'కిల్లింగ్ వీరప్పన్'పై కోర్టు స్టే
బెంగళూరు: రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'కిల్లింగ్ వీరప్పన్' చిత్రం విడుదలపై బెంగళూరు నగర సివిల్ కోర్టు స్టే విధించింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన అడవిదొంగ వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా 'కిల్లింగ్ వీరప్పన్' పేరుతో రాంగోపాల్ వర్మ చిత్రాన్ని రూపొందించిన చిత్రంపై కన్నడ, తమిళ చలనచిత్ర రంగానికి చెందిన రాజు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.
వీరప్పన్ జీవిత చరిత్రను ముద్రించడానికి, తెరకెక్కించడానికి తనకే సర్వహక్కులు ఉన్నట్లు ఈ మేరకు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీ తనకు లిఖిత పూర్వకంగా అనుమతిచ్చారని రాజు కోర్టుకు తెలిపారు. దీంతో 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా విడుదలపై స్టే ఇస్తూ న్యాయస్థానం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ఈ చిత్ర దర్శకుడు రాంగోపాల్‌వర్మతో పాటు నిర్మాత కూడా కోర్టుకు తమ వాదనలు వినిపించడానికి రెండు మూడు రోజుల్లో రానున్నట్లు సమాచారం. కిల్లింగ్ వీరప్పన్‌లో శాండల్‌వుడ్ స్టార్ శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.