bend
-
ఏం అమ్మాయి.. ఒంట్లో ఎముకలు లేవా ఏం?
ఒంట్లో ఎముకలే లేవన్నట్లుగా వెనక్కి, ముందుకు ఏ ఆకృతిలోనైనా వంగిపోగల బ్రిటిష్ టీనేజర్ ఈమె. పేరు లిబర్టీ బారోస్. వయసు 14 ఏళ్లు. వెనక్కి వంగి మోకాళ్లు పట్టుకుని అత్యంత తక్కువ సమయంలో 20 మీటర్ల దూరం నడిచి గిన్నిస్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. అదీ 22 సెకన్లలోనే. అందులో గిన్నిస్ బుక్‌లోకి ఆమె పేరు ఎక్కింది. గురువారం లండన్‌లో ఈ ఘనత సాధించింది. #LibertyBarros poses with her #GuinnessWorldRecords' certificate for achieving the fastest 20m back bend knee lock, in London, Britain, November 10, 2022. pic.twitter.com/oCdDiwbM41 — 香港商報 (@hkcd_HK) November 10, 2022 -
వంగే రాయి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారోయి..!
ఎలాంటి రాయినైనా సరే ముక్కలు చేయొచ్చు, ఉలితో చెక్కి శిల్పంగా మలచవచ్చు. కానీ, ఫొటోలో కనిపిస్తున్నట్లు ఎలా వంచగలుగుతున్నారో తెలియాలంటే ఈ రాయి గురించి తెలియాల్సిందే. పేరు.. ఇటాకోలమైట్. పోరస్ ఇసుకరాయి జాతికి చెందింది. సాధారణ రాళ్ల మాదిరే ఇది కూడా వివిధ రంగులు, రూపాలు, పరిమాణాల్లో ఉంటుంది. అయితే, ఎప్పుడైతే ఈ రాయి.. ఒక సెంటీమీటర్ మందం, 20 సెంటీమీటర్ల పొడవుగల సమాంతర పరిమాణంలోకి మారుతుందో.. అప్పుడు దీనికి వంగే స్వభావం వస్తుంది. ఈ విషయాన్ని ఈ మధ్యనే ఇటలీకి చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతకంటే ఒక్క మిల్లీమీటర్ సైజ్‌లో తేడా వచ్చినా, ఆ రాయి అంగుళం కూడా వంగదు. ఈ రాయికి, ఆ పరిమాణానికి, ఆ స్వభావానికి ముడిపడి ఉన్న సంబంధం ఏమిటో ఇంకా అంతుచిక్కాల్సి ఉంది. కానీ, భూకంపాలు, బలమైన గాలులు, తుఫానుల వంటి ప్రకృతి వైపరిత్యాలను తట్టుకుని నిలబడగలిగే భవన నిర్మాణాల రూపకల్పనలో ఈ రాళ్లు ఎంతోగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాళ్లల్లో కొన్నిరకాలు నీటిలో తేలే స్వభావం కలిగి ఉంటాయి. అలాగే ఈ రాళ్లు వంగే స్వభావం కలిగినవిగా చెబుతున్నారు. ఏది ఏమైనా అసలు నిజం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు. చదవండి: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!! -
బెండువాదులూ... బ్యాండువాదులు!
మొగుడు లేదా భర్త అనే మాటను ఇంగ్లిష్‌లో ‘హజ్బెండ్’ అని ఎందుకంటారా అని కొందరు భాషావేత్తలు పరిశోధించడం మొదలుపెట్టారు. ఎంత పెద్ద మొనగాడైనా సరే... భార్య ముందు ‘బెండ్’ కావాల్సిందే కదా. అందుకే దూరదృష్టితో మొగుణ్ణి ఇంగ్లిష్‌లో అలా అనడం మొదలుపెట్టారని కొందరు భాషావేత్తలు సిద్ధాంతీకరించారు. అసలు పరిశోధన అంటేనే ఒకరన్నమాటను మరొకరు విభేదించడం కదా. అందుకే... స్పెల్లింగ్‌లో హెచ్... యు... ఎస్... అక్షరాల తర్వాత ‘బెండ్’ అనే మాటను ఉచ్చారణగా తీసుకుంటున్నారనీ, వాస్తవానికి స్పెల్లింగ్ ప్రకారం అది ‘బ్యాండ్’ అని మరికొందరు వాదన మొదలుపెట్టారు. దాంతో ఈ ‘బెండ్’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారి గొంతులో పచ్చి బెండకాయ పడినట్లయ్యింది. వారు తమ సిద్ధాంతాన్ని సమర్థించుకోడానికి మళ్లీ ఒక వాదన మొదలుపెట్టారు. మొదట్లో హస్బెండ్‌కు ‘బీ...ఈ...ఎన్...డీ’ అనే స్పెల్లింగ్ ఉండేదనీ, ఆ తర్వాత తమ బెండింగ్ వ్యవహారం లోకానికి తెలియడం గిట్టక దాన్ని ‘బీ...ఏ...ఎన్...డీ’ గా మార్చారని వాదించడం మొదలుపెట్టారు. ఇందులో మరికొందరు ముందుకెళ్లి... పెళ్లాం చేసే షాపింగ్గానీ, నగలూ, చీరలూ ఇత్యాది సామగ్రి కొనడం వల్ల ‘బ్యాండు’ పడేది మొగుడికే కాబట్టి బీ...ఏ...ఎన్...డీ అన్న స్పెల్లింగే కరెక్టనీ... దాన్ని ఎవరూ మార్చలేదని వాదించడం ప్రారంభించారు. ఈ దెబ్బతో ‘హస్బెండ్’ పదంపై పరిశోధన సాగించిన బృందం సభ్యులు కాస్తా ‘బెండు’వాదులగానూ, ‘బ్యాండు’ వాదులుగానూ చీలిపోయారు. ఇప్పటికీ ఒకరి మీద మరొకరు వ్యాసాలు, పోటీ వ్యాసాలు రాస్తూ బతికేస్తున్నారు. ఈలోపు ‘బెండకాయ’ అన్నది మధ్యకు కాస్త బెండైనట్లుగా ఉన్నందువల్లనే దానికా పేరంటూ ఉభయభాషాప్రవీణులు కాస్త సందడి చేస్తూ సబ్జెక్టు సీరియస్‌నెస్‌ను కాస్త పలచబార్చేందుకూ, పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు గానీ... అసలు సబ్జెక్టుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వాళ్ల ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇంతలోనే ఇక్కడ తెలుగు మాట్లాడే చోట... మన తెలుగు భాషావేత్తలు కూడా తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంగ్లిష్‌వారు ఏం చేస్తే... దాన్ని తెలుగుకు అనువర్తిస్తూ వీళ్లు అదే పనిచేస్తుంటారు కాబట్టి... తెలుగుభాషావేత్తలు కొందరు ‘భర్త’ పదంపై పరిశోధన మొదలుపెట్టారు. తమ స్వభావరీత్యా వీళ్లు కూడా అచ్చం ఇంగ్లిష్వాదుల పంథాలోనే పరిశోధన ప్రారంభించారు. ‘భరించేవాడే భర్త’ అనే వాడుక తెలుగులో ఎప్పటినుంచో ఉందని, కాబట్టి ఇంగ్లిష్ భాషావేత్తలు కొత్తగా కనిపెట్టిందేమీ లేదని తెలుగుభాషావేత్తల భావన. ఈలోపు భర్త పదంపై మరింత లోతైన పరిశోధన జరిగింది. భార్య చేత భరతం పట్టబడేవాడు భర్త అనేది ఒక వ్యుత్పత్తి అని కొందరు ఔత్సాహికులు ఒక ప్రతిపాదన చేశారుగానీ... పాక్షికంగా ఆమోదిస్తూనే పరిశోధకులు కాస్త నసిగారు. భరతం పట్టబడటం అనే మాట చిన్నదనీ, భర్త వేదనలకు అంత చిన్నమాట సరిపోదని వారి అభిప్రాయం. ఎవరేమన్నా ఏతావాతా తేలిందేమిటంటే... హజ్బెండ్ అనే ఇంగ్లిష్ మాట సంగతైనా, భర్త అనే తెలుగు మాట విషయంలోనైనా ఎవరికి వారే స్వతంత్ర పరిశోధనలు సాగించినా... ఫలితం విషయంలో తేలిన వాస్తవం ఒకేలా ఉన్నందున పరిశోధకులు చెప్పిన మాటల్లో ఏ భాషలోనైనా భర్త భూమిక ఒకేలాంటిదన్న ఒక చారిత్రక సత్యం ఆవిష్కృతమైంది.