పోరాట చైతన్య దీప్తి ‘కోరేగావ్’ | incident on koregaon | Sakshi
Sakshi News home page

పోరాట చైతన్య దీప్తి ‘కోరేగావ్’

Published Wed, Dec 31 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM

పోరాట చైతన్య దీప్తి ‘కోరేగావ్’

పోరాట చైతన్య దీప్తి ‘కోరేగావ్’

ఏటా నూతన సంవత్సరం రోజున కోరేగావ్ వద్ద చేరే వేలాది ప్రజలందరిదీ ఒక్కటే మాట... ‘‘ఇది మాకు మరువలేని రోజు. ఆత్మగౌరవం కోసం, తెగనరికిన తలలను సైతం పెకైత్తుకొని తిరగడం కోసం మా తాతలు ఇక్కడ ప్రాణాలర్పించారు. మనిషిని పశువుకన్నా హీనంగా చూసే హేయమైన అంటరానితనాన్ని ప్రత్యక్షంగా అనుభవించి, సహించి... చివరకు తెగించి తిరగబడ్డ చరిత్రకు ఈ నదే సాక్ష్యం. పీష్వాల క్రూర పాలనను అంతం చేసి వారు మాకు మార్గనిర్దేశనం చేశారు. వారి త్యాగాలను గానం చేయడానికి, ఉద్యమ స్ఫూర్తిని రగుల్చుకోవడానికి ఇక్కడ కలుస్తుంటాం’’.
 
 జనవరి 1, 2015. ప్రపంచమంతా నూతన సంవత్సర సంబరాల్లో మునిగి తేలుతున్న సందర్భమిది. అయితే మహారాష్ట్రలోని పుణే సమీపాన ఉన్న భీమా నది ఒడ్డున నిటారుగా నింగికి ఎగసి, సగర్వంగా తలెత్తి నిలిచిన  కోరేగావ్ స్మారక స్తూపం వద్ద వేలాది మంది గుమిగూడి నివాళులర్పిస్తుంటారు. ఒకటి సంబరమైతే, రెండవది సంస్మరణ.
 
 ప్రపంచ ప్రజలంతా అనిశ్చితమైన భవితపై ఎక్కడలేని ఆశలతో సంబరాలలో తేలుతుండగా... అక్కడ చేరిన వారు మాత్రం తమ చేతులతో తామే తాము కోరుకుంటున్న భవితను నిర్మించుకోగలిగే స్ఫూర్తిని పొందడం కోసం తపిస్తారు. జనవరి ఒకటిన భీమా నది ఒడ్డున నిలిస్తే మరో ప్రపంచంలోకి దారులు వేస్తున్నట్టుంటుంది. రాచరికపు అరాచకాలకు ఎదురొడ్డి, ప్రాణాలకు తెగించి పోరాడిన దళిత పోరాటాల చరిత్రకు,  ప్రత్యేకించి సైనిక పోరాటాల చరిత్రకు కోరేగావ్ స్మారక స్తూపం మరుగున పడిపోకుండా మిగిలిన సజీవ సాక్ష్యం.
 
 ఏటా ఈ రోజున అక్కడ చేరిన ప్రజలలో విజయగర్వం తొణికిసలాడుతుంది. అందరి నోటా ఇంచుమించుగా ఇదే మాట వినవస్తుంది. ‘‘ఇది మాకు మరువలేని రోజు. ఆత్మ గౌరవం కోసం, తెగ నరికిన తలలను సైతం పెకైత్తుకొని తిరగడం కోసం మా తాతలు ఇక్కడ ప్రాణాలర్పిం చారు. మనిషిని పశువుకన్నా హీనంగా చూసే హేయమైన అంటరానితనాన్ని ప్రత్యక్షంగా అనుభవించి, సహించి... చివరకు తెగించి తిరగబడ్డ చరిత్రకు ఈ నదే సాక్ష్యం. పీష్వాల క్రూర పాలనను అంతం చేసి వారు మాకు మార్గనిర్దేశనం చేశారు. ఆ యుద్ధంలో ప్రాణాలర్పించిన వారిని సంస్మరిస్తూనే ఇక్కడ విజయ స్తూపాన్ని నిర్మించుకున్నాం. వారి త్యాగాలను గానం చేయడానికి, ఎప్పటి కప్పుడు మాలో ఉద్యమ స్ఫూర్తిని రగుల్చుకోవడానికి ఇక్కడ కలుస్తుంటాం’’.  
 
 పీష్వాల పీచ మణచిన దళిత సేన
 బ్రిటిష్ వర్తకులు ఈస్టిండియా కంపెనీని స్థాపించి, భారతదేశాన్ని రాజకీయంగా గెలుచుకోవడానికి అనేక యుద్ధాలు చేశారు. అందులో భీమా నది వద్ద పీష్వాలను ఓడించిన రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం ప్రముఖమైనది. ఈ యుద్ధం, అత్యంత క్రూరమైన కుల అణచివేత సాగించిన పీష్వాల రాజ్యం అంతం కావడానికి, బ్రిటిష్ పాలన నెలకొనడానికి ఎంతో ఉపకరించింది. ఒక సామ్రాజ్యవాదశక్తికీ, కుల వివక్ష తలకెక్కిన నిరంకుశ రాచరికానికి మధ్య జరిగిన యుద్ధంలో దళితులు బ్రిటిష్ సైన్యం పక్షాన నిలిచినది అత్యంత హేయమైన అంటరానితనాన్ని రుద్దిన పాలనను అంతం చేయడం కోసమే. అందుకే అది దళిత పోరాటాల చరిత్రలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఇతర యుద్ధాలకు ఇది చాలా భిన్నమైనది. అసలు ఈ యుద్ధం జరిగిన తీరే అద్భుతం.
 
 1817 నవంబర్‌లో పీష్వా సైన్యం పుణేలోని బ్రిటిష్ రెసిడెన్సీని ఆక్రమించడంతో కంగుతిన్న బ్రిటిష్ సైన్యం బొంబాయిలోని తన ఫస్ట్ రెజిమెంట్ రెండవ బెటాలియన్‌ను పంపి పీష్వాలకు బుద్ధి చెప్పాలనుకుంది. కెప్టెన్ స్వంటన్ నేతృత్వంలో అయిదు వందల మంది సైనికులను, 250 మందితో కూడిన అశ్విక దళాలను పంపారు. కానీ పీష్వాలకు  20 వేల సైనికులు, 8 వేల అశ్విక దళం ఉంది. పీష్వాల బలాధిక్యతకు బ్రిటిష్ వారి తరఫున రంగంలోకి దిగిన సైనికులు జంకలేదు. 1818, జవవరి 1న కోరేగావ్ దగ్గర జరిగిన ఈ యుద్ధంలో... ఒక రోజంతా అన్నం, నీళ్లు లేకుండానే యుద్ధానికి దిగిన 750  మంది సైనికులు దాదాపు 28 వేల పీష్వా సైన్యంతో తలపడ్డారు.
 
 ఉదయం నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ యుద్ధం సాగింది. పీష్వాల వేలకు వేల సైన్యాన్ని స్వంటన్ నేతృత్వంలో నిలిచిన కొన్ని వందల మంది సైనికులు మట్టి కరిపించారు.  1707 నుంచి 1818 వరకు సాగిన పీష్వాల దుర్మార్గ పాలనకు ముగింపు పలికారు. అయితే ఆ యుద్ధంలో బ్రిటిష్ సేనగా పోరాడిన సైనికులు బ్రిటిష్ వాళ్లు కారు, అంటరాని కులంగా చూసే మహర్‌లు. ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఈ విజయం దళిత సేన సాధించిన విజయం.
 
అణచివేత నుండి వచ్చిన తెగింపు
 ఈ అపూర్వ విజయం వెనుక మరో కోణం దాగి ఉంది. మహర్‌లు చాలా కాలంగా సైనిక వారసత్వం కలిగి, సైనికులుగా పనిచేసిన వాళ్లు. ముస్లింల దండయాత్రలను ప్రతిఘటించిన శివాజీ కాలంలోనే మహర్‌లను సైనికులుగా నియమించడం ప్రారంభమైంది. తద్వారా శివాజీ మహర్‌లకు సముచిత స్థానాన్ని కల్పించాడు. 1707లో పీష్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని సైన్యం నుంచి తొలగించారు. అంతేగాక అత్యంత దుర్మార్గమైన పద్ధతుల్లో, నీచమైన పద్ధతుల్లో అంటరానితనాన్ని పాటించారు. అంటరాని కులాలైన మహర్, మాంగ్, మాచంగ్‌లు గ్రామాల్లోకి రాకూడదు. ఉదయం, సాయంత్రాలైతే అసలే రాకూడదు. ఆ సమయాల్లో సూర్యుడు ఏటవాలుగా ఉంటాడు కాబట్టి వాళ్ల నీడలు పొడవుగా ఉంటాయి. అంటరాని వాళ్ల నీడలు సైతం అగ్ర కులాలను తాకరాదు అని ఆ నిషేధం విధించారు. మధ్యాహ్నం సూర్యుడు నట్టనడినెత్తిన ఉండే సమయంలో మాత్రమే వాళ్లు ఊళ్లోకి రావచ్చు.
 
 అది కూడా వారి అడుగులను వారే చెరిపేసుకునేలా నడుము వెనక చీపురు కట్టుకొని, ఉమ్మినా బయట పడకుండా ఉండేందుకు మూతికి ముంత కట్టుకొని రావాలి. పొరపాటున పీష్వాల వ్యాయామశాలల ముందు నుంచి పోతే మహర్, మాతంగ్‌ల తలలను నరికి, కత్తులతో బంతి ఆట ఆడేవారు. ఇంత క్రూర పాలనను అనుభవించారు కనుకనే మహర్ సైనికులు చావో రేవో తేల్చుకోవాలనుకున్నారు. బ్రిటిష్ సైన్యంలో చేరి పీష్వాల పీచమణచడానికే ప్రాణాలను లెక్కచేయక పోరాడారు.
 
 పీష్వాల క్రూర అణచివేత నుంచే వారిలో ఆ కసి, పట్టుదల పుట్టుకొచ్చాయి. లేకపోతే గుప్పెడు మంది వహర్‌లు వేల కొలది  పీష్వా సైన్యాన్ని మట్టుబెట్టడం సాధ్యమయ్యేదే కాదు. నీచమైన బతుకు కన్నా యుద్ధరంగంలో చావడమే గౌరవమని వాళ్లు భావించారు. కనుకనే విజయం వారి సొంతం అయింది. అమెరికా మానవ హక్కుల నాయకుడు, వర్జీనియా విముక్తి కోసం పోరాడిన యోధుడు పాట్రిక్ హెన్రీ మాటలు ఇక్కడ చక్కగా వర్తిస్తాయి.
 
 ‘‘మనం విముక్తి పొందాలంటే పోరాటం తప్పనిసరి. నా వరకైతే విముక్తి పొందడమో, వీర మరణమో కావాలి’’. కోరేగావ్ యుద్ధంలో మహర్‌లు సరిగ్గా అలాగే అంటరానితనం సంకెళ్లను తెంచుకోవడానికి ప్రాణ త్యాగాలకు సిద్ధమయ్యారు, విజయం సాధించారు.
 
కోరేగావ్ రగిల్చిన పోరాట స్ఫూర్తి   
 1819లో జరిగిన బ్రిటిష్ పార్లమెంట్ సమావేశాల్లో మహర్ సైనికుల వీరోచిత పోరాటం ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. ఆ తర్వాత మహర్ రెజిమెంట్ సైనికులు మూడు, నాలుగు యుద్ధాల్లో పాల్గొన్నారు. 1857 మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో భారతీయ సైనికులందరిలాగే మహర్‌లు కూడా తిరుగుబాటు చేశారు. ఆ తదుపరి బ్రిటిష్ వారు అన్ని కులాలవారిని తిరిగి సైన్యంలో చేర్చుకున్నారు. కానీ 1892 నుంచి మహర్‌లను సైన్యంలోకి తీసుకోవడం ఆపేశారు.
 
 మహర్లను సైన్యంలోకి చేర్చుకోవాలంటూ 1894లో గోపాల్ బాబా వాలంగ్‌కర్ నాయకత్వంలో మరో ఉద్యమం ప్రారంభమైంది. కానీ ఆధిపత్య కులాల మాటలు నమ్మి బ్రిటిష్‌వారు మహర్‌లను సైన్యంలోకి తీసుకోవడానికి నిరాకరించారు. శివ్‌రామ్ కాంబ్లే అనే మరొక నాయకుడు కూడా ఈ సమస్యపై నిరంతర పోరాటం చేశారు. ఆయన అంటరాని కులాల కోసం పాఠశాలలు నిర్వహించేవారు. కాంబ్లే 1910లో 50 గ్రామాల మహర్‌లను సమీకరించి మహర్ సైనికుల సమస్యలను ప్రధాన ఎజెండాగా చర్చించారు. ఆ తదుపరి పదే పదే విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు.
 
 చివరికి 1917లో మహర్‌లను తిరిగి సైన్యంలోకి తీసుకోవడం మొదలైంది. అదీ మొదటి ప్రపంచ యుద్ధ సమయం కావడం వల్ల తప్పనిసరై చేర్చుకున్నారు. యుద్ధం ముగిసిపోయాక, 1922లో తిరిగి వారిని సైన్యంలో చేర్చుకోవడం ఆపేశారు. 1940లో అంబేద్కర్ చూపిన చొరవ వల్లనే తిరిగి మహర్‌లను సైన్యంలోకి తీసుకున్నారు. నాటి నుంచి నేటి వరకు భారత సైన్యంలో మహర్ రెజిమెంట్ కొనసాగుతోంది.
 
 కోరేగావ్ యుద్ధంలో అమరులైన వారికి గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం 1851లో అక్కడే స్తూపాన్ని నిర్మించింది. అదే స్తూపం వద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మొదటిసారిగా 1927లో జనవరి ఒకటిన సభను నిర్వహించి ఏటేటా సంస్మరణ జరిపే సంప్రదాయాన్ని ప్రారంభించారు.  కోరేగావ్ యుద్ధం పీష్వాల దుర్మార్గ పాలనను అంతం చేయడంతో మహారాష్ట్రలో ఒక చైతన్య స్రవంతికి అంకురార్పణ జరిగింది. అదే పుణేలో, 1827లో జన్మించిన జ్యోతిరావు పూలే ఆనాటి మహర్ సైనికుల విజయాన్ని పునాది చేసుకొని కుల వ్యతిరేక పోరాటాలను నిర్మాణాత్మకంగా కొనసాగిం చారు. ఆ స్ఫూర్తి వల్లనేనేమో అంటరాని కులాల బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పరచారు.
 
ఆ చైతన్య స్రవంతికి కొనసాగింపుగా అదే మట్టిలో పుట్టిన బాబా సాహెబ్ అంబేద్కర్ కృషితో అంటరానితనాన్ని చట్టపరంగా నిషేధించారు. అందువల్లనే మహర్ సైనికులు జనవరి 1, 1818లో సాధించిన అద్భుత విజయాన్ని గుర్తు చేసుకో వడం, వారికి నివాళి అర్పించడం సామాజిక సమానత్వాన్ని, న్యాయాన్ని కాంక్షించే వారందరి బాధ్యత.
  (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ నం: 9705566213)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement