‘గులాబీ కూలీ’గా ఎమ్మెల్యే బాజిరెడ్డి
ఒక్క రోజు కూలి రూ.3.50 లక్షలు
డిచ్పల్లి (నిజామాబాద్ రూరల్) : వరంగల్‌లో జరుగనున్న టీఆర్ఎస్ ప్లీనరీకి నిధుల సమీకరణలో భాగంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం ‘గులాబీ కూలీ’ గా మారారు. డిచ్పల్లి మండలంలోని ఫోర్డ్, హోండా కారు షోరూంలలో కూలీ పని చేశారు. కార్ల షోరూం నిర్వాహకులు రూ.50 వేల చొప్పున కూలి అందజేశారు. అనంతరం, నడిపల్లి శివారులోని భారత్ పెట్రోల్ బంక్‌లో ఎమ్మెల్యే వాహనాల్లో పెట్రోల్ పోశారు.
బంక్ నిర్వాహకులు రూ.25 వేలు కూలి ఇచ్చారు. ఖిల్లా డిచ్పల్లి శివారులోని పీఎస్ఆర్ హాట్ మిక్స్ ప్లాంట్‌లో ఎమ్మెల్యే పని చేశారు. ప్లాంటు యజమాని మహేందర్‌రెడ్డి రూ.50 వేలు అందజేశారు. అనంతరం సమీపంలోని రెడీమేడ్ సిమెంట్ వాల్స్‌లో కూలీ పని చేయగా, నిర్వాహకులు రూ.75 వేలు ఇచ్చారు. అలాగే, ఇందల్వాయి మండలంలోని పాటితండా శివారులోని కంకర క్వారీతో పాటు మండల కేంద్రంలోని దుకాణాల్లో ఎమ్మెల్యే కూలీ పని చేసి రూ.లక్ష సేకరించారు.
దీంతో ప్లీనరీ కోసం ఒక రోజు కూలీగా రూ.3.50 లక్షలు సేకరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట జిల్లా ఒలింపిక్ అధ్యక్షుడు గడీల రాములు, టీఆర్ఎస్ నాయకుడు బాజిరెడ్డి జగన్, ఎంపీపీలు దాసరి ఇందిర, ఇమ్మడి గోపి, అప్పాల రాజన్న, జక్రాన్‌పల్లి జడ్పీటీసీ సభ్యురాలు తనూజరెడ్డి, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు శక్కరికొండ కృష్ణ, ఒడ్డెం నర్సయ్య, జాగృతి అధ్యక్షుడు దేశ్‌పెద్ది శ్రీనివాస్‌రావు, నేతలు దాసరి లక్ష్మీనర్సయ్య, నీరడి పద్మారావు, ఈగ నారాయణరెడ్డి, మారుపాక సాయిలు పాల్గొన్నారు.