![Hyderabad Ninth Nizam Was Nawab Raunaq Yar Khan - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/12/Nawab-Raunaq-Yar-Khan.jpg.webp?itok=50vWEjIE)
సనత్‌నగర్ (హైదరాబాద్): అసఫ్ జాహీ వంశం తొమ్మిదో నిజాంగా నవాబ్ రౌనఖ్ యార్ ఖాన్ ఎంపికయ్యారు. ఈ మేరకు మజ్లిస్–ఎ–షబ్జాదేగన్ సొసైటీ ప్రతినిధులు శనివారం ప్రకటించారు. ఎనిమిదో నిజాం నవాబ్ మీర్ బర్ఖత్ అలీఖాన్ మృతి అనంతరం తమ కుటుంబ సంప్రదాయాల ప్రకారం తొమ్మిదో నిజాంను ఎంపిక చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు.
అమీర్‌పేటలోని మ్యారీగోల్డ్ హోటల్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు షెహజాదా మీర్ ముజ్తాబా అలీఖాన్, ఉపాధ్యక్షుడు మీర్ నిజాముద్దీన్ అలీఖాన్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ మొయిజుద్దీన్ ఖాన్ వివరాలను వెల్లడించారు. 4,500 మంది నిజాం కుటుంబ సభ్యులతో కూడిన సొసైటీ పక్షాన తమ సమస్యలను ప్రభుత్వానికి సమర్థవంతంగా నివేదించగలరన్న పూర్తి విశ్వాసంతో తొమ్మిదో నిజాంగా నవాబ్ రౌనఖ్ యార్‌ఖాన్‌ను ఎంపిక చేసుకోవడం జరిగిందన్నారు. విదేశాల్లో ఉంటున్న నిజాం వారసులకంటే స్థానికంగా ఉంటూ తమ ప్రయోజనాలను కాపాడగలిగిన వ్యక్తినే తమ కుటుంబ పెద్దగా తాము ప్రకటించుకున్నామన్నారు. ఈ సందర్భంగా అసఫ్ జాహీ వంశపారపర్యంగా వస్తున్న వస్తువులను సమావేశంలో ప్రదర్శించారు. వీటిని తొమ్మిదో నిజాంగా బాధ్యతలు చేపట్టే సమయంలో నవాబ్ రౌనఖ్ యార్ ఖాన్‌కు అందజేస్తారు.
రూ.లక్షల విలువచేసే చేతికర్రలు
అసఫ్ జాహీల వంశపారంపర్యంగా వస్తున్న చేతికర్రల విలువ వింటే నోరెళ్ల బెట్టాల్సిందే. ఆనాటి నుంచి ఇప్పటివరకు మూడు చేతికర్రలను భద్రంగా ఉంచుతూ కొత్తగా బాధ్యతలు చేపట్టే నిజాంకు అందిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో ఒకటి మొదటి నిజాం ప్రభువు ప్రత్యేకంగా తయారుచేసుకున్నారు. నాణ్యమైన చెక్కతో ఫిరోజ్–హుస్సేనీ డైమండ్ పొదగబడిన ఈ కర్ర విలువ అక్షరాలా రూ.30 లక్షలు. పైభాగంలో గుండ్రని నోబ్ కలిగి చుట్టూరా 5 బ్రాస్ లైన్లతో ఉంటుంది. మరొకటి టిప్పు సుల్తాన్ నుంచి నిజాం ప్రభువులు పొందారు. రోజ్‌వుడ్‌తో వివిధ రకాల డిజైన్లతో దీనిని రూపొందించారు. దీని విలువ కూడా 30 లక్షల వరకు ఉంటుంది. ఇంకో చేతికర్ర తాజ్‌మహల్ సృష్టికర్త షాజహాన్‌న్‌నుంచి అందుకున్నారు. ఇది ఏనుగు దంతంతో రూపొందించింది. దీని విలువ రూ.15 లక్షలు ఉంటుందని సొసైటీ ప్రతినిధులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment