కుప్పకూలిన సీబీఎస్‌ | Hyderabad CBS Bus Stand Shed Collapsed | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన సీబీఎస్‌

Published Fri, Jul 6 2018 2:05 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Hyderabad CBS Bus Stand Shed Collapsed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎనిమిదిన్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన గౌలిగూడలోని సెంట్రల్‌ బస్‌స్టేషన్‌(సీబీఎస్‌) నేలకూలింది. మిసిసిపీ హేంగర్‌గా నగర ప్రజలకు సుపరిచితమైన ఈ ప్రయాణ ప్రాంగణం గురువారం తెల్లవారుజామున కూలిపోయినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఒకప్పుడు వేలాది మంది ప్రయాణికులు, వందలకొద్దీ బస్సుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉన్న సీబీఎస్‌ శిథిలావస్థకు చేరడంతో ఆర్టీసీ అధికారులు కొద్దిరోజులుగా బస్సుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అందులో ఉన్న దుకాణాలు, ప్రయాణికుల సదుపాయాలు, టికెట్‌ బుకింగ్‌ కేంద్రాలను తొలగించారు. అధికారులు ఊహించినట్లుగానే గురువారం సీబీఎస్‌ ఒకవైపు పూర్తిగా నేలకొరిగింది.

రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సునీల్‌శర్మ, ఆర్టీసీ ఉన్నతాధికారులు మిసిసిపీ హేంగర్‌ను పరిశీలించారు. బస్‌స్టేషన్‌ కూలిపోవడం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. మిసిసిపీ హేంగర్‌ స్థానంలో అధునాతన బస్‌స్టేషన్‌ నిర్మిస్తామని, ఈ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించనున్నామని తెలిపారు. ఎంతోకాలంగా సీబీఎస్‌లోనే ఉపాధి పొందుతున్న స్థానికులు తమకు ప్రత్యామ్నాయం కల్పించాలని మంత్రిని కోరారు. దుకాణాలు కోల్పోయిన వారికి మరోచోట వాటిని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

ఇదీ మిసిసిపీ హేంగర్‌ చరిత్ర.. 
నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో మిసిసిపీ హేంగర్‌ను నిర్మించారు. 1926లో హైదరాబాద్‌ సంస్థాన ప్రధాన మంత్రి మహారాజా కిషన్‌ పరిషద్‌ అధ్యక్షతన నగరంలో బస్సు రవాణా వ్యవస్థ కోసం ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఏడాది పాటు వివిధ రకాల రవాణా వ్యవస్థలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. అప్పటికే ఇంగ్లండ్‌లో పేరొందిన అల్‌బియన్‌ మోటర్‌ కంపెనీకి చెందిన బస్సులను హైదరాబాద్‌లో నడిపేందుకు చర్యలు చేపట్టారు. నిజాం స్టేట్‌ రైల్వేలో భాగంగా ఇవి రోడ్డెక్కాయి. అప్పట్లో పుతిలీబౌలీ కేంద్రంగా 27 బస్సులు, 166 మంది ఉద్యోగులతో బస్సు సదుపాయం అందుబాటులోకి వచ్చింది. బస్సులతో పాటు వాటిని నిలిపేందుకు బస్‌స్టేషన్‌ అవసరమని గ్రహించి.. విదేశాల్లో బస్సులు, రైళ్లు, విమానాల రిపేరింగ్‌కు ఉపకరించే షెడ్డుల మాదిరిగా గౌలిగూడలో ఒక భారీ షెడ్‌ నిర్మించాలని నిర్ణయించారు.

ఏవియేషన్‌ హేంగర్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఇంగ్లండ్‌కు చెందిన బట్లర్‌ స్టీల్‌ కంపెనీ మిసిసిపీ హేంగర్‌ను నిర్మించింది. ఇందుకోసం ఆ దేశానికి చెందిన ఇంజనీరింగ్‌ నిపుణులు విడిభాగాలతో హైదరాబాద్‌ వచ్చారు. హైదరాబాద్‌ సమశీతోష్ణ వాతావరణానికి అనుగుణంగా 1.77 ఎకరాల విస్తీర్ణంలో ఒక భవనంలా కాక అర్థచంద్రాకారంలో బస్సులు దక్షిణ దిశ నుంచి వచ్చి ఉత్తరం వైపు వెళ్లేలా నిర్మించారు. 1932 నుంచి వినియోగంలోకి రాగా.. మొదట్లో బస్సుల రిపేరింగ్, నైట్‌ హల్ట్‌ కోసం దీనిని వినియోగించారు. ఆ తర్వాత ప్రయాణికుల ప్రాంగణంగా సేవలు ప్రారంభమయ్యాయి. 

ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ.. 
1951లో ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో భాగమైంది. మిసిసిపీ హేంగర్‌ నుంచే ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ బస్సులు నడిచేవి. 2004లో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌(ఎంజీబీఎస్‌) నిర్మించే వరకూ గౌలిగూడ బస్‌స్టేషనే ప్రధాన బస్‌స్టేషన్‌గా ఉండేది. ఆ తర్వాత దీనిని సిటీ బస్సుల నిర్వహణ కోసం వినియోగించారు. ఇటీవల వరకూ గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 29 డిపోలకు చెందిన 510 బస్సులు మిసిసిపీ హేంగర్‌ నుంచి రాకపోకలు సాగించాయి. ఈ మార్గంలో నిత్యం 2,385 ట్రిప్పులు తిరిగేవి. 85 వేల మంది రాకపోకలు సాగించేవారు. అలాగే కర్నూలు, కడప, నెల్లూరు, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల బస్సులకు ఇది నైట్‌హాల్ట్‌గా ఉండేది. సంక్రాంతి, దసరా వంటి రద్దీ రోజుల్లో జిల్లాల బస్సులు ఎక్కువ శాతం ఇక్కడి నుంచే రాకపోకలు సాగించేవి. 

అనుమానాలెన్నో..? 
మిసిసిపీ హేంగర్‌ నుంచి నాలుగైదు రోజుల క్రితం వరకూ బస్సులు రాకపోకలు సాగించాయి. అలాంటి ప్రయాణ ప్రాంగణం దానికదిగా కూలిపోయినట్లుగా కాకుండా ‘యు’ఆకారంలో ఉన్న షెడ్డు దిగువ భాగం నిదానంగా నేలలోకి కూరుకుపోయిన తీరు, ముందస్తుగానే బస్సుల రాకపోకలను నిలిపివేయడం అనుమానాలకు తావిస్తోంది. షెడ్డు కింద ఉన్న నట్లు, బోల్టులు తొలగించడంద్వారా అది కుంగిపోయేలా చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా దీనిని కూల్చివేశారని ఇంటాక్‌ సంస్థ ప్రతినిధి అనురాధారెడ్డి ఆరోపించారు. చారిత్రక, వారసత్వ కట్టడాలను పరిరక్షించకుండా కూల్చివేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. 

అధునాతన బస్‌స్టేషన్‌ నిర్మాణం.. 
మిసిసిపీ హేంగర్‌ స్థానంలో అధునాతన బస్‌స్టేషన్‌ను నిర్మించేందుకు తెలంగాణ ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో అతిపెద్ద వాణిజ్య సముదాయాలను నిర్మించనున్నట్లు రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సునీల్‌శర్మ తెలిపారు. మొదటి అంతస్తులో బస్‌స్టేషన్‌.. ఆ పైఅంతస్తుల్లో షాపింగ్‌ మాల్స్, మల్టిప్లెక్స్‌లు, వినోద కేంద్రాలను నిర్మించనున్నారు. దీని ద్వారా ఆర్టీసీకి భారీగా ఆదాయం లభించగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఇందుకు కార్యాచరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సిటీ బస్సులతో పాటు కొన్ని జిల్లాల బస్సులను కూడా ఇక్కడి నుంచే నడపనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement