koregaon
-
అమృతోత్సవ దీక్షకు ఫలితం?!
కోరేగావ్ దళిత మహాసభ ఉద్దేశాన్ని వక్రంగా చిత్రించి, ఆ సభకు హాజరైన కొందరు వామపక్ష›సభ్యులు పాలకుల్ని హత్య చేయడానికి కుట్ర పన్నారన్న మిషపైన దేశవ్యాప్తంగా కొందరు పౌర హక్కుల నాయకుల్ని నిష్కారణంగా అరెస్టులు చేసి వేధింపులకు గురిచేశారు. గూఢచర్య ‘పెగసస్’తో భారతదేశ పౌర సమాజంపై పాలక పక్షం విరుచుకుపడింది. ఆఖరికి చిన్న దేశమైన భూటాన్ కరెన్సీతో ఇండియా రూపాయి సమానమైంది. ఇలా గడిచిన ఏడాది ఎన్నో పరిణామాల్ని భారతీయ సమాజం చవిచూసింది. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ పాలకులు, పాలితులు మిగిలిన పాఠాలను స్మరించు కోవలసి ఉంది. గడిచిన 75 ఏళ్ల చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోవలసి ఉంది. భారత స్వాతంత్య్రానికి 75 ఏళ్లు నిండిన వేళ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ దేశ న్యాయ స్థానాలకూ, పాలక వర్గానికీ, పౌర సమాజానికీ బాధ్యతా యుతమైన కర్తవ్యాన్ని (30 డిసెంబర్ 2022) నిర్దేశించారు. రాబోయే రోజుల్లో దేశ న్యాయ వ్యవస్థలో మహిళలదే ప్రధాన పాత్ర కాబోతున్నదనీ, వలసవాద ఆలోచనా విధానాల నుంచి న్యాయ వ్యవస్థను రక్షించవలసిన సమయం వచ్చిందనీ అన్నారు. వ్యక్తులను అకారణంగా అరెస్టులు చేసి, జైళ్లలో పెట్టడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనంటూ పలువురు పౌరుల విడుదలకు మార్గాన్ని సుగమం చేశారు. కోరేగావ్ దళిత మహాసభ ఉద్దేశాన్ని వక్రంగా చిత్రించి, ఆ సభకు హాజరైన కొందరు వామపక్షాల సభ్యులు పాలకుల్ని హత్య చేయ డానికి కుట్ర పన్నారన్న మిషపైన దేశవ్యాప్తంగా కొందరు పౌర హక్కుల నాయకుల్ని నిష్కారణంగా అరెస్టులు చేసి వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. కోరేగావ్ దళితుల సభలో స్వయంగా పాల్గొన్న న్యాయమూర్తులు ఈ అరెస్టులను, వేధింపులను నిరసించినా పాల కుల కుట్రపూరిత వైఖరి కొనసాగుతూనే వచ్చింది. కాగా జస్టిస్ చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా పదవిని స్వీకరించిన తర్వాత ఈ వేధింపుల విషయంలో కూడా స్పష్టమైన వైఖరి తీసుకున్నారు. అరెస్టయినవాళ్లు జైళ్లలో నిరవధికంగా విచారణ లేకుండా మగ్గడాన్ని గమనించి, నిష్కారణ పరిణామానికి ఫుల్స్టాప్ పెట్టడానికి నిర్ణయిం చారు. విచారణను త్వరితం చేసి, డిటెన్యూల విడుదలకు క్రమంగా చర్యలు తీసుకోవడం హర్షించదగిన పరిణామం. ఫాదర్ స్టాన్ స్వామి అరెస్టు ఉదంతం పాలక వర్గాల అత్యంత నీచమైన చర్య. భారత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సేకరించానని ప్రకటించిన ‘సాక్ష్యం’ ఫాదర్ స్టాన్ స్వామి, తదితర నిందితుల కంప్యూటర్లలోకి పనిగట్టుకొని చొప్పించిన దొంగ సాక్ష్యాలే నని ప్రసిద్ధ అమెరికన్ డిజిటల్ ఫోరెన్సిక్ కంపెనీ ‘ఆర్సెనల్ కన్సల్టెన్సీ’ విడుదల చేసిన నివేదికలో (10 డిసెంబర్ 2021) పేర్కొంది. విచిత్రమేమంటే, ఏ ఇజ్రాయిల్ స్పైవేర్ ‘పెగసస్’ను భారత పాల కులు ఉపయోగించారో, దాని సంస్థతో ఎన్ఐఏ కూడా సంబంధాలు పెట్టుకుంది. అయితే సుప్రీంకోర్టు (27 అక్టోబర్ 2021) విచారణ కోసం ఒక సాంకేతిక సంఘాన్ని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి. రవీంద్రన్ అధ్యక్షులుగా ఉన్న ఈ కమి టీలో ప్రొఫెసర్ పి. ప్రభాకరన్, ప్రొఫెసర్ అశ్వన్ గుమస్తే సభ్యులుగా ఉన్నారు. నిందితుల ఫోన్లను ఇజ్రాయిల్ పెగసస్ స్పైవేర్ ట్యాంపర్ చేస్తున్న విషయం నిజమా? కాదా? అని తేల్చాలని ఈ కమిటీ ఎన్ఐఏను ఆదేశించింది. కానీ, ఇంతవరకూ ఆ విషయాన్ని ఎన్ఐఏ తేల్చకుండా దాటవేసిందని వార్తలు. ఈ ‘కప్పదాట్లు’ అంతటితో ఆగ లేదు. ‘పెగసస్’తో భారతదేశ పౌర సమాజంపై పాలక పక్షం విరుచుకుపడేంతవరకు కొనసాగుతూనే వచ్చింది. అంతేగాదు, కాంగ్రెస్ పాలకుల ‘బోఫోర్స్’ కొనుగోళ్ల వల్ల దేశం నష్టపోయింది రూ. 70 కోట్లు కాగా, బీజేపీ–ఆరెస్సెస్ పాలకుల రఫేల్ (ఫ్రెంచి) విమానాల కొనుగోళ్ల వల్ల దేశం కోల్పోయింది రూ. 70 వేల కోట్లని తేలినా నిగ్గతీయగల చైతన్యాన్ని ప్రతిపక్షాలూ కోల్పోయాయి. ఆ మాటకొస్తే, 2002లో గుజరాత్లో ఏమైంది? పాలకుల అధికారిక దౌర్జన్యాలను, ఆగడాలను ఎండగట్టి, వారు శిక్షార్హులేనని సుప్రీంకోర్టు ప్రత్యేక సలహాదారుగా విచారణకు నియమితులైన ‘ఎమి కస్ క్యూరీ’ ప్రసిద్ధ న్యాయవాది రాజు రామచంద్రన్ సమర్పించిన నివేదికను కూడా పాలకులు తొక్కిపట్టిన ఉదంతాన్ని దేశం మరచి పోలేదు. ఇన్ని రకాల దారుణాలకు, పాలక పక్షాలు ఒడిగట్టిన దేశంలో – స్వాతంత్య్ర దినోత్సవ అమృతోత్సవాలు ముగిసిన వేళలో పాల కులకు, పాలితులకు మిగిలిన గుణపాఠాన్ని స్మరించుకోవలసిన సమయమిది. దేశ స్వాతంత్య్రం కోసం సకల వ్యక్తిగత సౌకర్యాలను గడ్డిపోచగా భావించి ప్రాణాలు సహా సర్వస్వాన్ని త్యాగం చేసిన లక్షలాదిమంది దేశభక్తులను ఒక్కసారి తలచుకోవలసిన సమయం ఇదే. గడిచిన 75 ఏళ్ల పరిణామాల నుంచి గుణపాఠాలు తీసు కోవలసిన ఘడియ కూడా ఇదే! అంతేగాదు, ఈ 75 ఏళ్లలోనే క్రమంగా పత్రికా రంగంలో కూడా జాతీయ ప్రయోజనాల పరిరక్షణ స్పృహకన్నా కార్పొరేట్ ఇండియాలో భాగంగా కార్పొరేట్ మీడియా బలిసింది. పత్రికా రంగంలో ప్రయివేట్ రంగ ప్రయోజనాల ప్రాధాన్యం పెరిగింది. తద్వారా జర్నలిజం స్వరూప స్వభావాలనే అది తారుమారు చేస్తూ వచ్చింది. 1955 నాటికే వర్కింగ్ జర్నలిస్టుల, తదితర వార్తా పత్రికా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూ ప్రత్యేక చట్టమే వచ్చింది. ఫలితంగా ఇతర సంస్థలలో పనిచేసే వివిధ వృత్తిదారుల ప్రయోజ నాలను కూడా రక్షించే నిబంధనలు అందులో పొందు పర్చడం జరిగింది. ఇది లేబర్ కోర్టుల ద్వారా ఉద్యోగుల సమస్యల సామరస్య పరిష్కారానికి తోడ్పడింది. తొల్లింటి ప్రయివేట్ మీడియాను జైన్లు, బిర్లాలు, గోయెంకా లాంటి జూట్ వ్యాపారులు నిర్వహించగా, ఇప్పుడు ఆ స్థానాన్ని నడమంత్రపు ‘సిరి’ పారిశ్రామికవేత్తలు భర్తీ చేశారు. వీళ్లపైన భారత రాజ్యాంగ నిబంధనల ఆజమాయిషీ బొత్తిగా మృగ్యమై పోవడం కూడా కాంగ్రెస్, బీజేపీ–ఆరెస్సెస్ పాలనల ‘పుణ్యమే’. కాబట్టి ఈ సమీక్ష అనివార్యమవుతోంది. చివరికి మన కరెన్సీ కూడా ఈ 75 ఏళ్లలో ఏ స్థాయికి దిగజారి పోయిందో, ఆ దిగజారుడులో కాంగ్రెస్ పాలకులు కూడా భాగ స్వాములయినా ఒక ఆలోచనాపరురాలిగా, కాంగ్రెస్ వాదిగా భావికా కపూర్ నిర్మొహమాటంగా ఇలా వర్ణించారు: మన ప్రగతి ‘వేగం’ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే – ‘‘భూటాన్ కరెన్సీ ఇప్పుడు ఇండియా కరెన్సీతో సమానం. ఒక భూటానీస్ గుల్ట్రమ్ (కరెన్సీ) ఒక రూపాయితో సమానమైంది. భూటాన్ ఒక్కటే కాదు, అఫ్గానిస్తాన్ రూపాయి కూడా ఇండియా రూపాయితో సమానమై కూర్చుంది. అంటే, మనమిప్పుడు తాలిబన్ల రాజ్యానికి సమానమన్నమాట. వావ్ మోదీజీ.. వావ్!’’ (30 డిసెంబర్ 2022) ఏది ఏమైనా, 75 ఏళ్ల భారత అమృతోత్సవాలు ముగిసిన వేళలో ఒక మహాకవి, స్వతంత్ర భారత మానవుడిని తలచుకుని అతని నేటి దుఃస్థితికి స్పందించిన తీరును మరొక్కసారి గుర్తు చేసుకుందాం: ‘‘ఆ మానవమూర్తి ముఖం మీద ఎప్పుడూ ఉండే పసిపాప నవ్వులేదు! స్వతంత్ర భరతవర్ష వాస్తవ్యుడా మానవుడు అర్ధనగ్నంగా ఆకాశాన్నే కప్పుకొని నిండని కడుపుతో మండుతూన్న కళ్లతో ఇలా ఎంతకాలం ఇంకా నిలబడతాడా ప్రాణి? అందుకే అతణ్ణి జాగ్రత్తగా చూడండి స్వతంత్ర భారత పౌరుడు అతని బాధ్యత వహిస్తామని అందరూ హామీ ఇవ్వండి అతని యోగ క్షేమాలకు / అందరూ పూచీపడండి అతికించండి మళ్లీ / అతని ముఖానికి నవ్వు! స్వాతంత్య్రం ఒక చాలా సున్నితమైన పువ్వు,చాలా వాడైన కత్తి, విలువైన వజ్రం స్వాతంత్య్రం తెచ్చేవెన్నెన్నో బాధ్యతలు సామర్థ్యంతో నిర్వహిస్తామని / సంకల్పం చెప్పుకుందాం’’ ఇంతకీ మహాకవి ఆశించిన ఆ ‘సామర్థ్యం, సంకల్పం’ మనలో ఏది? అది మనలో కరువయింది కాబట్టే పాలకుల పాలనా సామ ర్థ్యాన్ని గత సుమారు రెండు దశాబ్దాలుగా బొడ్లో చేయివేసి ప్రశ్నిస్తున్న ‘ఏడీఆర్’(అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) నిరంతర నివే దికలు కూడా ‘బుట్టదాఖలు’ అవుతున్నాయి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
వరవరరావు బెయిల్‌ను వ్యతిరేకించిన ఎన్ఐఏ
ముంబై: విరసం కవి, ఉద్యమకారుడు వరవరరావు (81) బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని బాంబే హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వాదించింది. ప్రస్తుతం ఆయనకు మంచి వైద్య సహాయం అందుతోందని, జైలు అధికారులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయనకు సరైన వైద్యసేవలు అందిస్తారని, అందువల్ల ఆయన బెయిల్ పిటిషన్‌ను ఆమోదించవద్దని కోరింది. ఎల్గార్ పరిషద్– కోరేగావ్ భీమా కుట్ర కేసులో వరవరరావును అరెస్టు చేశారు. జైల్లో ఆయన ఆరోగ్యం దెబ్బతినడం, కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని వరవరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ అమ్జాద్ సయిద్ బెంచ్ ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా వరవరరావుకు బెయిల్ ఇవ్వవద్దని ఎన్ఐఏ న్యాయవాది అనిల్‌సింగ్ వాదించారు. ఈ సందర్భంగా వరవరరావు తరఫు న్యాయవాది సత్యనారాయణ..గతనెల 31న చివరిసారిగా ఆయన కుటుంబసభ్యులతో వీడియోకాల్‌లో మాట్లాడించారని తెలిపారు. దీంతో ఆయనతో కుటుంబసభ్యులను వీడియోకాల్‌లో మాట్లాడించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను 2వారాలు వాయిదా వేశారు. -
ఎన్ఐఏకు కోరెగావ్ కేసు
పుణే: 2018 కోరెగావ్–భీమా అల్లర్ల కేసు పుణే పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయింది. ఈ మేరకు తమకు కేంద్ర హోంశాఖ నుంచి శుక్రవారం సమాచారం వచ్చినట్లు మహారాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజయ్ తెలిపారు. 2018లో చెలరేగిన కోరెగావ్–భీమా అల్లర్ల కేసులో వామపక్ష నేతలు వరవరరావు, సుధీర్ ధావలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేశ్ రౌత్, షోమా సేన్, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గొన్సాల్వెస్, సుధా భరద్వాజ్‌లను అర్బన్ నక్సల్స్ పేరుతో అరెస్ట్ చేయడం తెల్సిందే. గత బీజేపీ ప్రభుత్వంలో కోరెగావ్–భీమాపై పెట్టిన కేసును తిరగదోడితే తమ బండారం బయటపడుతుందనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు. -
భీమ్-కోరెగావ్: నలుగురు దళితుల అరెస్ట్
పుణె : భీమా-కోరేగావ్‌లో చెలరేగిన అల్లర్ల కేసులో నలుగురు దళిత నాయకులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. భీమా-కోరేగావ్ యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా 200వ జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటున్న దళితులపై కోరేగావ్‌లో జనవరి 1న పెద్ద సంఖ్యలో హిందుత్వ కార్యకర్తలు, అగ్రవర్ణ కులాల వారు దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన మిలింద్ ఎక్‌బోతేను మే 14న పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరి కొంతమందిని ఈ ఘర్షణలకు కారణంగా చూపుతూ.. పోలీసులు నలుగురు దళిత నాయకులు సుధీర్ ధావాలే, లాయర్ సురేంద్రను, దళిత కార్యకర్త మోహన్ రౌత్, రోనా విల్సన్‌లను అరెస్టు చేశారు. కాగా, దళిత నాయకుడైన సుధీర్ ధావాలేను ముంబైలో, లాయర్ సురేంద్రను, దళిత కార్యకర్త మోహన్ రౌత్‌ను నాగ్‌పూర్‌లో, రోనా విల్సన్‌ను ఢిల్లీలో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. భీమ్ కోరేగావ్‌లో జరిగిన ఘర్షణలకు వీరు పంచిన కరపత్రాలు, వీరిచ్చిన ప్రసాంగాలే ఉసిగొల్పినట్టు పోలీసు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో ఒకడైన సుధీర్ ‘ఎల్గర్ పరిషత్’ సంస్థ నిర్వహకులలో ఒకరు. జనవరి 1న కారేగావ్‌లో జయంతి ఉత్సావాలు నిర్వహించింది ఎల్గర్ పరిషత్ సంస్థే. రోనా విల్సన్‌ను ఢిల్లీలో పుణె పోలీసుల ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం సహయంతో అరెస్టు చేసి పటియాల కోర్టు ఎదుట హాజరుపర్చి రెండు రోజుల రిమాండ్‌కు తరలించారు. ఇవి చదవండి : హిందుత్వ నినాదాలతో దాడి.. , కోరెగావ్ ఓ శౌర్య ప్రతీక -
పోరాట చైతన్య దీప్తి ‘కోరేగావ్’
ఏటా నూతన సంవత్సరం రోజున కోరేగావ్ వద్ద చేరే వేలాది ప్రజలందరిదీ ఒక్కటే మాట... ‘‘ఇది మాకు మరువలేని రోజు. ఆత్మగౌరవం కోసం, తెగనరికిన తలలను సైతం పెకైత్తుకొని తిరగడం కోసం మా తాతలు ఇక్కడ ప్రాణాలర్పించారు. మనిషిని పశువుకన్నా హీనంగా చూసే హేయమైన అంటరానితనాన్ని ప్రత్యక్షంగా అనుభవించి, సహించి... చివరకు తెగించి తిరగబడ్డ చరిత్రకు ఈ నదే సాక్ష్యం. పీష్వాల క్రూర పాలనను అంతం చేసి వారు మాకు మార్గనిర్దేశనం చేశారు. వారి త్యాగాలను గానం చేయడానికి, ఉద్యమ స్ఫూర్తిని రగుల్చుకోవడానికి ఇక్కడ కలుస్తుంటాం’’. జనవరి 1, 2015. ప్రపంచమంతా నూతన సంవత్సర సంబరాల్లో మునిగి తేలుతున్న సందర్భమిది. అయితే మహారాష్ట్రలోని పుణే సమీపాన ఉన్న భీమా నది ఒడ్డున నిటారుగా నింగికి ఎగసి, సగర్వంగా తలెత్తి నిలిచిన కోరేగావ్ స్మారక స్తూపం వద్ద వేలాది మంది గుమిగూడి నివాళులర్పిస్తుంటారు. ఒకటి సంబరమైతే, రెండవది సంస్మరణ. ప్రపంచ ప్రజలంతా అనిశ్చితమైన భవితపై ఎక్కడలేని ఆశలతో సంబరాలలో తేలుతుండగా... అక్కడ చేరిన వారు మాత్రం తమ చేతులతో తామే తాము కోరుకుంటున్న భవితను నిర్మించుకోగలిగే స్ఫూర్తిని పొందడం కోసం తపిస్తారు. జనవరి ఒకటిన భీమా నది ఒడ్డున నిలిస్తే మరో ప్రపంచంలోకి దారులు వేస్తున్నట్టుంటుంది. రాచరికపు అరాచకాలకు ఎదురొడ్డి, ప్రాణాలకు తెగించి పోరాడిన దళిత పోరాటాల చరిత్రకు, ప్రత్యేకించి సైనిక పోరాటాల చరిత్రకు కోరేగావ్ స్మారక స్తూపం మరుగున పడిపోకుండా మిగిలిన సజీవ సాక్ష్యం. ఏటా ఈ రోజున అక్కడ చేరిన ప్రజలలో విజయగర్వం తొణికిసలాడుతుంది. అందరి నోటా ఇంచుమించుగా ఇదే మాట వినవస్తుంది. ‘‘ఇది మాకు మరువలేని రోజు. ఆత్మ గౌరవం కోసం, తెగ నరికిన తలలను సైతం పెకైత్తుకొని తిరగడం కోసం మా తాతలు ఇక్కడ ప్రాణాలర్పిం చారు. మనిషిని పశువుకన్నా హీనంగా చూసే హేయమైన అంటరానితనాన్ని ప్రత్యక్షంగా అనుభవించి, సహించి... చివరకు తెగించి తిరగబడ్డ చరిత్రకు ఈ నదే సాక్ష్యం. పీష్వాల క్రూర పాలనను అంతం చేసి వారు మాకు మార్గనిర్దేశనం చేశారు. ఆ యుద్ధంలో ప్రాణాలర్పించిన వారిని సంస్మరిస్తూనే ఇక్కడ విజయ స్తూపాన్ని నిర్మించుకున్నాం. వారి త్యాగాలను గానం చేయడానికి, ఎప్పటి కప్పుడు మాలో ఉద్యమ స్ఫూర్తిని రగుల్చుకోవడానికి ఇక్కడ కలుస్తుంటాం’’. పీష్వాల పీచ మణచిన దళిత సేన బ్రిటిష్ వర్తకులు ఈస్టిండియా కంపెనీని స్థాపించి, భారతదేశాన్ని రాజకీయంగా గెలుచుకోవడానికి అనేక యుద్ధాలు చేశారు. అందులో భీమా నది వద్ద పీష్వాలను ఓడించిన రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం ప్రముఖమైనది. ఈ యుద్ధం, అత్యంత క్రూరమైన కుల అణచివేత సాగించిన పీష్వాల రాజ్యం అంతం కావడానికి, బ్రిటిష్ పాలన నెలకొనడానికి ఎంతో ఉపకరించింది. ఒక సామ్రాజ్యవాదశక్తికీ, కుల వివక్ష తలకెక్కిన నిరంకుశ రాచరికానికి మధ్య జరిగిన యుద్ధంలో దళితులు బ్రిటిష్ సైన్యం పక్షాన నిలిచినది అత్యంత హేయమైన అంటరానితనాన్ని రుద్దిన పాలనను అంతం చేయడం కోసమే. అందుకే అది దళిత పోరాటాల చరిత్రలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఇతర యుద్ధాలకు ఇది చాలా భిన్నమైనది. అసలు ఈ యుద్ధం జరిగిన తీరే అద్భుతం. 1817 నవంబర్‌లో పీష్వా సైన్యం పుణేలోని బ్రిటిష్ రెసిడెన్సీని ఆక్రమించడంతో కంగుతిన్న బ్రిటిష్ సైన్యం బొంబాయిలోని తన ఫస్ట్ రెజిమెంట్ రెండవ బెటాలియన్‌ను పంపి పీష్వాలకు బుద్ధి చెప్పాలనుకుంది. కెప్టెన్ స్వంటన్ నేతృత్వంలో అయిదు వందల మంది సైనికులను, 250 మందితో కూడిన అశ్విక దళాలను పంపారు. కానీ పీష్వాలకు 20 వేల సైనికులు, 8 వేల అశ్విక దళం ఉంది. పీష్వాల బలాధిక్యతకు బ్రిటిష్ వారి తరఫున రంగంలోకి దిగిన సైనికులు జంకలేదు. 1818, జవవరి 1న కోరేగావ్ దగ్గర జరిగిన ఈ యుద్ధంలో... ఒక రోజంతా అన్నం, నీళ్లు లేకుండానే యుద్ధానికి దిగిన 750 మంది సైనికులు దాదాపు 28 వేల పీష్వా సైన్యంతో తలపడ్డారు. ఉదయం నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ యుద్ధం సాగింది. పీష్వాల వేలకు వేల సైన్యాన్ని స్వంటన్ నేతృత్వంలో నిలిచిన కొన్ని వందల మంది సైనికులు మట్టి కరిపించారు. 1707 నుంచి 1818 వరకు సాగిన పీష్వాల దుర్మార్గ పాలనకు ముగింపు పలికారు. అయితే ఆ యుద్ధంలో బ్రిటిష్ సేనగా పోరాడిన సైనికులు బ్రిటిష్ వాళ్లు కారు, అంటరాని కులంగా చూసే మహర్లు. ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఈ విజయం దళిత సేన సాధించిన విజయం. అణచివేత నుండి వచ్చిన తెగింపు ఈ అపూర్వ విజయం వెనుక మరో కోణం దాగి ఉంది. మహర్లు చాలా కాలంగా సైనిక వారసత్వం కలిగి, సైనికులుగా పనిచేసిన వాళ్లు. ముస్లింల దండయాత్రలను ప్రతిఘటించిన శివాజీ కాలంలోనే మహర్లను సైనికులుగా నియమించడం ప్రారంభమైంది. తద్వారా శివాజీ మహర్లకు సముచిత స్థానాన్ని కల్పించాడు. 1707లో పీష్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని సైన్యం నుంచి తొలగించారు. అంతేగాక అత్యంత దుర్మార్గమైన పద్ధతుల్లో, నీచమైన పద్ధతుల్లో అంటరానితనాన్ని పాటించారు. అంటరాని కులాలైన మహర్, మాంగ్, మాచంగ్లు గ్రామాల్లోకి రాకూడదు. ఉదయం, సాయంత్రాలైతే అసలే రాకూడదు. ఆ సమయాల్లో సూర్యుడు ఏటవాలుగా ఉంటాడు కాబట్టి వాళ్ల నీడలు పొడవుగా ఉంటాయి. అంటరాని వాళ్ల నీడలు సైతం అగ్ర కులాలను తాకరాదు అని ఆ నిషేధం విధించారు. మధ్యాహ్నం సూర్యుడు నట్టనడినెత్తిన ఉండే సమయంలో మాత్రమే వాళ్లు ఊళ్లోకి రావచ్చు. అది కూడా వారి అడుగులను వారే చెరిపేసుకునేలా నడుము వెనక చీపురు కట్టుకొని, ఉమ్మినా బయట పడకుండా ఉండేందుకు మూతికి ముంత కట్టుకొని రావాలి. పొరపాటున పీష్వాల వ్యాయామశాలల ముందు నుంచి పోతే మహర్, మాతంగ్‌ల తలలను నరికి, కత్తులతో బంతి ఆట ఆడేవారు. ఇంత క్రూర పాలనను అనుభవించారు కనుకనే మహర్ సైనికులు చావో రేవో తేల్చుకోవాలనుకున్నారు. బ్రిటిష్ సైన్యంలో చేరి పీష్వాల పీచమణచడానికే ప్రాణాలను లెక్కచేయక పోరాడారు. పీష్వాల క్రూర అణచివేత నుంచే వారిలో ఆ కసి, పట్టుదల పుట్టుకొచ్చాయి. లేకపోతే గుప్పెడు మంది వహర్లు వేల కొలది పీష్వా సైన్యాన్ని మట్టుబెట్టడం సాధ్యమయ్యేదే కాదు. నీచమైన బతుకు కన్నా యుద్ధరంగంలో చావడమే గౌరవమని వాళ్లు భావించారు. కనుకనే విజయం వారి సొంతం అయింది. అమెరికా మానవ హక్కుల నాయకుడు, వర్జీనియా విముక్తి కోసం పోరాడిన యోధుడు పాట్రిక్ హెన్రీ మాటలు ఇక్కడ చక్కగా వర్తిస్తాయి. ‘‘మనం విముక్తి పొందాలంటే పోరాటం తప్పనిసరి. నా వరకైతే విముక్తి పొందడమో, వీర మరణమో కావాలి’’. కోరేగావ్ యుద్ధంలో మహర్లు సరిగ్గా అలాగే అంటరానితనం సంకెళ్లను తెంచుకోవడానికి ప్రాణ త్యాగాలకు సిద్ధమయ్యారు, విజయం సాధించారు. కోరేగావ్ రగిల్చిన పోరాట స్ఫూర్తి 1819లో జరిగిన బ్రిటిష్ పార్లమెంట్ సమావేశాల్లో మహర్ సైనికుల వీరోచిత పోరాటం ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. ఆ తర్వాత మహర్ రెజిమెంట్ సైనికులు మూడు, నాలుగు యుద్ధాల్లో పాల్గొన్నారు. 1857 మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో భారతీయ సైనికులందరిలాగే మహర్లు కూడా తిరుగుబాటు చేశారు. ఆ తదుపరి బ్రిటిష్ వారు అన్ని కులాలవారిని తిరిగి సైన్యంలో చేర్చుకున్నారు. కానీ 1892 నుంచి మహర్లను సైన్యంలోకి తీసుకోవడం ఆపేశారు. మహర్లను సైన్యంలోకి చేర్చుకోవాలంటూ 1894లో గోపాల్ బాబా వాలంగ్కర్ నాయకత్వంలో మరో ఉద్యమం ప్రారంభమైంది. కానీ ఆధిపత్య కులాల మాటలు నమ్మి బ్రిటిష్‌వారు మహర్లను సైన్యంలోకి తీసుకోవడానికి నిరాకరించారు. శివ్రామ్ కాంబ్లే అనే మరొక నాయకుడు కూడా ఈ సమస్యపై నిరంతర పోరాటం చేశారు. ఆయన అంటరాని కులాల కోసం పాఠశాలలు నిర్వహించేవారు. కాంబ్లే 1910లో 50 గ్రామాల మహర్లను సమీకరించి మహర్ సైనికుల సమస్యలను ప్రధాన ఎజెండాగా చర్చించారు. ఆ తదుపరి పదే పదే విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. చివరికి 1917లో మహర్లను తిరిగి సైన్యంలోకి తీసుకోవడం మొదలైంది. అదీ మొదటి ప్రపంచ యుద్ధ సమయం కావడం వల్ల తప్పనిసరై చేర్చుకున్నారు. యుద్ధం ముగిసిపోయాక, 1922లో తిరిగి వారిని సైన్యంలో చేర్చుకోవడం ఆపేశారు. 1940లో అంబేద్కర్ చూపిన చొరవ వల్లనే తిరిగి మహర్లను సైన్యంలోకి తీసుకున్నారు. నాటి నుంచి నేటి వరకు భారత సైన్యంలో మహర్ రెజిమెంట్ కొనసాగుతోంది. కోరేగావ్ యుద్ధంలో అమరులైన వారికి గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం 1851లో అక్కడే స్తూపాన్ని నిర్మించింది. అదే స్తూపం వద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మొదటిసారిగా 1927లో జనవరి ఒకటిన సభను నిర్వహించి ఏటేటా సంస్మరణ జరిపే సంప్రదాయాన్ని ప్రారంభించారు. కోరేగావ్ యుద్ధం పీష్వాల దుర్మార్గ పాలనను అంతం చేయడంతో మహారాష్ట్రలో ఒక చైతన్య స్రవంతికి అంకురార్పణ జరిగింది. అదే పుణేలో, 1827లో జన్మించిన జ్యోతిరావు పూలే ఆనాటి మహర్ సైనికుల విజయాన్ని పునాది చేసుకొని కుల వ్యతిరేక పోరాటాలను నిర్మాణాత్మకంగా కొనసాగిం చారు. ఆ స్ఫూర్తి వల్లనేనేమో అంటరాని కులాల బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పరచారు. ఆ చైతన్య స్రవంతికి కొనసాగింపుగా అదే మట్టిలో పుట్టిన బాబా సాహెబ్ అంబేద్కర్ కృషితో అంటరానితనాన్ని చట్టపరంగా నిషేధించారు. అందువల్లనే మహర్ సైనికులు జనవరి 1, 1818లో సాధించిన అద్భుత విజయాన్ని గుర్తు చేసుకో వడం, వారికి నివాళి అర్పించడం సామాజిక సమానత్వాన్ని, న్యాయాన్ని కాంక్షించే వారందరి బాధ్యత. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ నం: 9705566213)