Bernie Sanders
-
స్కూల్ టీచర్.. ఒక్కరోజులోనే సెలబ్రిటీగా
ఆమె ఈ మెయిల్‌కి ఒకే రోజు పదమూడు వేల మెయిల్స్ వచ్చాయి. రోజంతా ఫోన్లో మెయిల్ బాక్స్ మోగుతూనే ఉంది. మెయిల్స్ అందుకున్న మహిళ ఓ సాధారణ స్కూల్ టీచర్. ఒక్కరోజులోనే సెలబ్రిటీగా మారిపోయారు. అమెరికన్ సెనేటర్ బెర్నీ శాండర్స్ చేతికి వేసుకున్న మిటెన్స్ (ఊలుతోతయారు చేసిన తొడుగులు, గ్లౌజ్ కాదు) ఆమెను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఆ మహిళ పేరు జెన్నిఫర్ ఎలీస్. అమెరికాలోని వెర్మాంట్ టౌన్, ఎసెక్స్ జంక్షన్లో ఒక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పని చేస్తున్నారు జెన్నిఫర్ ఎలీస్. జనవరి 20, 2021 బుధవారం నాడు తన ఈమెయిల్‌కి లెక్కలేకుండా టెక్ట్స్ మెయిల్స్ వస్తుండటం చూసి ఆశ్చర్యపోయారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారణం చేస్తుంటే జెన్నిఫర్ ఎలీస్ మెయిల్ బాక్స్ టకటక ధ్వనులు చేసింది. సరిగ్గా అదే సమయంలో అమెరికన్ సెనేటర్ బెర్నీ శాండర్స్‌కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవ్వడం మొదలైంది. ఆయన చేతులకు వేసుకున్న మిటెన్స్ (చేతి తొడుగులు) గురించి ట్వీట్ చేయటం ప్రారంభించారు. వాటిని నాలుగేళ్ల క్రితం జెన్నిఫర్ తయారు చేసి ఆయనకు పంపారు. వాస్తవానికి బెర్నీ శాండర్స్‌ని జెన్నిఫర్ ఎన్నడూ కలవలేదు. సాధారణ టీచర్... 42 సంవత్సరాల జెన్నిఫర్ ఎలీస్ ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్. వెర్మాంట్‌లో ప్రశాంత జీవనం గడుపుతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి కనుక, జెన్నిఫర్ ఆన్లైన్ క్లాసులు చెబుతున్నారు. ఆ రోజు కూడా అలాగే పాఠాలు చెబుతున్నారు. ఒక పక్కన బైడెన్ ప్రమాణ స్వీకారం, మరో పక్క జెన్నిఫర్ ఫోన్ నుంచి చిన్న చిన్న శబ్దాలు. అన్నీ టెక్ట్స్ మెసేజ్‌లే. అన్ని మెసేజ్‌లలోని అంశం ఒకటే. ‘‘బెర్నీ శాండర్స్ మీరు తయారు చేసిన మిటెన్స్ చేతులకు వేసుకున్నారు’’ అని. వాస్తవానికి ఆ మిటెన్స్ చేతులకు వెచ్చదనం కలిగించటానికి. అయితే వాటిని జెన్నిఫర్ వ్యర్థాలతో తయారు చేశారు. పనికిరాని ప్లాస్టిక్ సీసాలతో మిటెన్స్ లోపలి పొరను తయారు చేశారు. పాడైపోయిన స్వెటర్లను కట్ చేసి, మంచిమంచి రంగుల కాంటినేషన్తో పై తొడుగు భాగం తయారుచేశారు. మిటెన్స్ కథ.. శాండర్స్ చేతికి వేసుకున్న మిటెన్స్... ముదురు గోధుమ రంగు, లేత గోధుమ రంగు, తెలుపు రంగుల కాంబినేషన్లో ఉన్నాయి. వీటి వెనుక ఒక కథే ఉంది. ఎలీస్కి శాండర్స్ అంటే గౌరవంతో కూడిన అభిమానం. 2016లో మిటెన్స్ తయారు చేసి శాండర్స్‌కి పంపారు. ఆయనకు అవి నచ్చినట్లుగా తెలిసినవాళ్ల ద్వారా తెలుసుకున్నారు జెన్నిఫర్. చాలా సంతోష పడ్డారు. కిందటి సంవత్సరం శాండర్స్ ప్రెసిడెంట్‌గా నిలబడటానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆ మిటెన్స్ వేసుకున్నారు. అది చూసిన సోషల్ మీడియా ఆయనను ‘అల్లికల మెటిన్’ అంటూ కామెంట్స్ చేశారు. అది చూసిన జెన్నిఫర్‌కి సంతోషం కలిగింది. వెంటనే మరో పది జతలు తయారుచేసి శాండర్స్‌కి పంపారు ఎలీస్. శాండర్స్ వాటిని ధరించటం చూసిన తరవాతే ఇప్పుడు ఇంత హడావుడి మొదలైంది. శాండర్స్ ఇలా ఉన్నారు.. శాండర్స్... మందంగా ఉంటే చలి కోటు ధరించారు. చేతులకు మిటెన్స్ వేసుకుని, కాలి మీద కాలు, చేతి మీద చేయి వేసుకుని కూర్చున్నారు. ఏ మాత్రం గ్లామర్ లేదు ఆయనలో. ఈ వేషధారణనే అందరూ హాయిగా ఆనందించేలా మీమ్ కూడా తయారు చేశారు నెటిజన్లు. ఇంకేముంది జెన్నిఫర్ ఫోన్ ఆగకుండా మెసెజ్‌లతో మోగటం మొదలైంది. చాలాకాలం క్రితం.. జెన్నిఫర్ తన స్నేహితురాలితో కలిసి అదనపు ఆదాయం కోసం చాలాకాలం క్రితం మిటెన్స్ తయారు చేయటం ప్రారంభించారు. పాత ఉన్ని స్వెట్లర్లను కట్ చేసి, రకరకాల రంగుల కాంబినేషన్లలో తన తల్లి ఇచ్చిన కుట్టు మిషన్ మీద మిటెన్స్ కుడుతుండేవారు. ఒక్కో జత కుట్టడానికి గంట పట్టేది. అమ్మాయి పుట్టిన తరవాత ఇంక అవకాశం లేకపోవటంతో జెన్నిఫర్ కుట్టడం మానేశారు. ఎవరికైనా బహుమతి ఇవ్వాలనుకున్నప్పుడు సెలవు రోజుల్లో కుట్టేవారు జెన్నిఫర్. అన్నిటికీ దూరంగా.. జెన్ఫిఫర్ అందుకున్న మెయిల్స్‌కి ఆవిడ కావలసినంత డబ్బు సంపాదించుకోవచ్చు. ఒక్క జత కాదు, చాలా జతలు కావాలంటూ వచ్చిన మెయిల్స్ డిమాండ్‌కు తగ్గట్టు జెన్నిఫర్ తయారుచేయటం చాలా కష్టం. ఆవిడ దగ్గర తల్లి ఇచ్చిన 30 ఏళ్లనాటి కుట్టు మిషన్ ఉంది. జెన్నిఫర్‌కి వ్యాపారం చేసే ఆలోచనే లేదు. ‘‘నేను వ్యాపారం చేయటం మొదలుపెడితే, ఆ మిటెన్స్కి దక్కిన గౌరవం పోతుంది’’ అంటారు జెన్నిఫర్. ఆవిడకు తన కుటుంబంతో హాయిగా, ఐదేళ్ల కుమార్తెతో సంతోషంగా ఉండాలని కోరిక. వెర్మాంట్ సెనేటర్ బెర్నీ శాండర్ కోడలైన లిజా డ్రిస్కాల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రీస్కూల్లో జెన్నిఫర్ కూతురు చదువుకునేది. అయినా ఎన్నడూ లిజాను జెన్నిఫర్ కలవలేదు. ‘‘2016లో డెమొక్రటిక్ నామినేషన్ పోవటం నా మనసును గాయపరచింది. శాండర్స్ మళ్లీ నిలబడకపోతే బావుంటుంది అనుకున్నాను. నేను బహుమతిగా ఇచ్చిన మిటెన్స్ను ఆయన ధరించటం నన్ను ఆదరించినట్లుగా భావిస్తున్నాను. నేను నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చిన వాటిని ఈ రోజు ధరించటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో సాధారణంగా ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన వాటినే ధరిస్తారు. కాని బెర్నీ శాండర్ నేను ఇచ్చిన మిటెన్స్ వేసుకోవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులకి, స్నేహితులకి అందరికీ ఇటువంటి మిటెన్సే ఉన్నాయి. వారంతా వీటిని చూసుకుని, ఇవే కదా బెర్నీ ధరించినవి అని మురిసిపోతూ ఉంటారు. – జెన్నిఫర్ ఎలీస్ -
బెర్నీ నిశ్శబ్ద నిష్క్రమణ
ఈసారైనా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని చేజిక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించిన బెర్నీ సాండర్స్ వరస ఎదురు దెబ్బలతో రంగం నుంచి నిష్క్రమించారు. పర్యవసానంగా వచ్చే నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పీఠానికి జరిగే ఎన్నికల్లో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రటిక్ పార్టీ తరఫున బిడెన్ తలపడటం ఖాయమైంది. మొదట్లో సాండర్స్‌కు మంచి ఆదరణ లభించినా క్రమేపీ అది కొడిగట్టింది. న్యూహాంప్షైర్లో ఆయనదే పైచేయి అయింది. నెవెడాలో ఆయనకు అద్భుతవిజయం దక్కింది. అయోవా సైతం ఆయనకే మొగ్గు చూపింది. అంతా బాగుందనుకుంటుండగా సూపర్ ట్యూస్డే పెద్ద దెబ్బ తీసింది. ఆ రోజు జరిగిన 14 రాష్ట్రాల ప్రైమరీల్లో పది బిడెన్ ఖాతాలో పడ్డాయి. ముఖ్యంగా నల్లజాతీయులు అధికంగా వున్న సౌత్ కరోలినాలో అత్యధికులు బిడెన్ వైపే మొగ్గడం సాండర్స్‌కు పెను విఘాతమైంది. వచ్చే జూలై లోపు మరికొన్ని ప్రైమరీలున్నా ఇక కొనసాగడం అనవసరమని సాండర్స్ భావించారు. ఆయన రంగం నుంచి తప్పుకున్నాడని తెలియగానే స్టాక్ మార్కెట్ హుషారెత్తి 700 పాయింట్లు పెరిగిం దంటే... సాండర్స్ విధానాలు, ఆయన ఆలోచనలు ఎలాంటివో అర్థమవుతుంది. ఆయనకు అధికారం దక్కితే తమ ప్రయోజనాలు దెబ్బతినడం ఖాయమని అమెరికన్ బహుళజాతి సంస్థలు భయపడ్డాయి. వారికి కరోనా వైరస్ సంక్షోభం కన్నా సాండర్స్ బెడదే ప్రమాదకరమనిపించింది. విచిత్రమేమంటే రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ మొదటినుంచీ ‘బయటి వ్యక్తి’లాగే వ్యవహరిస్తూ వచ్చి చివరకు 2016లో అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని సాధించుకున్నారు. ఇప్పుడు రెండోసారి కూడా పోటీ చేస్తున్నారు. సాండర్స్ కథ కూడా ఇదే. ఆయన కూడా డెమొక్రటిక్ పార్టీలో ‘బయటి వ్యక్తే’. పార్టీలో అత్యధికులకు ఆయనంటే పొసగదు. అయితే ట్రంప్ మొదటినుంచీ దూకుడుగా వుంటూ, సంచ లనాత్మక ప్రకటనలు చేస్తూ, వివాదాలు రేకెత్తిస్తూ తన సొంత పార్టీలోని ప్రత్యర్థులపై అవలీలగా పైచేయి సాధించారు. తన ముగ్గురు ప్రత్యర్థులనూ ఆయన సునాయాసంగా ఓడించగలిగారు. కానీ సాండర్స్ తీరే వేరు. ఆయనకు హుందాతనం ఎక్కువ. విధానాలపై విమర్శలే తప్ప వ్యక్తులనుద్దేశించి మాట్లాడటం ఆయనకు అలవాటు లేదు. బిడెన్ విధానాలను ఆయన నిశితంగా విమర్శించారు. ఆ విధానాలకూ, ట్రంప్ ఆచరిస్తున్న విధానాలకూ తేడా లేదని దుయ్యబట్టారు. అంతేతప్ప ప్రత్యర్థి గురించి పరుషంగా మాట్లాడటం, ఆరోపణలు గుప్పించడం ఆయనకు చేతకాదు. ఈ విషయంలో సొంత టీంలోని వారు నచ్చజెప్పినా సాండర్స్ వినలేదు. ఆ పని చేసివుంటే మొదట్లో దక్కిన విజయాలను కొనసాగించడం వీలయ్యేదని వారి నమ్మకం. సాండర్స్‌కు విద్యార్థులు, యువత గట్టి మద్దతుగా నిలిచారు. అయితే నల్లజాతీయుల్లో విశ్వాసం కలిగించలేకపోవడం సాండర్స్‌కు శాపౖ మెంది. ట్రంప్‌కు ఆయన దీటైన అభ్యర్థి అవుతాడన్న నమ్మకం వారికి కలగలేదు. ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బిడెన్ అయితేనే తమ ప్రయోజనాలు నెరవేరతాయని, సాండర్స్ ఓడిపోతే మళ్లీ ట్రంప్ పాలనలో మగ్గాలని మెజారిటీ నల్లజాతీయులు భావించారు. వాస్తవానికి సాండర్స్ ప్రచారం ముందు బిడెన్ వెలవెలబోయారు. పేదలకు ఉచిత వైద్యం అందించే ‘ఒబామా కేర్’కు ఆయన వ్యతిరేకి. బిడెన్ కుటుంబాన్ని చుట్టుముట్టిన కుంభకోణాలు అనేకం. ఒక సెనేట్ ఉద్యోగినిపై ఆయన లైంగిక దాడి చేశాడన్న ఆరోపణ వుంది. వీటన్నిటికీ భిన్నంగా సాండర్స్ విధానాలు ప్రగతిశీలమైనవి. సంపన్నులపై పన్నుల పెంపు, ఆదాయ వ్యత్యాసాల తగ్గింపు, అల్పాదాయ వర్గాలకు ఉచిత వైద్యం, ఉచితంగా కళాశాల విద్య, కార్మికులకు కనీస వేతనం పెంపు వంటివి ప్రజానీకాన్ని విశేషంగా ఆకర్షించాయి. అందుకనే మొదట్లో సాండర్స్‌కు 30 శాతం మొగ్గు కనబడింది. బహుశా పార్టీ ఓటర్లతో నేరుగా సంభాషించే అవకాశం వస్తే సాండర్స్ తన స్థితిని మరింత మెరుగుపరుచుకునేవారు. కానీ కరోనా వైరస్ స్వైర విహారంతో ప్రచార సభలకు వీలు లేకపోవడం ఆయనకు మైనస్‌గా మారింది. మొదటినుంచీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ, సోషల్ డెమొక్రాట్‌గా పేరుబడిన సాండర్స్‌కు అమెరికా వంటి పెట్టుబడిదారీ సమాజంలో అనుకూలత వ్యక్తం కావడం సులభం కాదు. ఆయన న్యూహాంప్‌షైర్, నెవెడాల్లో నెగ్గినప్పుడే అక్కడి బహుళజాతి సంస్థలు ఉలిక్కిపడ్డాయి. అప్పటినుంచి సాండర్స్‌కు వ్యతిరేకంగా మీడియాలో పుంఖానుపుంఖా లుగా కథనాలు వెలువడ్డాయి. మూడు దశాబ్దాల క్రితం యూరప్‌ను నాశనం చేసిన సోషలిస్టు విధానాలను అమెరికాలో ఆయన ప్రవేశపెట్టాలనుకుంటున్నాడని దుమ్మెత్తిపోశాయి. సాండర్స్ కోసం రష్యా తహతహలాడుతున్నదని ప్రచారం చేశాయి. డెమొక్రటిక్ పార్టీలోని యువత, విద్యా ర్థులు సాండర్స్ వైపున్నా, వృద్ధ తరం ఓటర్లు మాత్రం అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎవరికు న్నాయన్నదే గీటురాయిగా తీసుకున్నారు. బిడెన్ పార్టీని గట్టెక్కిస్తాడని వారు భావించారు. ఇదంతా సాండర్స్‌కు ప్రతికూలంగా మారింది. కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో ఇప్పటికే 16,000 మందికిపైగా మరణించగా, లాక్‌డౌన్‌తో లక్షలాదిమంది ఉపాధి కోల్పోయారు. కనుకనే సాండర్స్ మద్దతుదార్లను కూడ గట్టుకునేందుకు బిడెన్ కూడా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. ఉచిత వైద్యం పరిధిలోకి మరింతమందిని తెచ్చేందుకు వయో పరిమితిని 60కి తగ్గిస్తానని, అల్పాదాయ, మధ్య ఆదాయ వర్గాల విద్యార్థులు తీసుకునే రుణాల్లో కొంత మేర మాఫీ చేస్తానని తాజాగా హామీ ఇస్తున్నారు. సాండర్స్ ఎన్నికల రంగం నుంచి తప్పుకున్నా, ఆయన విధానాలు అంత త్వరగా మరుగున పడిపోవు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్ ఏలుబడే కొనసాగినా, బిడెన్ అధ్యక్షుడైనా సాండర్స్ ప్రతిపాదించిన విధానాలపై చర్చ, వాటి అమలుకు ఉద్యమాలు కొనసాగుతాయి. -
పోటీ బైడెన్, శాండర్స్ మధ్యే!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి ఎవరనే విషయంలో మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్, పార్లమెంటు సభ్యుడు బెర్నీ శాండర్స్ల మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. అమెరికాలోని పద్నాలుగు రాష్ట్రాల్లో మంగళవారం జరిగిన ప్రైమరీ (అభ్యర్థి ఎన్నిక) ఎన్నికల్లో ఇద్దరూ గణనీయమైన విజయాలు సాధించారు. సూపర్ ట్యూస్డే ప్రైమరీ ఎన్నికల్లో జో బైడెన్ తొమ్మిది స్థానాలు గెలుచుకోగా, శాండర్స్.. కాలిఫోర్నియా, కొలరాడో, యూటా, వెర్మాంట్‌లో తన ఆధిక్యత చాటుకున్నారు. దీంతో వీరిద్దరిలో ఒకరు నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు పోటీగా డెమొక్రటిక్ పార్టీ తరఫున నిలబడనున్నారు. ఎన్బీసీ న్యూస్ అంచనాల ప్రకారం బైడెన్ మంగళవారంనాటి ప్రైమరీ ఎన్నికల్లో మొత్తం 342 మంది ప్రతినిధుల మద్దతు గెల్చారు. మునుపు జరిగిన ఎన్నికలను కలిపి చూసుకుంటే మొత్తం 395 మంది ప్రతినిధుల మద్దతు బైడెన్‌కు దక్కాయి. శాండర్స్ మంగళవారంనాటి ప్రైమరీల ద్వారా 245 మంది మద్దతు, మొత్తమ్మీద 305 మంది మద్దతు లభించింది. కాలిఫోర్నియాలో ఆధిక్యత సాధించడం ద్వారా శాండర్స్ తాను డెమొక్రటిక్ తరఫున అభ్యర్థి రేసులో ఉన్నానని నిరూపించుకున్నారు. -
ఢిల్లీ అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలు.. పూర్తిగా విఫలమయ్యారు
వాషింగ్టన్ : భారత రాజధాని ఢిల్లీలో జరుగుతున్న హింసాకాండపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనబడిందని ఆ దేశ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి బెర్నీ సాండర్స్ పేర్కొన్నారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా భారత్‌లో డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన హింసాకాండపై ట్రంప్ స్పందిస్తూ.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అల్లర్లు చోటు చేసుకోవడం దురదృష్టకరమని, ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, కానీ ఇది ఇండియా అంతర్గత వ్యవహారమని, ఈ విషయంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై బెర్నీ సాండర్స్ బుధవారం ట్విటర్ ద్వారా స్పందించారు.' భారత్‌లో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. మత ఘర్షణలు జరిగి పదుల సంఖ్యలో చనిపోగా, చాలా మంది గాయపడ్డారు. అయితే ఇది ఆ దేశ అంతర్గత వ్యవహారమని ట్రంప్ స్పందించారు. ఇది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు. ఆయన ఒక దేశానికి అధ్యక్షుడిగా నాయకత్వం లోపించింది. అంతేగాక ఒక వ్యక్తిగానూ మానవ హక్కుల విషయంలోనే పూర్తిగా విఫలమయ్యారు' అంటూ పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై బెర్నీసాండర్స్ మాత్రమే గాక ఇతర డెమొక్రాటిక్ సెనేటర్లు కూడా తప్పుబట్టారు. అంతకుముందు అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యుఎస్ కమిషన్ తమ పౌరుల భద్రత కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. అల్లర్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముస్లింలపై దాడి నివేదికల మధ్య భారత ప్రభుత్వం ప్రజలకు విశ్వాసంతో సంబంధం లేకుండా రక్షణ కల్పించాలని అమెరికా సంస్థ తెలిపింది. (కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!) (భారత్ గొప్ప దేశం: ట్రంప్) -
హిల్లరీని మళ్లీ దెబ్బకొట్టాడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికోసం నామినీ అభ్యర్థుల మధ్య రేసు అనూహ్యంగా మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రిపబ్లికన్ పార్టీ నుంచి ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని డోనాల్డ్ ట్రంప్ ఖరారు చేసుకోగా.. డెమొక్రటిక్ నామినీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మాత్రం ఇంకా ఆ దిశగా ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఆమెను అదే పార్టీకి చెందిన బెర్నీ సాండర్స్ గండం ఎదురవుతోంది. వెస్ట్ వర్జినీయాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో బెర్నీ సాండర్స్ విజయం సాధించారు. అంతకుముందు ఇండియానాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో కూడా ఆయన క్లింటన్ ను దెబ్బకొట్టారు. దీంతో ఇప్పుడు రేసులో ఇద్దరు సమ ఉజ్జీలుగా ముందుకు వెళ్లినట్లవుతుంది. ఈ విజయం అనంతరం సాండర్స్ మాట్లాడుతూ మొత్తం 19 రాష్ట్రాల్లో తాము విజయం సాధించినట్లు చెప్పారు. దీంతో తాము అభ్యర్థిత్వ రేసులో సురక్షితంగా ఉన్నట్లయిందని, చివరి ఓటు వరకు తాను రేసులోనే ఉంటానని ఆయన చెప్పారు. అలాగే, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కూడా ఇక్కడ విజయం సాధించారు. వెస్ట్ వర్జినీయాలోని బొగ్గు మైనింగ్ వ్యవహారాలను ఎన్నికల ప్రచారంలో చెప్పడంలో హిల్లరీ క్లింటన్ విఫలమైనట్లు రాజకీయ నిపుణులు చెప్తున్నారు. -
హిల్లరీ, ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ!
వాషింగ్టన్: డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందంజలో హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం జరిగిన కీలకమైన విస్కాన్సిన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలో హిల్లరీ, ట్రంప్ ప్రత్యర్థులు బెర్నీ సాండర్స్, టెడ్ క్రూజ్ ఘన విజయాలు సాధించారు. తద్వారా రిపబ్లికన్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి రేసులో దూసుకుపోతున్న ట్రంప్, హిల్లరీలకు గట్టి సందేశమే పంపారు. అధ్యక్ష అభ్యర్థి రేసు నుంచి తాము తప్పుకోలేదనే విషయాన్ని చాటారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఇప్పటివరకు ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు టెక్సాస్ సెనేటర్ అయిన క్రూజ్ గట్టి దెబ్బ కొట్టారు. కెనడా సరిహద్దుల్లో ఉన్న విస్కాన్సిన్ రాష్ట్రంలో రిపబ్లికన్ ప్రైమరీ రేసులో క్రూజ్ 49శాతం ఓట్లు సాధించి ముందంజలో ఉండగా.. ట్రంప్ కేవలం 35శాతం ఓట్లు మాత్రమే సాధించాడు. ఈ రేసులో ఉన్న మరో పోటీదారు ఓహి గవర్నర్ జాన్ కసిష్ 14శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు. తాజా ప్రైమరీ ఫలితాలు.. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్ కోసం తహతహలాడుతున్న ట్రంప్ తలరాతను తారుమారు చేసే అవకాశముందని భావిస్తున్నారు. విస్కాన్సిన్ లో బిలియనీర్ ట్రంప్ విజయం ఖాయమని, దీంతో రిపబ్లికన్ నామినేషన్ కోసం కావాల్సిన 1237 మంది డెలిగేట్స్ మద్దతు ఆయనకు లభించినట్టు అవుతుందని అంతా భావించారు. అయితే ఇక్కడ ఓటమితో ఆయనకు మెజారిటీ డెలిగేట్స్ మద్దతు లభిస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి రేసులోనూ ప్రధాన పోటీదారు హిల్లరీ క్లింటన్ కు ఎదురుదెబ్బ తగిలింది. విస్కాన్సిన్ ప్రైమరీలో వెర్మంట్ సెనేటర్ బెర్నీ సాండర్స్ కు 57శాతం ఓట్లు లభించగా.. హిల్లరీ కేవలం 43శాతం ఓట్లు మాత్రమే సాధించి వెనుకబడ్డారు. అయితే, త్వరలో జరుగనున్న న్యూయార్క్, పెన్సిల్వేనియా ప్రైమరీల్లో హిల్లరీ విజయావకాశాలు మెండుగా ఉండటంతో డెమొక్రటిక్ పార్టీ నామినేషన్ ఆమెనే వరించే అవకాశముందని వినిపిస్తోంది.