బడా నిర్మాతలు...ఛోటా సినిమాలు! | big producers Short Movies in telugu cinema industry | Sakshi
Sakshi News home page

బడా నిర్మాతలు...ఛోటా సినిమాలు!

Published Mon, Oct 3 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

బడా నిర్మాతలు...ఛోటా సినిమాలు!

బడా నిర్మాతలు...ఛోటా సినిమాలు!

గది నిండా కాసులే !
సరిగ్గా ఏడాది క్రితం రిలీజ్ అయిన ‘రాజుగారి గది’ గుర్తుందా? తన తమ్ముడు అశ్విన్‌ని హీరోగా పెట్టి ఓంకార్ డెరైక్ట్ చేసిన సినిమా ఇది. సినిమా అయితే బాగానే తీశాడు కానీ, రిలీజ్ చేయడం ఎలా? నిర్మాత సాయి కొర్రపాటి సీన్లోకి రావడంతో సమస్య సాల్వ్ అయిపోయింది. ఈ సినిమా మీద నమ్మకంతో ఆయన రిలీజ్ చేశారు. సినిమా సూపర్ హిట్. ‘రాజుగారి గది’లో డబ్బులే డబ్బులు.
 
మరి, సాయి కొర్రపాటి ఏమైనా చిన్న నిర్మాతా? కాదు.. టెక్నికల్ వండర్ ‘ఈగ’ తీశారు. సూపర్ డూపర్ హిట్ సినిమా ‘లెజెండ్’ నిర్మాతల్లో ఆయనా ఒకరు. ఇలాంటి బడా చిత్రాల నిర్మాత అయినా ఛోటా సినిమాలంటే ఆయనకు మక్కువ. అందుకే తన వారాహి చలన చిత్రమ్ బేనర్లో స్మాల్, మీడియమ్ బడ్జెట్ సినిమాలు తీస్తుం టారు. ఇరవై, నలభై కోట్లతో సినిమాలు తీసే సాయి రెండు కోట్లలోపు స్మాల్ బడ్జెట్ సినిమాలూ తీస్తుండడం విశేషం.
 
కొత్త ఊపిరి

ఒక్క హిట్ చూశాక మనసు ఆగదు. ఆ హిట్‌ని కొనసాగించాలనుకుంటారు. అందుకే ‘రాజుగారి గది’కి సీక్వెల్ చేయాలనుకున్నారు ఓంకార్. మొదటి భాగానికి సాయి కొర్రపాటి అండగా నిలిస్తే... రెండో భాగానికి ఎవరి సపోర్ట్ దొరికిందో తెలుసా? పొట్లూరి వి. ప్రసాద్ (పీవీపీ). ఆయన తీసినవి మామూలు సినిమాలు కాదు. ‘బలుపు, వర్ణ, సైజ్ జీరో, ఊపిరి, బ్రహ్మోత్సవం’... ఇలా అన్నీ పెద్ద బడ్జెట్ సినిమాలే. ఇప్పుడేమో తెలుగు, హిందీ భాషల్లో ‘ఘాజి’ అనే సినిమా తీస్తున్నారు. భారతీయ భాషల్లో తొలి జలాంతర్గామి నేపథ్య సినిమా ఇది. మొత్తం నీటి లోపలే ఉంటుంది. చాలా పెద్ద బడ్జెట్. ఈ సినిమా తీస్తూనే కథ నచ్చి, చిన్న బడ్జెట్ ‘క్షణం’ చిత్రానికి అండగా నిలిచారు. తీసినవాళ్ళకీ, కొన్న పీవీపీకీ దిల్ ఖుష్ చేసిన సినిమా ఇది. అదే ఊపుతో ఇప్పుడు ‘రాజుగారి గది 2’కి పీవీపీ సపోర్ట్ చేస్తున్నారు. అలా చిన్న సినిమాలకు ఈ పెద్ద నిర్మాత ఊపిరి అవుతున్నారు.
 
బిగ్ హెల్ప్

సరే.. సాయి కొర్రపాటి, పీవీపీ అంటే ఇప్పుడొచ్చినోళ్లు. ఎప్పట్నుంచో బడా నిర్మాతల్లో ఒకరిగా ఉంటున్న డి.సురేశ్‌బాబు కూడా చిన్న సినిమాపై మొగ్గు చూపడం విశేషం. ‘పెళ్లి చూపులు’ అనే చిన్ని సినిమాకి సురేశ్‌బాబు చేసిన సపోర్ట్ చాలా ఉపయోగపడింది. ఈ సినిమా విడుదలై దాదాపు మూడు నెలలవుతున్నా ఇంకా వార్తల్లోనే ఉంది. ‘పెళ్లి చూపులు’ స్ఫూర్తితో మరిన్ని చిన్న సినిమాలు మొదలయ్యాయి. రాజ్ కందుకూరి నిర్మించిన ఈ సినిమాకి సురేశ్ ప్రొడక్షన్స్ బేనర్ తోడవ్వడం పెద్ద హెల్ప్. ఈ బేనర్‌కి ఉన్న రేంజ్ అలాంటిది. ఈ బేనర్‌పై ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు వంటి పెద్ద పెద్ద హీరోలతో బిగ్ బడ్జెట్ మూవీస్ ప్రొడ్యూస్ చేశారు డి. రామానాయుడు. అలాగే చిన్న సినిమాలు కూడా తీశారు. ఇప్పుడు సురేశ్‌బాబు కూడా ఒకవైపు పెద్ద సినిమాలు, మరోవైపు చిన్న సినిమాలు తీసి, తండ్రిని ఫాలో అవుతున్నారు.
 
దిల్ ఉన్న రాజు

‘వెళ్లిపోమాకే’... ఈ సినిమా రెండేళ్లుగా నిర్మాణంలో ఉంది. కానీ, వెలుగులోకి రాలేదు. ఉన్నట్టుండి రెండు రోజుల క్రితం లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. దానికి కారణం ‘మీ సినిమాని నేను రిలీజ్ చేస్తా’ అని ‘దిల్’ రాజు ముందుకు రావడమే. పంపిణీదారుడిగా పలు బిగ్, మీడియమ్, స్మాల్ మూవీస్‌ని విడుదల చేశారు ‘దిల్’ రాజు. నిర్మాతగా పెద్ద సినిమాలు తీశారు. ఇప్పుడు ‘వెళ్లిపోమాకే’ సినిమా మీద నమ్మకంతో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రనిర్మాతలకు పెద్ద దిల్‌తో సహాయం చేస్తున్నారు. అలా ఇప్పుడు ఛోటా సినిమాలెన్నో బడా నిర్మాతల అండతో బాక్సాఫీస్ దగ్గర బడా సందడి చేస్తున్నాయి.

చిన్న సినిమా అంటే?

చిన్న సినిమా అంటే ఏంటి? ఎంతలో తీస్తారు? అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఏమీ లేదండి.. కోటి రూపాయల నుంచి రెండు కోట్ల లోపు తీసేవాటిని చిన్న సినిమాలంటారు. ఈ బడ్జెట్ బడా నిర్మాతలకు చాలా ఛోటా. సునాయాసంగా తీసేస్తారు. అఫ్‌కోర్స్ డబ్బుంటే కొత్తవాళ్లైనా సులువుగానే తీసేస్తారు. కాకపోతే.. బడా నిర్మాత తీస్తే.. ప్రమోషన్ ఈజీ అవుతుంది. సినిమా విడుదలకు ముందే నలుగురికీ తెలుస్తుంది. అదే చిన్నవాళ్లు తీస్తే.. సినిమా రిలీజై, బాగుందనే టాక్ వస్తేనే.. అప్పుడు జనాలు థియేటర్‌కి వస్తారు. సో.. పెద్ద నిర్మాతలు చిన్న సినిమాలు తీయడం మంచిదే. ముఖ్యంగా లాభాలొచ్చే సినిమాలు తీస్తే..  కొన్నవాళ్ల పంట పండినట్లే.
 
‘ఉయ్యాల జంపాల’... రాజ్ తరుణ్, అవికా గోర్‌కు హీరో హీరోయిన్లుగా మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా. చిన్న సినిమా అయినప్పటికీ మంచి వసూళ్లు రాబట్టి, పెద్ద సినిమాగా నిలవడంతో.. ఆ తర్వాత చాలామంది చిన్న సినిమాలు నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ సినిమా నిర్మించింది చిన్న బేనరేం కాదు. అక్కినేని కుటుంబపు అన్నపూర్ణ స్టూడియోస్. సురేశ్ ప్రొడక్షన్స్‌కి ఉన్నంత పేరు అన్నపూర్ణకి ఉంది. కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే నాగార్జున చిన్న సినిమాలు కూడా తీస్తుంటారు. అలా పి. రామ్మోహన్‌తో కలసి ‘ఉయ్యాల జంపాల’ తీశారు. ‘అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూల్’ వంటి మంచి మంచి సినిమాలు తీసిన రామ్మోహన్ ఇప్పుడు ‘పిట్టగోడ’ తీస్తున్నారు. మరి.. ఈ సినిమా రిలీజ్‌కు కూడా ఏదో ఒక పెద్ద బేనర్ ముందుకొచ్చే సూచనలు పుష్కలంగా ఉన్నాయి.
 
 - సినిమా డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement