా ‘బెల్లావిస్టా’ అప్పట్లో భూతల స్వర్గంగా ఒక వెలుగు వెలిగింది. భారత స్వాతంత్య్రానంతరం నిజాం కుమారుడికి ప్రిన్స ఆఫ్ బేరార్, (కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మడ్ ఫోర్సెస్) హోదాలు తొలగిపోయాయి.అనంతరం, అధికార బంగళా ఖాళీ చేసి పంజగుట్టలోని ఎత్తయిన కొండపై గల బైటల్ అజీజ్ బంగళాకు మారాడాయన. అందుకే అమ్మాం ప్రస్తుతం నాగార్జున గ్రూపు సంస్థలు ఈ భవనంలో వున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడ్డాక ముందుగా బెల్లావిస్టా భవనాలను గెస్ట్‌హౌస్‌కు కేటాయించారు. తర్వాత కొన్నాళ్లకు 1957 డిసెంబర్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ)కోసం కేటాయించారు. ఆస్కీ కోసం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెల్లావిస్టాను రూ.12 లక్షలకు అమ్మివేసింది. అతి ఖరీదైన బంగళాను కారు చౌకగా ప్రభుత్వం అమ్మివేసిందని రాష్ర్ట అసెంబ్లీలో చర్చ జరిగిందట. తక్కువ ఖరీదుకైనా ఒక మంచి సంస్థకు,ఒక మంచి పని కోసం కేటాయించామని, ఏదో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మలేదని ప్రభుత్వం ప్రకటించింది. - మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com -
బెల్లవిస్టా... చరిత్రకు సాక్షి
హైదరాబాబాద్ మా కలల నగరం! ఇక్కడికి వస్తామని కలలు కనలేదు! ఇది మామూలు నగరమా? రెండు బిలియన్ డాలర్ల స్వంత ఆస్తితో ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ జీవించిన నగరం! ఎర్రని ఉదయం కోసం మగ్దుం వంటి విప్లవ కవులు కామ్రేడ్లూ ఉద్యమించిన నగరం! మానాన్న వయసున్న పెద్దవాళ్లు ఇక్కడి స్త్రీల సౌందర్యాలను మార్మికంగా వర్ణించుకునే వారు! ప్రిన్సెస్ నీలోఫర్ జీవించిన నగరం! హైద్రాబాద్‌ను ‘నగరాల్లో వధువు’గా ఉర్దూ కవులు అభివర్ణించారు. 1958లో మేము ఇక్కడకు వచ్చేసరికి ‘నిరుడు కురిసిన హిమసమూహములు’ కరిగిపోయినా, ఆ చల్లదనం, ఆహ్లాదం ఆవిరి కాలేదు! విశాలమైన, నీటైన సిమెంట్ రోడ్లు. ఒకే అంతస్తున్న ఇళ్లు. ఎటుచూసినా పచ్చదనం. రాజ్యం పోయినా దర్పమూ, ఔదార్యమూ లోపించని రాజవంశీకులు ! నగరంలో తొలకరి వర్షం ప్రతిఏటా జూన్ 7న పడేది. ఏ ఏడాదైనా అలా వాన కురవకపోతే, ఒకటి రెండురోజులు ఆలస్యమైతే ప్రతి హైద్రాబాదీ బాధపడేవారు. ‘ప్చ్, అయ్యో, వాన కురవలేదు ఎందుకనో’ అంటూ తనవల్లే వాన కురవలేదా అన్నంతగా ఫీలయ్యేవారు. తొలకరితో నగరం చల్లబడేది. మరో తొమ్మిది నెలలవరకూ! కుదుపుల్లేని ప్రయాణంలా రుతువులు మెల్లమెల్లగా మారేవి. వానాకాలం నుంచి చలికాలం రావడం దుస్తుల మార్పులో స్పష్టంగా తెలిసేది. ఇక్కడి హాయైన వాతావరణం ప్రజలకు సామరస్య స్వభావాన్నిచ్చిందేమో! ఈ వాతావరణం ఆదర్శనీయమైన గవర్నర్లనూ ఇచ్చింది! సరోజినీ నాయుడు నుంచి శివశంకర్ వరకూ ఎక్కువమందిని వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా పంపింది హైద్రాబాదే! శతాధిక వసంతాల భవనం! జిల్లాల్లో ట్రైనీలుగా పనిచేస్తూ శాఖాపరమైన పరీక్షలు రాసేందుకు 1956లో హైద్రాబాద్ వచ్చేవారం. రాజ్‌భవన్-పంజాగుట్ట