ఓటర్ నమోదును ప్రోత్సహించండి
విజయనగరం కంటోన్మెంట్ : ఓటర్ నమోదును ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఓటర్ జాబితా పరిశీలకుడు, ఆర్డబ్ల్యూఎస్ విభాగం కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులు, రాజకీయ పక్షాలతో ఓటర్ జాబితా ఎన్రోల్మెంట్ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదుపై సలహాలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు భవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, ఓటర్ నమోదు కోసం వివిధ కాలేజీల్లో గతంలో డ్రాప్ బాక్స్లుండేవని, ఇప్పుడవి లేకపోవడంతో యువత నుంచి స్పందన రావడం లేదని చెప్పారు.
ఇంటర్నెట్లో ఓటరు నమోదుకు అవకాశం ఉన్నప్పటికీ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని, దీనివల్ల అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతున్నామని అభిప్రాయపడ్డారు. కేంద్రాల వద్ద బీఎల్వోలు కూడా అందుబాటులో ఉండటం లేదన్నారు. దీనికి జవహర్‌రెడ్డి స్పందిస్తూ ఓటరు నమోదుకు ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్ నాయక్‌ను ఆదేశించారు. కలెక్టర్ నాయక్ మాట్లాడుతూ, అన్ని కాలేజీల్లోనూ డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అంతే కాకుండా ఓటరు నమోదుకు గతంలో తాము తీసుకున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమీక్షలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
గొట్లాం పోలింగ్ బూత్ సందర్శన ..
సమీక్ష సమావేశం అనంతరం జవహర్ రెడ్డి గొట్లాంలోని పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. అక్కడి బీల్వోలతో మాట్లాడారు. ఓటరు నమోదుకు అర్హులను ఎలా గుర్తిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బొండపల్లి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఓటరు దరఖాస్తులు, వివిధ క్లైములు, అప్డేషన్ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రజత్‌కుమార్ సైనీ, సబ్ కలెక్టర్ శ్వేతామహంతి, డీఆర్వో వై నరసింహారావు, ఆర్డీఓ జె. వెంకటరావు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.