Bharat kumar
-
ప్రవీణ్.. నా కొడుకును ఎందుకు చంపమన్నావు?
ప్రొద్దుటూరు : ‘టీడీపీ నేత ప్రవీణ్‌రెడ్డి నా కుమారుడైన బెనర్జీని ఎందుకు చంపమని ఆదేశించావు.. మా వాడు ఏ పాపం చేశాడు. ఏ రోజు అయినా నీ జోలికి వచ్చాడా’ అని వైఎస్సార్సీపీ కార్యకర్త బెనర్జీ తల్లి బుజ్జమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. ఉద్దేశ పూర్వకంగానే బస్సు యాత్ర రోజున తన కుమారుడిని హత్య చేసేందుకు పురమాయించావన్నారు. నిత్యం ప్రవీణ్ వెంట తిరిగే భరత్‌కుమార్‌రెడ్డి ఆయన చెప్పందే ఈ విధంగా చేయడని తెలిపారు. ఎస్సీలమైన తాము రాజకీయాల్లో ఉండకూడదనేది మీ లక్ష్యమా అని ప్రశ్నించారు. మా కుమారుడు ఏమైనా మీ ఆస్తుల జోలికి, మీ కుటుంబ సభ్యుల జోలికి వచ్చాడా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కొడుకుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రజలందరూ చూస్తుండగా పట్టపగలు జంతువులా తమ కుమారుడిని ఎలా నరికాడన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో తన కుమారుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, వైద్యం కోసమే రూ.30 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మానవతా హృదయంతో స్పందించి వైద్యానికి అయ్యే ఖర్చును భరిస్తానని తెలిపారన్నారు. సమావేశంలో బెనర్జీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
'స్నేహితులే కొట్టి చంపారు'
రెబ్బన: ఆదిలాబాద్ జిల్లా రెబ్బన మండలం దేవులగూడలో యువకుడి మృతదేహంతో అతని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. మాలోత్ భరత్‌కుమార్(23) సోమవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో గాయాలతో పడి ఉండగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భరత్‌కుమార్‌ను అతడి స్నేహితులు సోమవారం ఉదయం బయటకు తీసుకెళ్లారని, వాళ్లే కొట్టి చంపారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు మంగళవారం ఉదయం స్థానిక అంతర్రాష్ట్ర రహదారిపై మృతదేహాన్ని ఉంచి రాస్తారోకో చేపట్టారు. భరత్‌కుమార్ మృతికి కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
కమలం ఆగ్రహాం... టీడీపీ కంగారు
జిల్లా అధికార ప్రతినిధి బ్రహ్మయ్యపై సస్పెన్షన్ వేటు హై కమాండ్ నిర్ణయంపై కావలి టీడీపీ నేతల అసంతృప్తి బీజేపీతో సమన్వయ లోపంపై నారాయణ, బీదరవిచంద్రకు సీఎం అక్షింతలు త్వరలో రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం నెల్లూరు: భారతీయ జనతా పార్టీతో తలెత్తిన గొడవలను సర్దుబాటు చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఒక మెట్టు కిందికి దిగింది. కమలనాథుల ఆగ్రహాన్ని తగ్గించడం కోసం జిల్లా అధికార ప్రతినిధి ఆత్మకూరి బ్రహ్మయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. కావలి మున్సిపల్ ఇన్చార్జ్ చైర్మ న్, బీజేపీ నా యకుడు భరత్‌కుమార్‌పై దాడి చేసినందుకు గాను ఈ చర్య తీసుకున్న ట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రరెడ్డి ప్రకటించారు. కావలి ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో ఇంకుడు గుంతలు తవ్వే కార్యక్రమానికి అధికారులు మున్సిపల్ ఇన్చార్జ్ చైర్మన్ భరత్‌కుమార్‌తోపాటు టీడీపీ నేతలను కూడా ఆహ్వానించారు. కార్యక్రమం ముగిసి మీడియాతో మాట్లాడే సమయంలో టీడీపీ అధికార ప్రతినిధి బ్రహ్మయ్య ఇన్చార్జ్ చైర్మన్ భరత్కుమార్నుద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశా రు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగి చివరకు ఇద్దరు ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్లింది. గొడవలో భరత్ చొక్కా చిరిగి పోయింది. ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో కేసులు నమోదు చేశారు. జిల్లాలో ఈ రెండు పార్టీల మధ్య అసలే అంతంత మాత్రం సఖ్యత ఉన్న నేపథ్యంలో ఈ ఘటన బీజేపీ నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సంఘటనపై విచారణ కు వెళ్లిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి ఈ సంఘటనలో తప్పు టీడీపీ నేతదేనని తేల్చారు. ఈ వ్యవహారంపై తీవ్రమైన చర్యలు తీసుకోక పోతే తాము ఊరుకునేది లేదని పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు హరిబాబుకు ఫిర్యాదు చేశారు. బ్రహ్మయ్య మీద టీడీపీ చర్య తీసుకోకపోతే తాను ఆర్ఎస్ఎస్ నేతల ద్వారా పార్టీ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానని భరత్‌కుమార్ సైతం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చారు. పుండు మీద కారం ఈ వివాదం పెద్దదై అటు టీడీపీ, ఇటు బీజేపీ నాయకత్వానికి కూడా తలనొప్పిగా మారిన నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ భరత్‌కుమార్ చాంబర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మంత్రి నారాయణ ఆదేశంతోనే కమిషనర్ ఈ చర్యకు దిగారని కమలనాథులు మరింత ఆగ్రహించారు. మంత్రి నుంచి ఆదేశం రాక పోతే కమిషనర్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటారని భరత్‌కుమార్ రగిలిపోయి పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దిద్దుబాటు చర్యలు కావలి సంఘటనపై సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. జిల్లాలో బీజేపీ నాయకులు రెచ్చగొట్టేలా మాట్లాడినా సంయమనం పాటించాలని, ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళుతున్నా మీరేం చేస్తున్నారని మంత్రి నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రకు అక్షింతలు వేశారు. ఈ సమస్యను సర్దుబాటు చేయక పోతే పెద్దదై కూర్చుంటుందని ఈ పరిణామాలు తమకే ఇబ్బంది కరంగా మారుతాయని ఆయన శుక్రవారం నాడు టెలికాన్ఫరెన్స్‌లో మంత్రిని, జిల్లా అధ్యక్షుడిని ఆదేశించారు. ఈ వివాదాన్ని ఏరకంగా పరిష్కరించాలని ఆలోచించిన జిల్లా పార్టీ నాయకత్వం బ్రహ్మయ్య మీద సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయించి ఆమేరకు ఉత్తర్వులు జారీచేశారు. త్వరలో సమన్వయ సమావేశం ? బీజేపీ- టీడీపీ నేతలు కలసి పనిచేయడం కోసం రెండేళ్ల కిందట ఇరు పార్టీల నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ ఇప్పటి దాకా ఒక్క సారి కూడా సమావేశం కాలేదు. సమన్వయానికి రెండు వైపుల నుంచి పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు. ఈ నేపథ్యంలోనే కావలి, నెల్లూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. కావలి ఘటనతో త్వరలోనే సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. కావలి నేతల సమావేశం బీజేపీ నేతల ఒత్తిడితో తన మీద సస్పెన్షన్ వేటు వేయడంపై టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బ్రహ్మయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జరిగిన గొడవకు ఇద్దరూ బాధ్యులమే అయితే తన మీదే చర్య తీసుకోవడం పట్ల జిల్లా నాయకత్వానికి ఆయన తన నిరసన తెలిపారని సమాచారం. పార్టీ నియోజక వర్గ ఇన్చార్జ్ బీదమస్తార్రావును కలిసి తదుపరి ఎలా వ్యవహరించాలనేది నిర్ణయించుకోవాలని కావలి టీడీపీ నేతలు నిర్ణయించారు. -
చెరువులో పడి చిన్నారి మృతి
సరదాగా చెరువులోకి దిగిన బాలుడు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం చంబుకూరు పంచాయతి బలిజపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భరత్‌కుమార్(4) అనే చిన్నారి తండ్రితో పాటు చెరువు వద్దకు వెళ్లాడు. తండ్రి గొర్లను మేపుతున్న సమయంలో సరదాగా ఆడుకుంటున్న చిన్నారి చెరువులోకి దిగిగాడు. చెరువులో లోతైనగుంట ఉండటంతో.. అందులో మునిగి పోయాడు. ఇది గుర్తించిన స్థానికులు బాలుడిని బయటకు తీసే ప్రయత్నం చేసేలోపే.. అతడు ప్రాణాలు కోల్పోయాడు. -
వేధింపులపై కన్నెర్ర..!
మహబూబ్‌నగర్ వ్యవసాయ, న్యూస్‌లైన్: డ్వామా జిల్లా విజిలెన్స్ అధికారి సుబ్రమణ్యం వేధింపుల వల్లే క్షేత్ర సహాయకుడు (ఫీల్డ్ అసిస్టెంట్) మరణించాడని అతని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని ఉపాధి సిబ్బంది సోమవారం 9 గంటలపాటు ధర్నా చేపట్టారు. తాడూర్ మండల పరిధిలోని ఐతోలు గ్రామానికి చెందిన బి.మల్లయ్య ఈ నెల 1న పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం ఎపిఓలు,టిఏలు , ఎసిఓలు, ఎఫ్ఏల సంఘాల అధ్యర్యంలో ఉపాధి సిబ్బంది ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు డ్వామా పీడీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. చివరకు జిల్లా కలెక్టర్ హమీతో విరమించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవులు మాట్లాడుతూ డీవీవో సుబ్రమణ్యం వేధింపుల కారాణంగా మల్లయ్య మరణించాడని ఆరోపించారు. డ్వామా పీడీ సిసి భరత్‌కుమార్, మల్లయ్య నుండి 15వేలు లంచం తీసుకోని ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఈ ఇద్దరిని విధుల నుంచి తొలగించి,వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలన్నారు. ఈ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ ధర్నా కార్యక్రమానికి టీజేఏసీ జిల్లా కోకన్వీనర్ బెక్కెం జనార్ధన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంకోటి ముదిరాజ్, టీసీపీఎం జిల్లా నాయకుడు ఖలీల్ తదితరులు మద్దతు తెలిపి మాట్లాడారు. రూ.లక్ష పరిహారం చెల్లిస్తాం: డ్వామా పీడీ హరిత ఆందోళన ప్రారంభమైన రెండు గంటల అనంతరం డ్వామా పీడీ హరిత అక్కడకు చేరుకొని ఉద్యోగులను శాంతింపచేసేందుకు యత్నించారు. మృతుని కుటుంబానికి రూ.1లక్ష పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి సిబ్బంది, యునియన్ నేతలు కోరినట్లుగా ఎక్కువ ఎక్స్‌గ్రేషియో కోసం సీఆర్డీకి నివేదిస్తామని ఆమె తెలిపారు. మృతుడి కుటుంబంలోని వారి విద్యార్హతను పరిశీలించి కాంట్రాక్ట్ పద్దతిన ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. ఉద్యోగి సిసి భరత్‌ను ఇప్పటికే కలెక్టర్ ఆదేశానుసారం సరెండర్ చేశామన్నారు. జిల్లా అదనపు జేసీ అతనిపై విచారణ చేపట్టిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. డీవీఓ సుబ్రమణ్యంపై రిపోర్టు తయారుచేసి కలెక్టర్‌కు నివేదిస్తానని తెలిపారు. దాని ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఆయనను విధుల నుండి తొలగించడం తన చేతిలో లేదని స్పష్టం చేశారు.అయినా సిబ్బంది పట్టు వీడలేదు. వివిధ అంశాలపై ఆందోళన కారులకు, పీడీకి మధ్య చర్చలు జరిగినా అవి ఫలించలేదు. చివరికి 4.30 గంటల వేళ వారు కలెక్టరుతో చర్చలకు వెళ్లారు. రోడ్డుపై బైఠాయింపు.... కలెక్టర్ గిరిజాశంకర్‌ను కలిసేందుకు వెళ్లిన వారికి సాయంత్రం 6.30 గంటల వరకూ అనుమతి లభించలేదు. దీంతో మళ్లీ ఆందోళన కారులు ప్రతినిధులు డ్వామా కార్యాలయానికి నిరాశగా చేరుకోవడంతో అంతా కలిసి ఆగ్రహంతో రాయచూర్ రోడ్డుపై బైఠాయించారు. అరగంట పాటు రోడ్డుపై ధర్నా చేశారు. వన్‌టౌన్ సిఐ బాలాజీ అక్కడికి చేరుకొని అందోళన కారులను శాంతింప చేశారు. చివరికి యూనియన్ నేతలు కలెక్టరును కలిసి ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారని ప్రకటించడంతో ధర్నా విరమించారు. మల్లయ్య కుటుంబానికి పరిహారం , క్షేత్రసహాయకుడి ఉద్యోగం అతని కుటుంబీకుల్లో ఒకరికి ఇచ్చేందుకు కలెక్టరు అంగీకరించినట్లు తెలిపారు. డీవీవో,సిసిలపై విచారణకు అదనపు జేసీ అధ్యర్యంలో కమిటీ వేసినట్లు ఆ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ ఒప్పుకున్నారని ఆందోళనకారులకు వెళ్లడించారు.దీంతో వివాదం ముగిసింఇద. ఈ కార్యక్రమంలో ఎపిఓల జిల్లా అధ్యక్షుడు సాయిశంకర్, టిఏల జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, ఏసిఓల జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్,ఎస్సీ, ఎస్టీ ఉపాధి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.