‘వేగం’ తగ్గిన... ఫోర్వే..!
అత్యంత కీలకమైన పనిగా భావిస్తున్న భూత్పూర్ - మహబూబ్ నగర్ రోడ్డు విస్తరణ పనులు అడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు చందాన సాగుతోంది. విస్తరణ వేగమందక అవస్థలు పెరుగుతున్నాయి. రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. మలుపుల వద్ద ప్రణాళిక లేకుండా పనులు చేయడంతో ప్రమాదాల బెడద పొంచి ఉంటుందన్న ఆరోపణలున్నాయి.
మహబూబ్‌నగర్ వ్యవసాయం : ప్రయాణికుల కష్టాలు తీర్చుతుందని భావిస్తున్న భూత్పూర్-మహబూబ్‌నగర్ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న అధికారులు అసలు ఇబ్బందులను గుర్తించి పరిష్కరించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. సింగిల్ రోడ్డుగా ఉన్న ఈ మార్గాన్ని రూ. 31 కోట్లతో విస్తరించేందుకు గత ప్రభుత్వం హయాంలోనే నిధులు మంజూరై పనులు ప్రారంభమయ్యాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండర్లు పూర్తైమార్చి నెల నుండి కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టారు. ఇప్పటికే రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల తొలగింపు పూర్తయింది.సివిల్ పనులను ముగ్గురు కాంట్రాక్టర్లు దక్కించుకోగా అందులో ఇద్దరు పనులు చేపడుతున్నారు. బాలాజీనగర్ స్టేజీ నుండి అమిస్తాపూర్ శివారులోని సాక్షి గణపతి దేవాలయం వరకు పనులు జరుగుతున్నాయి.అక్కడి నుండి భూత్పూర్ చౌరస్తా వరకు ఇంకా పనులు మొదలు కావాల్సి ఉంది. మరోవైపు కల్వర్టులను నిర్మించే పనికూడా సాగుతోంది.
మలుపులతోనే అసలు బెడద..
ఈ పనులను చేపడుతున్న కాంట్రాక్టర్లు ప్రస్తుతం ఇబ్బందికరంగా ఉన్న మలుపులను సరిచేయకుండానే విస్తరణ సాగిస్తుండడంతో అది ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. ఈ మార్గంలో దాదాపు 8కిపైగా మలుపులు ఉన్నాయి. వాటిలో నాలుగు అతి ప్రమాదకరమైనవి. ఆయా చోట్ల గతంలో భారీ ప్రమాదాలు చోటు చేసుకొని పలువురు మృత్యువాత పడిన సంఘటనలూ ఉన్నాయి. ఇలా బాలాజీనగర్ స్టేజీ, గోమతి ధాబా, అక్కడికి సమీపంలోని మరో మలుపు, పాలకొండ వంతెన, అమిస్తాపూర్ శివారులోని సాక్షి గణపతి దేవాలయం దగ్గర ఉన్న బ్రిడ్జి వద్ద , అమిస్తాపూర్ నుండి భూత్పూర్ మార్గంలో గ్రామ శివారున ఉన్న మలుపులు అతి ప్రమాద కరమైనవిగా భావిస్తుంటారు. వీటిని తక్షణం సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా ఈ రోడ్డుపై ఉన్న రెండు వంతెనల పనులకు టెండర్లు పూర్తికాకపోవడంతో విస్తరణపై ప్రభావం చూపనుంది.పాలకొండ స్టేజీ ,అమిస్తాపూర్ గ్రామం వద్ద ఉన్న వంతెనల వెడల్పు చేసేందుకు ఇంకా టెండర్లు ఇంకా చేపట్టలేదు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి ఇంకా నెలరోజులు పట్టే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
దుమ్ము కొడుతున్నారు...
రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా వేసిన డెబ్రిస్‌పై వెను వెంటనే నీరు చల్లక పోవడంతో .వాటిపై సమయానుకూలంగా నీరు చల్లకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇక ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంటోంది. దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది.
విద్యుత్తు స్తంభాలూ తొలగించలేదు...
ఈ రోడ్డుకు ఇరువైపుల ఉన్న విద్యుత్ స్తంబాలు రోడ్డు విస్తరణ పనులకు అడ్డంకిగా మారాయి.వీటికి టెండర్లు పూర్తయినా ఇప్పటి వరకు సంబంధిత కాంట్రాక్టర్లు పనులను మొదలు పెట్టడం లేదు.ఇవీ పనుల ఆలస్యానికి ఓ కారణంగా చెప్పవచ్చు.
డిసెంబర్‌కల్లా పూర్తిచేస్తాం...
రాష్ట్ర విభజన నేపథ్యంలో బ్రిడ్జి టెండర్లకు కొంత జాప్యం ఏర్పడింది.కొన్ని రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. విద్యుత్ స్తంభాలకు టెండర్లు పూర్తయినా పనులు మొదలు కాలేదు.రోడ్డుకు కుడివైపున పైపులైను ఉండడంతో మలుపుల వద్ద సరిచేయడం కుదరడం లేదు.సాధ్యమైనంత వరకు మలుపుల వద్ద సరిచేసేందుకు కృషి చేస్తాం.ఈ ఏడాది డిసెంబర్ నెల చివరికల్లా పనులు పూర్తిచేసే అవకాశం ఉంది.
- సంధ్య, ఏఈఆర్ అండ్ బీ మహబూబ్‌నగర్