సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సిటీ బస్‌స్టేషన్(సీబీఎస్)లో నిలిపిన ఆర్టీసీ బస్సును దొంగలు దర్జాగా తస్కరించి నాందేడ్ తరలించి తుక్కు కింద మార్చేందుకు చేసిన ప్రయత్నం ఆర్టీసీని కలవరపాటుకి గురిచేసింది. చోరీ తర్వాత బస్సు జాడను కనిపెట్టడంలో కాస్త ఆలస్యం జరిగినా రేకు ముక్క కూడా దొరికి ఉండేది కాదు. సకాలంలో జాడ తెలియటంతో బాడీ మాయమైనా.. కనీసం ఛాసిస్‌ను అయినా స్వాధీనం చేసుకోగలిగారు. ఇప్పుడు ఇదే అంశం ఆర్టీసీ కలవరానికి కారణమైంది. నైట్‌హాల్ట్ బస్సులు ఎక్కడపడితే అక్కడ నిలిపి ఉంటాయి. ఇక దొంగలు రెచ్చిపోతే సులభంగా బస్సులు మాయమై తుక్కుగా మారిపోవడం ఖాయం. పక్కా చాకచక్యంగా జరిగిన తాజా చోరీ ఇతర దొంగలకు దారి చూపినట్టవుతుందని అధికారులు ఇప్పుడు హైరానా పడుతున్నారు. ఈ నేపథ్యంలో బస్సుల స్టీరింగ్‌ను లాక్ చేసేలా కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు.
స్టీరింగ్‌ను లాక్ చేసేలా..
సాధారణంగా వాహనాలకు తాళం చెవితో లాక్ చేసే వెసులుబాటు ఉంటుంది. లాక్ పడిన తర్వాత ఇంజిన్‌ను ఆన్ చేయటం సాధ్యంకాదు. వాటికి ఉండే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ పనిచేయనందున బస్సును చోరీ చేయటం అంత సులువు కాదు. హైదరాబాద్‌లో 3,700 బస్సులుంటే వాటిల్లో కీ సిస్టం ఉన్నవి కేవలం 500 మాత్రమే. మిగతావి పాత మోడల్ బస్సులు. వీటిల్లో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ సిస్టం లేదు. వాటిని తాళం చెవితో లాక్ చేయటం సాధ్యం కాదు. ఇప్పుడు చోరీకి గురైంది కూడా అలాంటి బస్సే. భవిష్యత్తులో ఇలాంటి బస్సులు చోరీకి గురికాకుండా ఉండాలంటే కచ్చితంగా లాకింగ్ ఏర్పాటు అవసరం. ఇందుకోసం స్టీరింగ్‌కు లాక్ చేసేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
స్టీరింగ్ తిరగకుండా దాన్ని బంధించే ఏర్పాటుకు ఆదేశించారు. ఇందుకోసం మూడు రకాల డిజైన్లను చూశారు. వాటిల్లో ఒకదాన్ని ఎంపిక చేసి శనివారం ఆదేశాలు ఇవ్వనున్నారు. ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ వినోద్‌కుమార్ తొలుత సిటీ బస్సుల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత దీన్ని మిగతా జిల్లాల్లో అనుసరించనున్నారు. నగరంలో నైట్‌హాల్ట్ సర్వీసులు 900 ఉన్నాయి. వాటికి ఈ కొత్త ఏర్పాటు చేయనున్నారు. స్టీరింగ్ తిరగకుండా చేసే ఏర్పాటు బలంగా ఉండేలా చూస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దాన్ని రంపంతో కోసే వీలు ఉండకుండా చేస్తున్నారు. సుత్తిలాంటి దానితో మోది విరచాల్సి ఉంటుంది. అది చడీచప్పుడు కాకుండా జరిగే వీలు లేనందున చోరీ సాధ్యం కాదన్నది అధికారుల ఆలోచన. ఇక నైట్‌హాల్ట్ బస్సులుండే చోట్ల భద్రతను సైతం పెంచారు.
బస్సు ఇక భద్రమే!
Published Sat, Apr 27 2019 1:35 AM | Last Updated on Sat, Apr 27 2019 1:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment