Telangana: కృష్ణాపై కొత్త ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాను పూర్తిగా వినియోగించుకోవడానికి వీలుగా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. కృష్ణానదిపై జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య అలంపూర్ వద్ద గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్ద మారూరు గ్రామాల పరిధిలో జోగులాంబ బ్యారేజీని నిర్మించి 60-70 టీఎంసీల నీటిని తరలించాలని తీర్మానించింది. ఈ నీటిని పాలమూరు-రంగారెడ్డి పథకంలో భాగమైన ఏదుల రిజర్వాయర్‌కు ఎత్తిపోసి.. పాలమూరు, కల్వకుర్తి ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు అందించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులతో పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీటి విషయంగా అన్యాయం జరుగుతోందని, ఈ నేపథ్యంలో కృష్ణా జలాల్లో న్యాయంగా దక్కాల్సిన వాటాను వినియోగించుకునేలా మరిన్ని కొత్త పథకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఏపీ ప్రాజెక్టులపై ప్రధాని నుంచి ప్రజాక్షేత్రం వరకు..
భేటీ సందర్భంగా ఏపీ చేపట్టిన ప్రాజెక్టులపై చర్చించిన కేబినెట్.. రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ కుడి కాల్వ నిర్మాణాలపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. ఏపీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిందని, సుప్రీంకోర్టులో కేసులు వేసిందని గుర్తు చేసింది. ఆ ప్రాజెక్టులు ఆపాలని కేంద్రం, ఎన్జీటీ ఆదేశించినా ఏపీ ప్రభుత్వం బేఖాతరు చేయడం సరికాదని పేర్కొంది. ఈ విషయంలో ప్రధానమంత్రిని, కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించాలని, ఏపీ ప్రాజెక్టులను ఆపివేయించేలా చూడాలని నిర్ణయించింది. ఇదే సమయంలో ఏపీ జలదోపిడీకి పాల్పడుతోందని ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానాల్లో ఎత్తిచూపాలని.. రాబోయే వర్షకాల పార్లమెంటు సమావేశాల్లోనూ వివరించాలని మంత్రివర్గం ఆలోచనకు వచ్చింది. ఏపీ ప్రాజెక్టుల పర్యవసానంగా రాష్ట్రంలో కృష్ణా బేసిన్ ప్రాంతాలకు జరిగే నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించింది.
కేంద్రం తీరుపై ఆవేదన
నదీ జలాల విషయంలో కేంద్రం తీరును మంత్రివర్గం తప్పుపట్టింది. తెలంగాణకు న్యాయమైన వాటాకోసం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం– 1956 సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరిన అంశంపై చర్చించింది. సుప్రీంకోర్టులో కేసుల వల్ల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయలేకపోతున్నామని, తెలంగాణ కేసులను వెనక్కి తీసుకుంటే త్వరగా నిర్ణయం తీసుకుంటామని అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్ర జలశక్తి మంత్రి హామీ ఇచ్చారని మంత్రివర్గం గుర్తు చేసింది. కేంద్రం సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరిస్తుందనే నమ్మకంతో తెలంగాణ ప్రభుత్వం కేసులు ఉపసంహరించుకున్నా.. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రం వైఖరి కారణంగా తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించింది. రాష్ట్ర రైతుల ప్రయోజనాల రక్షణ కోసం ఎంత దూరమైనా పోవాలని అభిప్రాయపడింది.
ప్రాజెక్టులపై కేబినెట్ నిర్ణయాలివీ..
పులిచింతల ఎడమ కాల్వ నిర్మించి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి.
సుంకేశుల రిజర్వాయర్ నుంచి మరో ఎత్తిపోతల పథకం ద్వారా నడిగడ్డ ప్రాంతంలో మరో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించాలి.
కృష్ణా ఉపనది అయిన భీమా నది తెలంగాణలో ప్రవేశించే కృష్ణ మండలంలోని కుసుమర్తి గ్రామం వద్ద భీమా వరద కాల్వను నిర్మించాలి.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో జలాశయాల సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలి.
నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఎగువ భూములకు నీరివ్వాలి.
సాగునీటి శాఖ ఈ ప్రాజెక్టులకు సంబంధించి వెంటనే సర్వేలు నిర్వహించి, డీపీఆర్‌ల తయారీ కోసం చర్యలు తీసుకోవాలి.
వానాకాలం ప్రారంభంలోనే కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాలకు నీటి ప్రవాహం పెరుగుతుంది. ఈ సమయంలోనే తెలంగాణకు హక్కుగా ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టుల్లో వీలైనంత మేరకు జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. ఎత్తిపోతల పథకాలకు వినియోగించుకోవాలి. తద్వారా ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోసుకోవడంతోపాటు విద్యుత్ ఖర్చును తగ్గించుకోవచ్చు.
కృష్ణా, గోదావరి నదులపై 2,375 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో పూర్తి సామర్ధ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసి.. కాళేశ్వరం, దేవాదుల, ఏఎమ్మార్పీ తదితర పథకాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖను కేబినెట్ ఆదేశించింది.