కారు బాంబు దాడి: 29 మంది మృతి
ఇస్తాంబుల్(టర్కీ): ఇస్తాంబుల్‌లోని ఓ ఫుట్ బాల్ స్టేడియం సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో 29 మంది మృతిచెందగా, 160 మందికిపైగా గాయాలైనట్టు అధికారులు వెల్లడించారు. పోలీసులను లక్ష్యంగా చేసుకొని కారుబాంబు దాడితో పాటూ అదే ప్రాంతానికి సమీపలో ఓ ఆత్మాహుతి దాడి జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు.
బెసిక్టాస్ స్టేడియంలో అభిమానులు ఫుట్ బాల్ మ్యాచ్‌ను తిలకించి వెళ్లిన రెండు గంటలకే ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే కుర్దిష్ తీవ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య గతకొంతకాలంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కారుబాంబు, ఆత్మాహుతి దాడి వెనుక కర్దిష్ తీవ్రవాదుల హస్తం ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.