Nizam Nawabs
-
‘నిజాం వారసులకంటే మా ప్రయోజనాలను కాపాడే వ్యక్తే ఉండాలి’
సనత్‌నగర్ (హైదరాబాద్): అసఫ్ జాహీ వంశం తొమ్మిదో నిజాంగా నవాబ్ రౌనఖ్ యార్ ఖాన్ ఎంపికయ్యారు. ఈ మేరకు మజ్లిస్–ఎ–షబ్జాదేగన్ సొసైటీ ప్రతినిధులు శనివారం ప్రకటించారు. ఎనిమిదో నిజాం నవాబ్ మీర్ బర్ఖత్ అలీఖాన్ మృతి అనంతరం తమ కుటుంబ సంప్రదాయాల ప్రకారం తొమ్మిదో నిజాంను ఎంపిక చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. అమీర్‌పేటలోని మ్యారీగోల్డ్ హోటల్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు షెహజాదా మీర్ ముజ్తాబా అలీఖాన్, ఉపాధ్యక్షుడు మీర్ నిజాముద్దీన్ అలీఖాన్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ మొయిజుద్దీన్ ఖాన్ వివరాలను వెల్లడించారు. 4,500 మంది నిజాం కుటుంబ సభ్యులతో కూడిన సొసైటీ పక్షాన తమ సమస్యలను ప్రభుత్వానికి సమర్థవంతంగా నివేదించగలరన్న పూర్తి విశ్వాసంతో తొమ్మిదో నిజాంగా నవాబ్ రౌనఖ్ యార్ఖాన్ను ఎంపిక చేసుకోవడం జరిగిందన్నారు. విదేశాల్లో ఉంటున్న నిజాం వారసులకంటే స్థానికంగా ఉంటూ తమ ప్రయోజనాలను కాపాడగలిగిన వ్యక్తినే తమ కుటుంబ పెద్దగా తాము ప్రకటించుకున్నామన్నారు. ఈ సందర్భంగా అసఫ్ జాహీ వంశపారపర్యంగా వస్తున్న వస్తువులను సమావేశంలో ప్రదర్శించారు. వీటిని తొమ్మిదో నిజాంగా బాధ్యతలు చేపట్టే సమయంలో నవాబ్ రౌనఖ్ యార్ ఖాన్‌కు అందజేస్తారు. రూ.లక్షల విలువచేసే చేతికర్రలు అసఫ్ జాహీల వంశపారంపర్యంగా వస్తున్న చేతికర్రల విలువ వింటే నోరెళ్ల బెట్టాల్సిందే. ఆనాటి నుంచి ఇప్పటివరకు మూడు చేతికర్రలను భద్రంగా ఉంచుతూ కొత్తగా బాధ్యతలు చేపట్టే నిజాంకు అందిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో ఒకటి మొదటి నిజాం ప్రభువు ప్రత్యేకంగా తయారుచేసుకున్నారు. నాణ్యమైన చెక్కతో ఫిరోజ్–హుస్సేనీ డైమండ్ పొదగబడిన ఈ కర్ర విలువ అక్షరాలా రూ.30 లక్షలు. పైభాగంలో గుండ్రని నోబ్ కలిగి చుట్టూరా 5 బ్రాస్ లైన్లతో ఉంటుంది. మరొకటి టిప్పు సుల్తాన్ నుంచి నిజాం ప్రభువులు పొందారు. రోజ్‌వుడ్‌తో వివిధ రకాల డిజైన్లతో దీనిని రూపొందించారు. దీని విలువ కూడా 30 లక్షల వరకు ఉంటుంది. ఇంకో చేతికర్ర తాజ్‌మహల్ సృష్టికర్త షాజహాన్‌న్‌నుంచి అందుకున్నారు. ఇది ఏనుగు దంతంతో రూపొందించింది. దీని విలువ రూ.15 లక్షలు ఉంటుందని సొసైటీ ప్రతినిధులు వివరించారు. -
నిజాం నవాబుల ఖడ్గం స్టైలే వేరు.. పాము ఆకారం, రంపపు పళ్లు..
హైదరాబాద్ సంస్థానాన్ని ఏలిన నిజాంలకు చెందిన అరుదైన, పాము ఆకార ఖడ్గం ఇది. ఇండో–పర్షియన్ డిజైన్, రంపపు పళ్ల తరహాలో రెండు వైపులా ఉన్న పదునైన మొనలు, బంగారు పూత పూసిన ఏనుగు, పులి బొమ్మలతో కూడిన ఈ ఖడ్గం 117 ఏళ్ల తర్వాత యూకే నుంచి తిరిగి భారత్‌కు చేరుకుంది. త్వరలోనే మన భాగ్యనగరానికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో దీని చరిత్ర, విదేశాలకు ఎలా తరలి వెళ్లింది..? ఇప్పుడు ఎలా స్వదేశం చేరుకుంటోంది వంటి వివరాలను తెలుసుకుందాం. అధికార దర్పానికి చిహ్నంగా... క్రీస్తు శకం 1,350లో తయారైన ఈ కరవాలాన్ని 1896 నుంచి 1911 మధ్య హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ తన అధికార దర్పానికి, సైనిక శక్తిసామర్థ్యాలకు చిహ్నంగా పలు వేడుకల్లో ప్రదర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1903లో భారత్‌ను పాలించే బ్రిటిష్ చక్రవర్తిగా కింగ్ ఎడ్వర్డ్–7, క్వీన్ అలెగ్జాండ్రల పట్టాభిషేక మహోత్సవం ఢిల్లీ దర్బార్‌లో అట్టహాసంగా జరిగిందని, ఈ వేడుకలో పాల్గొన్న సందర్భంగా మీర్ మహబూబ్ అలీఖాన్ ఈ ఖడ్గాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు. చోరీయా లేక విక్రయమా.. మీర్ మహమూబ్ అలీఖాన్ పాలనలోనే ఈ ఖడ్గం మాయమైందని చరిత్రకారులు పేర్కొనగా ఈ ఖడ్గం సహా మరికొన్ని విలువైన వస్తువులను చోరీకి గురైన వస్తువులుగా ప్రభుత్వం పేర్కొంటూ వచ్చింది. బ్రిటిషర్ల వాదన మరోలా ఉంది. 1905లో నాటి బ్రిటిష్ సైన్యంలోని బాంబే కమాండ్‌కు చెందిన కమాండర్ ఇన్ చీఫ్ సర్ హంటర్ దీన్ని హైదరాబాద్ సంస్థాన ప్రధాని బహదూర్ నుంచి కొనుగోలు చేశారని, 1978లో ఆయన మేనల్లుడు ఈ ఖడ్గాన్ని స్కాట్లాండ్లోని గ్లాస్గో లైఫ్ మ్యూజియంకు దానం చేసినట్లు రికార్డుల్లో ఉంది. ఈ ఖడ్గం ఆరో నిజాం నుంచి నాటి ప్రధాని వద్దకు ఎలా వచ్చిందన్నది తెలియరాలేదు. తిరిగి స్వదేశానికి.. భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా భారత్‌కు చెందిన 7 చారిత్రక వస్తువులను స్కాట్లాండ్ గత నెలలో తిరిగి అప్పగించింది. ఆ ఏడు వస్తువుల్లో నిజాం కాలంనాటి పాము ఆకార ఖడ్గం, 10వ శతాబ్దానికి చెందిన సూర్యదేవుని విగ్రహం మొదలైనవి ఉన్నాయి. పాము ఆకార ఖడ్గం నిజాంలకు చెందినది కాబట్టి కేంద్రం దాన్ని హైదరాబాద్‌కు పంపే అవకాశం ఉందని సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ నాగేందర్‌రెడ్డి తెలిపారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
నిజాం వెంట చీతా.. అతిథులకు వేట సరదా తీర్చిన నవాబులు
నిజాం పాలనా సమయం.. అది మలక్‌పేటలోని రేస్ కోర్సు.. ఓ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయం.. ఉన్నట్టుండి అలజడి మొదలైంది. ఆరో నిజాం తన వెంట రెండు చీతాలను తీసుకుని అక్కడికి వచ్చారు. చీతాలను రెండు వైపులా కూర్చోబెట్టుకుని గుర్రపు పందాలను వీక్షించి.. కాసేపటికి వెళ్లిపోయారు. అది 1885.. బ్రిటిష్ అధికారి, రచయిత లార్కింగ్ హైదరాబాద్‌కు వచ్చారు. నిజాం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. భోజనం, ఆ తర్వాత ప్యాలెస్‌ల వీక్షణంతో గడిచిపోయింది. మరునాడు పొద్దునే లార్కింగ్ను నిజాం పరివారం మహబూబాబాద్ ప్రాంతంలో వేటకు తీసుకెళ్లారు. వారు వెంట రెండు చీతాలను తీసుకురావటం, వాటి సాయంతో వేటాడటం చూసి లార్కింగ్ ఆశ్చర్యపోయారు. ఆ వేటను వివరిస్తూ ఓ పెయింటింగ్ రూపొందించారు. ‘బందోబస్త్ అండ్ ఖబర్’ పేరుతో రాసిన పుస్తకంలో దాన్ని ప్రచురించారు. సాక్షి, హైదరాబాద్: నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలోనూ చీతాలు ఉండేవి. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న విదర్భ ప్రాంతంలో చీతాలు ఉండేవని బ్రిటిష్‌వారి నివేదికలు చెబుతున్నాయి. అక్కడి నుంచి ఆదిలాబాద్ వరకు అటవీ ప్రాంతంలో అవి తిరుగాడేవి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ లెక్కల ప్రకారం.. 1900 నాటికి ఇండియాలో 414 చీతాలు ఉండేవి. అయితే హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి నిజాం ఎలాంటి లెక్కలు తీయించలేదు. ఆ సమయంలో వేట విలాసంగా ఉండేది. పెద్ద పులులను వేటాడేందుకు వెళ్లినవారికి చీతాలు సులభంగా చిక్కేవి. అలా ఎన్నింటినో చంపినా.. ఆ తర్వాతికాలంలో జింకల వేట కోసం చీతాలను వాడటం మొదలుపెట్టారు. ఇందుకోసం నిజాం పాలకులు వేటకుక్కల్లా చీతాలను మచ్చిక చేసుకున్నారు. కానీ వేట, అనారోగ్యం, ఇతర కారణాలతో త్వరగా అంతరించిపోయాయి. దీనితో అడవుల్లో చీతా పిల్లలు కనిపిస్తే తెచ్చి అప్పగించాలని ప్రజలకు నిజాం ఆదేశాలు జారీ చేశారు. చివరికి బ్రిటీష్ అధికారులకు లేఖ రాసి మధ్యప్రదేశ్ ప్రాంతంలో చీతాలను పట్టుకుని, హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఎడ్ల బండిపై చీతాను తీసుకెళ్తున్నట్టు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గీయించిన చిత్రం 1908లో హైదరాబాద్‌కు వచ్చిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఆల్బర్ట్ ఎడ్వర్డ్.. ఇక్కడ నిజాంతో కలిసి వేటలో పాల్గొన్నారు. వేటకు వెళ్లేప్పుడు రెండు ఎడ్ల బండ్లపై మంచాలు వేసి, వాటికి చీతాలను కట్టి తీసుకురావడం ఆల్బర్ట్ ఎడ్వర్డ్‌ను ఆశ్చర్యపర్చింది. చీతాలు వాయువేగంతో పరుగెడుతూ జింకలను వేటాడటాన్ని చూసిన ఆయన.. ఆ దృశ్యాలను వివరిస్తూ ఈ చిత్రాలను గీయించారు. జింకను వేటాడుతున్నట్టు గీయించిన మరో చిత్రం ఇప్పటికీ నాటి గుర్తులు నిజాం వారసుల ఇళ్లలో చీతాలకు, నాటి వేటకు సంబంధించిన గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి. హైదరాబాద్‌లోని మౌలాలి ప్రాంతంలో నిజాం ఆంతరంగికుడి వారసుడి నివాసంలో నాడు చీతాల కోసం వినియోగించిన పెద్ద పెద్ద ఇనుపబోన్లు ఉన్నాయి. అప్పట్లో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ కూడా నిజాం సమక్షంలో వేట సరదా తీర్చుకున్నారు. నిజాం 1903లో లార్డ్ కర్జన్‌ను నిజాం పూర్వపు వరంగల్ జిల్లా నెక్కొండ అడవుల్లో వేటకు తీసుకెళ్లారు. వారు అక్కడ పెద్దపులిని వేటాడి.. దాని పక్కన కూర్చుని ఫొటోలకు ఫోజులిచ్చారు. (క్లిక్: 70 ఏళ్ల తర్వాత భారత్‌లోకి 8 చీతాలు.. పేరు పెట్టిన ప్రధాని మోదీ) -
మొదటి దేశీ కారు తయారు చేసింది హైదరాబాదీనే.. కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే?
భారతీయులు ఎందులోనూ తక్కువ కాదని చాటి చెప్పేందుకు ఓ హైదరాబాదీ ఇంజనీరు నడుం బిగించారు. భారత్ తొలి కారు గురించి పలు ఆకసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం... నిజాం ట్రాన్స్‌పోర్టులో ఇంజనీరుగా పని చేసే మధుసూదన్‌రెడ్డికి రవాణాలో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇక్కడి పరిమితులు బాగా తెలుసు. అనేక వ్యవహరాల సమాహారంగా వ్యక్తిగత ట్రాన్స్పోర్ట్ కోసం దేశీయంగా కారు తయారు చేయలేమా అనే సందేహాం ఆయన్ని చుట్టుముట్టింది. దీంతో తన ఇంట్లోనే కారు తయారీ కాన్సెప్టుపై అవిశ్రాంతంగా శ్రమించారు. స్వాత్రంత్రం వచ్చి హైదరాబాద్ స్టేట్ భారత్‌లో విలీనం అయ్యేనాటికి కాగితంపై కారుకి సంబంధించిన వర్క్(డీపీఆర్) అంతా పూర్తయ్యింది. బ్రాండ్ పింగళి స్వాత్రంత్రం వచ్చిన తర్వాత కారు తయారీలో మరింతగా తలామునకలయ్యారు పింగళి మధుసూదన్‌రెడ్డి. స్థానికంగా ఉన్న కంపెనీల సహకారంతో ఛాసిస్, ఇంజన్, వీల్ మెకానిజం, స్టీరింగ్ మెకానిజం తదితర పనులన్నీ పూర్తి చేశారు. ఆ తర్వాత కారు విడిభాగాలను అసెంబ్లింగ్ చేసేందుకు హిందూస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్), హైదరాబాద్ సహకారం తీసుకున్నారు. అలా 1957 నాటికి తొలి కారును తయారు చేశారు. ఈ కారుకి పింగళి పేరు పెట్టారు. ట్యాంక్‌బండ్‌పై చక్కర్లు స్వాతంత్రం సిద్ధించి దేశ విభజన సమస్యలు, పేదరికంతో మిగిలిన దేశం అంతా పోరాటం చేస్తుంటూ పారిశ్రామిక రంగం, పరిశోధనల్లో హైదరాబాద్ దూసుకుపోవడం మొదలైంది. హాల్లో తయారైన ప్రోటోటైప్ దేశీ కారు విదేశీ కార్లతో పోటీ పడుతూ హైదరాబాద్ రోడ్లపై ముఖ్యంగా ట్యాంక్‌బండ్‌పై పింగళి కారు చక్కర్లు కొట్టింది. టెస్ట్ రైడ్ సక్సెస్ఫుల్ కావడంతో కార్ల తయారీపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. నెహ్రూ మెచ్చిన కారు అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బెంగళూరు పర్యటన సందర్భంగా పింగళి కారుని అక్కడికి తరలించారు. నెహ్రూ స్వయంగా కారుని చూసి నడిపించారు. పక్కన ఉన్న ఇంజనీరు మధుసూదన్‌రెడ్డి కారుకి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడించారు. దేశంలోని మధ్య తరగతి ప్రజలకు ఈ కారు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. భారీ ఎత్తున కార్ల తయారు చేస్తే బాగుంటుందని వివరించారు. మన కోసం అప్పటికే అమెరికా, యూరప్‌లో అనేక కార్ల మోడళ్లు ఉన్నా అవేవీ భారత స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా లేవు. ఇక్కడుండే ఉమ్మడి కుటుంబాలు, ప్రయాణాల్లో ఎక్కువగా తీసుకెళ్లే లగేజీ, వేడి వాతావరణం, గతుకుల రోడ్లు తదితర సమస్యల ఉండేవి. విదేశీ కార్లు కొనుక్కున్నవారు సైతం పూర్తిగా నగరాలు, పట్టణాలకే పరిమితమయ్యేవారు. కానీ పింగళి కారు ఈ సమస్యలన్నీ దూరం చేసే సాధనంగా తోచింది. దీంతో ఈ కారు తయారీకి పూర్తి ప్రతిపాదనలు సిద్ధం చేయాలనే ఆర్డర్లు వచ్చాయి. ధర ఎంతంటే టూ సిలిండర్, టూ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్‌తో 7 బీహెచ్పీ సామర్థ్యంతో కారును తయారు చేస్తే ఒక్కో కారు తయారీకి రూ.4,500 ఖర్చు వస్తుందని నిర్ణయించారు. పన్నులు కలుపుకుంటే రూ.5000 దగ్గర ఈ కారు మార్కెట్లోకి తేవచ్చని. తొలి విడతగా 7,000 కార్లు తయారు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. చైనా తెచ్చిన చేటు కారు తయారీ కోసం ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో 1962లో ఇండో చైనా వార్ రావడంతో పింగళి కారు తయారీ ప్రతిపాదనలు పెండింగ్‌లో పెట్టారు. ఆ తర్వాత నెహ్రూ మరణంతో ఢిల్లీలో పింగళి కారు ప్రతిపాదనలు పట్టించుకునే వారే కరువయ్యారు. అలా ఏళ్ల పాటు కారు తయారీ ప్రతిపాదన మూలనపడింది. రంగంలోకి నిజాం మనువడు దేశీయంగా తయారయ్యే మొదటికారు హైదరాబాద్ నుంచే రావాలని నిజాం మనువడు సంకల్పించారు. దీంతో కారు తయారీకి అనుమతులు ఇచ్చి, హైదరాబాద్‌లో ఫ్యాక్టరీ పెట్టాలంటూ నిజం మనువడు ముకరంజా 1970లో కేంద్రాన్ని కోరారు. కారణాలు ఏమైనా మరోసారి పింగళికి చుక్కెదురైంది. హైదరాబాద్‌ను కాదని జపాన్ పింగళికి అనుమతులు రాకపోయినా దేశీ కారు తయారీ అంశం మాత్రం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మదిలో నాటుకు పోయింది. ఆ కారణంగానే ఎమర్జెన్సీ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాక దేశీ కారు తయారీపై ఇందిరా దృష్టి పెట్టారు. కానీ అప్పటికే నలభై ఏళ్లు దాటి పోవడంతో సాంకేతికంగా పింగళి వెనుకబడి పోయింది. దీంతో స్వదేశీ కారు కల అనేక మలుపులు తిరిగి చివరకు జపాన్ సహకారంతో మారుతిగా మార్కెట్లోకి వచ్చింది. ఎగ్జిబిషన్‌కే పరిమితం పరిస్థితులు అనుకూలించి ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తే తొలి దేశీ కారుగా మార్కెట్లోకి రావాల్సిన పింగళి కారు దాదాపు డెబ్బై ఏళ్ల పాటు హాల్ ఎగ్జిబిషన్‌కే పరిమితమైంది. చివరకు ఎవరికీ అంతుచిక్కని రీతిలో 2017లో ఎగ్జిబిషన్ నుంచి కూడా ఈ కారు మాయమైంది. హైదరాబాద్ ఘన చరిత్రలో చోటు దక్కించుకోలేకపోయిన పింగళి కారు చివరకు ఫోటోలకే పరిమితమైంది. అలా జరిగి ఉంటే పింగళి కారు తయారీకి వేగంగా అనుమతులు వస్తే ఆటోమొబైల్ సెక్టార్లో హైదరాబాద్ రూపు రేఖలు మారిపోయి ఉండేవి. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత కాలంలో ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఎక్కువగా వచ్చాయి. కాగా ఇటీవల మహీంద్రా ట్రాక్టర్స్, టాటా ఏయిరోస్పేస్తో పరిస్థితిలో మార్పు వచ్చింది. తాజాగా ఈవీ ప్రభంజనంలో యూకేకి చెందిన మోటో వన్ మరికొన్ని కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులకు రెడీ అయ్యాయి. - సాక్షి, వెబ్ స్పెషల్ చదవండి: మగువ.. అరకేజీ బంగారం.. ఓ ఆసక్తికరమైన కేసు -
నిహారిక-ఐరిష్ మధ్య నజ్రీభాగ్!
సాక్షి, హైదరాబాద్ : నిజాం వైభవానికి ప్రతీకైన నజ్రీభాగ్ ప్యాలెస్ విక్రయం ప్రస్తుతం వివాదంలో పడింది. ఈ భవనానికి జీపీఓ హోల్డర్‌గా ఉన్న ఎస్త్రా నుంచి నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనిని కొనుగోలు చేసింది. ఆపై దీని యాజమాన్య హక్కులు కాశ్మీర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఐరిష్ హాస్పిటాలిటీస్‌కు బదిలీ అయ్యాయి. తమ మాజీ ఉద్యోగులు నకిలీ డాక్యుమెంట్లతో ఈ విక్రయం చేపట్టారంటూ నిహారిక సంస్థ ముంబై పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు చేస్తున్న ఈఓడబ్ల్యూ అధికారులు హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. ముంబైకి చెందిన నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మూడేళ్ల క్రితం ప్రిన్స్ ముకర్రంజా మొదటి భార్య ఎస్త్రా నుంచి కింగ్ కోఠిలోని నజ్రీభాగ్ (పరదాగేట్) ప్యాలెస్‌ను కొనుగోలు చేసింది. 5 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ భవంతి ఏడో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ వ్యక్తిగత నివాసంగా ఉండేది. ఐదెకరాల విస్తీర్ణంలో కింగ్‌కోఠి ప్యాలెస్‌గా పిలిచే ఈ నిర్మాణంలో మొత్తం మూడు భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక దాంట్లో నిజాం ట్రస్ట్, మరో దాంట్లో కోఠి ఈఎన్టీ ఆసుపత్రి కొనసాగుతున్నాయి. మూడో భవనమైన నజ్రీభాగ్‌కు జీపీఓ హోల్డర్‌గా ఉన్న ఎస్త్రా నుంచి నిహారిక కన్స్ట్రక్షన్స్ సంస్థ రూ.150 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఆ ప్యాలెస్‌ను నిహారిక సంస్థ పొజిషన్ తీసుకోలేదు. కాగా ఈ ఏడాది ప్రథమార్థంలో సంస్థ డైరెక్టర్ల మధ్య స్పర్థలు రావడంతో గత జూన్‌లో సదరు సంస్థ ఉద్యోగులు హైదరాబాద్ జిల్లా రిజిస్టార్ కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ సందర్భంగా నజ్రీభాగ్ ప్యాలెస్ యాజమాన్య హక్కులు కాశ్మీర్‌కు చెందిన ఐరిష్ హాస్పిటాలిటీస్‌కు బదిలీ అయినట్లు గుర్తించిన వీరు దీనిపై ఆరా తీయగా గత ఫిబ్రవరిలో ‘నిహారిక’ నుంచి బయటికి వచ్చిన హైదరాబాద్ వాసి సుందరమ్ కె.రవీంద్రన్తో పాటు సురేష్ కుమార్ తదితరుల ప్రమేయంతోనే ఇది జరిగినట్లు తేల్చారు. నిహారికతో పాటు నజ్రీభాగ్ ప్యాలెస్ పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వీరు రూ.150 కోట్లకు ఐరిష్ హాస్పిటాలిటీస్‌కు ప్యాలెన్‌ను విక్రయించినట్లు గుర్తించి ముంబైలోని వర్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు నిమిత్తం అక్కడి ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగానికి (ఈఓడబ్ల్యూ) బదిలీ చేయగా, ఆ శాఖకు చెందిన యూనిట్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా రవీంద్రన్తో పాటు, ఇతర నిందితులకు నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే వారు అందుబాటులోకి రాకపోవడంతో విదేశాలకు పారిపోకుండా కట్టడి చేసేందుకుగాను లుక్ ఔట్ సర్క్యులర్స్ (ఎల్ఓసీ) జారీ చేసింది. రవీంద్రన్, సురేష్‌లతో పాటు మహ్మద్ ఉస్మాన్, ముఖేష్ గుప్తలను సైతం నిందితుల జాబితాలో చేర్చింది. గత శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఈఓడబ్ల్యూ అధికారులు రవీంద్రన్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఐరిష్ సంస్థకు నజ్రీభాగ్‌ను విక్రయిస్తూ నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తరఫున హైదరాబాద్ జిల్లా రిజిస్టార్ కార్యాలయంలో సురేష్, రవీంద్రన్లే సంతకాలు చేశారని, అయితే ఆ అధికారం వారికి లేదని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం ద్వారా తాము అధీకృత వ్యక్తులుగా పేర్కొంటూ విక్రయించినట్లు నిహారిక సంస్థ తమ ఫిర్యాదులో పేర్కొంది. నజ్రీభాగ్ విక్రయానికి సంబంధించి వారి మధ్య జరిగిన ఈమెయిల్స్‌ను తాము సేకరించామని, ఈ కేసులో ఇవి కీలక ఆధారాలుగా ఈఓడబ్ల్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఫోర్జరీ, మోసం తదితర ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదు మేరకే తాము కేసు నమోదు చేశామని, ప్రాథమిక ఆధారాలు లభించిన నేపథ్యంలో అరెస్టులు చేపట్టామన్నారు. ఈ వ్యవహారంలో ఐరిష్ హాస్పిటాలిటీస్ యజమానులు అమిత్ ఆమ్లా, అర్జున్ ఆమ్లా పాత్రను సైతం ఈఓడబ్ల్యూ అనుమానిస్తోంది. వీరూ నిందితులతో కలిసి ఈ స్కామ్‌కు పాల్పడినట్లు భావిస్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి సాక్షి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను సంప్రదించగా... రిజిస్ట్రేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారమే నజ్రీభాగ్‌ను ఐరిష్ హాస్పిటాలిటీస్ పేరిట బదిలీ చేశాం. ఈ ప్రక్రియ చేపట్టడానికి ముందు అన్ని పత్రాలు పరిశీలించాం. ప్రస్తుతం నడుస్తున్న వివాదం నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలోని డైరెక్టర్ల మధ్య స్పర్థలే ఈ వివాదానికి కారణమని భావిస్తున్నాం అని పేర్కొన్నారు. -
ప్రైవేటు కంపెనీకి కింగ్‌కోఠి ప్యాలెస్ అమ్మకం!
అలనాటి నిజాం చరిత్ర వైభవానికి ఆనవాలుగా ఉన్న కింగ్‌కోఠి ప్యాలెస్ (పరదాగేట్) ఇక కనుమరుగుకానుంది. చారిత్రక వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యంగా ఉన్న ఈ ప్యాలెస్ కనుమరుగుకానుందన్న వాస్తవం పురావస్తు, చరిత్ర ప్రేమికులు జీరి్ణంచుకోవటమూ కాస్త కష్టమే మరి. మొఘల్, యూరోపియన్ అద్భుత వాస్తు నిర్మాణ శైలితో ఎన్నో ప్రత్యేకతల్ని సంతరించుకున్న ఈ భవనం నిజాం రాజులనాటి చారిత్రక వైభవానికి కింగ్‌కోఠి ప్యాలెస్ శిథిల సజీవ సాక్ష్యం. 70 ఏళ్లుగా నిజాం వారసుల చేతుల్లో ఉన్న ఈ భారీ భవనం యాజమాన్య హక్కులు గతంలోనే చేతులు మారాయి. ఢిల్లీకి చెందిన ప్రముఖ హోటల్స్ సంస్థ ఐరిస్ ఈ భారీభవంతిని కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ భవనాన్ని కూల్చి ఓ భారీ బిజినెస్ మాల్‌ను నిర్మించేందుకు ఐరిస్ సంస్థ సన్నాహాలు ప్రారంభించింది. దీంతో కింగ్‌కోఠి ప్యాలెస్ కాస్తా ఇక నుంచి బిజినెస్ మాల్గా మారనుందని తెలుస్తోంది. – సాక్షి, హైదరాబాద్ చేతులు మారిందిలా.. ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ వ్యక్తిగత నివాసంగా వెలుగొందిన ఐదువేల గజాల విస్తీర్ణంలో ఉన్న భారీ భవంతి నజ్రీభాగ్ (పరదాగేట్)కు చాలాకాలం ప్రిన్స్ ముకర్రంజా మొదటి భార్య ఎస్త్రా జీపీఏ హోల్డర్‌గా వ్యవహరించారు. ఎస్త్రా నుంచి ముంబైకి చెందిన నిహారిక కన్స్ట్రక్షన్స్ కంపెనీ కొనుగోలు చేయగా తాజాగా నిహారిక కన్స్ట్రక్షన్స్ నుంచి ఐరిస్ హోటల్స్ సంస్థ రూ.150 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఐదెకరాల విస్తీర్ణంలో కింగ్‌కోఠి ప్యాలెస్‌లో ఉన్న మూడు భవనాల్లో ఒకదాన్లో ఈఎన్టీ ఆస్పత్రి నడుస్తుండగా, మరో భవనంలో నిజాంట్రస్ట్ కొనసాగుతోంది. పరదా కథ కింగ్‌కోఠి ప్యాలెస్‌లోని ప్రధాన భవనం (నజ్రీబాగ్) పరదాగేట్‌గా ఇప్పటికీ ప్రసిద్ధే. ఈ భవనం ఇప్పటికీ పరదా వేసి ఉండటమే విశేషం. అప్పట్లో నిజాం ఉస్మాన్ అలీఖాన్ నివాస కేంద్రంగా కొనసాగిన ఈ భవంతిలో ఆయన ఉంటేనే పరదాని పైకి లేపి ఉంచేవారు. పరదా కిందకు వేసి ఉంటే ఆయన రాజ్య పర్యటనలో ఉన్నారని అర్థం. నిజాం రాజు నిత్యం వెళ్లే దారిని నీళ్లతో కడిగి శుద్ధి చేసేవారు. ఇక్కడ నిత్యం సాయుధ పోలీస్ బలగాలతో భారీ పహారా ఉండేది. నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్ ఈ భవనంలోనే తుది శ్వాస విడువగా ఆయన సమాధి సైతం ఈ పరిసరాల్లోనే (జుడీ మస్జీద్) ఉండటం విశేషం. హెరిటేజ్ జాబితాలోనే కమాల్‌ఖాన్ ఆధ్వర్యంలో మొఘల్, యూరోపియన్ అద్భుత వాస్తు నిర్మాణ శైలితో నిర్మించిన ఈ భవనానికి దేశంలోనే అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ నిర్మాణ శైలిని చూసేందుకు అనేక దేశాల ఆర్కిటెక్టులు వచ్చి పరిశీలించిన సందర్భాలున్నాయి. ఈ భవనం చాలాకాలం హెరిటేజ్ జాబితాలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో హెరిటేజ్ భవనాల జాబితా ఏదీ అధికారికంగా లేకపోవటంతో ఈ భవనాన్ని ఐరిస్ హోటల్స్ కూలి్చవేసే అవకాశమే కనిపిస్తోంది. ఈ భవనానికి సరైన నిర్వహణ లేకపోవటంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఈ విషయమై ఇంటా క్ తెలంగాణ చాప్టర్ అధ్యక్షురాలు అనురాధారెడ్డి స్పందిస్తూ.. నజ్రీబాగ్ ఎప్పటి నుంచో హెరిటేజ్ భవనంగా ఉందని, ఆ భవనం కూలి్చవేతను అడ్డుకుంటామని పేర్కొన్నారు. కొనుగోలు వివాదం నిజాం ట్రస్ట్ నుంచి ఈ భవనాన్ని తొలుత నిహారిక ఇన్ఫ్రా కంపెనీ కొనుగోలు చేయగా, ఇదే కంపెనీలోని ఇద్దరు డైరెక్టర్లు మాత్రమే ఐరిస్ హోటల్స్‌కు విక్రయించారు. ఈ విషయమై నిహారిక డైరెక్టర్లు వర్లీ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆ రిజిస్ట్రేషన్ చెల్లుబాటు కాకుండా చూడాలని కోరారు. ఈ మేరకు ఓ లేఖ సైతం హైదరాబాద్ జిల్లా రిజి్రస్టార్‌కు చేరింది. ఈ విషయమై రిజి్రస్టార్ డీవీ ప్రసాద్‌ను వివరణ కోరగా తాము అన్ని పరిశీలించాకే రిజిస్టర్ చేసినట్లు ‘సాక్షి’కి తెలిపారు. -
కుప్పకూలిన సీబీఎస్
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదిన్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన గౌలిగూడలోని సెంట్రల్ బస్‌స్టేషన్(సీబీఎస్) నేలకూలింది. మిసిసిపీ హేంగర్గా నగర ప్రజలకు సుపరిచితమైన ఈ ప్రయాణ ప్రాంగణం గురువారం తెల్లవారుజామున కూలిపోయినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఒకప్పుడు వేలాది మంది ప్రయాణికులు, వందలకొద్దీ బస్సుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉన్న సీబీఎస్ శిథిలావస్థకు చేరడంతో ఆర్టీసీ అధికారులు కొద్దిరోజులుగా బస్సుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అందులో ఉన్న దుకాణాలు, ప్రయాణికుల సదుపాయాలు, టికెట్ బుకింగ్ కేంద్రాలను తొలగించారు. అధికారులు ఊహించినట్లుగానే గురువారం సీబీఎస్ ఒకవైపు పూర్తిగా నేలకొరిగింది. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ, ఆర్టీసీ ఉన్నతాధికారులు మిసిసిపీ హేంగర్‌ను పరిశీలించారు. బస్‌స్టేషన్ కూలిపోవడం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. మిసిసిపీ హేంగర్ స్థానంలో అధునాతన బస్‌స్టేషన్ నిర్మిస్తామని, ఈ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించనున్నామని తెలిపారు. ఎంతోకాలంగా సీబీఎస్‌లోనే ఉపాధి పొందుతున్న స్థానికులు తమకు ప్రత్యామ్నాయం కల్పించాలని మంత్రిని కోరారు. దుకాణాలు కోల్పోయిన వారికి మరోచోట వాటిని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇదీ మిసిసిపీ హేంగర్ చరిత్ర.. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో మిసిసిపీ హేంగర్‌ను నిర్మించారు. 1926లో హైదరాబాద్ సంస్థాన ప్రధాన మంత్రి మహారాజా కిషన్ పరిషద్ అధ్యక్షతన నగరంలో బస్సు రవాణా వ్యవస్థ కోసం ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఏడాది పాటు వివిధ రకాల రవాణా వ్యవస్థలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. అప్పటికే ఇంగ్లండ్‌లో పేరొందిన అల్బియన్ మోటర్ కంపెనీకి చెందిన బస్సులను హైదరాబాద్‌లో నడిపేందుకు చర్యలు చేపట్టారు. నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా ఇవి రోడ్డెక్కాయి. అప్పట్లో పుతిలీబౌలీ కేంద్రంగా 27 బస్సులు, 166 మంది ఉద్యోగులతో బస్సు సదుపాయం అందుబాటులోకి వచ్చింది. బస్సులతో పాటు వాటిని నిలిపేందుకు బస్‌స్టేషన్ అవసరమని గ్రహించి.. విదేశాల్లో బస్సులు, రైళ్లు, విమానాల రిపేరింగ్‌కు ఉపకరించే షెడ్డుల మాదిరిగా గౌలిగూడలో ఒక భారీ షెడ్ నిర్మించాలని నిర్ణయించారు. ఏవియేషన్ హేంగర్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇంగ్లండ్‌కు చెందిన బట్లర్ స్టీల్ కంపెనీ మిసిసిపీ హేంగర్‌ను నిర్మించింది. ఇందుకోసం ఆ దేశానికి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు విడిభాగాలతో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ సమశీతోష్ణ వాతావరణానికి అనుగుణంగా 1.77 ఎకరాల విస్తీర్ణంలో ఒక భవనంలా కాక అర్థచంద్రాకారంలో బస్సులు దక్షిణ దిశ నుంచి వచ్చి ఉత్తరం వైపు వెళ్లేలా నిర్మించారు. 