భారతీయులు ఎందులోనూ తక్కువ కాదని చాటి చెప్పేందుకు ఓ హైదరాబాదీ ఇంజనీరు నడుం బిగించారు. భారత్ తొలి కారు గురించి పలు ఆకసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
నిజాం ట్రాన్స్‌పోర్టులో ఇంజనీరుగా పని చేసే మధుసూదన్‌రెడ్డికి రవాణాలో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇక్కడి పరిమితులు బాగా తెలుసు. అనేక వ్యవహరాల సమాహారంగా వ్యక్తిగత ట్రాన్స్‌పోర్ట్ కోసం దేశీయంగా కారు తయారు చేయలేమా అనే సందేహాం ఆయన్ని చుట్టుముట్టింది. దీంతో తన ఇంట్లోనే కారు తయారీ కాన్సెప్టుపై అవిశ్రాంతంగా శ్రమించారు. స్వాత్రంత్రం వచ్చి హైదరాబాద్ స్టేట్ భారత్‌లో విలీనం అయ్యేనాటికి కాగితంపై కారుకి సంబంధించిన వర్క్(డీపీఆర్) అంతా పూర్తయ్యింది.
బ్రాండ్ పింగళి
స్వాత్రంత్రం వచ్చిన తర్వాత కారు తయారీలో మరింతగా తలామునకలయ్యారు పింగళి మధుసూదన్‌రెడ్డి. స్థానికంగా ఉన్న కంపెనీల సహకారంతో ఛాసిస్, ఇంజన్, వీల్ మెకానిజం, స్టీరింగ్ మెకానిజం తదితర పనులన్నీ పూర్తి చేశారు. ఆ తర్వాత కారు విడిభాగాలను అసెంబ్లింగ్ చేసేందుకు హిందూస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్), హైదరాబాద్ సహకారం తీసుకున్నారు. అలా 1957 నాటికి తొలి కారును తయారు చేశారు. ఈ కారుకి పింగళి పేరు పెట్టారు.
ట్యాంక్‌బండ్‌పై చక్కర్లు
స్వాతంత్రం సిద్ధించి దేశ విభజన సమస్యలు, పేదరికంతో మిగిలిన దేశం అంతా పోరాటం చేస్తుంటూ పారిశ్రామిక రంగం, పరిశోధనల్లో హైదరాబాద్ దూసుకుపోవడం మొదలైంది. హాల్‌లో తయారైన ప్రోటోటైప్ దేశీ కారు విదేశీ కార్లతో పోటీ పడుతూ హైదరాబాద్ రోడ్లపై ముఖ్యంగా ట్యాంక్‌బండ్‌పై పింగళి కారు చక్కర్లు కొట్టింది. టెస్ట్ రైడ్ సక్సెస్‌ఫుల్ కావడంతో కార్ల తయారీపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.
నెహ్రూ మెచ్చిన కారు
అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ బెంగళూరు పర్యటన సందర్భంగా పింగళి కారుని అక్కడికి తరలించారు. నెహ్రూ స్వయంగా కారుని చూసి నడిపించారు. పక్కన ఉన్న ఇంజనీరు మధుసూదన్‌రెడ్డి కారుకి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడించారు. దేశంలోని మధ్య తరగతి ప్రజలకు ఈ కారు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. భారీ ఎత్తున కార్ల తయారు చేస్తే బాగుంటుందని వివరించారు.
మన కోసం
అప్పటికే అమెరికా, యూరప్‌లో అనేక కార్ల మోడళ్లు ఉన్నా అవేవీ భారత స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా లేవు. ఇక్కడుండే ఉమ్మడి కుటుంబాలు, ప్రయాణాల్లో ఎక్కువగా తీసుకెళ్లే లగేజీ, వేడి వాతావరణం, గతుకుల రోడ్లు తదితర సమస్యల ఉండేవి. విదేశీ కార్లు కొనుక్కున్నవారు సైతం పూర్తిగా నగరాలు, పట్టణాలకే పరిమితమయ్యేవారు. కానీ పింగళి కారు ఈ సమస్యలన్నీ దూరం చేసే సాధనంగా తోచింది. దీంతో ఈ కారు తయారీకి పూర్తి ప్రతిపాదనలు సిద్ధం చేయాలనే ఆర్డర్లు వచ్చాయి.
ధర ఎంతంటే
టూ సిలిండర్, టూ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్‌తో 7 బీహెచ్‌పీ సామర్థ్యంతో కారును తయారు చేస్తే ఒక్కో కారు తయారీకి రూ.4,500 ఖర్చు వస్తుందని నిర్ణయించారు. పన్నులు కలుపుకుంటే రూ.5000 దగ్గర ఈ కారు మార్కెట్‌లోకి తేవచ్చని. తొలి విడతగా 7,000 కార్లు తయారు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.
చైనా తెచ్చిన చేటు
కారు తయారీ కోసం ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో 1962లో ఇండో చైనా వార్ రావడంతో పింగళి కారు తయారీ ప్రతిపాదనలు పెండింగ్‌లో పెట్టారు. ఆ తర్వాత నెహ్రూ మరణంతో ఢిల్లీలో పింగళి కారు ప్రతిపాదనలు పట్టించుకునే వారే కరువయ్యారు. అలా ఏళ్ల పాటు కారు తయారీ ప్రతిపాదన మూలనపడింది.
రంగంలోకి నిజాం మనువడు
దేశీయంగా తయారయ్యే మొదటికారు హైదరాబాద్ నుంచే రావాలని నిజాం మనువడు సంకల్పించారు. దీంతో కారు తయారీకి అనుమతులు ఇచ్చి, హైదరాబాద్‌లో ఫ్యాక్టరీ పెట్టాలంటూ నిజం మనువడు ముకరంజా 1970లో కేంద్రాన్ని కోరారు. కారణాలు ఏమైనా మరోసారి పింగళికి చుక్కెదురైంది.
హైదరాబాద్‌ను కాదని జపాన్
పింగళికి అనుమతులు రాకపోయినా దేశీ కారు తయారీ అంశం మాత్రం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మదిలో నాటుకు పోయింది. ఆ కారణంగానే ఎమర్జెన్సీ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాక దేశీ కారు తయారీపై ఇందిరా దృష్టి పెట్టారు. కానీ అప్పటికే నలభై ఏళ్లు దాటి పోవడంతో సాంకేతికంగా పింగళి వెనుకబడి పోయింది. దీంతో స్వదేశీ కారు కల అనేక మలుపులు తిరిగి చివరకు జపాన్ సహకారంతో మారుతిగా మార్కెట్‌లోకి వచ్చింది.
ఎగ్జిబిషన్‌కే పరిమితం
పరిస్థితులు అనుకూలించి ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తే తొలి దేశీ కారుగా మార్కెట్‌లోకి రావాల్సిన పింగళి కారు దాదాపు డెబ్బై ఏళ్ల పాటు హాల్ ఎగ్జిబిషన్‌కే పరిమితమైంది. చివరకు ఎవరికీ అంతుచిక్కని రీతిలో 2017లో ఎగ్జిబిషన్ నుంచి కూడా ఈ కారు మాయమైంది. హైదరాబాద్ ఘన చరిత్రలో చోటు దక్కించుకోలేకపోయిన పింగళి కారు చివరకు ఫోటోలకే పరిమితమైంది.
అలా జరిగి ఉంటే
పింగళి కారు తయారీకి వేగంగా అనుమతులు వస్తే ఆటోమొబైల్ సెక్టార్‌లో హైదరాబాద్ రూపు రేఖలు మారిపోయి ఉండేవి. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత కాలంలో ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఎక్కువగా వచ్చాయి. కాగా ఇటీవల మహీంద్రా ట్రాక్టర్స్, టాటా ఏయిరోస్పేస్‌తో పరిస్థితిలో మార్పు వచ్చింది. తాజాగా ఈవీ ప్రభంజనంలో యూకేకి చెందిన మోటో వన్ మరికొన్ని కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులకు రెడీ అయ్యాయి.
- సాక్షి, వెబ్ స్పెషల్
Comments
Please login to add a commentAdd a comment