CBS Bus Stand
-
సంక్రాంతికి ఊళ్ల బాట పట్టిన హైదరబాదీలు..
-
సంక్రాంతి: ఊళ్లకు పయనమవుతున్న నగర వాసులు
-
బస్సు ఇక భద్రమే!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సిటీ బస్‌స్టేషన్(సీబీఎస్)లో నిలిపిన ఆర్టీసీ బస్సును దొంగలు దర్జాగా తస్కరించి నాందేడ్ తరలించి తుక్కు కింద మార్చేందుకు చేసిన ప్రయత్నం ఆర్టీసీని కలవరపాటుకి గురిచేసింది. చోరీ తర్వాత బస్సు జాడను కనిపెట్టడంలో కాస్త ఆలస్యం జరిగినా రేకు ముక్క కూడా దొరికి ఉండేది కాదు. సకాలంలో జాడ తెలియటంతో బాడీ మాయమైనా.. కనీసం ఛాసిస్‌ను అయినా స్వాధీనం చేసుకోగలిగారు. ఇప్పుడు ఇదే అంశం ఆర్టీసీ కలవరానికి కారణమైంది. నైట్‌హాల్ట్ బస్సులు ఎక్కడపడితే అక్కడ నిలిపి ఉంటాయి. ఇక దొంగలు రెచ్చిపోతే సులభంగా బస్సులు మాయమై తుక్కుగా మారిపోవడం ఖాయం. పక్కా చాకచక్యంగా జరిగిన తాజా చోరీ ఇతర దొంగలకు దారి చూపినట్టవుతుందని అధికారులు ఇప్పుడు హైరానా పడుతున్నారు. ఈ నేపథ్యంలో బస్సుల స్టీరింగ్‌ను లాక్ చేసేలా కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. స్టీరింగ్‌ను లాక్ చేసేలా.. సాధారణంగా వాహనాలకు తాళం చెవితో లాక్ చేసే వెసులుబాటు ఉంటుంది. లాక్ పడిన తర్వాత ఇంజిన్‌ను ఆన్ చేయటం సాధ్యంకాదు. వాటికి ఉండే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ పనిచేయనందున బస్సును చోరీ చేయటం అంత సులువు కాదు. హైదరాబాద్‌లో 3,700 బస్సులుంటే వాటిల్లో కీ సిస్టం ఉన్నవి కేవలం 500 మాత్రమే. మిగతావి పాత మోడల్ బస్సులు. వీటిల్లో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ సిస్టం లేదు. వాటిని తాళం చెవితో లాక్ చేయటం సాధ్యం కాదు. ఇప్పుడు చోరీకి గురైంది కూడా అలాంటి బస్సే. భవిష్యత్తులో ఇలాంటి బస్సులు చోరీకి గురికాకుండా ఉండాలంటే కచ్చితంగా లాకింగ్ ఏర్పాటు అవసరం. ఇందుకోసం స్టీరింగ్‌కు లాక్ చేసేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్టీరింగ్ తిరగకుండా దాన్ని బంధించే ఏర్పాటుకు ఆదేశించారు. ఇందుకోసం మూడు రకాల డిజైన్లను చూశారు. వాటిల్లో ఒకదాన్ని ఎంపిక చేసి శనివారం ఆదేశాలు ఇవ్వనున్నారు. ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ వినోద్‌కుమార్ తొలుత సిటీ బస్సుల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత దీన్ని మిగతా జిల్లాల్లో అనుసరించనున్నారు. నగరంలో నైట్‌హాల్ట్ సర్వీసులు 900 ఉన్నాయి. వాటికి ఈ కొత్త ఏర్పాటు చేయనున్నారు. స్టీరింగ్ తిరగకుండా చేసే ఏర్పాటు బలంగా ఉండేలా చూస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దాన్ని రంపంతో కోసే వీలు ఉండకుండా చేస్తున్నారు. సుత్తిలాంటి దానితో మోది విరచాల్సి ఉంటుంది. అది చడీచప్పుడు కాకుండా జరిగే వీలు లేనందున చోరీ సాధ్యం కాదన్నది అధికారుల ఆలోచన. ఇక నైట్‌హాల్ట్ బస్సులుండే చోట్ల భద్రతను సైతం పెంచారు. -
సీబీఎస్ అభివృద్ధి పనులపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సెంట్రల్ బస్ స్టేషన్ (సీబీఎస్) పునర్నిర్మాణ, ఆధునీకరణ పనులపై రాష్ట్ర ఆర్టీసీ అధికారులు సమీక్షించారు. కొద్ది రోజుల కిందటే సీబీఎస్ రేకుల షెడ్డు కూలిపోవడంతో ఆ స్థలంలో ఆధునీకరణ పనులు చేపట్టేందుకు కార్యాచరణను రూపొందించారు. సీబీఎస్‌లో ప్రయాణీకులకు మెరుగైన రవాణా సదుపాయాల కల్పనతో పాటు సంస్థ వాణిజ్య పరంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్టీసీ ఈడీ, కార్యదర్శి పురుషోత్తం పర్యవేక్షణలో సీటీఎం (ట్రాఫిక్), సీటీఎం (ఎం అండ్ సీ)లతో పాటు ఇతర కమిటీ సభ్యులు సీబీఎస్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆదివారం సమీక్షించారు. ఇక్కడ బస్ పార్కింగ్ స్థలాన్ని సెల్లార్లో కేటాయించాలని నిర్ణయించారు. సంస్థ ఆర్థిక పరిపుష్టి కోసం 3 నుంచి మూడున్నర ఎకరాల స్థలాన్ని బీఓటీ పద్ధతిలో వాణిజ్య సముదాయాలకు ఇవ్వాలని సూత్రప్రాయంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మినీ థియేటర్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుతో పాటు ఖాళీ స్థలంలో పెట్రోల్ బంకు నిర్వహణను చేపట్టే దిశలో ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వేసవిలో తీవ్రమవుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణీకుల సౌకర్యం కోసం నామినేషన్ బేసిన్ మీద తాత్కాలిక షెల్టర్లను నెలకొల్పడానికి చర్యలు తీసుకోబోతున్నా రు. గతేడాదితో పోలిస్తే.. 16శాతం కమర్షియల్ అభివృద్ధి చెందగా, 25 నుంచి 30 శాతం మేర వాణిజ్య ఆదాయాన్ని పెంచుకోవడానికి గల అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఈడీ పురుషోత్తం మాట్లాడుతూ, సంస్థ ఆర్థిక స్థితిని మెరు గుపరుచుకునే క్రమంలో వాణిజ్య ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. -
నిజాం వారసత్వాన్ని కాపాడండి
సాక్షి, హైదరాబాద్ : నిజాం చారిత్రక కట్టడం గౌలిగూడ బస్ స్టేషన్ ఒక్క సారిగా కుప్పకూలడంపై న్యాయ విచారణ జరిపించాలని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు నజాఫ్ అలీఖాన్ సీఎం కేసీఆర్‌ను కోరారు. బస్ స్టేషన్ కూలిపోవడంపై పలు అనూమానాలు వ్యక్త మవుతున్నాయి, దానిపై విచారణ జరిపించాలని కేసీఆర్‌కు ఆదివారం లేఖ రాశారు. హైదరాబాద్‌లోని నిజాం అస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పలు ఆస్తులు నగరం నుంచి అదృశ్యమవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా ఆసుపత్రి, ఛాతీ ఆసుపత్రిను కూల్చీ వేయాలని ప్రభుత్వం భావిస్తోందని, చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో తెలిపారు. హైదరాబాద్ సందర్శనకు వచ్చిన వారికి హైటెక్ సిటీ లాంటివి కాదని, తెలంగాణ సంస్కృతి, చారిత్రక కట్టడాలే చూపించాలని పేర్కొన్నారు. గౌలిగూడ బస్ స్టేషన్ కూలీపోవడంపై పలు అనూమానాలు వ్యక్తమవుతున్నా విషయం తెలిసిందే. 90 ఏళ్ల క్రితం మూసీ నది ఒడ్డున నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గౌలిగూడ బస్ స్టేషన్ నిర్మించారు. 1994లో మహాత్మ గాంధీ బస్టాండ్ నిర్మించడంతో ప్రస్తుతం దానిని సిటీ బస్ స్టేషన్ (సీబీఎస్)గా ఉపయోగిస్తున్నారు. నిజాం స్మారక చిహ్నాలను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్ఐఎమ్ ఛీప్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్‌ను కోరిన విషయం తెలిసిందే. -
కుప్పకూలిన సీబీఎస్
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదిన్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన గౌలిగూడలోని సెంట్రల్ బస్‌స్టేషన్(సీబీఎస్) నేలకూలింది. మిసిసిపీ హేంగర్గా నగర ప్రజలకు సుపరిచితమైన ఈ ప్రయాణ ప్రాంగణం గురువారం తెల్లవారుజామున కూలిపోయినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఒకప్పుడు వేలాది మంది ప్రయాణికులు, వందలకొద్దీ బస్సుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉన్న సీబీఎస్ శిథిలావస్థకు చేరడంతో ఆర్టీసీ అధికారులు కొద్దిరోజులుగా బస్సుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అందులో ఉన్న దుకాణాలు, ప్రయాణికుల సదుపాయాలు, టికెట్ బుకింగ్ కేంద్రాలను తొలగించారు. అధికారులు ఊహించినట్లుగానే గురువారం సీబీఎస్ ఒకవైపు పూర్తిగా నేలకొరిగింది. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ, ఆర్టీసీ ఉన్నతాధికారులు మిసిసిపీ హేంగర్‌ను పరిశీలించారు. బస్‌స్టేషన్ కూలిపోవడం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. మిసిసిపీ హేంగర్ స్థానంలో అధునాతన బస్‌స్టేషన్ నిర్మిస్తామని, ఈ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించనున్నామని తెలిపారు. ఎంతోకాలంగా సీబీఎస్‌లోనే ఉపాధి పొందుతున్న స్థానికులు తమకు ప్రత్యామ్నాయం కల్పించాలని మంత్రిని కోరారు. దుకాణాలు కోల్పోయిన వారికి మరోచోట వాటిని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇదీ మిసిసిపీ హేంగర్ చరిత్ర.. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో మిసిసిపీ హేంగర్‌ను నిర్మించారు. 1926లో హైదరాబాద్ సంస్థాన ప్రధాన మంత్రి మహారాజా కిషన్ పరిషద్ అధ్యక్షతన నగరంలో బస్సు రవాణా వ్యవస్థ కోసం ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఏడాది పాటు వివిధ రకాల రవాణా వ్యవస్థలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. అప్పటికే ఇంగ్లండ్‌లో పేరొందిన అల్బియన్ మోటర్ కంపెనీకి చెందిన బస్సులను హైదరాబాద్‌లో నడిపేందుకు చర్యలు చేపట్టారు. నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా ఇవి రోడ్డెక్కాయి. అప్పట్లో పుతిలీబౌలీ కేంద్రంగా 27 బస్సులు, 166 మంది ఉద్యోగులతో బస్సు సదుపాయం అందుబాటులోకి వచ్చింది. బస్సులతో పాటు వాటిని నిలిపేందుకు బస్‌స్టేషన్ అవసరమని గ్రహించి.. విదేశాల్లో బస్సులు, రైళ్లు, విమానాల రిపేరింగ్‌కు ఉపకరించే షెడ్డుల మాదిరిగా గౌలిగూడలో ఒక భారీ షెడ్ నిర్మించాలని నిర్ణయించారు. ఏవియేషన్ హేంగర్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇంగ్లండ్‌కు చెందిన బట్లర్ స్టీల్ కంపెనీ మిసిసిపీ హేంగర్‌ను నిర్మించింది. ఇందుకోసం ఆ దేశానికి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు విడిభాగాలతో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ సమశీతోష్ణ వాతావరణానికి అనుగుణంగా 1.77 ఎకరాల విస్తీర్ణంలో ఒక భవనంలా కాక అర్థచంద్రాకారంలో బస్సులు దక్షిణ దిశ నుంచి వచ్చి ఉత్తరం వైపు వెళ్లేలా నిర్మించారు. 1932 నుంచి వినియోగంలోకి రాగా.. మొదట్లో బస్సుల రిపేరింగ్, నైట్ హల్ట్ కోసం దీనిని వినియోగించారు. ఆ తర్వాత ప్రయాణికుల ప్రాంగణంగా సేవలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ.. 1951లో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో భాగమైంది. మిసిసిపీ హేంగర్ నుంచే ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ బస్సులు నడిచేవి. 2004లో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్(ఎంజీబీఎస్) నిర్మించే వరకూ గౌలిగూడ బస్స్టేషనే ప్రధాన బస్‌స్టేషన్‌గా ఉండేది. ఆ తర్వాత దీనిని సిటీ బస్సుల నిర్వహణ కోసం వినియోగించారు. ఇటీవల వరకూ గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోలకు చెందిన 510 బస్సులు మిసిసిపీ హేంగర్ నుంచి రాకపోకలు సాగించాయి. ఈ మార్గంలో నిత్యం 2,385 ట్రిప్పులు తిరిగేవి. 85 వేల మంది రాకపోకలు సాగించేవారు. అలాగే కర్నూలు, కడప, నెల్లూరు, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల బస్సులకు ఇది నైట్‌హాల్ట్‌గా ఉండేది. సంక్రాంతి, దసరా వంటి రద్దీ రోజుల్లో జిల్లాల బస్సులు ఎక్కువ శాతం ఇక్కడి నుంచే రాకపోకలు సాగించేవి. అనుమానాలెన్నో..? మిసిసిపీ హేంగర్ నుంచి నాలుగైదు రోజుల క్రితం వరకూ బస్సులు రాకపోకలు సాగించాయి. అలాంటి ప్రయాణ ప్రాంగణం దానికదిగా కూలిపోయినట్లుగా కాకుండా ‘యు’ఆకారంలో ఉన్న షెడ్డు దిగువ భాగం నిదానంగా నేలలోకి కూరుకుపోయిన తీరు, ముందస్తుగానే బస్సుల రాకపోకలను నిలిపివేయడం అనుమానాలకు తావిస్తోంది. షెడ్డు కింద ఉన్న నట్లు, బోల్టులు తొలగించడంద్వారా అది కుంగిపోయేలా చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా దీనిని కూల్చివేశారని ఇంటాక్ సంస్థ ప్రతినిధి అనురాధారెడ్డి ఆరోపించారు. చారిత్రక, వారసత్వ కట్టడాలను పరిరక్షించకుండా కూల్చివేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. అధునాతన బస్‌స్టేషన్ నిర్మాణం.. మిసిసిపీ హేంగర్ స్థానంలో అధునాతన బస్‌స్టేషన్‌ను నిర్మించేందుకు తెలంగాణ ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అతిపెద్ద వాణిజ్య సముదాయాలను నిర్మించనున్నట్లు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ తెలిపారు. మొదటి అంతస్తులో బస్‌స్టేషన్.. ఆ పైఅంతస్తుల్లో షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్‌లు, వినోద కేంద్రాలను నిర్మించనున్నారు. దీని ద్వారా ఆర్టీసీకి భారీగా ఆదాయం లభించగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఇందుకు కార్యాచరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సిటీ బస్సులతో పాటు కొన్ని జిల్లాల బస్సులను కూడా ఇక్కడి నుంచే నడపనున్నారు. -
గౌలిగూడ బస్టాండ్‌లో కుప్పకూలిన షెడ్