సాక్షి, హైదరాబాద్ : నిజాం వైభవానికి ప్రతీకైన నజ్రీభాగ్ ప్యాలెస్ విక్రయం ప్రస్తుతం వివాదంలో పడింది. ఈ భవనానికి జీపీఓ హోల్డర్‌గా ఉన్న ఎస్త్రా నుంచి నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దీనిని కొనుగోలు చేసింది. ఆపై దీని యాజమాన్య హక్కులు కాశ్మీర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఐరిష్ హాస్పిటాలిటీస్‌కు బదిలీ అయ్యాయి. తమ మాజీ ఉద్యోగులు నకిలీ డాక్యుమెంట్లతో ఈ విక్రయం చేపట్టారంటూ నిహారిక సంస్థ ముంబై పోలీసుల్ని ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు చేస్తున్న ఈఓడబ్ల్యూ అధికారులు హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. ముంబైకి చెందిన నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మూడేళ్ల క్రితం ప్రిన్స్ ముకర్రంజా మొదటి భార్య ఎస్త్రా నుంచి కింగ్ కోఠిలోని నజ్రీభాగ్ (పరదాగేట్) ప్యాలెస్‌ను కొనుగోలు చేసింది. 5 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ భవంతి ఏడో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ వ్యక్తిగత నివాసంగా ఉండేది. ఐదెకరాల విస్తీర్ణంలో కింగ్‌కోఠి ప్యాలెస్‌గా పిలిచే ఈ నిర్మాణంలో మొత్తం మూడు భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక దాంట్లో నిజాం ట్రస్ట్, మరో దాంట్లో కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి కొనసాగుతున్నాయి.
మూడో భవనమైన నజ్రీభాగ్‌కు జీపీఓ హోల్డర్‌గా ఉన్న ఎస్త్రా నుంచి నిహారిక కన్‌స్ట్రక్షన్స్ సంస్థ రూ.150 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఆ ప్యాలెస్‌ను నిహారిక సంస్థ పొజిషన్ తీసుకోలేదు. కాగా ఈ ఏడాది ప్రథమార్థంలో సంస్థ డైరెక్టర్ల మధ్య స్పర్థలు రావడంతో గత జూన్‌లో సదరు సంస్థ ఉద్యోగులు హైదరాబాద్ జిల్లా రిజిస్టార్ కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ సందర్భంగా నజ్రీభాగ్ ప్యాలెస్ యాజమాన్య హక్కులు కాశ్మీర్‌కు చెందిన ఐరిష్ హాస్పిటాలిటీస్‌కు బదిలీ అయినట్లు గుర్తించిన వీరు దీనిపై ఆరా తీయగా గత ఫిబ్రవరిలో ‘నిహారిక’ నుంచి బయటికి వచ్చిన హైదరాబాద్ వాసి సుందరమ్ కె.రవీంద్రన్‌తో పాటు సురేష్ కుమార్ తదితరుల ప్రమేయంతోనే ఇది జరిగినట్లు తేల్చారు.
నిహారికతో పాటు నజ్రీభాగ్ ప్యాలెస్ పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వీరు రూ.150 కోట్లకు ఐరిష్ హాస్పిటాలిటీస్‌కు ప్యాలెన్‌ను విక్రయించినట్లు గుర్తించి ముంబైలోని వర్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు నిమిత్తం అక్కడి ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగానికి (ఈఓడబ్ల్యూ) బదిలీ చేయగా, ఆ శాఖకు చెందిన యూనిట్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా రవీంద్రన్‌తో పాటు, ఇతర నిందితులకు నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
అయితే వారు అందుబాటులోకి రాకపోవడంతో విదేశాలకు పారిపోకుండా కట్టడి చేసేందుకుగాను లుక్ ఔట్ సర్క్యులర్స్ (ఎల్‌ఓసీ) జారీ చేసింది. రవీంద్రన్, సురేష్‌లతో పాటు మహ్మద్ ఉస్మాన్, ముఖేష్ గుప్తలను సైతం నిందితుల జాబితాలో చేర్చింది. గత శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఈఓడబ్ల్యూ అధికారులు రవీంద్రన్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఐరిష్ సంస్థకు నజ్రీభాగ్‌ను విక్రయిస్తూ నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తరఫున హైదరాబాద్ జిల్లా రిజిస్టార్ కార్యాలయంలో సురేష్, రవీంద్రన్‌లే సంతకాలు చేశారని, అయితే ఆ అధికారం వారికి లేదని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం ద్వారా తాము అధీకృత వ్యక్తులుగా పేర్కొంటూ విక్రయించినట్లు నిహారిక సంస్థ తమ ఫిర్యాదులో పేర్కొంది. నజ్రీభాగ్ విక్రయానికి సంబంధించి వారి మధ్య జరిగిన ఈమెయిల్స్‌ను తాము సేకరించామని, ఈ కేసులో ఇవి కీలక ఆధారాలుగా ఈఓడబ్ల్యూ అధికారులు పేర్కొంటున్నారు.
ఫోర్జరీ, మోసం తదితర ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదు మేరకే తాము కేసు నమోదు చేశామని, ప్రాథమిక ఆధారాలు లభించిన నేపథ్యంలో అరెస్టులు చేపట్టామన్నారు. ఈ వ్యవహారంలో ఐరిష్ హాస్పిటాలిటీస్ యజమానులు అమిత్ ఆమ్లా, అర్జున్ ఆమ్లా పాత్రను సైతం ఈఓడబ్ల్యూ అనుమానిస్తోంది. వీరూ నిందితులతో కలిసి ఈ స్కామ్‌కు పాల్పడినట్లు భావిస్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి సాక్షి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను సంప్రదించగా... రిజిస్ట్రేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారమే నజ్రీభాగ్‌ను ఐరిష్ హాస్పిటాలిటీస్ పేరిట బదిలీ చేశాం. ఈ ప్రక్రియ చేపట్టడానికి ముందు అన్ని పత్రాలు పరిశీలించాం. ప్రస్తుతం నడుస్తున్న వివాదం నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలోని డైరెక్టర్ల మధ్య స్పర్థలే ఈ వివాదానికి కారణమని భావిస్తున్నాం అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment