జిల్లా అధికార ప్రతినిధి బ్రహ్మయ్యపై సస్పెన్షన్ వేటు
హై కమాండ్ నిర్ణయంపై కావలి టీడీపీ నేతల అసంతృప్తి
బీజేపీతో సమన్వయ లోపంపై నారాయణ, బీదరవిచంద్రకు సీఎం అక్షింతలు
త్వరలో రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం
నెల్లూరు: భారతీయ జనతా పార్టీతో తలెత్తిన గొడవలను సర్దుబాటు చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఒక మెట్టు కిందికి దిగింది. కమలనాథుల ఆగ్రహాన్ని తగ్గించడం కోసం జిల్లా అధికార ప్రతినిధి ఆత్మకూరి బ్రహ్మయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. కావలి మున్సిపల్ ఇన్‌చార్జ్ చైర్మ న్, బీజేపీ నా యకుడు భరత్‌కుమార్‌పై దాడి చేసినందుకు గాను ఈ చర్య తీసుకున్న ట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రరెడ్డి ప్రకటించారు.
కావలి ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో ఇంకుడు గుంతలు తవ్వే కార్యక్రమానికి అధికారులు మున్సిపల్ ఇన్‌చార్జ్ చైర్మన్ భరత్‌కుమార్‌తోపాటు టీడీపీ నేతలను కూడా ఆహ్వానించారు. కార్యక్రమం ముగిసి మీడియాతో మాట్లాడే సమయంలో టీడీపీ అధికార ప్రతినిధి బ్రహ్మయ్య ఇన్‌చార్జ్ చైర్మన్ భరత్‌కుమార్‌నుద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశా రు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగి చివరకు ఇద్దరు ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్లింది. గొడవలో భరత్ చొక్కా చిరిగి పోయింది. ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో కేసులు నమోదు చేశారు.
జిల్లాలో ఈ రెండు పార్టీల మధ్య అసలే అంతంత మాత్రం సఖ్యత ఉన్న నేపథ్యంలో ఈ ఘటన బీజేపీ నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సంఘటనపై విచారణ కు వెళ్లిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి ఈ సంఘటనలో తప్పు టీడీపీ నేతదేనని తేల్చారు. ఈ వ్యవహారంపై తీవ్రమైన చర్యలు తీసుకోక పోతే తాము ఊరుకునేది లేదని పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు హరిబాబుకు ఫిర్యాదు చేశారు. బ్రహ్మయ్య మీద టీడీపీ చర్య తీసుకోకపోతే తాను ఆర్‌ఎస్‌ఎస్ నేతల ద్వారా పార్టీ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానని భరత్‌కుమార్ సైతం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చారు.
పుండు మీద కారం
ఈ వివాదం పెద్దదై అటు టీడీపీ, ఇటు బీజేపీ నాయకత్వానికి కూడా తలనొప్పిగా మారిన నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ భరత్‌కుమార్ చాంబర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మంత్రి నారాయణ ఆదేశంతోనే కమిషనర్ ఈ చర్యకు దిగారని కమలనాథులు మరింత ఆగ్రహించారు. మంత్రి నుంచి ఆదేశం రాక పోతే కమిషనర్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటారని భరత్‌కుమార్ రగిలిపోయి పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు.
దిద్దుబాటు చర్యలు
కావలి సంఘటనపై సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. జిల్లాలో బీజేపీ నాయకులు రెచ్చగొట్టేలా మాట్లాడినా సంయమనం పాటించాలని, ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళుతున్నా మీరేం చేస్తున్నారని మంత్రి నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రకు అక్షింతలు వేశారు. ఈ సమస్యను సర్దుబాటు చేయక పోతే పెద్దదై కూర్చుంటుందని ఈ పరిణామాలు తమకే ఇబ్బంది కరంగా మారుతాయని ఆయన శుక్రవారం నాడు టెలికాన్ఫరెన్స్‌లో మంత్రిని, జిల్లా అధ్యక్షుడిని ఆదేశించారు. ఈ వివాదాన్ని ఏరకంగా పరిష్కరించాలని ఆలోచించిన జిల్లా పార్టీ నాయకత్వం బ్రహ్మయ్య మీద సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయించి ఆమేరకు ఉత్తర్వులు జారీచేశారు.
త్వరలో సమన్వయ సమావేశం ?
బీజేపీ- టీడీపీ నేతలు కలసి పనిచేయడం కోసం రెండేళ్ల కిందట ఇరు పార్టీల నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ ఇప్పటి దాకా ఒక్క సారి కూడా సమావేశం కాలేదు. సమన్వయానికి రెండు వైపుల నుంచి పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు. ఈ నేపథ్యంలోనే కావలి, నెల్లూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. కావలి ఘటనతో త్వరలోనే సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది.
కావలి నేతల సమావేశం
బీజేపీ నేతల ఒత్తిడితో తన మీద సస్పెన్షన్ వేటు వేయడంపై టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బ్రహ్మయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జరిగిన గొడవకు ఇద్దరూ బాధ్యులమే అయితే తన మీదే చర్య తీసుకోవడం పట్ల జిల్లా నాయకత్వానికి ఆయన తన నిరసన తెలిపారని సమాచారం. పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జ్ బీదమస్తార్‌రావును కలిసి తదుపరి ఎలా వ్యవహరించాలనేది నిర్ణయించుకోవాలని కావలి టీడీపీ నేతలు నిర్ణయించారు.
కమలం ఆగ్రహాం... టీడీపీ కంగారు
Published Sun, May 8 2016 1:13 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement