ఆ ప్రధాని ప్రజల మహారాజు
ఆదేశాల్లో పదనిసలు.. వరుసలో ఇమడని ఒక పత్రం ఉంది! తన ప్రధానమంత్రి కిషన్ ప్రసాద్ చేసిన వ్యక్తిగత ‘రుణాన్ని మాఫీ’ చేస్తూ నిజాం సంతకం చేశాడు. ఈ వైనం వచ్చేవారం ముచ్చటించుకుందాం. అంతకు ముందుగా, కిషన్ ప్రసాద్ బహదూర్‌ను స్మరించుకుందాం! ప్రజల మహారాజుగా ఆయన కీర్తి పొందారు. నిజాం నవాబులూ అందుకు అసూయ చెందలేదు. కిషన్ ప్రసాద్ (1864 జనవరి 1-1940 మే 13) మరికొంతకాలం జీవించి ఉంటే ఉపఖండం చరిత్ర మరోలా ఉండేది!
కిషన్ ప్రసాద్ బహదూర్
పూర్వీకులు అక్బర్ చక్రవర్తికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన తోడర్ మల్ వారసులు! కిషన్ ప్రసాద్ హైద్రాబాద్ స్టేట్‌లోనే జన్మించారు. ఆయన తాతగారు చందూలాల్ హైదరాబాద్ స్టేట్ ప్రధానమంత్రిగా పనిచేశారు. మొదటి సాలార్‌జంగ్‌తో, ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్‌తో కిషన్ కలసి మెలసి పెరిగాడు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ నూనూగు మీసాల వయసులోనే రసికుడు! విచ్చలవిడి స్త్రీ సాంగత్యం మంచిది కాదని బ్రిటిష్ రెసిడెంట్ ఒత్తిడి చేయడంతో మహబూబ్ అలీ ఖాన్‌ను పురానీ హవేలీకి మార్చారు.
వారానికి ఒక పర్యాయం మాత్రమే యువతులను కలిసే షరతుతో!
క్రమం తప్పని నెలసరి.. కిషన్ ప్రసాద్ స్వయంగా కవి. షాద్
(సంతుష్టుడు) అనే కలం పేరుతో కవితలు రాశారు. సంస్కృతం, పర్షియన్,అరబిక్,ఉర్దూ, గురుముఖి, ఇంగ్లిష్ భాషలలో పండితుడు. ప్రథమ భారత స్వాతంత్య్రోద్యమం (సిపాయిల తిరుగుబాటు) నేపథ్యంలో ఉత్తరాది అల్లకల్లోలం అయ్యింది. ప్రఖ్యాత ఉర్దూ కవి ఫానీ బదయూని ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకుని అవధ్ ప్రాంతం నుంచి ‘షాద్’ పిలిపించారు. ఇక్కడ అధ్యాపకునిగా ఉద్యోగం ఇప్పించారు. కిషన్ ప్రసాద్ నివాసం నిత్యం ముషాయిరాల (కవితా గోష్టుల)తో కళకళలాడేది. నిజాంలు తాము రాసిన కవితలను కిషన్ ప్రసాద్ ముషాయిరాల్లో మాత్రమే చదివేందుకు పంపేవారు. అలా వచ్చిన కవితలను సగౌరవంగా నుదుటికి తాకించుకుని కవితాహరులతో చదివించేవారు. అబిద్ అలీ అనే కవి ‘బేగమ్’ అనే కలం పేరుతో గజల్స్ రాసేవాడు. స్త్రీ
వేషధారణతో వచ్చి చదివేవాడు. ముషాయిరాల్లో హాస్యం ఉండొద్దా? అతడికి అఫ్‌కోర్స్ బేగమ్‌కు కిషన్ ప్రసాద్ నెలసరి ప్రోత్సాహకాన్ని మంజూరు చేశారు. ఆ నేపథ్యంలో ‘మహారాజా ధన్యవాదాలు! నాకు ‘నెలసరి’ క్రమం తప్పకుండా వస్తోంది’ అని బేగమ్ చమత్కరించాడు!
రెండోసారి..
ఆరో నిజాం హయాంలో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన కిషన్ ప్రసాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌చే ఉద్వాసనకు గురైనారు. తన నియామకానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వైస్రాయ్‌కి ఫిర్యాదు చేసిన వారిలో కిషన్ ప్రసాద్ ఒకరనే అపోహతో! అలా తనకు లభించిన విరామంతో కిషన్ ప్రసాద్ దేశాటన చేశారు. పెయింటింగ్ నేర్చుకున్నారు. పియానో నేర్చుకున్నారు. వంటలు కూడా. లాహోర్ పర్యటనలో ప్రముఖ కవి ఇక్బాల్‌తో స్నేహం చేశారు. కిషన్ ప్రసాద్ విధేయతను శంకించడం తప్పని ఆయన సంతకాన్ని ఇతరులు ఫోర్జరీ చేశారని నిజాం నవాబుకు తర్వాత తెలిసింది. 1927లో రెండోసారి ప్రధానమంత్రిగా ఆహ్వానించారు. 9 ఏళ్లు ఆ బాధ్యతలు నిర్వర్తించాడు. యమీన్-ఉల్- సుల్తానత్ (ప్రభువు కుడి భుజం) అనే బిరుదును సార్థకం చేసుకున్నాడు.
‘అద్వితీయ’ వారసత్వం!
కిషన్ ప్రసాద్ ఏడుగురిని వివాహమాడాడు. ముగ్గురు హిందూ భార్యలు. నలుగురు ముస్లిం భార్యలు.
30 మంది సంతానం. తల్లుల మతానికి చెందిన పేర్లు పిల్లలకు పెట్టారు. వారి వారి మతరీతులతో పద్ధతులతో పెంచారు. ఆయా మతాల వారికే ఇచ్చి వివాహం చేశారు. తన విల్లులో తన వారసులు ఏక పత్నీ-పతీ వ్రతం పాటించాల్సిందిగా సూచించారు. ఇతరుల మతాన్ని కించపరచిన ఎవరూ సుఖంగా జీవించలేరని స్పష్టం చేశారు! కిషన్ ప్రసాద్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఆరాధకుడు. శ్రీకృష్ణ భక్తుడు. అన్ని కులాల, మతాల అభిమానాన్ని పొందిన కిషన్ ప్రసాద్‌ను హిందువుగా, ముస్లింగా భావించేవారు. ఇంతకీ మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహదూర్ హిందువా? ముస్లిమా? వచ్చేవారం..
ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి