Bhakti Kulkarni
-
Chess Olympiad 2022: భారత జట్ల జోరు
చెన్నై: చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లు వరుసగా రెండో విజయం నమోదు చేశాయి. శనివారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’ 3.5–0.5తో మాల్డోవాపై, భారత్ ‘బి’ 4–0తో ఎస్తోనియాపై, భారత్ ‘సి’ 3.5–0.5తో మెక్సికోపై గెలుపొందాయి. మహిళల విభాగం రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో కోనేరు హంపి, తానియా సచ్దేవ్, వైశాలి, భక్తి కులకర్ణిలతో కూడిన భారత్ ‘ఎ’ 3.5–0.5తో అర్జెంటీనాపై, భారత్ ‘బి’ 3.5–0.5తో లాత్వియాపై, భారత్ ‘సి’ 3–1తో సింగపూర్‌పై విజయం సాధించాయి. మరీసా (అర్జెంటీనా)తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ హంపి 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) తానియా సచ్దేవ్ 36 ఎత్తుల్లో అనాపవోలాపై, వైశాలి 90 ఎత్తుల్లో మరియా జోస్పై, భక్తి కులకర్ణి 44 ఎత్తుల్లో మరియా బెలెన్‌పై గెలిచారు. ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తన ప్రత్యర్థి ఇవాన్ షిట్కోపై నెగ్గగా... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ తన ప్రత్యర్థి మెకోవరితో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. -
మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నీకి కోనేరు హంపి, హారిక అర్హత
చెన్నై: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరగనున్న మహిళల ప్రపంచకప్ టోర్నమెంట్‌కు భారత స్టార్ క్రీడాకారిణులు, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక అర్హత సాధించారు. ఈ ఇద్దరితోపాటు పద్మిని రౌత్, భక్తి కులకర్ణి భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. ప్రపంచ ర్యాంకింగ్, రేటింగ్ ప్రకారం హంపి, హారిక బెర్త్‌లు దక్కించుకోగా... ఆసియా జోనల్ కోటా ద్వారా పద్మిని, భక్తి అర్హత పొందారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం హంపి మూడో ర్యాంక్‌లో, హారిక తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ జూలై 10 నుంచి ఆగస్టు 3 వరకు రష్యాలోని సోచి నగరంలో జరగనుంది. ఈ టోర్నీకి అర్హత సాధించిన క్రీడాకారిణుల జాబితాను ‘ఫిడే’ విడుదల చేసింది. నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో మొత్తం ఏడు రౌండ్లు ఉంటాయి. ప్రతి రౌండ్లో రెండు గేమ్‌ల చొప్పున జరుగుతాయి. ఒకవేళ ఇద్దరి మధ్య స్కోర్లు సమం గా నిలిస్తే టైబ్రేక్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. -
ఆసియా చాంప్స్
భక్తి, సేతురామన్ తాష్కెంట్: ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో మహిళల, ఓపెన్ విభాగంలో భారత్‌కు చెందిన భక్తి కులకర్ణి, సేతురామన్ విజేతలుగా నిలిచారు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఆయా విభాగాల్లో భక్తి, సేతురామన్ ఏడేసి పాయింట్లతో అగ్రస్థానాలను దక్కించుకున్నారు. గోవాకు చెందిన భక్తి తాజా విజయంతో వచ్చే ఏడాది జరిగే ప్రపంచ మహిళల నాకౌట్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో భక్తి ఐదు గేముల్లో నెగ్గి, మిగతా నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. సేతురామన్ ఆరు గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన సౌమ్య స్వామినాథన్ 6.5 పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష ఐదు పాయింట్లతో పదో స్థానాన్ని దక్కించుకుంది.