King Kothi Palace
-
నిహారిక-ఐరిష్ మధ్య నజ్రీభాగ్!
సాక్షి, హైదరాబాద్ : నిజాం వైభవానికి ప్రతీకైన నజ్రీభాగ్ ప్యాలెస్ విక్రయం ప్రస్తుతం వివాదంలో పడింది. ఈ భవనానికి జీపీఓ హోల్డర్‌గా ఉన్న ఎస్త్రా నుంచి నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనిని కొనుగోలు చేసింది. ఆపై దీని యాజమాన్య హక్కులు కాశ్మీర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఐరిష్ హాస్పిటాలిటీస్‌కు బదిలీ అయ్యాయి. తమ మాజీ ఉద్యోగులు నకిలీ డాక్యుమెంట్లతో ఈ విక్రయం చేపట్టారంటూ నిహారిక సంస్థ ముంబై పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు చేస్తున్న ఈఓడబ్ల్యూ అధికారులు హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. ముంబైకి చెందిన నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మూడేళ్ల క్రితం ప్రిన్స్ ముకర్రంజా మొదటి భార్య ఎస్త్రా నుంచి కింగ్ కోఠిలోని నజ్రీభాగ్ (పరదాగేట్) ప్యాలెస్‌ను కొనుగోలు చేసింది. 5 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ భవంతి ఏడో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ వ్యక్తిగత నివాసంగా ఉండేది. ఐదెకరాల విస్తీర్ణంలో కింగ్‌కోఠి ప్యాలెస్‌గా పిలిచే ఈ నిర్మాణంలో మొత్తం మూడు భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక దాంట్లో నిజాం ట్రస్ట్, మరో దాంట్లో కోఠి ఈఎన్టీ ఆసుపత్రి కొనసాగుతున్నాయి. మూడో భవనమైన నజ్రీభాగ్‌కు జీపీఓ హోల్డర్‌గా ఉన్న ఎస్త్రా నుంచి నిహారిక కన్స్ట్రక్షన్స్ సంస్థ రూ.150 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఆ ప్యాలెస్‌ను నిహారిక సంస్థ పొజిషన్ తీసుకోలేదు. కాగా ఈ ఏడాది ప్రథమార్థంలో సంస్థ డైరెక్టర్ల మధ్య స్పర్థలు రావడంతో గత జూన్‌లో సదరు సంస్థ ఉద్యోగులు హైదరాబాద్ జిల్లా రిజిస్టార్ కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ సందర్భంగా నజ్రీభాగ్ ప్యాలెస్ యాజమాన్య హక్కులు కాశ్మీర్‌కు చెందిన ఐరిష్ హాస్పిటాలిటీస్‌కు బదిలీ అయినట్లు గుర్తించిన వీరు దీనిపై ఆరా తీయగా గత ఫిబ్రవరిలో ‘నిహారిక’ నుంచి బయటికి వచ్చిన హైదరాబాద్ వాసి సుందరమ్ కె.రవీంద్రన్తో పాటు సురేష్ కుమార్ తదితరుల ప్రమేయంతోనే ఇది జరిగినట్లు తేల్చారు. నిహారికతో పాటు నజ్రీభాగ్ ప్యాలెస్ పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వీరు రూ.150 కోట్లకు ఐరిష్ హాస్పిటాలిటీస్‌కు ప్యాలెన్‌ను విక్రయించినట్లు గుర్తించి ముంబైలోని వర్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు నిమిత్తం అక్కడి ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగానికి (ఈఓడబ్ల్యూ) బదిలీ చేయగా, ఆ శాఖకు చెందిన యూనిట్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా రవీంద్రన్తో పాటు, ఇతర నిందితులకు నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే వారు అందుబాటులోకి రాకపోవడంతో విదేశాలకు పారిపోకుండా కట్టడి చేసేందుకుగాను లుక్ ఔట్ సర్క్యులర్స్ (ఎల్ఓసీ) జారీ చేసింది. రవీంద్రన్, సురేష్‌లతో పాటు మహ్మద్ ఉస్మాన్, ముఖేష్ గుప్తలను సైతం నిందితుల జాబితాలో చేర్చింది. గత శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఈఓడబ్ల్యూ అధికారులు రవీంద్రన్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఐరిష్ సంస్థకు నజ్రీభాగ్‌ను విక్రయిస్తూ నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తరఫున హైదరాబాద్ జిల్లా రిజిస్టార్ కార్యాలయంలో సురేష్, రవీంద్రన్లే సంతకాలు చేశారని, అయితే ఆ అధికారం వారికి లేదని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం ద్వారా తాము అధీకృత వ్యక్తులుగా పేర్కొంటూ విక్రయించినట్లు నిహారిక సంస్థ తమ ఫిర్యాదులో పేర్కొంది. నజ్రీభాగ్ విక్రయానికి సంబంధించి వారి మధ్య జరిగిన ఈమెయిల్స్‌ను తాము సేకరించామని, ఈ కేసులో ఇవి కీలక ఆధారాలుగా ఈఓడబ్ల్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఫోర్జరీ, మోసం తదితర ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదు మేరకే తాము కేసు నమోదు చేశామని, ప్రాథమిక ఆధారాలు లభించిన నేపథ్యంలో అరెస్టులు చేపట్టామన్నారు. ఈ వ్యవహారంలో ఐరిష్ హాస్పిటాలిటీస్ యజమానులు అమిత్ ఆమ్లా, అర్జున్ ఆమ్లా పాత్రను సైతం ఈఓడబ్ల్యూ అనుమానిస్తోంది. వీరూ నిందితులతో కలిసి ఈ స్కామ్‌కు పాల్పడినట్లు భావిస్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి సాక్షి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను సంప్రదించగా... రిజిస్ట్రేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారమే నజ్రీభాగ్‌ను ఐరిష్ హాస్పిటాలిటీస్ పేరిట బదిలీ చేశాం. ఈ ప్రక్రియ చేపట్టడానికి ముందు అన్ని పత్రాలు పరిశీలించాం. ప్రస్తుతం నడుస్తున్న వివాదం నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలోని డైరెక్టర్ల మధ్య స్పర్థలే ఈ వివాదానికి కారణమని భావిస్తున్నాం అని పేర్కొన్నారు. -
ప్రైవేటు కంపెనీకి కింగ్‌కోఠి ప్యాలెస్ అమ్మకం!
అలనాటి నిజాం చరిత్ర వైభవానికి ఆనవాలుగా ఉన్న కింగ్‌కోఠి ప్యాలెస్ (పరదాగేట్) ఇక కనుమరుగుకానుంది. చారిత్రక వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యంగా ఉన్న ఈ ప్యాలెస్ కనుమరుగుకానుందన్న వాస్తవం పురావస్తు, చరిత్ర ప్రేమికులు జీరి్ణంచుకోవటమూ కాస్త కష్టమే మరి. మొఘల్, యూరోపియన్ అద్భుత వాస్తు నిర్మాణ శైలితో ఎన్నో ప్రత్యేకతల్ని సంతరించుకున్న ఈ భవనం నిజాం రాజులనాటి చారిత్రక వైభవానికి కింగ్‌కోఠి ప్యాలెస్ శిథిల సజీవ సాక్ష్యం. 