కింగ్ ప్యాలెస్
let's చూసొద్దాం రండి see
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ (1911-48) నివసించిన ప్రాంతం కింగ్ కోఠి. కింగ్ కోఠి అంటే కింగ్స్ ప్యాలెస్. ధనవంతుడైన ‘కమన్‌ఖాన్’కు చెందింది. కమన్‌ఖాన్ తన పేరును‘కె.కె’ అని ఇంగ్లిష్ అక్షరాలను ఈ ప్యాలెస్‌లోని అద్దాలు, తలుపులు, గోడలపై చెక్కించుకున్నాడు. నిజాం నవాబు ముచ్చటపడితే కమన్‌ఖాన్ ఆయనకు ఈ ప్యాలెస్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఐతే ఈ ప్యాలెస్‌లోని గోడలపై తలుపులపై కె.కె ఉండటంతో ఒకదశలో ఈ ప్యాలెస్ తనకు వద్దని నిజాం నిర్ణయించుకున్నాడు. కానీ, నిజాం ఆస్థాన మంత్రి నవాబు ఫరూదూన్-ఉల్-ముల్కు-ఫరూధూన్ జా, కె.కె అంటే కింగ్ కోఠి అని అర్థం వచ్చేలా సర్దిచెప్పడంతో నిజాం ఈ ప్యాలెస్‌లో ఉండటానికి సమ్మతించాడని ఒక కథనం ప్రచారంలో ఉంది.
సుమారు 21 ఎకరాల్లో విస్తరించిన విశాలమైన కింగ్ కోఠి ప్యాలెస్‌లో అనేక భవనాలున్నాయి. నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1911లో ఏడో నిజాంగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. కింగ్ కోఠిని తన అధికార నివాసంగా ప్రకటించాడు. కింగ్‌కోఠి ప్యాలెస్‌లోని డ్రాయింగ్ రూం చరిత్ర ప్రసిద్ధి చెందింది.
ఆ రోజుల్లో ఇక్కడ బ్రిటిష్
రెసిడెంట్‌లు, నాటి అధికార అతిథులు, ఉన్నతాధికారులను నిజాం ఈ బంగ్లాలోనే కలుసుకునేవాడు. భారతదేశంలో హైదరాబాద్ విలీనం తర్వాత భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ హైదరాబాద్ వచ్చినప్పుడు నిజాంను ఇక్కడే కలుసుకున్నారు. 1951లో నిజాంను ‘రాజప్రముఖ్’గా భారత ప్రభుత్వం నియమించాక, రాజప్రముఖ్ హోదాలో కొత్త కేబినెట్ పదవీ ప్రమాణం కూడా కింగ్‌కోఠి ప్యాలెస్‌లోని విశాలమైన దర్బార్ హాల్‌లోనే జరిగింది.
పరదా ఎత్తారో..
ఏడో నిజాం పాలనా సమయంలోనే కింగ్‌కోఠి ప్యాలెస్‌లోని విశాల ప్రాంగణంలో ముబారక్ మాన్షన్, ఉస్మాన్ మాన్షన్, నియాజ్‌ఖానా, మేజ్‌ఖానా (రాయల్ కిచెన్ మరియు డైనింగ్ హాల్) ఇలా పలు భవనాలు నిర్మించారు. ముబారక్ మాన్షన్ ప్రధాన సింహ ద్వారం దగ్గర ఒక పరదా వేలాడుతూ ఉంటుంది. ఆ పరదా ఏర్పాటు నేటికీ చూడొచ్చు. నిజాం ప్యాలెస్‌లో లేని సమయంలో ఈ పరదా ఎత్తి ఉంచేవారు. నవాబు ప్యాలెస్‌లో ఉన్నారా..? లేరా..? అని తెలుసుకునేందుకు అధికారులు ఈ ఏర్పాట్లు చేసుకున్నట్టు చెప్తారు. ఈ పరదా గేటు దగ్గర సాయుధ రక్షక దళాలు మైసారం రెజిమెంట్ పహారా కాపలా ఉండేవారు.
అందులోనే అన్నీ..
పరదా గేటుకు ఎదురుగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ఉండేది. ముబారక్ మాన్షన్‌కు తూర్పు దిశలో బొగ్గులకుంట రోడ్డులోని ప్రవేశ ద్వారాన్ని గాధిలాల్ గేటు అని పిలిచేవారు. ఇక్కడ నిజాం వ్యక్తిగత కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల సలహాదారుని కార్యాలయాలు ఉండేవి. ముబారక్ మాన్షన్ లోపల సూపరింటెండెంట్ ఆఫ్ ది రాయల్ ప్యాలెస్ అధికార కార్యాలయం ఉండేది. ఈ ప్రాంతాన్నే స్ట్రీట్ ఆఫ్ అజార్ జంగ్ అని పిలిచేవారు. కింగ్‌కోఠి ప్యాలెస్‌లో గల పలు భవనాలలోనే నిజాం కుటుంబీకులకు, అధికార సిబ్బందికి నివాస గృహాలున్నాయి.
కింగ్‌కోఠి ప్యాలెస్ యూరోపియన్ నిర్మాణ శైలిలో జరిగింది. ఈ ప్యాలెస్‌లోని పలు భవన సముదాయాల నిర్మాణ శైలి, కలపతో చేసిన పలు కళాకృతులు, ఎత్తయిన విశాల ప్రాకారాలు నేటికీ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నాటి పురాతన వారసత్వపు చరిత్రకు సాక్షిగా కింగ్ కోఠి నిలుస్తుంది. ఇంతటి విశిష్టత ఉన్న కింగ్ కోఠిలోని కొన్ని భవనాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కింగ్‌కోఠి ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. అయితే పర్యాటకులకు వీలు చిక్కినప్పుడు ఈ ప్యాలెస్‌ను సందర్శించే అవకాశం లేదు.
అయితే, రాబోయే రోజుల్లో రాజప్రాసాదాన్ని అందరూ సందర్శించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇది కార్యరూపం దాల్చాలని కోరుకుందాం. ఈ నివాసంలోనే ఏడో నిజాం 1967 ఫిబ్రవరి 24న తుదిశ్వాస విడిచారు.
మల్లాది కృష్ణానంద్, malladisukku@gmail.com