ఇరకాటంలో ముత్తంశెట్టి
భీమునిపట్నం ఎమ్మెల్యే ముత్తంశెట్టి వ్యూహం బెడిసికొట్టేలా కనిపిస్తోంది. టీడీపీ నాయకుల నుంచి వ్యతిరేకత.. కాంగ్రెస్ వర్గం నుంచి మద్దతు లభించకపోవడంతో ఇప్పుడు ఆయన ఇరకాటంలో పడ్డారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఉంటే డిపాజిట్లు కూడా దక్కవనే ఆందోళనతో టీడీపీలో చేరేందుకు నిర్ణయించారు.
టీడీపీ ఓటు బ్యాంక్‌తో పాటు తన వెంట ఉన్న కాంగ్రెస్ నాయకుల అండతో ఈసారి గట్టెక్కవచ్చని భావించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్, టీడీపీ నాయకుల్లో రగిలిన అసమ్మతి సెగ వల్ల అతి కష్టం మీద విజయం సాధించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ క్యాడర్ అంతా ఆయన వెంట నడిచింది. ఇప్పుడు ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం కావడాన్ని క్యాడర్ జీర్ణించుకోలేపోతోంది. కాంగ్రెస్‌లో పెద్దగా గుర్తింపులేని నాయకులు తప్ప జోన్, మండలానికి చెందిన ముఖ్య నాయకులెవరూ టీడీపీలోకి వెళ్లడానికి గాని, ముత్తంశెట్టికి మద్దతు ఇవ్వడానికి గాని సిద్ధంగా లేరని తెలుస్తోంది.
టీడీపీ నాయకుల విషయానికి వస్తే పార్టీలో ఎమ్మెల్యే చేరకముందే భీమిలి నుంచి పోటీ చేస్తానని ప్రకటించుకోవడంపై మాజీ మంత్రి అప్పల నర్సింహరాజుతో పాటు నియోజకవర్గ నాయకులంతా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాము ఎప్పటినుంచో పార్టీకి అంటిపెట్టుకుని ఉన్నామని, నియోజకవర్గ పరిధిలో స్థానికంగా ఉండే నాయకుల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.
వైఎస్సార్ సీపీ వైపు కాంగ్రెస్ శ్రేణుల చూపు..
నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్నాయి. ఎమ్మెల్యే ముత్తంశెట్టి టీడీపీలో చేరితే తామంతా వైఎస్సార్ సీపీలోకి వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ముఖ్య నాయకులంతా ఈ విషయమై చర్చించుకున్నారని తెలిసింది.