సుందర సౌధం | Bellavista: Peru's Hidden Gem of a Seaport Town | Sakshi
Sakshi News home page

సుందర సౌధం

Published Thu, Dec 11 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM

సుందర సౌధం

సుందర సౌధం

‘బెల్లా విస్టా’ గురించి నేటి తరం వారికి ఎంత మాత్రం తెలుసో ఎవరికి వారుగానే జవాబివ్వాలి. నేరుగా వారికి తెలియదనడం భావ్యం కాదు కదా!! బెల్లా విస్టా అనికాకుండా, ఆస్కీ అని అంటే, లేదా Administrative Staff College of India (ASCI) గురించి వాకబు చేస్తే చాలామంది సులువుగా గుర్తుపడతారు. ఆస్కీ భవనాలనే, నిజాం కాలంలో బెల్లావిస్టా అని పిలిచేవారు.
 
‘బెల్లావిస్టా’ లాటిన్ పదం.. అంటేa beautiful view అని అర్థం. తెలుగులో చెప్పాలంటే, చూడచక్కని అందమైన ప్రాంతం. పేరుకు తగ్గట్లే ఎత్తై వృక్షాలు, పచ్చని పచ్చిక బయళ్లతో చల్లని వాతావరణంలో ఖైరతాబాద్ జంక్షన్‌లో ప్రశాంతంగా ఉండే ఈ అందమైన భవనాలలో సుమారు అర్ధ శతాబ్ద  కాలంగా అనేక ప్రభుత్వ-ప్రభుత్వేతర సంస్థల్లోని ఉన్నతాధికారులకు ఆస్కీ పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
 
నిజాం కుమారుడి నివాసం..

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, నాటి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ టి.టి. కృష్ణమాచారి ప్రోత్సాహంతో, మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా ఆధునిక రీతిలో ప్రభుత్వ అధికారులకు తగిన శిక్షణ ఇప్పించాల్సిన అవసరాన్ని గుర్తించి ఏర్పాటు చేసిన శిక్షణ సంస్థ ఆస్కీ. 1919 ప్రాంతంలో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆస్థానంలోని ప్రధానమంత్రి సర్ అలీ ఇమామ్ అధికార నివాసంగా ఈ బంగళా నిర్మాణం జరిగింది. ఈ బంగళా ప్రక్కనే వున్న ‘లేక్‌వ్యూ’ గెస్ట్‌హౌస్ ప్రధానమంత్రి అధికార కార్యాలయంగా వుండేది. ప్రధానమంత్రి సర్‌అలీ ఇమామ్ 1922 ప్రాంతంలో తన పదవీ బాధ్యతల నుంచి తప్పుకుని హైదరాబాద్‌ను వదలిపెట్టి వెళ్లిపోయారు.ఆ తర్వాత, ఈ బంగళాను ఆధునీకరించి నిజాం పెద్ద కుమారుడి నివాసంగా కేటా యించారు.
 
ప్రిన్స్ ఆఫ్ బేరార్, commander in chief of  the state's armed forces హోదాలో నిజాం కుమారుడికి ఈ బంగళా కేటాయించారు. ఏడో నిజాం పాలన 1911 నుంచి 1948 వరకు కొనసాగింది. నిజాం నవాబుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడి పేరు మీర్ హిమాయత్ అలీఖాన్(1907). ఈయన్నే ఆజాం ఖాన్‌గా కూడా స్థానికులు పిలిచేవారు. రెండో కొడుకు పేరు - మీర్ సుజాత్ అలీఖాన్. ఈయన్ని ‘మౌజాంగా’ పిలిచేవారు. ఈయన సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు (1912) చైర్మన్‌గా ఉండేవాడు. ఈయన హిల్‌ఫోర్ట్ ప్యాలెస్‌లో ఉండేవాడు. ప్రస్తుతం దీనినే రిడ్జ్ హోటల్‌గా పిలుస్తున్నారు.
 
నిజాం సోదరులు ఇద్దరూ 1931 నవంబర్ 12న ఫ్రాన్స్-దేశంలోని ‘నైస్’ అనే ప్రాంతంలో వివాహం చేసుకున్నారు. నిజాం పెద్ద  కుమారుడు టర్కీ దేశపు ఆఖరి సుల్తాన్ అబ్దుల్ మాజిద్, ఏకైక కుమార్తె ప్రిన్సెస్ దారుషెవార్‌ను వివాహం చేసుకున్నాడు. దారుషెవార్ అంటే ‘మంచి ముత్యం’ అని అర్థం. కాగా, నిజాం రెండో కుమారుడు ప్రిన్సెస్ నిలోఫర్‌ను వివాహమాడారు. నిలోఫర్ అంటే కమలం అని అర్థం. ప్రిన్సెస్ నిలోఫర్‌కు దారుషెవార్‌తో దగ్గరి బంధుత్వం వుంది. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలకు నిజాం గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ హాజరు కాలేదు. నూతన వధూవరులు నగరానికి తిరిగి వచ్చాక, 1931 డిసెంబర్ 31న, నిజాం ప్రభువు చౌమహల్లా ప్యాలెస్‌లో వైభవోపేతంగా రిసెప్షన్ ఏర్పాటు చేశాడు.
 
రైలు కూతకు కోత..
ఆ రోజుల్లో బెల్లావిస్టా చాలా ప్రశాంతంగా ఉండేది. బంగళా ఎదురుగా హుస్సేన్‌సాగర్ కనిపిస్తూ వుండేది. ఆ సాగర్ తీరాన రైలు మార్గంపై ఒకే ఒకరైలు ఎలాంటి శబ్దం చేయకుండా, హారన్ మోగించకుండా నిశ్శబ్దంగా ముందుకు సాగేది. ఈ ప్రాంతం చేరువలోకి రాగానే, రైలు ఇంజన్ డ్రైవర్ హారన్ మోగించరాదనే ఆదేశాలు ఉండేవి. అలా ‘బెల్లావిస్టా’ అప్పట్లో భూతల స్వర్గంగా ఒక వెలుగు వెలిగింది. భారత స్వాతంత్య్రానంతరం నిజాం కుమారుడికి ప్రిన్‌‌స ఆఫ్ బేరార్, (కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్‌‌మడ్ ఫోర్సెస్) హోదాలు తొలగిపోయాయి.అనంతరం, అధికార బంగళా ఖాళీ చేసి పంజగుట్టలోని ఎత్తయిన కొండపై గల బైటల్ అజీజ్ బంగళాకు మారాడాయన.
 
అందుకే అమ్మాం
ప్రస్తుతం నాగార్జున గ్రూపు సంస్థలు ఈ భవనంలో వున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడ్డాక ముందుగా బెల్లావిస్టా భవనాలను గెస్ట్‌హౌస్‌కు కేటాయించారు. తర్వాత కొన్నాళ్లకు 1957 డిసెంబర్‌లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ)కోసం కేటాయించారు. ఆస్కీ కోసం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెల్లావిస్టాను రూ.12 లక్షలకు అమ్మివేసింది. అతి ఖరీదైన బంగళాను కారు చౌకగా ప్రభుత్వం అమ్మివేసిందని రాష్ర్ట అసెంబ్లీలో చర్చ జరిగిందట. తక్కువ ఖరీదుకైనా ఒక మంచి సంస్థకు,ఒక మంచి పని కోసం కేటాయించామని, ఏదో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మలేదని ప్రభుత్వం ప్రకటించింది.
 - మల్లాది కృష్ణానంద్
 malladisukku@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement