
ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ (HCLTech) హైదరాబాద్‌లో మరో గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను (GDC) తెరిచింది. హైటెక్ సిటీలో ఏర్పాటైన ఈ గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగరంలో హెచ్‌సీఎల్ టెక్ సంస్థకు ఇది ఐదో గ్లోబల్ డెలివరీ సెంటర్. ఈ అత్యాధునిక కేంద్రంలో 5,000 మంది ఉద్యోగులు పని చేసుకునేందుకు వెసులుబాటు ఉంది.
హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ తాజాగా ఏర్పాటు చేసిన గ్లోబల్ డెలివరీ సెంటర్ 3,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్ పొందింది. ఈ కేంద్రం ద్వారా 5,000 ఉద్యోగాలు లభిస్తాయని, ప్రముఖ టెక్ గమ్యస్థానంగా హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని అంచనా.
2007 నుండి హెచ్‌సీఎల్ టెక్ సంస్థకు హైదరాబాద్ వ్యూహాత్మక ప్రదేశంగా ఉంది. నగరంలో ఈ సంస్థకు 10,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. కొత్త కేంద్రం గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు మద్దతు ఇస్తుంది. ఫైనాన్స్, మాన్యుఫాక్చరింగ్, హెల్త్‌కేర్ వంటి రంగాలలో అధునాతన పరిష్కారాలను అందిస్తుంది.

గ్లోబల్ ఏఐ హబ్ గా తెలంగాణ
ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, గ్లోబల్ ఏఐ హబ్ గా తెలంగాణ శరవేగంగా రూపాంతరం చెందుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ పట్ల రాష్ట్రానికి ఉన్న నిబద్ధతను ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణ 2.0 గ్రోత్ విజన్ ద్వారా వృద్ధిని వేగవంతం చేయడానికి రాష్ట్రం కట్టుబడి ఉందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు.
హెచ్ సీఎల్ టెక్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సి.విజయకుమార్ కొత్త కేంద్రంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ‘కృత్రిమ మేధ నేతృత్వంలోని సాంకేతిక పరిజ్ఞానంలో ఉత్తేజకరమైన దశలో మనం ఉన్నాం. మా క్లయింట్లకు ఈ పరిష్కారాలను అందించడానికి మా గ్లోబల్ నెట్వర్క్‌లో హైదరాబాద్ ఒక వ్యూహాత్మక స్థానం. ఇక్కడి గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల పురోగతికి కృషి చేస్తాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment