కార్ఖానాల అడ్డా
సిటీవాసులకు జాయ్‌ఫుల్ జర్నీని రుచి చూపించిన డబుల్ డెక్కర్ బస్సు వచ్చింది ఇక్కడ్నుంచే.. ! ఇండియన్ ఆర్మీ కోసం శక్తిమాన్ ట్రక్స్ వెళ్లిందీ ఇక్కడి నుంచే..!1952లో స్వతంత్ర భారత తొలి సార్వత్రిక ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్స్ రూపుదిద్దుకున్నదీ ఇక్కడే..!
ఇవన్నీ శతాబ్దాల చరిత్ర
మూటగట్టుకున్న భాగ్యనగరం నుంచి వెళ్లినవే. కళ్లు చెదిరే కట్టడాలకే కాదు.. శాస్త్ర సాంకేతికతలోనూ ఆ రోజుల్లోనే నగరం కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. నిజాం ప్రభువుకు చెందిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్, అల్లావుద్దీన్ అండ్ కంపెనీ సంయుక్త భాగస్వామ్యంతో ఆవిష్కృతమైన అద్భుతాలకు సనత్ నగర్ ప్రాంతం కేంద్రంగా నిలిచింది. 1942లో ఇప్పటి ఓల్టాస్ ఉన్న ప్రాంతంలో నిజాం సైనికుల కోసం ప్రత్యేకంగా గన్స్ తయారు చేయించేవారు. ఆ ప్రాంతాన్ని లీజుకు తీసుకున్న టాటా-బిర్లా యాజమాన్యం ఆల్విన్ కంపెనీకి పురుడు పోసింది. 1948లో హైదరాబాద్ విలీనం తర్వాత సనత్‌నగర్ ప్రాంతంలోని అల్లావుద్దీన్ అండ్ కంపెనీకి చెందిన 408 ఎకరాల భూమిని రాష్ట్రపతి స్వాధీనం చేసుకున్నారు.
అందులోని 150 ఎకరాల్లో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను కేంద్ర కార్మిక సంస్థ ఆహ్వానించింది. ఆ ప్రాంతానికే సనత్‌నగర్ పారిశ్రామికవాడగా పేరు పెట్టారు. మొట్టమొదటి కార్మికశాఖ మంత్రి జగ్జీవన్‌రామ్ చేతుల మీదుగా ఈ పారిశ్రామికవాడ ప్రారంభమైంది.
ఆల్ ఇన్ ఆల్విన్
ఇండస్ట్రియల్ ఏరియాగా మారిన తర్వాత ఆల్విన్ తన ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంచింది. శక్తిమాన్ ట్రక్స్, బస్సుల బాడీలు ఇక్కడే రూపొందించేవారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ అనుబంధంగా 1963లో డబుల్ డెక్కర్ బస్సు డిజైన్ చేసి తయారు చేసింది కూడా ఇక్కడే. 1969లో ఈ కంపెనీని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1970-80 మధ్యకాలంలో ఆల్విన్ కంపెనీ రిఫ్రిజిరేటర్లు వరల్డ్ వైడ్‌గా పేరు సంపాదించాయి. 1990 తర్వాత నష్టాల బాట పట్టింది. దీన్ని అప్పటి ప్రభుత్వం వోల్టాస్ లిమిటెడ్‌కు అప్పగించింది. 1994లో ఇది పూర్తిగా ప్రైవేట్‌పరం అయింది.
2002 వరకు ఆల్విన్
మోడల్స్‌తోనే రిఫ్రిజిరేటర్లు మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఆల్విన్‌కు సంబంధించిన ఉత్పత్తులన్నీ నిలిచిపోయాయి.
మరెన్నో కంపెనీలు..
బెక్లెట్ హైలాం (హైలాం షీట్ల ఉత్పత్తి), ఫర్నిచర్ ఇండస్ట్రీ, దక్కన్ మెటల్ వర్క్స్, ఈసీఐఎల్, బీడీఎల్, చైన్ ఫ్యాక్టరీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బడా కంపెనీలు సనత్‌నగర్‌లో అడుగుపెట్టాయి. తర్వాత దక్కన్ మెటల్ వర్క్స్ ఆగ్రోమెక్ స్టీల్ పరిశ్రమగా మారింది. బీడీఎల్ చాంద్రాయణగుట్టకు, ఈసీఐఎల్ ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి తరలిపోయాయి. ఫార్మా కంపెనీలు హెటెరో డ్రగ్స్, నాట్కో రీసెర్చ్ సెంటర్, బ్రైట్ స్టార్ రబ్బర్, దివీస్, సిప్రా, గ్లాండ్‌ఫార్మా, ల్యాంకో వంటి బడా కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను కొనసాగించాయి. వీటితో పాటు 200 వరకు బడా ఛోటా కంపెనీలు ఇక్కడ ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి.
జెకొస్లేవేకియన్ల అడ్డా..
నిజాం పాలన సమయంలో జెకొస్లేవేకియా దేశస్తులు విహారయాత్ర పేరిట నగరానికి వచ్చేవారు. వారి కోసం నిజాం పాలకులు ఆల్విన్ కంపెనీ ఎదురుగా ప్రత్యేకంగా 18 బంగ్లాలను నిర్మించి కేటాయించారు. వాటి స్థానంలో ఇప్పుడు అపార్ట్‌మెంట్లు వెలిశాయి. ఒకప్పుడు జెకొస్లేవేకియన్లకు పర్యాటక విడిదిగా ఉన్న ప్రాంతం కావడంతో ఆ ఏరియా జెక్ కాలనీగా నిలిచిపోయింది.
సెకండ్ హ్యాండ్ మార్కెట్
సనత్‌నగర్ ప్రాంతంలో ప్రతి ఆదివారం సాగే సెకండ్ హ్యాండ్ మార్కెట్ అంటే ఫుల్ డిమాండ్ ఉండేది. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ మార్కెట్‌లో గుండుసూది నుంచి గునపాల వరకు అన్నీ పనిముట్లు లభించేవి. అప్పట్లో పదెకరాల విస్తీర్ణంలో ఈ మార్కెట్ కొనసాగేది. ఇప్పుడు ఎర్రగడ్డ చౌరస్తా నుంచి సనత్‌నగర్ రోడ్డు వరకూ కొనసాగుతోంది.