bhima river
-
‘కృష్ణా’తీరం.. ఆధ్యాత్మిక తరంగం
తెలంగాణ – కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని కృష్ణా మండలానికి ఓ విశిష్టమైన స్థానం ఉంది. జీవ నదులు.. రాజుల సంస్థానాలు.. రుషులు తపస్సు చేసిన ప్రాంతాలు.. ఆధ్యాత్మిక క్షేత్రాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఘనకీర్తి సముపార్జించుకున్న ప్రాంతం కృష్ణా మండలం. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క విశిష్టతతో ప్రసిద్ధికెక్కాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రసిద్ధ ప్రాంతాలు ఆదరణకు నోచుకోక మరుగున పడ్డాయి. చారిత్రాత్మక ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధిపరచాలని స్థానికులు కోరుతున్నారు. – కృష్ణానారాయణపేట జిల్లాలోని కృష్ణా మండలంలో 22 కిలోమీటర్ల మేర కృష్ణానది (Krishna River) 3 కిలోమీటర్ల మేర భీమా నది ప్రవహిస్తోంది. ఈ రెండు నదులు తంగిడి గ్రామంలో కలుస్తాయి. నదీ తీర ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయాలు (Temples) ఉన్నాయి. కుసుమర్తి గ్రామంలో కర్ణాటక నుంచి తెలంగాణలోకి ప్రవేశించే భీమా నది ఒడ్డున కృష్ణ ద్వైపాయన మఠం ఉంది. ఆ రుషి మంత్రాలయం గురు రాఘవేంద్ర మహాస్వాములకు ముందే ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారు. ఆయన తపస్సుకు సాక్షాత్తు భగవంతుండు ప్రత్యక్షమైనట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ వేద పాఠశాల కూడా నిర్వహించినట్టు ఇక్కడి పురోహితులు చెబుతున్నారు. తంగిడిలో సంగమ క్షేత్రం.. కృష్ణా, భీమా నదులు కలిసే తంగిడి సంగమ క్షేత్రంలో ఎందరో రుషులు తపస్సు ఆచరించినట్టు ఆధారాలున్నాయి. నది అటువైపు కర్ణాటక (Karnataka) ప్రాంతంలో ప్రసిద్ధ శివాలయం ఉంది. అక్కడ ఇప్పటికీ ఈ ప్రాంత విశిష్టత గురించి శిలా శాసనాలు ఉన్నాయి. ఇటువైపు కొంతకాలం క్రితం దత్త పీఠాధిపతి విఠల్‌బాబా దత్త భీమేశ్వర ఆలయం నిర్మించారు. గూర్జాల్ గ్రామ సమీపంలోని కృష్ణానది మధ్యలో ఒక బండపై శివలింగం, నంది విగ్రహాలు ఉన్నాయి. అవి కదిలిస్తే కదులుతాయి. కానీ నది ప్రవాహానికి అంగుళం కూడా కదలవు. ఇక్కడ నది ఒడ్డునే సిద్ధలింగ మహాస్వాములు తపస్సు ఆచరించి.. ఓ మఠం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అక్కడ పూజలు నిర్వహిస్తూ.. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కృష్ణా గ్రామంలో నది ఒడ్డున దత్తాత్రేయ మందిరం, శివాలయం ఉన్నాయి. ఇక్కడ కూడా రుషులు తపస్సు ఆచరిస్తూ.. స్థానికులకు తమ మహిమలను చూపించే వారు. అందులో ఒకరైన శ్రీ క్షీరలింగేశ్వర మహాస్వాములు 47 రోజులపాటు కేవలం ఒకమారు మాత్రమే పాలు సేవించి ఘోర తపస్సు ఆచరించారు. ఆయన శిష్యులు ఇక్కడ ఏటా మకర సంక్రాంతి పండగ రోజు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ముడుమాల్ గ్రామంలో నది ఒడ్డున మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల సమకాలికులైన గురు యాదవేంద్ర మహాస్వాములు తపస్సు ఆచరించారు. గురు రాఘవేంద్ర స్వాములు ప్రజల్లో దైవభక్తిని పెంపొందించేందుకు «ఇక్కడి నుంచి ధర్మ ప్రచారం ప్రారంభించారు. అలా వెళ్లిన గురురాఘవేంద్ర స్వాములు తుంగభద్ర నది ఒడ్డున ప్రస్తుత మంత్రాలయంలో మఠం ఏర్పాటు చేశారు. ఇక్కడున్న ఆయన సమకాలికుడు యాదవేంద్ర మహాస్వామి మాత్రం కేవలం పూజలు, తపస్సుకే ప్రాధాన్యం ఇచ్చి ఇక్కడే ఉండిపాయారు. ఇక్కడ ఏటా ఫిబ్రవరి 22న యాదవేంద్ర స్వాముల ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు విధిగా మంత్రాలయ పీఠాధిపతులు హాజరవుతారు. ఇక్కడ నాలుగు ద్వారాలతో కూడిన శివాలయం ఉంది. ఎక్కడైనా ఆలయ గర్భగుడికి ఓకే ద్వారం ఉంటుంది. కాని ఇక్కడ మాత్రం శివాలయ గర్భగుడికి నాలుగు ద్వారాలు ఉండటం విశేషం. ముడుమాల్ సంస్థానం రాజులు ఈ ఆలయంలో పూజలు నిర్వహించే వారని.. యుద్ధ సమయంలో సైన్యంతో తూర్పున ఉన్న ద్వారం నుంచి ప్రవేశించి, పశ్చిమాన ఉన్న ద్వారం గుండా బయటికెళ్లే వారని చరిత్ర చెబుతోంది. మాగనూర్ మండలం కొల్పూర్‌లో కృష్ణానది ఒడ్డున సత్యపూర్ణ తీర్థ మహాస్వాముల మఠం ఉంది. ఈయన కూడా మంత్రాలయ రాఘవేంద్రస్వామి సమకాలికులే. ఈయన భక్తులు కోరిన కోర్కెలను తీర్చే స్వామిగా ప్రసిద్ధికెక్కారు. ముడుమాల్ గ్రామంలో రాజులు సంస్థానాలను ఏర్పాటు చేసుకొని పరిపాలించారు. కృష్ణా, మాగనూర్ మండలంలోని గ్రామాలతో పాటు కర్ణాటకలోని పలు గ్రామాలను ఈ రాజులు పరిపాలించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కొల్పూర్ సంస్థానంలో నది అటువైపు ఉన్న కర్ణాటక ప్రాంతంతో పాటు ఇటువైపు ఉన్న కొన్ని గ్రామాలను వారు పరిపాలించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రం కూడా కొల్పూర్ ప్రాంతానికి చెందినదిగా ప్రచారం ఉంది. ఈ వజ్రం (Diamond) చేపల వేటగాడికి నదిలో దొరికిందని.. అది కొల్పూర్ దొరకు ఇవ్వగా, ఆయన నిజాం ప్రభువుకు అప్పగించినట్లు ప్రచారంలో ఉంది. కొల్పూర్‌లో ఇప్పటికీ రాజమందిరాలు ఉన్నాయి. వీరి వంశీకులే ప్రస్తుతం కర్ణాటకలోని ప్రసిద్ధ దేవసూగూర్ సూగురేశ్వర ఆలయాన్ని నిర్మించారు. సంస్థానాధీశులకు చెందిన లక్షలాది ఎకరాలు భూములను ఆచార్య వినోభాబావే స్వచ్ఛందంగా సేకరించి, పేదలకు పంచిపెట్టారు.ఇక్కడే నిలువు రాళ్లు.. ముడుమాల్ సమీపంలోని నది ఒడ్డున ఉన్న నిలువురాళ్లు దేశంలో మరెక్కడా కనిపించవు. ఈ నిలువు రాళ్లు ఆదిమానవులు ఏర్పాటు చేసుకున్నవని.. పురావస్తు శాఖకు చెందిన ప్రొఫెసర్ పుల్లారావు పరిశోధన ద్వారా ప్రపంచానికి తెలిసింది. సూర్య కిరణాలు ఒక వరుస నుంచి.. మరో వరుసకు ప్రయాణించే సమయాన్ని.. ఆది మానవులు రుతువులుగా భావించే వారని ప్రొఫెసర్ పేర్కొన్నారు. మహోన్నతమైన, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నిలువురాళ్లు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, మఠాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
ఆ నది రక్తంతో ఎరుపెక్కుతోంది..
బనశంకరి(కర్ణాటక): బీదర్– కలబుర్గి జిల్లాల సరిహద్దుల్లో భీమా నది ప్రవాహం రక్తంతో ఎరుపెక్కుతోంది. ఇక్కడ దశాబ్దాలుగా ఆధిపత్య పోరు, కిరాయి హంతక ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. నదిని ఆనుకుని ఉండే అఫ్జల్‌పుర, చడచణ, దేవనగావ్, ఆల్మేల, ఉమ్రాణి గ్రామాలను దాటుకుని ఈ హింస విస్తరించింది. బైరగొండ వర్సెస్ చడచణ ఉమ్రాని గ్రామంలో బైరగొండ, చడచణ అనే రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు రక్తసిక్తమైంది. ఒక కుటుంబం ఒక శత్రువును చంపితే, ప్రతీకారంగా మరో కుటుంబం ఇద్దరిని హతమారుస్తోంది. ఇది ఎడతెగని వ్యవహారంగా మారింది. ఈ పగలకు సుమారు యాభై మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఒక అంచనా. ఇందులో అనేకమంది శవాలు భీమా నదిలో దొరకకుండా పోయాయి. సోమవారం కాంగ్రెస్ నేత, ముఠా నాయకుడు మహదేవ సాహుకార బైరగొండపై సినీ ఫక్కీలో జరిగిన దాడి ఈ మారణహోమానికి తాజా ఉదాహరణ. (చదవండి: అశ్లీల వీడియో: పూనమ్ పాండేపై కేసు) 1984లో బీజం కొన్నినెలలుగా ప్రశాంతంగా ఉన్న భీమా తీర గ్రామాల్లో ఈ దాడితో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి. 1984 నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య ద్వేషం మొదలైంది. మహిళ గొడవకు సంబంధించి ఉమ్రాణి గ్రామంలో శాంతప్ప చడచణ అనే వ్యక్తిని పంచాయతీకి పిలిచారు. పంచాయతీ చేస్తున్న సమయంలో శాంతప్పచడచణను ప్రత్యర్థులు అక్కడే అంతమొందించడంతో హత్యాకాండకు తెరలేచింది. బైరగొండ కుటుంబమే దీనికి కారణమని అనుమానం వ్యక్తమైంది. దీంతో బైరగొండ, చడచణ కుటుంబాలు పరస్పర ప్రతీకార ద్వేషంతో రగిలిపోయాయి. అప్పటి నుంచి నేటి వరకు మూడు దశాబ్దాలు గడిచినప్పటికీ ఈ రెండు కుటుంబాల మధ్య ద్వేషం, పగ చల్లారలేదు. రెండు కుటుంబాలు దాడులకు దిగుతూ ఎంతో ప్రాణనష్టాన్ని చవిచూశాయి. 1984లో చడచణ గ్రామ బస్టాండులో శ్రీశైల బైరగొండ, అతని అనుచరుడు హత్యకు గురికాగా చడచణ కుటుంబమే కారణమని అనుమానం వ్యక్తమైంది. 2008 లో పుత్రప్ప సాహుకార బైరగొండ ఎన్నికల ప్రచారం నుంచి వస్తుండగా ఇండి తాలూకా లోణిబీకే గ్రామం వద్ద దుండగులు కాల్పులు జరిపారు. ఆయన తీవ్ర గాయాలతో రెండేళ్లపాటు సతమతమై మరణించాడు. (చదవండి: ప్రియుడితో రాసలీలలు.. భర్త రెడ్‌హ్యాండెడ్‌గా..) మినీ నేర సామ్రాజ్యం ఈ తరహాలతో చడచణ– బైరగొండ కుటుంబాల మధ్య వైరం అండచూసుకుని అనేక ముఠాలు పుట్టుకొచ్చాయి. సెటిల్మెంట్లు, అక్రమ తుపాకుల విక్రయాల్లో పేరుగాంచాయి. రాజకీయ నేతలు తమ పలుకుబడి కోసం ముఠాలను చేరదీయడంతో కొన్నేళ్లు ఎదురు లేకుండాపోయింది. ముఠాల నేరగాళ్లు కర్ణాటకతో పాటు మహారాష్ట్రలోనూ కిరాయి హంతకులుగానూ మారారు. ప్రత్యర్థుల దాడులు, పోలీసు ఎన్కౌంటర్లలో బడా ముఠాల నాయకులు మట్టి కరిచారు. ఎన్కౌంటర్లు 2017 అక్టోబరు 30 తేదీన ధర్మరాజ చడచణ అనే వ్యక్తిని పోలీసులు ఎన్కౌంటర్లో మట్టుబెట్టారు. అతని సోదరుడు గంగాధర చడచణ అనుమానాస్పదంగా చనిపోయాడు. బైరగొండ కుటుంబమే ఇది చేయించిందని అనుమానం వ్యక్తమైంది. మహదేవ బైరగొండ అనుచరులతో పాటు 15 మందిపై కోర్టులో పోలీసులు చార్జిïÙట్ వేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. మహదేవ సాహుకార బైరగొండ అతడి అనుచరులు ఈ కేసులో జామీనుపై విడుదలయ్యారు. -
