అపురూప నాణేల సేకర్త
ఆల్కాట్‌తోట (రాజమండ్రి) :అందరు గృహిణుల్లా కాకుండా తనకు ఏదో ఒక ప్రత్యేకత ఉండాలన్న తపన ఆమెను అపురూప నాణేలు సేకరించే దిశగా నడిపించింది. అదే ఇప్పుడు ఆమె హాబీ అయింది. రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డు ప్రాంతానికి చెందిన గృహిణి ఎన్.సుజాత రకరకాల నాణేలు, కరెన్సీలు, స్టాంపులు సేకరించడంలో దిట్ట. 1616 సంవత్సరానికి చెందిన నాణెం, 1730లోని ‘వి’ ఆకారపు నాణెం, విక్టోరియా మహారాణి బొమ్మ ముద్రించిన 1882 నాటి వెండినాణెం, నైజాం నవాబులు చార్మినార్ బొమ్మతో ముద్రించిన నాణేలు, 1897 నాటి అర్ధ, పావు నాణేలు, అణా, రెండణాలు, చిల్లికానీ, గుర్రపు కానీ, గాంధీ బొమ్మ ఉన్న 20 పైసల బిళ్ల, వివిధ రూపాయి నాణేలు, కలువ పువ్వు ఉన్న రాగి 20 పైసలు, టోపీ లేని, టోపీ ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ బొమ్మలతో కూడిన నాణేలు, నెహ్రూ, ఇందిరాగాంధీ బొమ్మలతో ఉన్న పెద్ద ఐదు రూపాయల నాణేలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమెవద్ద అనేక నాణేలు ఉన్నాయి.
రూపాయి నుంచి రూ.1000 వరకూ వివిధ డిజైన్ల నోట్లు ఉన్నాయి. నైజీరియా, అమెరికా, సౌదీ అరేబియా, నేపాల్, భూటాన్ తదితర దేశాల కరెన్సీ నోట్లను సైతం ఆమె సేకరించారు. పైసా నుంచి రూ.10 వరకూ అనేక డిజైన్లలో రూపొందిన నాణేలు ఉన్నాయి. రూ.10 నాణేలు మూడు డిజైన్లు, రూ.ఐదు నాణేలు 33 డిజైన్లు, రూ.రెండు నాణేలు 26 డిజైన్లు, రూ.ఒకటి నాణేలు 34 డిజైన్లు ఉన్నాయి. వీటితోపాటు ఒక పైసా నుంచి 50 పైసల వరకూ అనేక డిజైన్లలో ఉన్న నాణేలను సుజాత సేకరించారు. సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, వల్లభాయ్ పటేల్, శివాజీ, జగ్జీవన్‌రామ్, దాదాబాయ్ నౌరోజీ, మోతీలాల్ నెహ్రూ, శ్యాంప్రసాద్ ముఖర్జీ, జయప్రకాశ్ నారాయణ, కింగ్ జార్జి, రాజీవ్‌గాంధీ, చిత్తరంజన్‌దాస్, మహారాణా ప్రతాప్ తదితరుల బొమ్మలతో ఉన్న నాణేలు సేకరించి పలువురి అభినందనలు అందుకుంటున్నారు సుజాత.