మత్తు ‘చిత్రం’లో మిస్సింగ్ పాత్రలు
- ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి చేసి తప్పించుకున్న కొందరు
- బడా నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, నిర్మాతల తనయులు కూడా..
- కెల్విన్, జీశాన్‌ల కాల్‌డేటా విశ్లేషణలో వెల్లడి
- డ్రైవర్లు, మేనేజర్లు, మేకప్మెన్ల ఫోన్ నంబర్ల నుంచి డ్రగ్స్ కోసం ఆర్డర్లు.. వారి పేర్లూ చూచాయగా వెల్లడి
డ్రగ్స్ వ్యవహారంలో లింక్ ఉన్న సినీ ప్రముఖుల సంఖ్య - 27
సిట్ నోటీసులు జారీ అయిన వారి సంఖ్య - 12
వివరాలు బయటకు రానివారి సంఖ్య - 15
సాక్షి, హైదరాబాద్
డ్రగ్స్ వ్యవహారం సినీ పరిశ్రమను కుదిపేస్తోంది.. ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నటులు సహా మొత్తంగా 27 మందికి డ్రగ్స్ వ్యవహారంతో లింకు ఉన్నట్లు వెల్లడైంది. కానీ వారిలో 12 మందికి మాత్రమే ఎక్సైజ్ సిట్ అధికారుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. వారి పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. మిగతా 15 మందికి సంబంధించిన వివరాలేమీ బయటకు రాకపోవడంపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ 15 మంది కూడా ప్రముఖ నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు అని... వారు తమకున్న పలుకుబడితో ప్రభుత్వ పెద్దల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చి, పేర్లు బయటికి రాకుండా చూసుకున్నారని సమాచారం. అయితే ఎక్సైజ్ వర్గాలు మాత్రం ఆ మరో 15 మంది సినీ ప్రముఖులు ఎవరనేది చూచాయగా వెల్లడిస్తున్నాయి.
కెల్విన్, జీశాన్‌ల కాల్‌డేటాతో..
డ్రగ్స్ వ్యవహారంలో కీలకమైన కెల్విన్, జీశాన్‌ల ఫోన్ కాల్‌డేటాను విశ్లేషించిన ఎక్సైజ్ సిట్ అధికారులు.. ఎన్నో ఆశ్చర్యకర విషయాలను గుర్తించారు. కెల్విన్‌కు చెందిన 4 సిమ్‌కార్డులు, జీశాన్‌కు చెందిన 2 సిమ్ కార్డుల డేటాను పరిశీలించి.. ఎవరెవరికి ఫోన్ కాల్స్ వెళ్లిందీ నిర్ధారించుకున్నారు. అత్యధికంగా 27 మంది సినీ ప్రముఖుల ఫోన్ నంబర్లకు కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. అందులో 12 మందికి మాత్రం నోటీసులు జారీ చేశారు. ఇందులో రవితేజ, పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, ఛార్మి, ముమైత్‌ఖాన్, నవదీప్, తరుణ్‌లకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ మిగతావారికి నోటీసులు జారీ చేయలేదు. వారి పేర్లు బయటికి రాలేదు. దీనిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. మిగతా 15 మందికి నోటీసులు ఎందుకు జారీ చేయలేదన్న వాదన వినవస్తోంది. ఇక కావాలనే కొంత మందిని డ్రగ్స్ కేసులోకి లాగుతున్నారని వర్ధమాన నటుడు నందు ఆరోపించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లారు. తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని.. ఆ ప్రచారం తప్పని రుజువు చేసుకోవడానికే వచ్చానన్నారు. అధికారులెవరూ లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు తమకు ఎలాంటి నోటీసులు రాకున్నా తమ పేర్లు ప్రచారం కావడంపై ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, శ్యామ్‌కే నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
పలుకుబడితో తొక్కిపెడుతున్నారు?
బడా నిర్మాతలు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, హీరో హీరోయిన్లకు డ్రగ్స్‌ను అలవాటు చేసిన వారి పేర్లు, నిర్మాతల తనయుల పేర్లు బయటికి రాకుండా తొక్కిపెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చారని.. అందువల్లే ఎక్సైజ్ సిట్ నోటీసులు ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా గానీ, ఆర్థికంగా గానీ పలుకుబడి లేనివారికి మాత్రమే ఎక్సైజ్ సిట్ నోటీసులు వచ్చాయని ప్రచారం జరుగుతోంది.
ఆ 15 మంది వీరే..!
సినీ పరిశ్రమకు చెందిన 27 మంది ప్రముఖులకు డ్రగ్స్‌తో లింకు ఉన్నట్లు గుర్తించగా.. అందులో నోటీసులిచ్చినట్లుగా 12 మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మిగతా 15 మంది ఎవరనే దానిపై ఎక్సైజ్ వర్గాలు పలు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. వీరే ఆ ప్రముఖులు..
⇒ ఆయన ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి. అనుకోకుండా క్రేజీ స్టార్‌తో అత్యంత హిట్ సినిమాకు దారివేసిన నిర్మాత ఈయన.
⇒ మరొకరు కుటుంబ కథనాలు, చిన్న సినిమాలను వేదికగా చేసుకుంటూ భారీ హిట్లు కొట్టిన నిర్మాత. తన సొంత బ్యానర్‌తో కుర్రహీరోతో తెలుగు ఇండస్ట్రీలోకి దూసుకొచ్చారు.
⇒ మరో ప్రముఖ నిర్మాత ఇద్దరు తనయులూ డ్రగ్స్ ‘బంధం’లో ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తమ పాత్ర కీలకమైనదని చెప్పుకొనే పలు కుటుంబాల్లో వీరూ ఒకరు. ఈ కుటుంబానికి చెందిన వారంతా సినీ పరిశ్రమలో రాణిస్తున్నవారే. గతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న డ్రగ్స్ కేసుల్లో ఈ ప్రొడ్యూసర్ తనయుల పేర్లు చాలా సార్లు వినిపించాయి. వీరిలో చిన్న కుమారుడికి కెల్విన్ ద్వారా.. పెద్ద కుమారుడికి మరో కుర్రహీరో ద్వారా డ్రగ్స్ అందినట్లు సిట్ ఆధారాలు సంపాదించింది.
⇒ 2011, 2012 సంవత్సరాల్లో ప్రముఖ హీరోలతో రెండు, మూడు సినిమాల్లో నటించి.. ఫ్లాప్ హీరోయిన్లుగా ముద్రపడిన ఇద్దరు హీరోయిన్లు ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది.
⇒ 2009లో ఇండస్ట్రీలో అడుగుపెట్టి కుర్ర హీరోలతో వరుస హిట్లు కొట్టి.. ప్రస్తుతం బాలీవుడ్‌కు చెక్కేసిన మరో ప్రముఖ హీరోయిన్ తన మేనేజర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నట్టు సిట్ వర్గాలు గుర్తించాయి. కెల్విన్ ఫోన్‌కు పదే పదే కాల్స్ వచ్చిన ఓ ఫోన్ నంబర్‌పై సిట్ అధికారులు దర్యాప్తు చేయగా.. అతను హీరోయిన్ మేనేజర్ అని, మాదాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉన్న కార్యాలయం అడ్రస్ పేరు మీద సిమ్ తీసుకున్నాడని తేల్చారు.
⇒ ఇక వేగంగా సినిమాలు తీస్తాడని పేరుపొందిన ప్రముఖ దర్శకుడి ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు కెల్విన్‌తో టచ్‌లో ఉన్నట్టు అనాలిసిస్లో బయటపడింది.
⇒ రవితేజ తమ్ముడు భరత్‌తో పదే పదే పార్టీలు, పబ్‌లకు వెళ్లిన ఓ సహాయనటుడు, ప్రముఖ హీరోకు మేనేజర్‌గా పనిచేసే నటుడు నిత్యం జీశాన్‌తో టచ్‌లో ఉండేవాడని వెల్లడైంది.
⇒ మేకప్‌మెన్, డ్రైవర్ల పేరుతో సిమ్‌కార్డులు తీసుకొని డ్రగ్స్ వాడుతున్న ఒక విలక్షణ దర్శకుడికి కూడా డ్రగ్స్ వ్యవహారంతో లింకున్నట్టు చెబుతున్నారు. ఏప్రిల్‌లో రాయదుర్గం పరిధిలోని ఓ ఫాంహౌజ్‌లో ఈ దర్శకుడికి తాను డ్రగ్స్ సరఫరా చేసినట్టు జీశాన్ విచారణలో వెల్లడించినట్టు సిట్ అధికారులు తెలిపారు.
⇒ 2013 వరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడపాదడపా సినిమాలు చేసి ప్రముఖ హీరోతో సినిమా తీసి సంచలనం రేపిన నటుడు, నిర్మాతకు కూడా డ్రగ్స్ లింకు ఉందని సిట్ భావిస్తోంది. ఆయన తన ఫాంహౌజ్‌లో పనిచేసే సహాయకుడి పేరుతో సిమ్‌కార్డు తీసుకొని జీశాన్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నారు.
⇒ఆయనొకప్పుడు ఫ్యామిలీ హీరో.. వయసు పెరిగినా కొద్దీ ఏ క్యారెక్టరైనా చేసేందుకు సిద్ధమయ్యారు. విలక్షణ నటుడిగా పేరుగాంచిన ఈ హీరోకు సైతం డ్రగ్స్ లింకు బయటపడడం సంచలనం రేపుతోంది. ఆయన మేనేజర్ ఫోన్ నంబర్ నుంచి కెల్విన్‌తో కాంటాక్టులో ఉన్నట్లు సిట్ గుర్తించింది.
సినీ ‘బంధం’కుదిరిందెలా?
బీటెక్ చదివి బ్యాంకులో ఉద్యోగం చేసిన కెల్విన్.. గ్రాడ్యుయేషన్ చేసి ప్రముఖ రెస్టారెంట్లో మేనేజర్‌గా పనిచేస్తున్న జీశాన్.. ఇద్దరూ అడ్డదారి సంపాదన కోసం డ్రగ్స్ దందాకు తెరలేపారు. విద్యార్థులు, సినీ ప్రముఖులకు డ్రగ్స్‌ను సరఫరా చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ ఇద్దరికి సినీ పరిశ్రమలో లింకులు ఎలా కుదిరాయి? ప్రముఖ నిర్మాతలు, దర్శకులు ఎలా పరిచయమయ్యారు? వాళ్లు డార్క్‌నెట్‌లో ఆర్డర్ చేస్తే వీళ్లు సరఫరా చేయడం వెనుకున్న ఆంతర్యం ఏమిటన్న విషయాలు ఎక్సైజ్ అధికారులకు సవాలు విసురుతున్నాయి. అయితే క్లబ్బులు, సినీ పార్టీలు, పబ్బుల్లో లైవ్‌షోలు, ఈవెంట్లు నిర్వహించడంతో.. సినీ పరిశ్రమకు చెందినవారితో కెల్విన్‌కు పరిచయాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. 2008 నుంచి 2013 వరకు గంజాయి వినియోగించిన కెల్విన్... దానిని సినీ పరిశ్రమకు చెందిన పలువురికి అలవాటు చేశాడు. ఆ తర్వాత డార్క్‌నెట్ ద్వారా ఎల్ఎస్డీ, ఎండీఎంఏ డ్రగ్స్‌ను తెప్పిస్తూ.. బడా నిర్మాతలు, దర్శకులకు, హీరోయిన్లకు సరఫరా చేసినట్టు ఎక్సైజ్ సిట్ గుర్తించింది. దీనిపై కెల్విన్‌ను విచారించగా.. పలు కీలక విషయాలు వెల్లడించాడు. డార్క్‌నెట్ నుంచి తెప్పించుకున్న ఎల్ఎస్డీ డ్రగ్స్‌ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు, పలువురు నిర్మాతలకు సరఫరా చేసినట్లుగా బయటపెట్టినట్లు ఎక్సైజ్ శాఖలో పనిచేసే కీలక అధికారి ఒకరు తెలిపారు.
జీశాన్.. మేనేజర్ టు డ్రగ్ పెడ్లర్
హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో నివసించే జీశాన్ అలీ అలియాస్ జాక్ (23) మొఘల్ బావర్చి హోటల్లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పలు ఈవెంట్ల (వేడుకలు, ఇతర కార్యక్రమాలు)కు మేనేజర్‌గా కూడా పనిచేస్తున్నాడు. అలా ఈవెంట్ల సమయంలోనే హీరో రవితేజ డ్రైవర్ శ్రీనివాసరాజుతో జీశాన్‌కు పరిచయం ఏర్పడినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఆ క్రమంలో రవితేజ సోదరుడు భరత్‌తో స్నేహం ఏర్పడిందని.. డార్క్‌నెట్ ద్వారా డ్రగ్స్ తెప్పించడం సులువన్న విషయాన్ని భరత్‌కు జీశానే చెప్పాడని విచారణలో బయటపడింది. భరత్, శ్రీనివాస్రాజులకు జీశాన్ కొకైన్ సరఫరా చేసి ఉంటాడా? రవితేజకు తమ్ముడు భరత్ ద్వారా డ్రగ్స్ వెళ్లాయా? లేక శ్రీనివాసరాజు ద్వారా వెళ్లాయా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని సిట్ అధికారులు తెలిపారు. వారికి నోటీసులు ఇచ్చామని, విచారణలో విషయం బయటపడుతుందని పేర్కొన్నారు.
(చదవండి.. డ్రగ్స్ కేసు: సినిమా ప్రముఖుల పేర్లు వెల్లడి!)
(టాలీవుడ్‌ను ఆడిపోసుకుంటున్నారు: జీవిత)