ఇలాగైతే ఎలా పాసవుతారు..!
భీమిని, న్యూస్‌లైన్ : బోధన తీరు ఇలా ఉంటే విద్యార్థులు ఎలా పాస్ అవుతారని ఉపాధ్యాయుల వైఖరిపై జిల్లా విద్యాధికారి అక్రముల్లాఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇద్దరు ఉపాధ్యాయులు సెలవులో ఉండగా విధులకు హాజరైన ఉపాధ్యాయులు శ్రీనివాస్, ప్రణీతలు సిలబస్ పూర్తి చేయకపోవడంపై డీఈవో మండిపడ్డారు.
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఈ నెలాఖరులోగా పాఠ్యంశాలు పూర్తి చేయాలని సూచించారు. ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు ప్రమోద్ రెండు రోజుల నుంచి పాఠశాలకు రాకపోవడంతో అతడి రెండు రోజుల వేతనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పదో తరగతి విద్యార్థులను ప్రశ్నలు అడగగా వారు సరైన సమాధానం చెప్పకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల పనితీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.
పాఠశాల ఆవరణలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో ఆర్వీఎం అధికారులతో మాట్లాడి పనులు వెంటనే పునఃప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మార్సీలోని రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఇన్చార్జి ఎంఈవో శంకర్ ఉన్నారు.