Malladi krishnanand
-
అపురూపాల నిలయం
అద్భుతమైన కళాఖండాల నిలయం... నిజాం మ్యూజియం. నగర సంసృ్కతిని ప్రతిబింబించే విశిష్టమైన ఈ మ్యూజియం పురానాహవేలీ ప్యాలెస్ వసంత్ మహల్ ప్రాంగణంలో ఉంది. ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను సింహాసనం అధిష్టించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాలను 1938లో ఘనంగా జరిపారు. ఈ వేడుకకు హాజరైన ప్రముఖులు ఎన్నో రకాల బహుమతులు అందజేశారు. వాటిలో కళ్లు చెదిరే కళాఖండాలున్నాయి. వాటితోపాటు, తాను ఉపయోగించిన వస్తువులతో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని నిజాం నవాబు 1950లో ఆలోచించారు. ఇందుకు పురానాహవేలీ ప్యాలెస్‌లోని వసంత్ మహల్‌ను ఎంచుకున్నారు. నాలుగైదు దశాబ్దాల తరువాత 2002లో ఈ మ్యూజియం ప్రారంభమైంది. అరుదైన వార్డ్రోబ్ ఆరో నిజాం కాలంలో రూపొందిన అతిపెద్ద వార్డ్రోబ్ మ్యూజియంలో తప్పక చూడాల్సిందే. రంగూన్ టేకుతో చేసిన 264 అడుగుల పొడవున్న ఈ వార్డ్‌రోబ్‌లో 140 గదులున్నాయి. దీనిని ప్రపంచంలోనే అరుదైన వార్డ్రోబ్గా చరిత్రకారులు చెబుతారు. నగిషీ ఇంకా చెక్కు చెదరకుండా ఉన్న ఈ వార్డ్రోబ్ రెండు అంతస్తుల్లో ఉంది. పైభాగాన్ని చేరడానికి మెట్లున్నాయి. పై అంతస్తులో నిజాం దుస్తులతో పాటు, ఆయన వాడిన సుగంధ ద్రవ్యాలు, పలు రకాల సెంట్లు, పాదరక్షలు, టోపీలు, బ్యాగులు ఇతరత్రా ఉన్నాయి. అద్భుతమైన కళాఖండాలు... ఆ తర్వాత గదుల్లో సుమారు వెయ్యికి పైగా కళాఖండాలు, నిజాం నవాబు వాడిన వస్తువులను గాజు అల్మారాల్లో విద్యుత్ కాంతుల నడుమ ప్రదర్శించారు. సుమారు పన్నెండడుగుల ఎత్తున్న గాజు ఫలకంపై చిత్రీకరించిన ఏడో నిజాం తైలవర్ణ చిత్రం... ఎటునుంచి చూసినా మనల్ని చూస్తున్నట్లుగా ఉంటుంది. దక్కను సంస్థానం భూభాగాన్ని, సరిహద్దులను తెలియజేస్తూ వెండి రేకుపై చిత్రపటం, నిజాం పాలనలో చేపట్టిన ప్రధానమైన సుమారు 48 అతిపెద్ద అభివృద్ధి పనులను ప్రింట్ చేసిన కలర్ ఫొటో కాపీ కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. కానుకల ఖజానా... ఉస్మానియా యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో వాడిన 112 తులాల బరువుగల బంగారు గిన్నె, ఆల్విన్ మెట్ వర్క్స్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వాడిన బంగారు, వెండి తాళం కప్పలను మ్యూజియంలో పదిలపరిచారు. యుద్ధంలో వాడిన అరుదైన ఆయుధాలకు ఇందులో స్థానం కల్పించారు. ప్రారంభోత్సవం సందర్భంగా నిజామ్కు అందజేసిన కిలోల కొద్ది బరువుగల వెండితో చేసిన సిటీ సివిల్ కోర్టు నమూనా, మొజాంజాహీ మార్కెట్, పబ్లిక్ గార్డెన్స్, నిజాం స్టేట్ రైల్వే, ఉస్మానియా విశ్వవిద్యాలయం భవనాల నమూనాలను కూడా భద్రపరచారు. ఆకట్టుకునే ఆభరణాలు... బంగారంతో తయారుచేసిన టిఫిన్ బాక్సు, రాణి వాడిన అద్దంతోపాటు నిజాం సేకరించిన పలు అపురూప కళాఖండాలూ ఇక్కడ ఉన్నాయి. ఇవి ఏడో నిజాం కళాతృష్ణకు అద్దం పడతాయి. నిజాం వాడిన జ్యూయలరీ, భద్రాచలం, పాల్వంచ రాజులు నిజామ్కు బహూకరించిన గోపికాకృష్ణులతో అలంకరించిన సిల్వర్ అత్తర్‌దాన్ సందర్శకులను ఆకట్టుకుంటాయి. బంగారం పొదిగిన నిజాం సిల్వర్ జూబ్లీ సింహాసనం, ఇరాన్‌లోని ‘బస్రా పట్టణపు’ అతి పెద్ద సైజు ముత్యంతో చేసిన వాకింగ్ స్టిక్ నాటి రాజఠీవీని గుర్తు చేస్తాయి. అంతేకాదు విందుల్లో విష ప్రయోగాలను సైతం గుర్తించగలిగే ‘పాయిజన్ డిటెక్టివ్ కప్‌లు’, బంగారు పూత కవరుతో కూడిన ఖురాన్ గ్రంథాలు, మేలిమి ముత్యాలు, పగడాలు- రత్న వైఢూర్యాలు పొదిగిన కళాకృతులు నిజాం మ్యూజియంలో చూపరుల మనసును దోచుకుంటాయి. శుక్రవారం సెలవు... విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లో వాడిన ‘మాన్యువల్ లిఫ్ట్’ పనితీరు ప్రతి ఒక్కరూ పరిశీలించ దగినది. ఈ మ్యూజియానికి ప్రతి శుక్రవారం సెలవుదినం. మిగిలిన రోజుల్లో ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.30 దాకా (ఫోన్: 040-24521029) తెరచి ఉంటుంది. ఈ నిజాం మ్యూజియం నగర ప్రజలకు ఏడో నిజాం అందించిన అపురూప కానుకగా చెప్పుకోవచ్చు. - మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com -
శాసనం కోసం నిర్మితమైన..
హైదరాబాద్ నగర నడిబొడ్డున గల అసెంబ్లీ భవనాలను చూడని వారుండరు. ఈ భవన సముదాయాలు నిజాం హయాంలో టౌన్ హాలుగా ఉండేవి. ఎంతో విశిష్టత ఉన్న ఈ భవనం నిర్మాణంలో ఇండో-ఇస్లామిక్ శైలి కనిపిస్తుంది. రాజస్థానీ-పర్షియన్ ఆర్కిటెక్చర్‌తో రాచఠీవిని కళ్ల ముందుంచుతుంది. ప్రజాసమస్యలపై చర్చించి, వాటిని పరిష్కరించే సమావేశ మందిరంగా ఆనాడు ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. ఆరో నిజాం ప్రభువు నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ పాలన కాలంలో దీన్ని నిర్మించారు. నిజాం 40వ జన్మదిన వేడుకల సందర్భంగా 1905లో టౌన్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1911లో ఆరో నిజాం కాలం చేశారు. తర్వాత రెండేళ్లకు అంటే 1913లో దీని నిర్మాణం పూర్తయింది. అనంతరం ఈ భవనాన్ని ప్రజానీకానికి అంకితమిచ్చారు. ఈ భవన నిర్మాణంలో స్థానిక ప్రజలు కూడా తమవంతు విరాళాలు అందజేశారు. అసెంబ్లీగా..భారత స్వాతంత్య్రానంతరం, ఈ భవనాలలో శాసనసభ, శాసన మండలిని ఏర్పాటు చేశారు. కాలనుగుణంగా అసెంబ్లీ భవనాలలో అనేక మరమ్మతులు, మార్పులు, చేర్పులు చేపట్టినా, ప్రధాన భవనం చారిత్రక విశిష్టత వన్నె తగ్గలేదు. శాసనసభ జరుగుతున్న సమయంలో స్థానిక ప్రజానీకానికి ప్రవేశం పరిమితంగా ఉంటుంది. ముందుగా అనుమతి తీసుకుని శాసనసభా వ్యవహారాలు చూడొచ్చు. శాసనసభ నిర్వహణ లేని రోజుల్లో స్థానిక అధికారుల అనుమతితో శాసనసభా ప్రాంగణంలో కలియ తిరగవచ్చు. సిల్వర్ జూబ్లీ భవన్.. పబ్లిక్ గార్డెన్స్ కేంద్ర బిందువుగా జూబ్లీహాలు ఉంది. 1936 నాటికి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అధికారం చేపట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం కోసం ప్రత్యేకంగా ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలు నిర్వహణ కోసం నిర్మించిన భవనం కాబట్టి, క్లుప్తంగా జూబ్లీహాల్- జూబ్లీ భవన్‌గా ఈ నిర్మాణం ప్రసిద్ధి చెందింది. నాటి అధికార దర్పానికి ప్రతీకగా జూబ్లీ హాలు కనిపిస్తుంది. జూబ్లీ హాలు ప్రాంగణంలోనే నేడు రాష్ట్ర శాసన మండలిని నిర్వహిస్తున్నారు. ఇండో-పర్షియన్ శైలిలో నిర్మించిన జూబ్లీహాలు. చారిత్రక నిర్మాణ విశిష్టత దృష్ట్యా జంట నగరాలలోని ప్రధాన భవనాలలో అత్యంత ప్రధానమైనదిగా చెప్పొచ్చు. మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com -
సుందర సౌధం
‘బెల్లా విస్టా’ గురించి నేటి తరం వారికి ఎంత మాత్రం తెలుసో ఎవరికి వారుగానే జవాబివ్వాలి. నేరుగా వారికి తెలియదనడం భావ్యం కాదు కదా!! బెల్లా విస్టా అనికాకుండా, ఆస్కీ అని అంటే, లేదా Administrative Staff College of India (ASCI) గురించి వాకబు చేస్తే చాలామంది సులువుగా గుర్తుపడతారు. ఆస్కీ భవనాలనే, నిజాం కాలంలో బెల్లావిస్టా అని పిలిచేవారు. ‘బెల్లావిస్టా’ లాటిన్ పదం.. అంటేa beautiful view అని అర్థం. తెలుగులో చెప్పాలంటే, చూడచక్కని అందమైన ప్రాంతం. పేరుకు తగ్గట్లే ఎత్తై వృక్షాలు, పచ్చని పచ్చిక బయళ్లతో చల్లని వాతావరణంలో ఖైరతాబాద్ జంక్షన్లో ప్రశాంతంగా ఉండే ఈ అందమైన భవనాలలో సుమారు అర్ధ శతాబ్ద కాలంగా అనేక ప్రభుత్వ-ప్రభుత్వేతర సంస్థల్లోని ఉన్నతాధికారులకు ఆస్కీ పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిజాం కుమారుడి నివాసం.. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, నాటి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ టి.టి. కృష్ణమాచారి ప్రోత్సాహంతో, మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా ఆధునిక రీతిలో ప్రభుత్వ అధికారులకు తగిన శిక్షణ ఇప్పించాల్సిన అవసరాన్ని గుర్తించి ఏర్పాటు చేసిన శిక్షణ సంస్థ ఆస్కీ. 1919 ప్రాంతంలో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆస్థానంలోని ప్రధానమంత్రి సర్ అలీ ఇమామ్ అధికార నివాసంగా ఈ బంగళా నిర్మాణం జరిగింది. ఈ బంగళా ప్రక్కనే వున్న ‘లేక్‌వ్యూ’ గెస్ట్‌హౌస్ ప్రధానమంత్రి అధికార కార్యాలయంగా వుండేది. ప్రధానమంత్రి సర్అలీ ఇమామ్ 1922 ప్రాంతంలో తన పదవీ బాధ్యతల నుంచి తప్పుకుని హైదరాబాద్‌ను వదలిపెట్టి వెళ్లిపోయారు.ఆ తర్వాత, ఈ బంగళాను ఆధునీకరించి నిజాం పెద్ద కుమారుడి నివాసంగా కేటా యించారు. ప్రిన్స్ ఆఫ్ బేరార్, commander in chief of the state's armed forces హోదాలో నిజాం కుమారుడికి ఈ బంగళా కేటాయించారు. ఏడో నిజాం పాలన 1911 నుంచి 1948 వరకు కొనసాగింది. నిజాం నవాబుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడి పేరు మీర్ హిమాయత్ అలీఖాన్(1907). ఈయన్నే ఆజాం ఖాన్‌గా కూడా స్థానికులు పిలిచేవారు. రెండో కొడుకు పేరు - మీర్ సుజాత్ అలీఖాన్. ఈయన్ని ‘మౌజాంగా’ పిలిచేవారు. ఈయన సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు (1912) చైర్మన్‌గా ఉండేవాడు. ఈయన హిల్‌ఫోర్ట్ ప్యాలెస్‌లో ఉండేవాడు. ప్రస్తుతం దీనినే రిడ్జ్ హోటల్‌గా పిలుస్తున్నారు. నిజాం సోదరులు ఇద్దరూ 1931 నవంబర్ 12న ఫ్రాన్స్-దేశంలోని ‘నైస్’ అనే ప్రాంతంలో వివాహం చేసుకున్నారు. నిజాం పెద్ద కుమారుడు టర్కీ దేశపు ఆఖరి సుల్తాన్ అబ్దుల్ మాజిద్, ఏకైక కుమార్తె ప్రిన్సెస్ దారుషెవార్ను వివాహం చేసుకున్నాడు. దారుషెవార్ అంటే ‘మంచి ముత్యం’ అని అర్థం. కాగా, నిజాం రెండో కుమారుడు ప్రిన్సెస్ నిలోఫర్‌ను వివాహమాడారు. నిలోఫర్ అంటే కమలం అని అర్థం. ప్రిన్సెస్ నిలోఫర్‌కు దారుషెవార్తో దగ్గరి బంధుత్వం వుంది. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలకు నిజాం గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ హాజరు కాలేదు. నూతన వధూవరులు నగరానికి తిరిగి వచ్చాక, 1931 డిసెంబర్ 31న, నిజాం ప్రభువు చౌమహల్లా ప్యాలెస్‌లో వైభవోపేతంగా రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. రైలు కూతకు కోత.. ఆ రోజుల్లో బెల్లావిస్టా చాలా ప్రశాంతంగా ఉండేది. బంగళా ఎదురుగా హుస్సేన్‌సాగర్ కనిపిస్తూ వుండేది. ఆ సాగర్ తీరాన రైలు మార్గంపై ఒకే ఒకరైలు ఎలాంటి శబ్దం చేయకుండా, హారన్ మోగించకుండా నిశ్శబ్దంగా ముందుకు సాగేది. ఈ ప్రాంతం చేరువలోకి రాగానే, రైలు ఇంజన్ డ్రైవర్ హారన్ మోగించరాదనే ఆదేశాలు ఉండేవి. అలా ‘బెల్లావిస్టా’ అప్పట్లో భూతల స్వర్గంగా ఒక వెలుగు వెలిగింది. భారత స్వాతంత్య్రానంతరం నిజాం కుమారుడికి ప్రిన్స ఆఫ్ బేరార్, (కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మడ్ ఫోర్సెస్) హోదాలు తొలగిపోయాయి.అనంతరం, అధికార బంగళా ఖాళీ చేసి పంజగుట్టలోని ఎత్తయిన కొండపై గల బైటల్ అజీజ్ బంగళాకు మారాడాయన. అందుకే అమ్మాం ప్రస్తుతం నాగార్జున గ్రూపు సంస్థలు ఈ భవనంలో వున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడ్డాక ముందుగా బెల్లావిస్టా భవనాలను గెస్ట్‌హౌస్‌కు కేటాయించారు. తర్వాత కొన్నాళ్లకు 1957 డిసెంబర్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ)కోసం కేటాయించారు. ఆస్కీ కోసం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెల్లావిస్టాను రూ.12 లక్షలకు అమ్మివేసింది. అతి ఖరీదైన బంగళాను కారు చౌకగా ప్రభుత్వం అమ్మివేసిందని రాష్ర్ట అసెంబ్లీలో చర్చ జరిగిందట. తక్కువ ఖరీదుకైనా ఒక మంచి సంస్థకు,ఒక మంచి పని కోసం కేటాయించామని, ఏదో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మలేదని ప్రభుత్వం ప్రకటించింది. - మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com -
కింగ్ ప్యాలెస్
let's చూసొద్దాం రండి see ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ (1911-48) నివసించిన ప్రాంతం కింగ్ కోఠి. కింగ్ కోఠి అంటే కింగ్స్ ప్యాలెస్. ధనవంతుడైన ‘కమన్‌ఖాన్’కు చెందింది. కమన్‌ఖాన్ తన పేరును‘కె.కె’ అని ఇంగ్లిష్ అక్షరాలను ఈ ప్యాలెస్‌లోని అద్దాలు, తలుపులు, గోడలపై చెక్కించుకున్నాడు. నిజాం నవాబు ముచ్చటపడితే కమన్‌ఖాన్ ఆయనకు ఈ ప్యాలెస్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఐతే ఈ ప్యాలెస్‌లోని గోడలపై తలుపులపై కె.కె ఉండటంతో ఒకదశలో ఈ ప్యాలెస్ తనకు వద్దని నిజాం నిర్ణయించుకున్నాడు. కానీ, నిజాం ఆస్థాన మంత్రి నవాబు ఫరూదూన్-ఉల్-ముల్కు-ఫరూధూన్ జా, కె.కె అంటే కింగ్ కోఠి అని అర్థం వచ్చేలా సర్దిచెప్పడంతో నిజాం ఈ ప్యాలెస్‌లో ఉండటానికి సమ్మతించాడని ఒక కథనం ప్రచారంలో ఉంది. సుమారు 21 ఎకరాల్లో విస్తరించిన విశాలమైన కింగ్ కోఠి ప్యాలెస్‌లో అనేక భవనాలున్నాయి. నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1911లో ఏడో నిజాంగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. కింగ్ కోఠిని తన అధికార నివాసంగా ప్రకటించాడు. కింగ్‌కోఠి ప్యాలెస్‌లోని డ్రాయింగ్ రూం చరిత్ర ప్రసిద్ధి చెందింది. ఆ రోజుల్లో ఇక్కడ బ్రిటిష్ రెసిడెంట్లు, నాటి అధికార అతిథులు, ఉన్నతాధికారులను నిజాం ఈ బంగ్లాలోనే కలుసుకునేవాడు. భారతదేశంలో హైదరాబాద్ విలీనం తర్వాత భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ హైదరాబాద్ వచ్చినప్పుడు నిజాంను ఇక్కడే కలుసుకున్నారు. 1951లో నిజాంను ‘రాజప్రముఖ్’గా భారత ప్రభుత్వం నియమించాక, రాజప్రముఖ్ హోదాలో కొత్త కేబినెట్ పదవీ ప్రమాణం కూడా కింగ్‌కోఠి ప్యాలెస్‌లోని విశాలమైన దర్బార్ హాల్లోనే జరిగింది. పరదా ఎత్తారో.. ఏడో నిజాం పాలనా సమయంలోనే కింగ్‌కోఠి ప్యాలెస్‌లోని విశాల ప్రాంగణంలో ముబారక్ మాన్షన్, ఉస్మాన్ మాన్షన్, నియాజ్‌ఖానా, మేజ్ఖానా (రాయల్ కిచెన్ మరియు డైనింగ్ హాల్) ఇలా పలు భవనాలు నిర్మించారు. ముబారక్ మాన్షన్ ప్రధాన సింహ ద్వారం దగ్గర ఒక పరదా వేలాడుతూ ఉంటుంది. ఆ పరదా ఏర్పాటు నేటికీ చూడొచ్చు. నిజాం ప్యాలెస్‌లో లేని సమయంలో ఈ పరదా ఎత్తి ఉంచేవారు. నవాబు ప్యాలెస్‌లో ఉన్నారా..? లేరా..? అని తెలుసుకునేందుకు అధికారులు ఈ ఏర్పాట్లు చేసుకున్నట్టు చెప్తారు. ఈ పరదా గేటు దగ్గర సాయుధ రక్షక దళాలు మైసారం రెజిమెంట్ పహారా కాపలా ఉండేవారు. అందులోనే అన్నీ.. పరదా గేటుకు ఎదురుగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ఉండేది. ముబారక్ మాన్షన్‌కు తూర్పు దిశలో బొగ్గులకుంట రోడ్డులోని ప్రవేశ ద్వారాన్ని గాధిలాల్ గేటు అని పిలిచేవారు. ఇక్కడ నిజాం వ్యక్తిగత కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల సలహాదారుని కార్యాలయాలు ఉండేవి. ముబారక్ మాన్షన్ లోపల సూపరింటెండెంట్ ఆఫ్ ది రాయల్ ప్యాలెస్ అధికార కార్యాలయం ఉండేది. ఈ ప్రాంతాన్నే స్ట్రీట్ ఆఫ్ అజార్ జంగ్ అని పిలిచేవారు. కింగ్‌కోఠి ప్యాలెస్‌లో గల పలు భవనాలలోనే నిజాం కుటుంబీకులకు, అధికార సిబ్బందికి నివాస గృహాలున్నాయి. కింగ్‌కోఠి ప్యాలెస్ యూరోపియన్ నిర్మాణ శైలిలో జరిగింది. ఈ ప్యాలెస్‌లోని పలు భవన సముదాయాల నిర్మాణ శైలి, కలపతో చేసిన పలు కళాకృతులు, ఎత్తయిన విశాల ప్రాకారాలు నేటికీ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నాటి పురాతన వారసత్వపు చరిత్రకు సాక్షిగా కింగ్ కోఠి నిలుస్తుంది. ఇంతటి విశిష్టత ఉన్న కింగ్ కోఠిలోని కొన్ని భవనాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కింగ్‌కోఠి ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. అయితే పర్యాటకులకు వీలు చిక్కినప్పుడు ఈ ప్యాలెస్‌ను సందర్శించే అవకాశం లేదు. అయితే, రాబోయే రోజుల్లో రాజప్రాసాదాన్ని అందరూ సందర్శించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇది కార్యరూపం దాల్చాలని కోరుకుందాం. ఈ నివాసంలోనే ఏడో నిజాం 1967 ఫిబ్రవరి 24న తుదిశ్వాస విడిచారు. మల్లాది కృష్ణానంద్, malladisukku@gmail.com -
ది రిట్రీట్
బ్రిటిష్ ప్రధాని సర్ చర్చిల్ సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ప్రాంతంలో THE RETREATN అలాగే, ఈ బంగ్లా ముందు HERE LIVED SIR WINSTON LS CHURCHIL WHILE SERVING WITH 4th QUEEN'S OWN HASSA RS DURING 1896 అని రాసి ఉన్న చిన్న పాలరాతి ఫలకం సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ బంగ్లాను సిటీలో కొద్ది మందే చూసుంటారు. బొల్లారంలోని రాష్ర్టపతి నిలయానికి సుమారు ఒక కిలో మీటరు దూరంలో, అక్కడి ఆర్మీ గోల్ఫ్ కోర్సు మైదానానికి ఎదురుగా ఈ పురాతన భవనం కనిపిస్తుంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి విన్స్టన్ చర్చిల్ రెండు పర్యాయాలు (1940-45, 1951-55) ప్రధానిగా ఉన్నాడు. చర్చిల్ తన చదువు పూర్తయ్యాక, 1895-1900 మధ్యకాలంలో బ్రిటిష్ ఆర్మీలో పని చేశాడు. అందులో భాగంగానే, 1896 ప్రాంతంలో ఇంగ్లండ్ నుంచి సికింద్రాబాద్‌కు బదిలీపై వచ్చిన చర్చిల్ అసఫ్ జా నిజాం ప్రభువుల కాలంలో నేటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ‘ది రిట్రీట్’లో నివాసమున్నాడు. అప్పటికి చర్చిల్ వయస్సు 22 ఏళ్లు. సికింద్రాబాద్ పోలో గ్రౌండ్స్‌లో పోలో ఆడేవాడని చరిత్రకారుల రాతల వల్ల తెలుస్తుంది. గొప్ప సైనికునిగా, రచయితగా, వక్తగా, చిత్రకారునిగా, సమర్థుడైన రాజకీయవేత్తగా విన్స్టన్ చర్చిల్ ప్రపంచ ప్రఖ్యాతి చెందాడు. చర్చిల్ కొంతకాలం జర్నలిస్టుగా కూడా పని చేశాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కీలక బాధ్యతలు నిర్వహించిన చర్చిల్ తన జ్ఞాపకాల దొంతరలను పదిలంగా పదికాలాలు ఉండేలా గ్రంథస్తం చేశాడు. అందుకుగాను, 1953లో నోబుల్ సాహితీ పురస్కారం అందుకున్నాడు. అంతేకాదు, బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీలో చర్చిల్ చిత్రించిన అనేక చిత్రాలను చూడొచ్చు. ఆయన చిత్రకళపై రాసిన PAINTING AS A PASTTIME (1948) పుస్తకానికి గొప్ప ఆదరణ లభించింది. సమర్థుడైన బ్రిటిష్ ప్రధానిగా ఖ్యాతిగాంచిన చర్చిల్ 90 ఏళ్ల వయసులో 1965 జనవరి 24న తుదిశ్వాస విడిచారు. కాగా, నాటి సమాజం ఆయన్ని Citzen of the Worఛీగా ప్రస్తుతించింది. సామాన్య సైనికాధికారి స్థాయి నుంచి బ్రిటిష్ ప్రధాని దాకా స్వయంశక్తితో ఎదిగిన సర్ చర్చిల్ సికింద్రాబాద్‌లో నివాసమున్న ది రిట్రీట్‌ని సందర్శించాలనుకోవడం ముదావహం. శతాబ్దికి పైగా చరిత్రగల ఈ బంగ్లాలో నాటి బ్రిటిష్ వారి నిర్మాణ విశిష్టత తప్పించి మరే ప్రత్యేకతలు కనిపించవు. ఇండియన్ ఆర్మీలో బ్రిగేడియర్ స్థాయిలో పనిచేస్తున్న అధికారికి ప్రస్తుతం ఈ బంగ్లా కేటాయిస్తున్నారు. వీలుచిక్కితే మీరు ఒకసారి సందర్శించే ప్రయత్నం చేయండి!! మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com