70 ఏళ్లుగా నిజాం వారసుల చేతుల్లో ఉన్న ఈ భారీ భవనం యాజమాన్య హక్కులు గతంలోనే చేతులు మారాయి. ఢిల్లీకి చెందిన ప్రముఖ హోటల్స్ సంస్థ ఐరిస్ ఈ భారీభవంతిని కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ భవనాన్ని కూల్చి ఓ భారీ బిజినెస్ మాల్‌ను నిర్మించేందుకు ఐరిస్ సంస్థ సన్నాహాలు ప్రారంభించింది. దీంతో కింగ్‌కోఠి ప్యాలెస్ కాస్తా ఇక నుంచి బిజినెస్ మాల్గా మారనుందని తెలుస్తోంది. – సాక్షి, హైదరాబాద్ చేతులు మారిందిలా.. ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ వ్యక్తిగత నివాసంగా వెలుగొందిన ఐదువేల గజాల విస్తీర్ణంలో ఉన్న భారీ భవంతి నజ్రీభాగ్ (పరదాగేట్)కు చాలాకాలం ప్రిన్స్ ముకర్రంజా మొదటి భార్య ఎస్త్రా జీపీఏ హోల్డర్‌గా వ్యవహరించారు. ఎస్త్రా నుంచి ముంబైకి చెందిన నిహారిక కన్స్ట్రక్షన్స్ కంపెనీ కొనుగోలు చేయగా తాజాగా నిహారిక కన్స్ట్రక్షన్స్ నుంచి ఐరిస్ హోటల్స్ సంస్థ రూ.150 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఐదెకరాల విస్తీర్ణంలో కింగ్‌కోఠి ప్యాలెస్‌లో ఉన్న మూడు భవనాల్లో ఒకదాన్లో ఈఎన్టీ ఆస్పత్రి నడుస్తుండగా, మరో భవనంలో నిజాంట్రస్ట్ కొనసాగుతోంది. పరదా కథ కింగ్‌కోఠి ప్యాలెస్‌లోని ప్రధాన భవనం (నజ్రీబాగ్) పరదాగేట్‌గా ఇప్పటికీ ప్రసిద్ధే. ఈ భవనం ఇప్పటికీ పరదా వేసి ఉండటమే విశేషం. అప్పట్లో నిజాం ఉస్మాన్ అలీఖాన్ నివాస కేంద్రంగా కొనసాగిన ఈ భవంతిలో ఆయన ఉంటేనే పరదాని పైకి లేపి ఉంచేవారు. పరదా కిందకు వేసి ఉంటే ఆయన రాజ్య పర్యటనలో ఉన్నారని అర్థం. నిజాం రాజు నిత్యం వెళ్లే దారిని నీళ్లతో కడిగి శుద్ధి చేసేవారు. ఇక్కడ నిత్యం సాయుధ పోలీస్ బలగాలతో భారీ పహారా ఉండేది. నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్ ఈ భవనంలోనే తుది శ్వాస విడువగా ఆయన సమాధి సైతం ఈ పరిసరాల్లోనే (జుడీ మస్జీద్) ఉండటం విశేషం. హెరిటేజ్ జాబితాలోనే కమాల్‌ఖాన్ ఆధ్వర్యంలో మొఘల్, యూరోపియన్ అద్భుత వాస్తు నిర్మాణ శైలితో నిర్మించిన ఈ భవనానికి దేశంలోనే అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ నిర్మాణ శైలిని చూసేందుకు అనేక దేశాల ఆర్కిటెక్టులు వచ్చి పరిశీలించిన సందర్భాలున్నాయి. ఈ భవనం చాలాకాలం హెరిటేజ్ జాబితాలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో హెరిటేజ్ భవనాల జాబితా ఏదీ అధికారికంగా లేకపోవటంతో ఈ భవనాన్ని ఐరిస్ హోటల్స్ కూలి్చవేసే అవకాశమే కనిపిస్తోంది. ఈ భవనానికి సరైన నిర్వహణ లేకపోవటంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఈ విషయమై ఇంటా క్ తెలంగాణ చాప్టర్ అధ్యక్షురాలు అనురాధారెడ్డి స్పందిస్తూ.. నజ్రీబాగ్ ఎప్పటి నుంచో హెరిటేజ్ భవనంగా ఉందని, ఆ భవనం కూలి్చవేతను అడ్డుకుంటామని