1932 నుంచి వినియోగంలోకి రాగా.. మొదట్లో బస్సుల రిపేరింగ్, నైట్ హల్ట్ కోసం దీనిని వినియోగించారు. ఆ తర్వాత ప్రయాణికుల ప్రాంగణంగా సేవలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ.. 1951లో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో భాగమైంది. మిసిసిపీ హేంగర్ నుంచే ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ బస్సులు నడిచేవి. 2004లో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్(ఎంజీబీఎస్) నిర్మించే వరకూ గౌలిగూడ బస్స్టేషనే ప్రధాన బస్‌స్టేషన్‌గా ఉండేది. ఆ తర్వాత దీనిని సిటీ బస్సుల నిర్వహణ కోసం వినియోగించారు. ఇటీవల వరకూ గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోలకు చెందిన 510 బస్సులు మిసిసిపీ హేంగర్ నుంచి రాకపోకలు సాగించాయి. ఈ మార్గంలో నిత్యం 2,385 ట్రిప్పులు తిరిగేవి. 85 వేల మంది రాకపోకలు సాగించేవారు. అలాగే కర్నూలు, కడప, నెల్లూరు, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల బస్సులకు ఇది నైట్‌హాల్ట్‌గా ఉండేది. సంక్రాంతి, దసరా వంటి రద్దీ రోజుల్లో జిల్లాల బస్సులు ఎక్కువ శాతం ఇక్కడి నుంచే రాకపోకలు సాగించేవి. అనుమానాలెన్నో..? మిసిసిపీ హేంగర్ నుంచి నాలుగైదు రోజుల క్రితం వరకూ బస్సులు రాకపోకలు సాగించాయి. అలాంటి ప్రయాణ ప్రాంగణం దానికదిగా కూలిపోయినట్లుగా కాకుండా ‘యు’ఆకారంలో ఉన్న షెడ్డు దిగువ భాగం నిదానంగా నేలలోకి కూరుకుపోయిన తీరు, ముందస్తుగానే బస్సుల రాకపోకలను నిలిపివేయడం అనుమానాలకు తావిస్తోంది. షెడ్డు కింద ఉన్న నట్లు, బోల్టులు తొలగించడంద్వారా అది కుంగిపోయేలా చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా దీనిని కూల్చివేశారని ఇంటాక్ సంస్థ ప్రతినిధి అనురాధారెడ్డి ఆరోపించారు. చారిత్రక, వారసత్వ కట్టడాలను పరిరక్షించకుండా కూల్చివేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. అధునాతన బస్‌స్టేషన్ నిర్మాణం.. మిసిసిపీ హేంగర్ స్థానంలో అధునాతన బస్‌స్టేషన్‌ను నిర్మించేందుకు తెలంగాణ ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అతిపెద్ద వాణిజ్య సముదాయాలను నిర్మించనున్నట్లు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ తెలిపారు. మొదటి అంతస్తులో బస్‌స్టేషన్.. ఆ పైఅంతస్తుల్లో షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్‌లు, వినోద కేంద్రాలను నిర్మించనున్నారు. దీని ద్వారా ఆర్టీసీకి భారీగా ఆదాయం లభించగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఇందుకు కార్యాచరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సిటీ బస్సులతో పాటు కొన్ని జిల్లాల బస్సులను కూడా ఇక్కడి నుంచే నడపనున్నారు. -
అపురూప నాణేల సేకర్త
ఆల్కాట్‌తోట (రాజమండ్రి) :అందరు గృహిణుల్లా కాకుండా తనకు ఏదో ఒక ప్రత్యేకత ఉండాలన్న తపన ఆమెను అపురూప నాణేలు సేకరించే దిశగా నడిపించింది. అదే ఇప్పుడు ఆమె హాబీ అయింది. రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డు ప్రాంతానికి చెందిన గృహిణి ఎన్.సుజాత రకరకాల నాణేలు, కరెన్సీలు, స్టాంపులు సేకరించడంలో దిట్ట. 1616 సంవత్సరానికి చెందిన నాణెం, 1730లోని ‘వి’ ఆకారపు నాణెం, విక్టోరియా మహారాణి బొమ్మ ముద్రించిన 1882 నాటి వెండినాణెం, నైజాం నవాబులు చార్మినార్ బొమ్మతో ముద్రించిన నాణేలు, 1897 నాటి అర్ధ, పావు నాణేలు, అణా, రెండణాలు, చిల్లికానీ, గుర్రపు కానీ, గాంధీ బొమ్మ ఉన్న 20 పైసల బిళ్ల, వివిధ రూపాయి నాణేలు, కలువ పువ్వు ఉన్న రాగి 20 పైసలు, టోపీ లేని, టోపీ ఉన్న జవహర్లాల్ నెహ్రూ బొమ్మలతో కూడిన నాణేలు, నెహ్రూ, ఇందిరాగాంధీ బొమ్మలతో ఉన్న పెద్ద ఐదు రూపాయల నాణేలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమెవద్ద అనేక నాణేలు ఉన్నాయి. రూపాయి నుంచి రూ.1000 వరకూ వివిధ డిజైన్ల నోట్లు ఉన్నాయి. నైజీరియా, అమెరికా, సౌదీ అరేబియా, నేపాల్, భూటాన్ తదితర దేశాల కరెన్సీ నోట్లను సైతం ఆమె సేకరించారు. పైసా నుంచి రూ.10 వరకూ అనేక డిజైన్లలో రూపొందిన నాణేలు ఉన్నాయి. రూ.10 నాణేలు మూడు డిజైన్లు, రూ.ఐదు నాణేలు 33 డిజైన్లు, రూ.రెండు నాణేలు 26 డిజైన్లు, రూ.ఒకటి నాణేలు 34 డిజైన్లు ఉన్నాయి. వీటితోపాటు ఒక పైసా నుంచి 50 పైసల వరకూ అనేక డిజైన్లలో ఉన్న నాణేలను సుజాత సేకరించారు. సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, వల్లభాయ్ పటేల్, శివాజీ, జగ్జీవన్‌రామ్, దాదాబాయ్ నౌరోజీ, మోతీలాల్ నెహ్రూ, శ్యాంప్రసాద్ ముఖర్జీ, జయప్రకాశ్ నారాయణ, కింగ్ జార్జి, రాజీవ్‌గాంధీ, చిత్తరంజన్‌దాస్, మహారాణా ప్రతాప్ తదితరుల బొమ్మలతో ఉన్న నాణేలు సేకరించి పలువురి అభినందనలు అందుకుంటున్నారు సుజాత. -
ఆ ప్రధాని ప్రజల మహారాజు
ఆదేశాల్లో పదనిసలు.. వరుసలో ఇమడని ఒక పత్రం ఉంది! తన ప్రధానమంత్రి కిషన్ ప్రసాద్ చేసిన వ్యక్తిగత ‘రుణాన్ని మాఫీ’ చేస్తూ నిజాం సంతకం చేశాడు. ఈ వైనం వచ్చేవారం ముచ్చటించుకుందాం. అంతకు ముందుగా, కిషన్ ప్రసాద్ బహదూర్‌ను స్మరించుకుందాం! ప్రజల మహారాజుగా ఆయన కీర్తి పొందారు. నిజాం నవాబులూ అందుకు అసూయ చెందలేదు. కిషన్ ప్రసాద్ (1864 జనవరి 1-1940 మే 13) మరికొంతకాలం జీవించి ఉంటే ఉపఖండం చరిత్ర మరోలా ఉండేది! కిషన్ ప్రసాద్ బహదూర్ పూర్వీకులు అక్బర్ చక్రవర్తికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన తోడర్ మల్ వారసులు! కిషన్ ప్రసాద్ హైద్రాబాద్ స్టేట్‌లోనే జన్మించారు. ఆయన తాతగారు చందూలాల్ హైదరాబాద్ స్టేట్ ప్రధానమంత్రిగా పనిచేశారు. మొదటి సాలార్జంగ్తో, ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్‌తో కిషన్ కలసి మెలసి పెరిగాడు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ నూనూగు మీసాల వయసులోనే రసికుడు! విచ్చలవిడి స్త్రీ సాంగత్యం మంచిది కాదని బ్రిటిష్ రెసిడెంట్ ఒత్తిడి చేయడంతో మహబూబ్ అలీ ఖాన్‌ను పురానీ హవేలీకి మార్చారు. వారానికి ఒక పర్యాయం మాత్రమే యువతులను కలిసే షరతుతో! క్రమం తప్పని నెలసరి.. కిషన్ ప్రసాద్ స్వయంగా కవి. షాద్ (సంతుష్టుడు) అనే కలం పేరుతో కవితలు రాశారు. సంస్కృతం, పర్షియన్,అరబిక్,ఉర్దూ, గురుముఖి, ఇంగ్లిష్ భాషలలో పండితుడు. ప్రథమ భారత స్వాతంత్య్రోద్యమం (సిపాయిల తిరుగుబాటు) నేపథ్యంలో ఉత్తరాది అల్లకల్లోలం అయ్యింది. ప్రఖ్యాత ఉర్దూ కవి ఫానీ బదయూని ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకుని అవధ్ ప్రాంతం నుంచి ‘షాద్’ పిలిపించారు. ఇక్కడ అధ్యాపకునిగా ఉద్యోగం ఇప్పించారు. కిషన్ ప్రసాద్ నివాసం నిత్యం ముషాయిరాల (కవితా గోష్టుల)తో కళకళలాడేది. నిజాంలు తాము రాసిన కవితలను కిషన్ ప్రసాద్ ముషాయిరాల్లో మాత్రమే చదివేందుకు పంపేవారు. అలా వచ్చిన కవితలను సగౌరవంగా నుదుటికి తాకించుకుని కవితాహరులతో చదివించేవారు. అబిద్ అలీ అనే కవి ‘బేగమ్’ అనే కలం పేరుతో గజల్స్ రాసేవాడు. స్త్రీ వేషధారణతో వచ్చి చదివేవాడు. ముషాయిరాల్లో హాస్యం ఉండొద్దా? అతడికి అఫ్కోర్స్ బేగమ్‌కు కిషన్ ప్రసాద్ నెలసరి ప్రోత్సాహకాన్ని మంజూరు చేశారు. ఆ నేపథ్యంలో ‘మహారాజా ధన్యవాదాలు! నాకు ‘నెలసరి’ క్రమం తప్పకుండా వస్తోంది’ అని బేగమ్ చమత్కరించాడు! రెండోసారి.. ఆరో నిజాం హయాంలో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన కిషన్ ప్రసాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్చే ఉద్వాసనకు గురైనారు. తన నియామకానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వైస్రాయ్కి ఫిర్యాదు చేసిన వారిలో కిషన్ ప్రసాద్ ఒకరనే అపోహతో! అలా తనకు లభించిన విరామంతో కిషన్ ప్రసాద్ దేశాటన చేశారు. పెయింటింగ్ నేర్చుకున్నారు. పియానో నేర్చుకున్నారు. వంటలు కూడా. లాహోర్ పర్యటనలో ప్రముఖ కవి ఇక్బాల్‌తో స్నేహం చేశారు. కిషన్ ప్రసాద్ విధేయతను శంకించడం తప్పని ఆయన సంతకాన్ని ఇతరులు ఫోర్జరీ చేశారని నిజాం నవాబుకు తర్వాత తెలిసింది. 1927లో రెండోసారి ప్రధానమంత్రిగా ఆహ్వానించారు. 9 ఏళ్లు ఆ బాధ్యతలు నిర్వర్తించాడు. యమీన్-ఉల్- సుల్తానత్ (ప్రభువు కుడి భుజం) అనే బిరుదును సార్థకం చేసుకున్నాడు. ‘అద్వితీయ’ వారసత్వం! కిషన్ ప్రసాద్ ఏడుగురిని వివాహమాడాడు. ముగ్గురు హిందూ భార్యలు. నలుగురు ముస్లిం భార్యలు. 30 మంది సంతానం. తల్లుల మతానికి చెందిన పేర్లు పిల్లలకు పెట్టారు. వారి వారి మతరీతులతో పద్ధతులతో పెంచారు. ఆయా మతాల వారికే ఇచ్చి వివాహం చేశారు. తన విల్లులో తన వారసులు ఏక పత్నీ-పతీ వ్రతం పాటించాల్సిందిగా సూచించారు. ఇతరుల మతాన్ని కించపరచిన ఎవరూ సుఖంగా జీవించలేరని స్పష్టం చేశారు! కిషన్ ప్రసాద్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఆరాధకుడు. శ్రీకృష్ణ భక్తుడు. అన్ని కులాల, మతాల అభిమానాన్ని పొందిన కిషన్ ప్రసాద్‌ను హిందువుగా, ముస్లింగా భావించేవారు. ఇంతకీ మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహదూర్ హిందువా? ముస్లిమా? వచ్చేవారం.. ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి