Bharadwaja
-
గొల్లపూడి గుడ్‌బై
గొల్లపూడి మారుతీరావు అనే ఒక్క పేరే అనేక రకాలుగా సాక్షాత్కరిస్తుంది. బుద్ధిజీవులకు ఓ మహా రచయిత దర్శనమిస్తాడు. సినీ జీవులకు ఆ పేరు వినగానే నాగభూషణం లాంటి విలన్ గుర్తొస్తాడు. పత్రికా ప్రపంచంలో జీవనయానం ప్రారంభించి రంగస్థల, సినీ రచయితగా అనేక పాత్రలు పోషించిన ఆయన వేదిక దిగేశారు. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన గొల్లపూడి విద్యార్థిగా ఉన్నప్పుడే రచనా వ్యాసంగంలోకి దూకేశారు. తొలి దశలో కథలు రాయడం ప్రారంభించారు. ఆ తర్వాత కలాన్ని నమ్ముకునే జీవించాలనుకున్నారు. ఆంధ్రప్రభలో చేరారు. అట్నుంచి రేడియోకి విస్తరించారు. నాటక రచయితగా కళ్లు లాంటి ప్రయోగాత్మక రచనతో అవార్టులతో పాటు ప్రేక్షక హృదయాలనూ గెల్చుకున్నారు. రచనా రంగంలో విజయపతాకం ఎగరేసిన గొల్లపూడి సహజంగానే దుక్కిపాటి మధుసూదనరావు దృష్టిని ఆకర్షించారు. అరెకపూడి కౌసల్యా దేవి రాసిన చక్రభ్రమణం నవల ఆధారంగా తెరకెక్కిన డాక్టర్ చక్రవర్తి సినిమాకు స్క్రీన్ ప్లే రచయి తగా గొల్లపూడిని ఆహ్వానించారు దుక్కిపాటి. ఆ స్క్రీన్ ప్లే రచనకు నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత విశ్వనాథ్ తొలి చిత్రం ఆత్మగౌరవం స్క్రిప్ట్‌కు మరోసారి నంది గొల్లపూడిని వరించింది. అనేక సూపర్ హిట్ చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేశారు గొల్లపూడి. ఎస్.డి. లాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన అనేక సూపర్ హిట్ చిత్రాలకు డైలాగ్స్ రాశారు. అన్నదమ్ముల అనుబంధం లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు డైలాగ్స్ రాసి తన కలానికి మాస్ పల్స్ కూడా తెల్సుననిపించారు మారుతీరావు. కోడి రామకృష్ణ దర్శకుడుగా అరంగేట్రం చేయడానికి ముందుగా అనుకున్న కథ తరంగిణి. అయితే చిత్ర కథానాయకుడు చిరంజీవి అని నిర్మాత కన్ఫర్మ్ చేయడంతో కథ మారి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అయ్యింది. అందులో ఓ పాలిష్డ్ విలన్ రోల్ ఉంటుంది. దాన్ని ఎవరితో చేయించినా పండదనిపించింది కోడి రామకృష్ణకు. ఫైనల్‌గా మీరే చేసేయండని గొల్లపూడిని బల వంత పెట్టేశారు. ఆయనా సరే అనేశారు. అలా నటుడుగా తెర ముందుకు వచ్చి సక్సెస్ కొట్టారు. ఆ తర్వాత అనేక పాత్రలు గొల్లపూడిని వెతుక్కుంటూ వచ్చాయి. అలా వచ్చిన వాటిలో అద్భుతంగా పేలినవి అనేకం ఉన్నాయి. అభిలాషలో ఉత్తరాంధ్ర మాండలికంలో ఓ శాడిస్ట్ విలన్ రోల్ చేశారు గొల్లపూడి. బామ్మర్ది అనే ఊతపదంతో ప్రవేశించే ఆ పాత్ర అభిలాష సెకండాఫ్‌ను నిల బెట్టింది. అలా సినిమా సక్సెస్‌కు ఊతంగా నిల్చిన అనేక పాత్రలకు గొల్లపూడి ప్రాణం పోశారు. సుమారు 87 చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చిన గొల్లపూడి నటుడుగా 230 చిత్రాలు చేశారు. క్యారెక్టర్ రోల్స్‌తో పాటు హాస్యనటుడిగానూ మెప్పించారు. ముఖ్యంగా గుంటనక్క తరహా విలనిజం చేయాలంటే.. గొల్లపూడిదే అగ్రతాంబూలం. గొల్లపూడి నటనలో ఓ నిండుదనం ఉంటుంది. డైలాగ్ మీద పట్టు ఉంటుంది. అద్భుతమైన మాడ్యులేషన్ ఉంటుంది. ఫైటింగులు చేసే విలనీ కాదు... జస్ట్ అలా కూల్‌గా మాట్లాడుతూ అపారమైన దుర్మార్గం గుప్పించే పాత్రలు పోషించాలంటే చాలా టాలెంట్ కావాలి. అధికారం కావాలి. నాగభూషణం చేయగలిగేవాడు. పాత్రకు న్యాయం చేయడానికి ఒక్కోసారి స్వతంత్రించేవారు కూడా. గొల్లపూడిలో మళ్లీ ఆ స్థాయి నటుడు కనిపిస్తాడు. చిరంజీవి ఛాలెంజ్ మూవీలో స్మిత భర్త పాత్రలో గొల్లపూడి ఆ తరహా విలనీ అద్భుతంగా పండించారు. విస్తృతమైన తన అనుభవాల సారాన్ని అమ్మ కడుపు చల్లగా పేరుతో ప్రచురించారు గొల్లపూడి. ఆయన బాగా ఔట్ స్పోకెన్. ఎటువంటి దాపరికాలూ ఉండవు. తన మనసులో అనిపించింది రాసేస్తారు. అందుకే ఆయన అంత విస్తృతంగా రాసేస్తారు. ఇంటర్ నెట్లో కూడా అంత విస్తారంగా రాసిన రచయితలు అరుదు. అదీ మారుతీయం. వయసు పెరిగిన తర్వాత అడపాదడపా గౌరవప్రదమైన పాత్రల్లో కనిపిస్తూ... అచ్చతెనుగు నుడికారాన్ని వినిపిస్తూ... కనిపించిన నటుడు గొల్లపూడి. ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన గొల్ల పూడి కలం ఆయన కన్నుమూసే వరకు అలసట చెందక సాహితీ వ్యవసాయం చేస్తూనే ఉంది. ఇప్పుడు స్మృతిగా మిగిలిపోయింది. భరద్వాజ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
మద్యం మత్తులో మాజీ ఎంపీ తనయుడి వీరంగం
హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ మాజీ ఎంపీ కుమారుడు వీరంగం సృష్టించాడు. అడ్డుబోయిన ఎస్ఐపై దాడికి యత్నించిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున మల్కాజ్‌గిరిలో చోటు చేసుకుంది. దాంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మాజీ ఎంపీ తనయుడు భరత్ తేజతో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దివంగత రావూరి భరద్వాజకు శ్రీకృష్ణదేవరాయ పురస్కారం
సాక్షి, బెంగళూరు : బడుగుల జీవితాలను అక్షరబద్ధం చేసి, ‘పాకుడురాళ్ల’తో జ్ఞానపీఠాన్ని అధిరోహించి, ఇటీవల నింగికెగిసిన తెలుగు తేజం దివంగత రావూరి భరద్వాజకు తెలుగు విజ్ఞాన సమితి ‘శ్రీకృష్ణదేవరాయ పురస్కారాన్ని’ ప్రకటించింది. రావూరి భరద్వాజ తరఫున ఆయన మనువరాలు సౌమ్య భరద్వాజ ఈ అవార్డును అందుకోనున్నారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎ.రాధాకృష్ణ రాజు ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ నెల 26న తెలుగు విజ్ఞాన సమితి 61వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డును అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ‘ప్రతి ఏడాది సమితి వ్యవస్థాపక దినోత్సవం రోజున ‘శ్రీకృష్ణదేవరాయ పురస్కారాన్ని’ అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. 25ఏళ్ల తర్వాత తెలుగు సాహిత్యానికి జ్ఞానపీఠ్ అవార్డును అందించిన ప్రముఖ రచయిత డాక్టర్ రావూరి భరద్వాజను ఈ ఏడాది ఆ పురస్కారానికి ఎంపిక చేశాం. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఇటీవలే కన్నుమూశారు. అందుకే ఈ అవార్డును ఆయన మనువరాలు సౌమ్య భరద్వాజ అందుకోనున్నారు’ అని రాధాకృష్ణ రాజు వెల్లడించారు. ఈ నెల 26న నగరంలోని రవీంద్రకళాక్షేత్రలో సాయంత్రం 6.30గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ చంద్రశేఖర కంబార, ఎమ్మెల్యే కె.ఆర్.రమేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. -
రావూరి మృతి సాహిత్యలోకానికి తీరనిలోటు : ప్రముఖులు
-
అనారోగ్యంతో కన్నుమూసిన రావూరి భరద్వాజ
-
రావూరికి డాక్టరేట్ ప్రదానం