జంక్షన్లో ఉన్న బెల్లావిస్టా అతిథి భవనంలో మా విడిది. బెల్లవిస్టా అనే ఇటాలియన్ పేరుకు అర్థం ‘అందమైన చోటు’! ఇక్కడ ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఉంది. అతిథి గృహంలో ఫర్నిచర్, పింగాణీ, వెండి పాత్రలూ, సేవకుల వినయవిధేయతలూ మమ్ములను ఆశ్చర్యానికి గురిచేసేవి. ‘రాజరికం’ మా అనుభవంలోకి వచ్చేది! ఈ అందమైన చోటు శతవసంతాలు చూసింది. హైద్రాబాద్ హైకోర్డు ప్రధానన్యాయమూర్తి ముస్లిహుద్దీన్ మహమ్మద్ 1905లో బెల్లావిస్టా భవంతిని నిర్మించారు. ఆయనకు హకీముద్దౌలా బిరుదుండేది. విశాలమైన ఆ భవంతిలో రెండు అడుగుల గోడలు తప్ప మధ్యలో ఎక్కడా స్తంభాలుండేవి కావు. 57వ ఏట ప్లేగు వ్యాధితో మరణించే వరకూ(1914) ఆయన అందులో నివసించారు. ఈ కాం పౌండ్లోనే ఇంకో భవంతి ఉంది. ఇందులో హకీముద్దౌలా తమ్ముడు న్యాయవాది, జలాలుద్దీన్ నివసించేవాడు. 1916లో ఆయన చనిపోయిన తర్వాత వారసులు అమ్మకానికి పెట్టారు. 1917లో ఫర్నిచర్‌తో సహా 60 వేల రూపాయలకు నిజాం కొన్నాడు. క ట్టుబడి ఖర్చు రూ.45 వేలు! రాకుమారుని ‘కటకట’! నిజాంకు ప్రధానమంత్రిగా పనిచేసిన సర్ అలీ ఇమామ్ 1919నుంచి 1922 వరకూ బెల్లవిస్టాలో నివసించారు. పక్కనే ఉన్న లేక్‌వ్యూ (ప్రస్తుతం ఎ.పి.సీ.ఎం క్యాంప్ ఆఫీస్) అలీ ఇమామ్ కార్యాలయం! సాయుధ దళాల అధిపతి, బేరార్ యువరాజు హోదాలో నిజాం పెద్దకుమారుడు అజంజా, 1922 నుంచి ఇందులో నివసించారు. బెల్లవిస్టా ముందు ఇప్పుడు విద్యుత్ కార్యాలయం ఉన్న భవంతి యువరాజుల గుర్రపుశాల! బెల్లవిస్టాలో ఆయన నివసించినన్నాళ్లూ రాత్రి విందు వినోదాలు పూర్తయ్యి నిద్రలోకి జారేవేళకి సూర్యుడు ఉదయిస్తుండేవాడు! యువరాజుకి నెలకు 25వేలు అలవెన్స్‌గా నిజాం ఇచ్చేవాడు. అది చాలక వడ్డీవ్యాపారుల వద్ద ముప్ఫై వేలు తీసుకున్నట్లుగా సంతకాలు పెట్టి పదివేల రూపాయలు తీసుకునేవాడు. పెద్ద-చిన్న ప్రిన్స్‌లు (అజంజా-మౌజాం జా) ఇలా చేసిన అప్పు మొత్తం నాలుగున్నరకోట్ల రూపాయలుగా లెక్కతేలింది. నిజాం క్లియర్ చేశాడు. ఇక్కడ రకరకాల స్త్రీ-పురుషులుండేవారు! వారందరినీ ఖాళీచేయాల్సిందిగా ఆదేశించి వారి తాలూకూ బాకీలు లెక్కవేసేందుకు నిజాం ఒక కమిటీ వేశాడు! తనకు 50 ఏళ్లు వచ్చినా ఆయన విదిల్చే ‘నాలుగు కాసుల కోసం’ ఎదురు చూడాల్సి వస్తోందని బేరార్ యువరాజు, నిజాంకు వ్యతిరేకంగా క్షుద్రపూజలు చేయించాడు! ఇవన్నీ తెలిసి నిజాం వార సుడిగా మనుమడు ముఖరంజాను నిర్ణయించాడు. ఫలితంగా తండ్రికొడుకుల మధ్య మాటలు లేవు! 1948లో హైద్రాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్‌లో భాగం అయ్యాక ‘నిజాం సైన్యాధ్యక్షుడు’ బెల్లవిస్టాను ఖాళీ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి బెల్లవిస్టా ప్రభుత్వ అతిథి గృహం. ట్రైనీ ఆఫీసర్లుగా మేం విడిది చేసినప్పుడు అక్కడి లైబ్రరీలో అపురూప గ్రంథాలను తిరగేశాం! ‘నిజాం సిబ్బంది’ చెప్పే బెల్లావిస్టా కథలు ఏ పుస్తకంలోనూ ఉండేవి కావు! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి