big movies
-
ఓటీటీకే ఓటు
థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అనిశ్చితిలో దక్షిణాదిన ఓటీటీ బాట పట్టిన తొలి సినిమా సూర్య నిర్మించిన ‘పొన్ మగళ్ వందాళ్’. జ్యోతిక లీడ్ రోల్లో నటించారు. ఈ నిర్ణయం వల్ల తమిళ డిస్ట్రిబ్యూటర్స్ సంఘం నుంచి సూర్యకు బెదిరింపులు ఎదురయ్యాయి. ఇకపై సూర్య నటించే సినిమాలను థియేటర్స్‌లో ప్రదర్శించమన్నారు. ఇది జరిగి ఆల్రెడీ మూడు నెలలయింది. కానీ ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు ఓటీటీలో విడుదలకు రెడీ కావడంతో పంపిణీదారుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదనే చెప్పాలి. మీడియమ్ బడ్జెట్ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఇప్పుడు పెద్ద బడ్జెట్ చిత్రాలు కూడా రాబోతున్నాయి. థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారు? తెరిస్తే ప్రేక్షకులు థియేటర్స్ వరకూ వస్తారా? రారా అన్నది ఇంకా ప్రశ్నార్థకమే. అందుకే సూర్య మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నటించిన పెద్ద బడ్జెట్ సినిమా ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’) చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సూర్య బాటలోనే పలువురు తమిళ స్టార్ హీరోలు తమ సినిమాలు కూడా ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నారని టాక్. విజయ్ నటించిన ‘మాస్టర్’, విశాల్ నటించిన ‘చక్ర’, ధనుష్ ‘జగమే తందిరం’, ‘జయం’ రవి ‘భూమి’ కూడా ఓటీ టీలో విడుదలవుతాయని టాక్. ఈ చిత్రాల వివరాలు చూద్దాం. మాస్టర్ తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన తాజా చిత్రం ‘మాస్టర్’. లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. ఈ సినిమాలో కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలో నటించారు విజయ్. ఆ మధ్య ‘మాస్టర్’ ఓటీటీలో వస్తోందనే వార్తలను ఈ చిత్రనిర్మాత గ్జేవియర్ బ్రిట్టో కొట్టిపారేశారు. ‘మాస్టర్’ కచ్చితంగా థియేటర్స్‌లోనే వస్తాడని స్పష్టం చేశారు. కానీ ఈ సినిమా ఓటీటీలోనే విడుదల కానుందనే వార్త మరోసారి ప్రచారంలోకి వచ్చింది. మరి.. ‘మాస్టర్’ ప్లాన్ ఏంటో చూడాలి. జగమే తందిరం ధనుష్ హీరోగా నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘జగమే తందిరం’. తెలుగులో ‘జగమే తంత్రం’గా విడుదల కానుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. యస్. శశికాంత్ నిర్మాత. ఈ చిత్రం మే 1న విడుదల కావాలి. అయితే కరోనా వల్ల వాయిదా పడింది. మీకు ఇబ్బంది అయితే ఓటీటీలో అయినా విడుదల చేసుకోండి అని ధనుష్ తన నిర్మాతలకు చెప్పినట్టు చిత్రబృందం ఆ మధ్య తెలిపింది. భూమి ‘జయం’ రవి, నిధీ అగర్వాల్ నటించిన చిత్రం ‘భూమి’. రైతుల సమస్యల కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం కూడా మే 1న విడుదల కావాలి. కానీ వాయిదా సూరరై పోట్రు సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’గా విడుదలవుతుంది. పైలట్ కావాలని కలలుకనే వ్యక్తిగా సూర్య కనిపించనున్నారు. ఆయన గురువుగా మోహన్‌బాబు నటించారు. సూర్య సొంత బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాను అమేజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు సూర్య. ‘‘సినిమాను ప్రేక్షకుల వద్దకు సరైన సమయంలో తీసుకెళ్లడం నిర్మాత పని. ఈ నిర్ణయాన్ని నటుడిగా కాదు.. నిర్మాతగా తీసుకున్నాను. మళ్లీ థియేటర్స్ ప్రారంభం అయి అందరూ సంతోషంగా థియేటర్స్‌కి వెళ్లే సమయానికి మరో సినిమాతో సినిమా హాళ్లలో వినోదం అందిస్తాను’’ అన్నారు సూర్య. అలాగే కోవిడ్ కోసం కష్టపడుతున్న వారికి 5 కోట్లు విరాళాన్ని (ఈ చిత్రం రిలీజ్ ఖర్చులలో నుంచి) కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. అక్టోబర్ 30 నుంచి ఈ సినిమా ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. చక్ర విశాల్ హీరోగా నటించి, నిర్మించిన యాక్షన్ చిత్రం ‘చక్ర’. శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కథానాయికలు. ఆన్లైన్ మోసాల నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుంది. యంయస్ ఆనందన్ దర్శకుడు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల విడుదలయిన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం కూడా ఓటీటీలోనే రిలీజ్ అని సమాచారం. థియేటర్స్ ఓపెన్ అయ్యేవరకూ వేచి చూడటం కన్నా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఓటీటీయే బెస్ట్ అనే ఆలోచనతో ఓటీటీకే స్టార్స్ ఓటు వేస్తున్నారని ఊహించవచ్చు. నిర్మాతకు లాభసాటిగా ఉంటే ఓటీటీయే బెస్ట్ అని అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. మళ్లీ థియేటర్స్‌కి వెళ్లడం సాధారణం అయ్యాక సినిమాలను ఎప్పటిలానే నేరుగా థియేటర్స్‌లోనే విడుదల చేస్తారు. ఎందుకంటే ‘బిగ్ స్క్రీన్’లో సినిమా చూస్తే ఆ అనుభూతే వేరు. ఇది మొత్తం సినిమా పరిశ్రమ అంటున్న మాట. -
సంక్రాంతికి సినిమాల సందడి
తమిళులు పొంగల్‌గా జరుపుకునే ముఖ్య పండగ సంక్రాంతి. దీన్ని సినీ వర్గాల పండగగా కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజున పలు భారీ చిత్రాలు విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధమవుతారు. అలా ఈ ఎడాది నాలుగు చిత్రాలు పొంగల్‌కు సిద్ధమవుతున్నాయి. వాటిలో కథాకళి, గెత్తు,రజనీమురుగన్, తారైతప్పట్టై చోటు చేసుకున్నాయి. ఇక వాటి వివరాలు చూస్తే నటుడు విశాల్ కథానాయకుడుగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం కథాకళి. క్యాథరిన్ ట్రెసా నాయకిగా నటించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. ఇది పూర్తి కమర్షియల్ ఎంటర్టెయిన్మెంట్తో రూపొందిన చిత్రం అంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. దీన్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ విడుదల చేయనుంది. జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత బాలా దర్శకత్వం వహిస్తున్న చిత్రం తారైతప్పట్టై. శశికుమార్ హీరోగా నటిస్తూ తన కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. నటి వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్గా నటించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఇది ఆయనకు వెయ్యొవ చిత్రం కావడం విశేషం. తమిళనాట ప్రసిద్ధి గాంచిన గరగాట్టం నృత్యం ఇతి వృత్తంగా తెరకెక్కిన చిత్రం తారైతప్పట్టై. దీనికి దర్శకుడు బాలా బి.స్టూడియోస్, ఐన్గరన్ ఇంటర్నేషనల్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థలు నిర్మాణంలో భాగస్వామిగా ఉండడం విశేషం. మూడో చిత్రం గెత్తు. యువ నటుడు ఉదయనిధి స్టాలిన్ తన రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గెత్తు. ఇందులో ఎమిజాక్సన్ హీరోయిన్. ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రం ద్వారా తొలిసారిగా యాక్షన్ హీరోగా అవతారమెత్తారు. తిరుకుమరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పొంగల్ రేస్‌లో ఉంది. ఇక నాల్గవ చిత్రం రజనీమురుగన్. శివకార్తీకేయన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కీర్తీసురేశ్ హీరోయిన్. పొన్రామ్ దర్శకుడు. దర్శకుడు లింగసామి సమర్పణలో తిరుపతి బ్రదర్స్ ఫిలిం మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుభాష్ చంద్రబోస్ నిర్మించారు. డీ. ఇమాన్ బాణీలు కట్టిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుని చాలా కాలమైంది. పలు సమస్యలను ఎదుర్కొని, పలుమార్లు విడుదల తేదీలు వాయిదాపడ్డా ఎట్టకేలకు పొంగల్‌కు తెరపైకి రానుంది. విశేషం ఏమిటంటే ఈ ఏడాది తొలిరోజే ఎనిమిది చిత్రాలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ నాలుగు చిత్రాలకు ముందే 8వ తేదీన కైల పూ మాలై చిన్న చిత్రాలు విడుదల కానున్నాయి. వీటిలో ఏ చిత్రం కాసుల వర్షం కురిపించి విజయం అనిపించుకుంటాయో వేచి చూడాలి. -
దీపావళి బరిలో కమల్‌తో ఢీకుంటున్న అజిత్
దీపావళి బరిలో విశ్వనాయకుడు కమలహాసన్‌తో అజిత్ ఢీకుంటున్నారు. పెద్ద పండగలు వస్తున్నాయంటే చిత్ర పరిశ్రమలో సందడి వాతావరణం, సినీ అభిమానుల్లో ఆనందాలు నెలకొంటాయి. అయితే దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పండగల సందర్భాల్లోనే భారీ చిత్రాలు విడుదల చేయాలన్న నిర్మాతల మండలి నిబంధన అమలులో ఉంది. కాగా ఈ దీపావళికి రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో ఒకటి కమలహాసన్ నటించిన తూంగావనం కాగా రెండోది అజిత్ నటించిన వేదాళం. దీంతో కమల్, అజిత్ మధ్య పోటీ అనివార్యమయ్యింది. తూంగావనం.. పాపనాశం వంటి విజయవంతమైన చిత్రం తరువాత విశ్వనాయకుడు కమలహాసన్ నటించి, తన రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన చిత్రం తూంగావనం. ఇది ఏక కాలంలో తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ద్విభాషా చిత్రం. తెలుగులో చీకటిరాజ్యం పేరుతో విడుదల కానుంది. ఇందులో కమలహాసన్ సరసన నటి త్రిష నాయకిగా నటించారు. ప్రకాశ్‌రాజ్, కిషోర్, ఆశాచరణ్ తదితరులు ముఖ్యపాత్రల్ని పోషించిన ఈ చిత్రానికి కమలహాసన్ శిష్యుడు రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వం వహించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం పాటలు, టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. వేదాళం.. ఎన్నైఅరిందాల్ వంటి హిట్ చిత్రం తర్వాత అజిత్ నటించిన భారీ చిత్రం బేదాళం. ఈయనతో ఇంతకుముందు ఆరంభం, ఎన్నైఅరిందాల్ చిత్రాలను నిర్మించిన శ్రీసాయి రామ్ ఫిలింస్ అధినేత ఏఎం.రత్నం నిర్మించిన మరో భారీ చిత్రం ఇది. అదే విధంగా ఇంతకు ముందు అజిత్‌తో వీరం వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన శివ తెరకెక్కించిన చిత్రం బేదాళం. ఇందలో శ్రుతీహాసన్ హీరోయిన్. అజిత్‌కు చెల్లెలుగా నటి లక్ష్మీమీనన్ ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రం కుటుంబ నేపథ్యంలో సాగే కమర్షియల్ కథా చిత్రంగా రానుంది. విశేషం ఏమిటంటే ఈ దీపావళికి తండ్రీకూతుళ్ల చిత్రాలు పోటీ పడుతున్నాయన్న మాట. మరి ఈ రెండింటిలో ఏది ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో, ఏ స్థాయిలో వసూళ్లు సాధిస్తాయో వేచి చూడాల్సిందే.