Bharat Banking
-
తొమ్మిదేళ్లలో ఖాతాల్లోంచి రూ.14.56 లక్షల కోట్ల రద్దు!
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ 2014–15 నుంచి గడచిన తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో రూ.14,56,226 కోట్ల మొండి బకాయిలను మాఫీ (రైటాఫ్) చేశాయని ప్రభుత్వం సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది. ఇందులో భారీ పరిశ్రమలు, సేవల రంగం వాటా రూ. 7,40,968 కోట్లని ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ ఒక లోక్‌సభలో ఇచి్చన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. రైటాఫ్ అంటే ఖాతాలు, లెక్కల నుంచి మొండిబకాయిలను తొలగించడం. అయితే అటువంటి ఖాతాదారులపై చట్టబద్ధమైన, రికవరీకి సంబంధించిన చర్యలు కొనసాగుతాయి. ఆయా అంశాలకు సంబంధించి ఆర్బీఐ నుంచి అందిన తాజా గణాంకాలను ఉటంకిస్తూ, కరాద్ లోక్‌సభలో చేసిన లిఖితపూర్వక ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు.. ► 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగ బ్యాంకుల నికర రైటాఫ్ రుణాలు రూ.73,803 కోట్లు. ► 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు రంగ బ్యాంకుల స్థూల రుణాల్లో నికర రైటాఫ్‌లు 1.25 శాతం. 2022–23లో ఇది 1.57 శాతంగా ఉంది. ప్రభుత్వం రంగ బ్యాంకుల విషయంలో ఈ అంకెలు వరుసగా 2 %, 1.12 శాతాలుగా ఉన్నాయి. ► మొండిబకాయిలు దిగిరావడానికి ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లు సమగ్ర చర్యలు తీసుకుంటున్నాయి. ఫలితంగా 2018 మార్చి 31 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు రూ.8.96 లక్షల కోట్లు ఉంటే, 2023 మార్చి 31వ తేదీ నాటికి ఈ విలువ రూ.4.28 లక్షల కోట్లకు తగ్గింది. గత తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీలు)రూ. 10,16,617 కోట్ల మొత్తాన్ని రికవరీ చేశాయి. ► రుణగ్రహీతల డేటాను సేకరించడం, నిర్వహించడం, ప్రచురించడం కోసం ఆర్బీఐ ఏర్పాటు చేసిన సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్‌ఐఎల్‌సీ)డేటా ప్రకారం, 2023 మార్చి 1వ తేదీ నాటికి రూ. 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ బకాయి ఉన్న మొత్తం రూ. 1,03,975 కోట్లు. ► రూ. 5 కోట్లు అంతకంటే ఎక్కువ రుణం తీసుకున్న సంస్థలు ఏదైనా డిఫాల్ట్ అయితే, బ్యాంకులు ఈ సమాచారాన్ని ప్రతి వారం సీఆర్‌ఐఎల్‌సీకి నివేదించాలి. ► షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లలో రూ.20 కోట్లకు పైగా ఉన్న ఎన్పీఏలు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో తగ్గుదలని నమోదు చేసుకున్నాయి. పటిష్ట రికవరీ చర్యలు... రుణ నిష్పత్తిని తగ్గించడంలో సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రస్ట్ యాక్ట్, 2002 సవరణ కీలక పాత్ర పోషిస్తోంది. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ (డీఆర్టీ) ఆర్థిక అధికార పరిధిని రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచడం వల్ల అవి అధిక–విలువ కేసులపై దృష్టి సారించేందుకు వీలు కలిగింది. ఇది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అధిక రికవరీకి దోహదపడింది. రూ. 500 కోట్లకు పైగా ఒత్తిడిలో ఉన్న ఆస్తులను పరిష్కరించే లక్ష్యంతో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌ను (ఎన్ఏఆర్సీఎల్) కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి కరాద్ వివరించారు. ఒత్తిడితో ఉన్న రుణ ఆస్తులను స్వా«దీనం చేసుకునేందుకు రుణ సంస్థలకు ఎన్‌ఆర్‌సీఎల్ జారీ చేసిన సెక్యూరిటీ రసీదులకు మద్దతుగా రూ. 30,600 కోట్ల వరకు గ్యారెంటీని పొడిగించడానికి ప్రభుత్వం ఆమోదించిందని ఆయన చెప్పారు. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు ఎటువంటి అదనపు సౌలభ్యతలను మంజూరు చేయడం లేదు. వారి యూనిట్ ఐదేళ్లపాటు కొత్త వెంచర్లను నిర్వహించకుండా నిషేధం కూడా ఉంది. ఉద్దేశపూర్వక డిఫాల్టర్లు లేదా కంపెనీలు నిధుల సమీకరణకు క్యాపిటల్ మార్కెట్లనూ ఎంచుకోడానికి వీలుండకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. వాటి ప్రమోటర్లు, డైరెక్టర్లు ఉద్దేశపూర్వక ఎగవేతదారులతో కలిసి నిధులను సేకరించేందుకు వీలుండదు. అంతేకాకుండా, ఒత్తిడికి గురైన ఆస్తులను ముందస్తుగా గుర్తించడం, నివేదించడం, సమయానుకూలంగా పరిష్కరించడం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందించడానికి 2019లో ఆర్బీఐ ప్రుడెన్షియల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్ట్రెస్డ్ అసెట్స్‌ను విడుదల చేసింది. ఒత్తిడిలో ఉన్న రుణాలకు సంబంధించి రిజల్యూషన్ ప్లాన్‌ను ముందస్తుగా అనుసరించిన బ్యాంకర్లకు ప్రో త్సాహకాలను కూడా అందించడం జరుగుతోంది. పీఎంఎంవై దేశ వ్యాప్త అమలు ఇదిలావుండగా, 2015 ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభించిన ప్రధాన్ మంత్రి ముద్రా యోజనను దేశ వ్యాప్తంగా పటిష్టంగా అమలు చేస్తున్నట్లు మరో సమాధానంలో మంత్రి కరాద్ పేర్కొన్నారు. 2023 జూన్ 30 నాటికి ఈ పథకం కింద రుణగ్రహీతలకు దాదాపు రూ. 24.34 లక్షల కోట్ల రుణాల మంజూరు జరిగినట్లు వివరించారు. -
రుణాలు @ రూ.63,574 కోట్లు
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ ‘క్రెడిట్ అవుట్‌రీచ్’ కార్యక్రమం కింద కేవలం పక్షం రోజుల్లో దాదాపు 13.84 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.63,574 కోట్ల రుణాలను అందజేసిందని ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ ఒక ట్వీట్లో తెలిపారు. దేశ వ్యాప్తంగా అక్టోబర్ 16వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కింద, బ్యాంకులు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రుణగ్రహీతలకు రుణాలను మంజూరు చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో దాదాపు 10,580 శిబిరాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనితోపాటు పలు బ్యాంకులు రాయితీ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వంటి పండుగ ఆఫర్లను ప్రకటించాయి. ‘ఆగస్టులో ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు మద్దతును అందించే క్రమంలో అక్టోబర్‌లో క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలని బ్యాంకులకు సూచించారు. దీనికి అనుగుణంగా, బ్యాంకులు జిల్లాల వారీగా, రంగాల వారీగా రుణ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి‘ అని ఆర్థిక మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. బ్యాంకులు–నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), ఫిన్‌టెక్ సెక్టార్ల మధ్య సహ–రుణ ఏర్పాట్ల ద్వారా కేంద్రం క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంచి స్పందన వివిధ కేంద్ర ప్రభుత్వ రుణ గ్యారెంటీ పథకాల కింద మంజూరు చేసిన, పంపిణీ చేసిన నిధుల పరిమాణంకంటే క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ కింద జారీ అయిన రుణాలు అధికంగా ఉండడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దాదాపు 3.2 లక్షల మంది లబ్ధిదారులకు రూ.21,687.23 కోట్ల వ్యాపార రుణాలు మంజూరు చేయగా, 59,090 మంది రుణగ్రహీతలకు రూ.4,560.39 కోట్ల విలువైన వాహన రుణాలు మంజూరయ్యాయి. 41,226 మంది రుణగ్రహీతలకు రూ.8,994.25 కోట్ల విలువైన గృహ రుణాలు మంజూరయ్యాయి. ఏడు లక్షలకు మందికిపైగా రైతులకు రూ.16,734.62 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరయ్యాయి. గతంలో ఇలా... 2019 అక్టోబర్ – 2021 మార్చి మధ్య ఇలాంటి అవుట్‌రీచ్ కార్యక్రమాలను బ్యాంకులు నిర్వహించాయి. తద్వారా ఆర్ఏఎం సెక్టార్ (రిటైల్, వ్యవసాయం, లఘు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) అన్ని రకాల రుణ అవసరాలను నెరవేర్చాయి. అప్పట్లో ఈ కార్యక్రమం కింద రూ.4.94 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ పండుగ సీజన్లో కూడా చిన్న రుణగ్రహీతలకు సరసమైన వడ్డీ రేట్లలో భారీ ఎత్తున ఈ కార్యక్రమం కింద రుణాలను అందజేయాలని కేంద్రం నిర్దేశిస్తోంది. బ్యాంకింగ్‌కు ఇందుకు తగిన సూచనలు అందాయి. -
భారత్ బ్యాంకింగ్ బాగోలేదు
రేటింగ్ ఏజెన్సీలు ఫిచ్, క్రిసిల్ విశ్లేషణ ► ప్రతికూల అవుట్‌లుక్ ఇచ్చిన ఫిచ్ ► మొండిబకాయిల సమస్య తీవ్రమన్న క్రిసిల్ న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్‌కు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు.. ఫిచ్, క్రిసిల్ షాకిచ్చాయి. అంతర్జాతీయ దిగ్గజం ఫిచ్ రేటింగ్స్ భారత్ బ్యాంకులకు ప్రతికూల ఔట్లుక్ ఇవ్వగా, మొండిబకాయిల(ఎన్పీఏ) భారం తీవ్రంగా ఉందని క్రిసిల్ పేర్కొంది. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్స్‌కు క్రిసిల్‌లో భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసిందే. తగినంత తాజా మూలధన నిధుల కల్పన విషయంలో బలహీనతలనూ రెండు సంస్థలూ ప్రస్తావించాయి. ఫిచ్ నివేదికలో ముఖ్యాంశాలు... ► తాజా మూలధన పరిస్థితి కల్పన విషయంలో ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. అధిక మొండిబకాయిలు, రుణ వృద్ధి తక్కువగా ఉండడం దీనికి కారణం. ఆయా అంశాలు బ్యాంకుల లాభదాయకతపై కూడా ప్రభావం చూపుతాయి. మా నెగిటివ్ అవుట్‌లుక్ ప్రధాన కారణాల్లో ఇదొకటి. ► వచ్చే 12 నెలల్లో రుణ నాణ్యత సవాలుగా కొనసాగవచ్చు. విద్యుత్‌రంగంలో ఇబ్బంది, వ్యవసాయ రుణ మాఫీలు, చిన్న తరహా పరిశ్రమల ప్రతికూల ధోరణి వంటి అంశాలు దీనికి కారణం. ► తాజా మూలధనానికి సంబంధించి అంతర్జాతీయ బాసెల్ 3 ప్రమాణాలను చేరుకోడానికి 2019 మార్చి నాటికి భారత్ బ్యాంకింగ్‌కు 65 బిలియన్ అమెరికా డాలర్లు అవసరం. దీనిలో 90 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులకే అవసరం అవుతుంది. ► ఎన్పీఏలు, బలహీన ప్రొవిజనింగ్ కవర్, పేలవ రుణ వృద్ధి వంటి అంశాల నేపథ్యంలో బ్యాంకింగ్ రంగానికి ప్రభుత్వం నుంచి మరింత మూలధన నిధుల సాయం అందాలి. ► రుణ నాణ్యత విషయంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంకులకన్నా, ప్రైవేటు రంగం పరిస్థితి బాగుంది. ► మొండిబకాయిల సమస్య పరిష్కారానికి రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న చర్యలు కొంత సత్ఫలితాలను ఇచ్చే అవకాశం కనబడుతోంది. ► 2016–17 ఏడాదిలో రుణ వృద్ధి 4.4 శాతానికి పడిపోయింది. ఇదే ధోరణి సమీప భవిష్యత్తులోనూ కొనసాగే వీలుంది. క్రిసిల్ ఏమంటోందంటే.. ► వచ్చే ఏడాది మార్చి ముగిసే నాటికి వార్షికంగా మొండిబకాయిల భారం 1% పెరిగి (రుణాల్లో) 10.5 శాతానికి చేరే వీలుంది. ► ఒత్తిడిలోఉన్న కొన్ని రుణాలనూ పలు బ్యాంకులు మొండిబకాయిలుగా ప్రకటించే అవకాశం ఉండటం ఆందోళనకరం. ► ఒత్తిడిలో ఉన్న రుణాలు ప్రధానంగా మౌలికరంగం, విద్యుత్, ఇంజనీరింగ్, నిర్మాణ రంగాలకు మంజూరు చేసినవే. ఈ రంగాల పునరుద్ధరణ తక్షణ అవసరం. ► దివాలా చట్టం అలాగే ఇతర పలు వ్యవస్థాగత పథకాల ద్వారా ఒత్తిడిలో ఉన్న రుణ సంబంధ అంశాల పరిష్కారంపై తక్షణ చర్యలు తీసుకోవాలి. ► నిజానికి గడచిన రెండేళ్లలో రికవరీలు చాలా తక్కువగా ఉన్నాయి. స్థూల ఎన్‌పీఏల్లో తగ్గుదల అధిక రైటాఫ్స్ వల్లనే. మూడీస్ భిన్నం... కాగా ఫిచ్, క్రిసిల్ అభిప్రాయం మరో అంతర్జాతీయ దిగ్గజం– మూడీస్కన్నా కొంత భిన్నంగా ఉండటం గమనార్హం. దాదాపు పక్షం రోజుల క్రితం మూడీస్ – భారత్ బ్యాంకింగ్‌కు ‘స్టేబుల్’ అవుట్‌లుక్‌ను ఇస్తున్నట్లు పేర్కొంది. రుణ నాణ్యత పెంపునకు చర్యలు బాగున్నాయనీ, నిర్వహణ కూడా మెరుగుపడిందని పేర్కొంటూ, దీనితో దేశ బ్యాంకింగ్ వ్యవస్థకు స్టేబుల్ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. తమ రేటింగ్‌లో ఉన్న 15 బ్యాంకుల్లో పదింటికి కూడా స్టేబుల్ అవుట్‌లుక్ ఉన్నట్లు తెలిపింది. ఈ మొత్తం 15 బ్యాంకుల మొత్తం రుణ పరిమాణం వ్యవస్థలో 70 శాతం. అయితే వ్యవసాయం, చిన్న మధ్య తరహా పరిశ్రమల రుణ నాణ్యత విషయంలో బ్యాంకింగ్ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.