భీమా పుష్కరాలు ప్రారంభం
మాగనూర్ (మక్తల్): మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా మండలంలో వ్రహిహిస్తున్న భీమా నది పుష్కరాలు గురువారం ప్రారంభమయ్యా యి. ఈ నది పుష్కరాల కోసం మూడు పుష్క ర ఘాట్లు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 7.23 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛ రణల నడుమ పుష్కరుడికి మంగళ హారతి ఇచ్చి పుష్కరాలు ప్రారంభమైనట్లుగా ప్రకటిం చారు. నేరడగం పక్షిమాద్రి విరక్త మఠం పీఠాధిపతి శ్రీ పంచమ సిద్ధలింగ మహా స్వా మి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేవదాయ శాఖ కమిషనర్ శ్రీనివాస్‌రావు, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి తదితరులు పూజల తర్వాత నదీ స్నానం ఆచరించారు. -
నేటి నుంచి భీమా పుష్కరాలు
మాగనూర్ (మక్తల్): మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా మండలంలో ప్రవహిస్తున్న భీమా నది పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 22వ తేదీ వరకు కొనసాగే పుష్కరాలకు రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పుణ్యస్నానాల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కాగా, తెలంగాణలో కేవలం ఏడు కిలోమీటర్లు మాత్రమే భీమా నది ప్రవహిస్తోంది. ఈ పుష్కరాలను పురస్కరించుకుని తంగిడి, కుసునూర్, శుక్రలింగంపల్లి గ్రామాల్లో స్నాన ఘాట్లను ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం 7.24 గంటలకు అధికారులు, వేద పండితులు పుష్కరుడికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా పుష్కరాలను ప్రారంభించనున్నారు. -
పోరాట చైతన్య దీప్తి ‘కోరేగావ్’
ఏటా నూతన సంవత్సరం రోజున కోరేగావ్ వద్ద చేరే వేలాది ప్రజలందరిదీ ఒక్కటే మాట... ‘‘ఇది మాకు మరువలేని రోజు. ఆత్మగౌరవం కోసం, తెగనరికిన తలలను సైతం పెకైత్తుకొని తిరగడం కోసం మా తాతలు ఇక్కడ ప్రాణాలర్పించారు. మనిషిని పశువుకన్నా హీనంగా చూసే హేయమైన అంటరానితనాన్ని ప్రత్యక్షంగా అనుభవించి, సహించి... చివరకు తెగించి తిరగబడ్డ చరిత్రకు ఈ నదే సాక్ష్యం. పీష్వాల క్రూర పాలనను అంతం చేసి వారు మాకు మార్గనిర్దేశనం చేశారు. వారి త్యాగాలను గానం చేయడానికి, ఉద్యమ స్ఫూర్తిని రగుల్చుకోవడానికి ఇక్కడ కలుస్తుంటాం’’. జనవరి 1, 2015. ప్రపంచమంతా నూతన సంవత్సర సంబరాల్లో మునిగి తేలుతున్న సందర్భమిది. అయితే మహారాష్ట్రలోని పుణే సమీపాన ఉన్న భీమా నది ఒడ్డున నిటారుగా నింగికి ఎగసి, సగర్వంగా తలెత్తి నిలిచిన కోరేగావ్ స్మారక స్తూపం వద్ద వేలాది మంది గుమిగూడి నివాళులర్పిస్తుంటారు. ఒకటి సంబరమైతే, రెండవది సంస్మరణ. ప్రపంచ ప్రజలంతా అనిశ్చితమైన భవితపై ఎక్కడలేని ఆశలతో సంబరాలలో తేలుతుండగా... అక్కడ చేరిన వారు మాత్రం తమ చేతులతో తామే తాము కోరుకుంటున్న భవితను నిర్మించుకోగలిగే స్ఫూర్తిని పొందడం కోసం తపిస్తారు. జనవరి ఒకటిన భీమా నది ఒడ్డున నిలిస్తే మరో ప్రపంచంలోకి దారులు వేస్తున్నట్టుంటుంది. రాచరికపు అరాచకాలకు ఎదురొడ్డి, ప్రాణాలకు తెగించి పోరాడిన దళిత పోరాటాల చరిత్రకు, ప్రత్యేకించి సైనిక పోరాటాల చరిత్రకు కోరేగావ్ స్మారక స్తూపం మరుగున పడిపోకుండా మిగిలిన సజీవ సాక్ష్యం. ఏటా ఈ రోజున అక్కడ చేరిన ప్రజలలో విజయగర్వం తొణికిసలాడుతుంది. అందరి నోటా ఇంచుమించుగా ఇదే మాట వినవస్తుంది. ‘‘ఇది మాకు మరువలేని రోజు. ఆత్మ గౌరవం కోసం, తెగ నరికిన తలలను సైతం పెకైత్తుకొని తిరగడం కోసం మా తాతలు ఇక్కడ ప్రాణాలర్పిం చారు. మనిషిని పశువుకన్నా హీనంగా చూసే హేయమైన అంటరానితనాన్ని ప్రత్యక్షంగా అనుభవించి, సహించి... చివరకు తెగించి తిరగబడ్డ చరిత్రకు ఈ నదే సాక్ష్యం. పీష్వాల క్రూర పాలనను అంతం చేసి వారు మాకు మార్గనిర్దేశనం చేశారు. ఆ యుద్ధంలో ప్రాణాలర్పించిన వారిని సంస్మరిస్తూనే ఇక్కడ విజయ స్తూపాన్ని నిర్మించుకున్నాం. వారి త్యాగాలను గానం చేయడానికి, ఎప్పటి కప్పుడు మాలో ఉద్యమ స్ఫూర్తిని రగుల్చుకోవడానికి ఇక్కడ కలుస్తుంటాం’’. పీష్వాల పీచ మణచిన దళిత సేన బ్రిటిష్ వర్తకులు ఈస్టిండియా కంపెనీని స్థాపించి, భారతదేశాన్ని రాజకీయంగా గెలుచుకోవడానికి అనేక యుద్ధాలు చేశారు. అందులో భీమా నది వద్ద పీష్వాలను ఓడించిన రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం ప్రముఖమైనది. ఈ యుద్ధం, అత్యంత క్రూరమైన కుల అణచివేత సాగించిన పీష్వాల రాజ్యం అంతం కావడానికి, బ్రిటిష్ పాలన నెలకొనడానికి ఎంతో ఉపకరించింది. ఒక సామ్రాజ్యవాదశక్తికీ, కుల వివక్ష తలకెక్కిన నిరంకుశ రాచరికానికి మధ్య జరిగిన యుద్ధంలో దళితులు బ్రిటిష్ సైన్యం పక్షాన నిలిచినది అత్యంత హేయమైన అంటరానితనాన్ని రుద్దిన పాలనను అంతం చేయడం కోసమే. అందుకే అది దళిత పోరాటాల చరిత్రలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఇతర యుద్ధాలకు ఇది చాలా భిన్నమైనది. అసలు ఈ యుద్ధం జరిగిన తీరే అద్భుతం. 1817 నవంబర్‌లో పీష్వా సైన్యం పుణేలోని బ్రిటిష్ రెసిడెన్సీని ఆక్రమించడంతో కంగుతిన్న బ్రిటిష్ సైన్యం బొంబాయిలోని తన ఫస్ట్ రెజిమెంట్ రెండవ బెటాలియన్‌ను పంపి పీష్వాలకు బుద్ధి చెప్పాలనుకుంది. కెప్టెన్ స్వంటన్ నేతృత్వంలో అయిదు వందల మంది సైనికులను, 250 మందితో కూడిన అశ్విక దళాలను పంపారు. కానీ పీష్వాలకు 20 వేల సైనికులు, 8 వేల అశ్విక దళం ఉంది. పీష్వాల బలాధిక్యతకు బ్రిటిష్ వారి తరఫున రంగంలోకి దిగిన సైనికులు జంకలేదు. 1818, జవవరి 1న కోరేగావ్ దగ్గర జరిగిన ఈ యుద్ధంలో... ఒక రోజంతా అన్నం, నీళ్లు లేకుండానే యుద్ధానికి దిగిన 750 మంది సైనికులు దాదాపు 28 వేల పీష్వా సైన్యంతో తలపడ్డారు. ఉదయం నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ యుద్ధం సాగింది. పీష్వాల వేలకు వేల సైన్యాన్ని స్వంటన్ నేతృత్వంలో నిలిచిన కొన్ని వందల మంది సైనికులు మట్టి కరిపించారు. 1707 నుంచి 1818 వరకు సాగిన పీష్వాల దుర్మార్గ పాలనకు ముగింపు పలికారు. అయితే ఆ యుద్ధంలో బ్రిటిష్ సేనగా పోరాడిన సైనికులు బ్రిటిష్ వాళ్లు కారు, అంటరాని కులంగా చూసే మహర్లు. ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఈ విజయం దళిత సేన సాధించిన విజయం. అణచివేత నుండి వచ్చిన తెగింపు ఈ అపూర్వ విజయం వెనుక మరో కోణం దాగి ఉంది. మహర్లు చాలా కాలంగా సైనిక వారసత్వం కలిగి, సైనికులుగా పనిచేసిన వాళ్లు. ముస్లింల దండయాత్రలను ప్రతిఘటించిన శివాజీ కాలంలోనే మహర్లను సైనికులుగా నియమించడం ప్రారంభమైంది. తద్వారా శివాజీ మహర్లకు సముచిత స్థానాన్ని కల్పించాడు. 1707లో పీష్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని సైన్యం నుంచి తొలగించారు. అంతేగాక అత్యంత దుర్మార్గమైన పద్ధతుల్లో, నీచమైన పద్ధతుల్లో అంటరానితనాన్ని పాటించారు. అంటరాని కులాలైన మహర్, మాంగ్, మాచంగ్లు గ్రామాల్లోకి రాకూడదు. ఉదయం, సాయంత్రాలైతే అసలే రాకూడదు. ఆ సమయాల్లో సూర్యుడు ఏటవాలుగా ఉంటాడు కాబట్టి వాళ్ల నీడలు పొడవుగా ఉంటాయి. అంటరాని వాళ్ల నీడలు సైతం అగ్ర కులాలను తాకరాదు అని ఆ నిషేధం విధించారు. మధ్యాహ్నం సూర్యుడు నట్టనడినెత్తిన ఉండే సమయంలో మాత్రమే వాళ్లు ఊళ్లోకి రావచ్చు. అది కూడా వారి అడుగులను వారే చెరిపేసుకునేలా నడుము వెనక చీపురు కట్టుకొని, ఉమ్మినా బయట పడకుండా ఉండేందుకు మూతికి ముంత కట్టుకొని రావాలి. పొరపాటున పీష్వాల వ్యాయామశాలల ముందు నుంచి పోతే మహర్, మాతంగ్‌ల తలలను నరికి, కత్తులతో బంతి ఆట ఆడేవారు. ఇంత క్రూర పాలనను అనుభవించారు కనుకనే మహర్ సైనికులు చావో రేవో తేల్చుకోవాలనుకున్నారు. బ్రిటిష్ సైన్యంలో చేరి పీష్వాల పీచమణచడానికే ప్రాణాలను లెక్కచేయక పోరాడారు. పీష్వాల క్రూర అణచివేత నుంచే వారిలో ఆ కసి, పట్టుదల పుట్టుకొచ్చాయి. లేకపోతే గుప్పెడు మంది వహర్లు వేల కొలది పీష్వా సైన్యాన్ని మట్టుబెట్టడం సాధ్యమయ్యేదే కాదు. నీచమైన బతుకు కన్నా యుద్ధరంగంలో చావడమే గౌరవమని వాళ్లు భావించారు. కనుకనే విజయం వారి సొంతం అయింది. అమెరికా మానవ హక్కుల నాయకుడు, వర్జీనియా విముక్తి కోసం పోరాడిన యోధుడు పాట్రిక్ హెన్రీ మాటలు ఇక్కడ చక్కగా వర్తిస్తాయి. ‘‘మనం విముక్తి పొందాలంటే పోరాటం తప్పనిసరి. నా వరకైతే విముక్తి పొందడమో, వీర మరణమో కావాలి’’. కోరేగావ్ యుద్ధంలో మహర్లు సరిగ్గా అలాగే అంటరానితనం సంకెళ్లను తెంచుకోవడానికి ప్రాణ త్యాగాలకు సిద్ధమయ్యారు, విజయం సాధించారు. కోరేగావ్ రగిల్చిన పోరాట స్ఫూర్తి 1819లో జరిగిన బ్రిటిష్ పార్లమెంట్ సమావేశాల్లో మహర్ సైనికుల వీరోచిత పోరాటం ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. ఆ తర్వాత మహర్ రెజిమెంట్ సైనికులు మూడు, నాలుగు యుద్ధాల్లో పాల్గొన్నారు. 1857 మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో భారతీయ సైనికులందరిలాగే మహర్లు కూడా తిరుగుబాటు చేశారు. ఆ తదుపరి బ్రిటిష్ వారు అన్ని కులాలవారిని తిరిగి సైన్యంలో చేర్చుకున్నారు. కానీ 1892 నుంచి మహర్లను సైన్యంలోకి తీసుకోవడం ఆపేశారు. మహర్లను సైన్యంలోకి చేర్చుకోవాలంటూ 1894లో గోపాల్ బాబా వాలంగ్కర్ నాయకత్వంలో మరో ఉద్యమం ప్రారంభమైంది. కానీ ఆధిపత్య కులాల మాటలు నమ్మి బ్రిటిష్‌వారు మహర్లను సైన్యంలోకి తీసుకోవడానికి నిరాకరించారు. శివ్రామ్ కాంబ్లే అనే మరొక నాయకుడు కూడా ఈ సమస్యపై నిరంతర పోరాటం చేశారు. ఆయన అంటరాని కులాల కోసం పాఠశాలలు నిర్వహించేవారు. కాంబ్లే 1910లో 50 గ్రామాల మహర్లను సమీకరించి మహర్ సైనికుల సమస్యలను ప్రధాన ఎజెండాగా చర్చించారు. ఆ తదుపరి పదే పదే విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. చివరికి 1917లో మహర్లను తిరిగి సైన్యంలోకి తీసుకోవడం మొదలైంది. అదీ మొదటి ప్రపంచ యుద్ధ సమయం కావడం వల్ల తప్పనిసరై చేర్చుకున్నారు. యుద్ధం ముగిసిపోయాక, 1922లో తిరిగి వారిని సైన్యంలో చేర్చుకోవడం ఆపేశారు. 1940లో అంబేద్కర్ చూపిన చొరవ వల్లనే తిరిగి మహర్లను సైన్యంలోకి తీసుకున్నారు. నాటి నుంచి నేటి వరకు భారత సైన్యంలో మహర్ రెజిమెంట్ కొనసాగుతోంది. కోరేగావ్ యుద్ధంలో అమరులైన వారికి గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం 1851లో అక్కడే స్తూపాన్ని నిర్మించింది. అదే స్తూపం వద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మొదటిసారిగా 1927లో జనవరి ఒకటిన సభను నిర్వహించి ఏటేటా సంస్మరణ జరిపే సంప్రదాయాన్ని ప్రారంభించారు. కోరేగావ్ యుద్ధం పీష్వాల దుర్మార్గ పాలనను అంతం చేయడంతో మహారాష్ట్రలో ఒక చైతన్య స్రవంతికి అంకురార్పణ జరిగింది. అదే పుణేలో, 1827లో జన్మించిన జ్యోతిరావు పూలే ఆనాటి మహర్ సైనికుల విజయాన్ని పునాది చేసుకొని కుల వ్యతిరేక పోరాటాలను నిర్మాణాత్మకంగా కొనసాగిం చారు. ఆ స్ఫూర్తి వల్లనేనేమో అంటరాని కులాల బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పరచారు. ఆ చైతన్య స్రవంతికి కొనసాగింపుగా అదే మట్టిలో పుట్టిన బాబా సాహెబ్ అంబేద్కర్ కృషితో అంటరానితనాన్ని చట్టపరంగా నిషేధించారు. అందువల్లనే మహర్ సైనికులు జనవరి 1, 1818లో సాధించిన అద్భుత విజయాన్ని గుర్తు చేసుకో వడం, వారికి నివాళి అర్పించడం సామాజిక సమానత్వాన్ని, న్యాయాన్ని కాంక్షించే వారందరి బాధ్యత. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ నం: 9705566213)