పేర్కొన్నారు. కొనుగోలు వివాదం నిజాం ట్రస్ట్ నుంచి ఈ భవనాన్ని తొలుత నిహారిక ఇన్ఫ్రా కంపెనీ కొనుగోలు చేయగా, ఇదే కంపెనీలోని ఇద్దరు డైరెక్టర్లు మాత్రమే ఐరిస్ హోటల్స్‌కు విక్రయించారు. ఈ విషయమై నిహారిక డైరెక్టర్లు వర్లీ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆ రిజిస్ట్రేషన్ చెల్లుబాటు కాకుండా చూడాలని కోరారు. ఈ మేరకు ఓ లేఖ సైతం హైదరాబాద్ జిల్లా రిజి్రస్టార్‌కు చేరింది. ఈ విషయమై రిజి్రస్టార్ డీవీ ప్రసాద్‌ను వివరణ కోరగా తాము అన్ని పరిశీలించాకే రిజిస్టర్ చేసినట్లు ‘సాక్షి’కి తెలిపారు. -
కింగ్ ప్యాలెస్
let's చూసొద్దాం రండి see ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ (1911-48) నివసించిన ప్రాంతం కింగ్ కోఠి. కింగ్ కోఠి అంటే కింగ్స్ ప్యాలెస్. ధనవంతుడైన ‘కమన్‌ఖాన్’కు చెందింది. కమన్‌ఖాన్ తన పేరును‘కె.కె’ అని ఇంగ్లిష్ అక్షరాలను ఈ ప్యాలెస్‌లోని అద్దాలు, తలుపులు, గోడలపై చెక్కించుకున్నాడు. నిజాం నవాబు ముచ్చటపడితే కమన్‌ఖాన్ ఆయనకు ఈ ప్యాలెస్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఐతే ఈ ప్యాలెస్‌లోని గోడలపై తలుపులపై కె.కె ఉండటంతో ఒకదశలో ఈ ప్యాలెస్ తనకు వద్దని నిజాం నిర్ణయించుకున్నాడు. కానీ, నిజాం ఆస్థాన మంత్రి నవాబు ఫరూదూన్-ఉల్-ముల్కు-ఫరూధూన్ జా, కె.కె అంటే కింగ్ కోఠి అని అర్థం వచ్చేలా సర్దిచెప్పడంతో నిజాం ఈ ప్యాలెస్‌లో ఉండటానికి సమ్మతించాడని ఒక కథనం ప్రచారంలో ఉంది. సుమారు 21 ఎకరాల్లో విస్తరించిన విశాలమైన కింగ్ కోఠి ప్యాలెస్‌లో అనేక భవనాలున్నాయి. నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1911లో ఏడో నిజాంగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. కింగ్ కోఠిని తన అధికార నివాసంగా ప్రకటించాడు. కింగ్‌కోఠి ప్యాలెస్‌లోని డ్రాయింగ్ రూం చరిత్ర ప్రసిద్ధి చెందింది. ఆ రోజుల్లో ఇక్కడ బ్రిటిష్ రెసిడెంట్లు, నాటి అధికార అతిథులు, ఉన్నతాధికారులను నిజాం ఈ బంగ్లాలోనే కలుసుకునేవాడు. భారతదేశంలో హైదరాబాద్ విలీనం తర్వాత భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ హైదరాబాద్ వచ్చినప్పుడు నిజాంను ఇక్కడే కలుసుకున్నారు. 1951లో నిజాంను ‘రాజప్రముఖ్’గా భారత ప్రభుత్వం నియమించాక, రాజప్రముఖ్ హోదాలో కొత్త కేబినెట్ పదవీ ప్రమాణం కూడా కింగ్‌కోఠి ప్యాలెస్‌లోని విశాలమైన దర్బార్ హాల్లోనే జరిగింది. పరదా ఎత్తారో.. ఏడో నిజాం పాలనా సమయంలోనే కింగ్‌కోఠి ప్యాలెస్‌లోని విశాల ప్రాంగణంలో ముబారక్ మాన్షన్, ఉస్మాన్ మాన్షన్, నియాజ్‌ఖానా, మేజ్ఖానా (రాయల్ కిచెన్ మరియు డైనింగ్ హాల్) ఇలా పలు భవనాలు నిర్మించారు. ముబారక్ మాన్షన్ ప్రధాన సింహ ద్వారం దగ్గర ఒక పరదా వేలాడుతూ ఉంటుంది. ఆ పరదా ఏర్పాటు నేటికీ చూడొచ్చు. నిజాం ప్యాలెస్‌లో లేని సమయంలో ఈ పరదా ఎత్తి ఉంచేవారు. నవాబు ప్యాలెస్‌లో ఉన్నారా..? లేరా..? అని తెలుసుకునేందుకు అధికారులు ఈ ఏర్పాట్లు చేసుకున్నట్టు చెప్తారు. ఈ పరదా గేటు దగ్గర సాయుధ రక్షక దళాలు మైసారం రెజిమెంట్ పహారా కాపలా ఉండేవారు. అందులోనే అన్నీ.. పరదా గేటుకు ఎదురుగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ఉండేది. ముబారక్ మాన్షన్‌కు తూర్పు దిశలో బొగ్గులకుంట రోడ్డులోని ప్రవేశ ద్వారాన్ని గాధిలాల్ గేటు అని పిలిచేవారు. ఇక్కడ నిజాం వ్యక్తిగత కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల సలహాదారుని కార్యాలయాలు ఉండేవి. ముబారక్ మాన్షన్ లోపల సూపరింటెండెంట్ ఆఫ్ ది రాయల్ ప్యాలెస్ అధికార కార్యాలయం ఉండేది. ఈ ప్రాంతాన్నే స్ట్రీట్ ఆఫ్ అజార్ జంగ్ అని పిలిచేవారు. కింగ్‌కోఠి ప్యాలెస్‌లో గల పలు భవనాలలోనే నిజాం కుటుంబీకులకు, అధికార సిబ్బందికి నివాస గృహాలున్నాయి. కింగ్‌కోఠి ప్యాలెస్ యూరోపియన్ నిర్మాణ శైలిలో జరిగింది. ఈ ప్యాలెస్‌లోని పలు భవన సముదాయాల నిర్మాణ శైలి, కలపతో చేసిన పలు కళాకృతులు, ఎత్తయిన విశాల ప్రాకారాలు నేటికీ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నాటి పురాతన వారసత్వపు చరిత్రకు సాక్షిగా కింగ్ కోఠి నిలుస్తుంది. ఇంతటి విశిష్టత ఉన్న కింగ్ కోఠిలోని కొన్ని భవనాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కింగ్‌కోఠి ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. అయితే పర్యాటకులకు వీలు చిక్కినప్పుడు ఈ ప్యాలెస్‌ను సందర్శించే అవకాశం లేదు. అయితే, రాబోయే రోజుల్లో రాజప్రాసాదాన్ని అందరూ సందర్శించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇది కార్యరూపం దాల్చాలని కోరుకుందాం. ఈ నివాసంలోనే ఏడో నిజాం 1967 ఫిబ్రవరి 24న తుదిశ్వాస విడిచారు. మల్లాది కృష్ణానంద్, malladisukku@gmail.com -
తెలంగాణ హైకోర్టు ఏర్పాటుపై చర్చ
న్యూఢిల్లీ: హైదరాబాద్ కింగ్‌కోఠిలోని పరదా ప్యాలెస్‌లో తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేసే అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తుతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈరోజు చర్చలు జరిపారు. తెలంగాణ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడానికి ప్రధాన న్యాయమూర్తి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు భవనాన్ని తాత్కాలికంగా ఏపికి కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దాంతో తెలంగాణ హైకోర్టును కింగ్‌కోఠిలోని నిజాం పరదా ప్యాలెస్‌లో లేదా ఎర్రమంజిల్ ఆర్ అండ్ బీ భవనంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో కలిసి రాజీవ్ శర్మ ఈ రెండు భవనాలను పరిశీలించారు. **