‘జగనన్న తోడు’మాకు చాలా తోడుగా ఉందన్నా..
సాక్షి, తాడేపల్లి: రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులు మరో 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన లబ్ధిదారు రుబియా బేగం మాట్లాడుతూ.. ‘కరోనా వచ్చిన తర్వాత ఇళ్లు గడవడం కూడా కష్టమయ్యేది. రూ. 5, 10 రూపాయల వడ్డీకి కూడా రుణం దొరికేది కాదు. అటువంటి సమయంలో జగనన్న తోడు మాకు అండగా నిలిచింది. దాంతో మళ్లీ మా వ్యాపారం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగైంది. జగనన్న తోడు కింద రూ.10 వేలు, అలాగే ఆసరా కింద రూ.12 వేలు జమ అయ్యాయి. మీరు ఇలా సంక్షేమ పథకాలు పెట్టడంతో మాలాంటి వాళ్లం బతుకుతున్నాం.
ఇది వరకు ఆరోగ్య శ్రీ లేదు. రేషన్ కార్డు లేదు. ఇప్పుడు మాకు అవన్నీ ఉన్నాయి. మీరు పెట్టిన వాలంటరీ వ్యవస్థతో వాళ్లే మమ్మల్ని అడిగి మాకు ఏదైతే అవసరమే వాటిని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. మీ పథకాలన్నీ మేము పొందాము. మీరు పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికీ ఏదో రకంగా ఉపయోగపడుతున్నాయి. మాలాంటి వాళ్లు బ్రతక గల్గుతున్నాం. మీకు రుణపడి ఉంటాము’ అని తెలిపారు.
విశాఖ జిల్లాకు చెందిన మరో లబ్ధిదారు కల్యాణి మాట్లాడుతూ.. ‘అన్నా నమస్కారమన్నా.. నా పేరు కల్యాణి. జగనన్న తోడు ద్వారా రూ.10 వేలు లబ్ధి పొందాను. నా భర్త తాపీమేస్త్రీ. కుటుంబానికి అండగా ఉండాలనే ఏదైనా చేయాలనుకున్నా. దాంతో ఒక ఫైనాన్షియర్‌ను ఆశ్రయించాను. రూ.10 వేలకు గాను రూ. 9వేలు ఇస్తానన్నారు. కట్టకపోతే ఇబ్బందులు ఉంటాయని కూడా చెప్పారు. ఈ విషయం చెబితే నా భర్త అలా తీసుకోవద్దని అన్నాడు. ఆ సమయంలో జగనన్న తోడు మాకు అండగా నిలిచింది. ఈరోజు మీరిచ్చిన రూ.10 వేలతో బ్యూటీ పార్లర్ వ్యాపారం ప్రారంభించాను.
నా వ్యాపారాన్ని గుర్తించి బ్యాంకులు రూ.70 వేలు రుణం ఇచ్చాయి. మీరిచ్చిన రూ.10వేలతో నెలకు 5వేల రూపాయల నుంచి 10 వేల రూపాయల వరకూ వస్తుంది. షూరిటీ లేకుండా మాకు డబ్బులు ఇచ్చారు. రెండోసారి కూడా జగనన్న తోడు ద్వారా రూ. 10 వేల రూపాయలు పొందాను. అది నా వ్యాపారానికి పెట్టుబడి పెట్టాను. మీరు పెట్టిన పథకాలు వైఎస్సార్ ఆసరా ద్వారా రూ. 6 వేలు, సున్నా వడ్డీ ద్వారా 18 వందల రూపాయలు వచ్చింది. మా అబ్బాయికి రూ. 15 వేల అమ్మఒడి కూడా వచ్చింది. మా అత్త గారికి పింఛన్ కూడా వచ్చింది. ఈ పథకానికి ‘జగనన్న తోడు’ అని ఎవరు పేరు పెట్టారో తెలియదు గానీ మాకు చాలా తోడుగా ఉందన్నా. మాకు మీరు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు అన్నా’ అని సీఎం జగన్‌కు తెలిపారు.
అది మీరు పెట్టిన ప్రాణభిక్షే అన్నా..
మరో లబ్ధిదారు మాట్లాడుతూ.. ‘నా పేరు శారద. అనంతపురం జిల్లా రుద్రంపేట గ్రామం. పండ్ల వ్యాపారం చేస్తున్నాం. జగనన్న తోడు మీరు ఎందుకు పెట్టారో కానీ మాలాంటి చిరు వ్యాపారులకు తోడుగా ఉందన్నా. ఎటువంటి షూరిటీ లేకుండా రూ.10వేలు రావడం చాలా సంతోషంగా ఉందన్నా. నేను డిగ్రీ, నా భర్త ఎంబీఏ చదువుకున్నాడు. ఒకరి దగ్గర పని చేయకూడదనే పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాం. మా అత్తకి ఇళ్ల పట్టా కూడా వచ్చింది.
మా మావకు వృద్ధాప్య పింఛన్ కూడా వచ్చిందన్నా. అది మీ దయ అన్నా. గతంలో ఈ పరిస్థితి లేదన్నా. పింఛన్ కోసం వెళితే ఏ టైమ్‌కి వచ్చేవాళ్లమో తెలిసేది కాదు. వార్డు వాలంటీర్లే ఇప్పుడు ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు. కిడ్నీ ప్రాబ్లమ్‌తో చాలా బాధపడేదాన్ని. ఆరోగ్య శ్రీతో దానికి చికిత్స కూడా తీసుకున్నా. అది మీరు పెట్టిన ప్రాణభిక్షే. మీరు చాలా మంచి పరిపాలన చేస్తున్నారు. ఇలాగే పాలన కొనసాగించాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు.