ది రిట్రీట్ | The Retreat | Sakshi
Sakshi News home page

ది రిట్రీట్

Published Sun, Nov 2 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

ది రిట్రీట్

ది రిట్రీట్

బ్రిటిష్ ప్రధాని సర్ చర్చిల్ సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ప్రాంతంలో THE RETREATN అలాగే, ఈ బంగ్లా ముందు HERE LIVED SIR WINSTON LS CHURCHIL WHILE SERVING WITH 4th QUEEN'S OWN HASSA RS DURING 1896 అని రాసి ఉన్న చిన్న పాలరాతి ఫలకం సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ బంగ్లాను సిటీలో కొద్ది మందే చూసుంటారు. బొల్లారంలోని రాష్ర్టపతి నిలయానికి సుమారు ఒక కిలో మీటరు దూరంలో, అక్కడి ఆర్మీ గోల్ఫ్ కోర్సు మైదానానికి ఎదురుగా ఈ పురాతన భవనం కనిపిస్తుంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి విన్‌స్టన్ చర్చిల్ రెండు పర్యాయాలు (1940-45, 1951-55) ప్రధానిగా ఉన్నాడు.

చర్చిల్ తన చదువు పూర్తయ్యాక, 1895-1900 మధ్యకాలంలో బ్రిటిష్ ఆర్మీలో పని చేశాడు. అందులో భాగంగానే, 1896 ప్రాంతంలో ఇంగ్లండ్ నుంచి సికింద్రాబాద్‌కు బదిలీపై వచ్చిన చర్చిల్ అసఫ్ జా నిజాం ప్రభువుల కాలంలో నేటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ‘ది రిట్రీట్’లో నివాసమున్నాడు. అప్పటికి చర్చిల్ వయస్సు 22 ఏళ్లు. సికింద్రాబాద్ పోలో గ్రౌండ్స్‌లో పోలో ఆడేవాడని చరిత్రకారుల రాతల వల్ల తెలుస్తుంది. గొప్ప సైనికునిగా, రచయితగా, వక్తగా, చిత్రకారునిగా,  సమర్థుడైన రాజకీయవేత్తగా విన్‌స్టన్ చర్చిల్ ప్రపంచ ప్రఖ్యాతి చెందాడు.

చర్చిల్ కొంతకాలం జర్నలిస్టుగా కూడా పని చేశాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కీలక బాధ్యతలు నిర్వహించిన చర్చిల్ తన జ్ఞాపకాల దొంతరలను పదిలంగా పదికాలాలు ఉండేలా గ్రంథస్తం చేశాడు. అందుకుగాను, 1953లో నోబుల్ సాహితీ పురస్కారం అందుకున్నాడు. అంతేకాదు, బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీలో చర్చిల్ చిత్రించిన అనేక చిత్రాలను చూడొచ్చు. ఆయన చిత్రకళపై రాసిన PAINTING AS A PASTTIME (1948) పుస్తకానికి గొప్ప ఆదరణ లభించింది. సమర్థుడైన బ్రిటిష్ ప్రధానిగా ఖ్యాతిగాంచిన చర్చిల్ 90 ఏళ్ల వయసులో 1965 జనవరి 24న తుదిశ్వాస విడిచారు. కాగా, నాటి సమాజం ఆయన్ని  Citzen of the Worఛీగా ప్రస్తుతించింది.

సామాన్య సైనికాధికారి స్థాయి నుంచి బ్రిటిష్ ప్రధాని దాకా స్వయంశక్తితో ఎదిగిన సర్ చర్చిల్ సికింద్రాబాద్‌లో నివాసమున్న ది రిట్రీట్‌ని సందర్శించాలనుకోవడం ముదావహం. శతాబ్దికి పైగా చరిత్రగల ఈ బంగ్లాలో నాటి బ్రిటిష్ వారి నిర్మాణ విశిష్టత తప్పించి మరే ప్రత్యేకతలు కనిపించవు. ఇండియన్ ఆర్మీలో బ్రిగేడియర్ స్థాయిలో పనిచేస్తున్న అధికారికి ప్రస్తుతం ఈ బంగ్లా కేటాయిస్తున్నారు. వీలుచిక్కితే మీరు ఒకసారి సందర్శించే ప్రయత్నం చేయండి!!
 
 మల్లాది కృష్ణానంద్
malladisukku@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement