‘విడిల్‌క్లాస్ మెలోడీస్’లో తండ్రి కొండలరావు పాత్రలో గోపరాజు రమణ
తిట్టే నాన్న... దండించే నాన్న... కర్ర తీసుకొని వెంటబడే నాన్న... ఎప్పుడూ కోపంగా ఉండే నాన్న.. ఎన్నడూ దగ్గరకు పిలువని నాన్న... కాని ఆ మనసులో మంచుకొండ ఉంటుంది. ఆ గుండెల్లో ఎంతో ఆర్తి ఉంటుంది. ఆ హృదయంలో పిల్లల గురించి బెంగ ఉంటుంది. మధ్యతరగతి నాన్నను సినిమా అప్పుడప్పుడు సరిగ్గా చూపిస్తుంటుంది. ఇటీవలి సినిమా ‘మిడిల్‌క్లాస్ మెలోడీస్’ చూసిన ప్రేక్షకులు తమ తండ్రుల కబుర్లలో మునుగుతున్నారు. తెలుగు సినిమాల్లో మధ్యతరగతి నాన్నల స్పెషల్ ఇది.
గుంటూరు వెళ్లి హోటల్ పెట్టాలనుకుంటాడు కొడుకు. తండ్రికి ఇంత పొడుగున పొడుచుకొచ్చింది కోపం. ‘ఏం... ఇది హోటలు కాదా... ఇక్కడ సరిగ్గా అఘోరించవచ్చుగా’ అంటాడు పల్లెటూళ్లో తాను నడుపుతున్న హోటల్‌ని చూపిస్తూ కొడుకును పట్టుకొని. కొడుక్కు మీసాలు వచ్చాయి. కండలు పెరిగాయి. ఏదో నిరూపించాలని అనుకుంటున్నాడు. తండ్రికి జుత్తు నెరిసింది. అనుభవం వచ్చింది. కొడుకు ఎక్కడ నష్టపోతాడో అని సంశయిస్తున్నాడు. కాని ఆ ముక్క మెత్తగా చెప్పడు. ఆ ముక్కను నేరుగా చెప్పడు.
తిట్టి కొట్టబోయి అదిలించబోయి చెబుతుంటాడు. కొడుక్కు తండ్రిని చూస్తే ఎంత భయమంటే ఒక్కోసారి ఎదిరించేసేంత భయం. లోకంలో చూసేవారందరికీ ఆ తండ్రికి ముక్కు మీద కోపం అని తెలుస్తూ ఉంటుంది. కాని లోకంలో అందరికీ ఆ తండ్రి మనసులో చాలా ప్రేమ ఉందని కూడా తెలుస్తూ ఉంటుంది. కొడుక్కూ తెలుసు. కాని పైకి జరిగేదంతా నాటకమే. ఇటీవల ‘ఓటిటి’ ప్లాట్‌ఫామ్‌పై విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ సినిమాలో తండ్రి ‘కొండలరావు’ పాత్రను చూసి చాలామంది తమ తండ్రుల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
గత కాలపు తండ్రి
1980ల ముందు వరకూ మధ్యతరగతి తండ్రులకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక ప్రశాంతత ఉండేది. కాని 1980ల తర్వాత తండ్రుల మీద ఒత్తిడి పెరిగింది. ఆడపిల్ల అయితే కట్నం టెన్షన్... మగపిల్లాడు అయితే ఉద్యోగం టెన్షన్. బొటాబొటి జీతంతో కుటుంబాన్ని లాగాలంటే ఎలాగో తెలియక తండ్రులు చిర్రుబుర్రుమంటూ ఉండేవారు. వారికి తమ మనసులోని ప్రేమను వ్యక్తం చేసే సమయం ఉండేది కాదు. అలాంటి మూడ్ రేర్‌గా ఉండేది. పిల్లలు ఏం చెప్పాలన్నా తల్లికే చెప్పుకునేవారు. ఈ తండ్రులు 2000 సంవత్సరం తర్వాత ముఖ్యంగా ఈ కాలంలో దాదాపుగా తగ్గిపోయారు గాని ఇవాళ ముప్పైల్లో నలభైల్లో ఉన్నవారంతా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’లోని తండ్రులను చూసినవారే.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
మీసాలు వచ్చినా తండ్రి చేతి దెబ్బలు తిన్నవారే. ‘అమ్మో.. నాన్నొచ్చాడు’ అని ఆయన గుమ్మంలో చెప్పులు విడుస్తుంటే దొడ్డి గుమ్మం నుంచి పారిపోయే కొడుకులు ఉన్నారు. ఆ కాలంలో తండ్రులు ఎక్కువగా కూతుళ్లతో అంతో ఇంతో సంభాషించేవారు. కొడుకులతో నిత్యం ఘర్షణే. ఈ ఘర్షణను ‘ఆకలి రాజ్యం’ సినిమా చూపించింది. ఆ సినిమాలో తండ్రిగా రమణమూర్తి, కొడుకుగా కమల హాసన్ చివరి వరకూ ఘర్షణలోనే ఉంటారు. వారి మధ్య సయోధ్య రాదు. చివరకు ఆ తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన తన కొడుకును తలుచుకుని ‘కూటి కోసం కూలి కోసం’ అని వేదనాభరితంగా పాడతాడు కాని దగ్గర పడితే గుండెలకు హత్తుకోడు.
తండ్రుల కన్నీరు
తెలుగు సినిమాలలో మిడిల్ క్లాస్ తండ్రులను సహజత్వానికి దగ్గరగా అతి తక్కువ సందర్భాలలో చూపిస్తుంటారు. చిరంజీవి నటించిన ‘మగ మహరాజు’లో ఉదయ భాస్కర్, ‘విజేత’లో సోమయాజులు అలాంటి తండ్రులుగా కనిపిస్తారు. రెండు సినిమాలలోనూ కొడుకుల ప్రయోజకత్వం మీద నమ్మకం లేక ఇంటి భారం తాము మోయాలనుకున్న తండ్రులే వారు. ఆ తర్వాత మధ్యతరగతిలో అతి స్నేహం ప్రదర్శించే త్రివిక్రమ్ మార్కు తండ్రులు (నువ్వే కావాలి), అతి చనువు చూపదగ్గ శ్రీను వైట్ల మార్కు తండ్రులు (ఆనందం), ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకునే పూరి జగన్నాథ్ మార్కు తండ్రులు (ఇడియట్) వచ్చారు.
కాని ‘7/జి బృందావన్ కాలనీ’ వచ్చి మిడిల్ క్లాస్ తండ్రి అలాగే భగభగలాడుతున్నాడని చూపించింది. ఆ సినిమాలోని తండ్రి చంద్రమోహన్ చిన్నపాటి ఉద్యోగం చేస్తూ కొడుకు రవికృష్ణ బాధ్యత తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఆ కొడుక్కు ఎంతకూ బాధ్యత తెలియదు. తిట్టడమే పనిగా పెట్టుకున్న చంద్రమోహన్ చివరకు రవికృష్ణ ఉద్యోగం తెచ్చుకున్నా సరే తిడతాడు. ‘ఇంతకాలం తిట్టాను. కొట్టాను. ఇప్పుడు ఉద్యోగం రాగానే ప్రేమ చూపిస్తే మా నాన్న డబ్బు కోసం యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటే...’ అని భార్య దగ్గర చెప్పి కళ్ల నీళ్లు పెట్టుకునే సన్నివేశం అందరికీ గుర్తుంటుంది.
7/జి బృందావన్ కాలనీ
తండ్రి కోపానికి అర్థమే వేరులే
ఇళ్లల్లో కూతుళ్లు గుండెల మీద కుంపటిలా కూచుని ఉన్నారు అని గతంలో అనేవారు గాని ఇంకా బాధ్యత తెలుసుకోని కొడుకు అసలైన కుంపటి అని మధ్యతరగతి తండ్రి భావిస్తాడు. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలో వెంకటేష్ బాధ్యత తెలుసుకోడు. భార్య చనిపోయి ఇంటిని, ఉద్యోగాన్ని చూసుకుంటున్న తండ్రి గురించి ఆలోచించడు. గాలివాటుకు పోతుంటాడు. ప్రేమగా ఒక్కమాట మాట్లాడింది లేదు. కాని ఆ తండ్రి చనిపోతేనే ఆయన విలువ తెలుసుకుని విలవిలలాడతాడు. ఇక చిన్న కొడుకు ప్రయోజకుడయ్యి పెద్ద కొడుకు వృథాగా ఉంటే ఆ తండ్రి అవస్థ ఎలా ఉంటుందో ‘రఘువరన్’లో చూశాం.
నీదీ నాదీ ఒకే కథ
తన మర్యాద పోకుండా కొడుకు మర్యాద చెడకుండా ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటం చాలా కష్టమైన పని అని ఆ తండ్రీ కొడుకులు తెలుసుకుని మాటల్లో చేతల్లో దాగుడుమూతలు ఆడుతూ ఉంటారు. కొడుకును చిన్న మాట అనకుండా ‘మనం కష్టపడ్డాం వాణ్ణన్నా సుఖపడనీ’ అనుకునే తండ్రిని ‘కొత్త బంగారు లోకం’లో, కొడుకులు తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటారులే అని హాయిగా నవ్వేస్తూ తిరిగే ‘సీతమ్మ వాకిట్లో’... తండ్రిని కూడా చూశాం. కాని మధ్యతరగతి తండ్రికి కొడుకు మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయని, వాటిని అందుకోకపోతే ఆ తండ్రి హర్ట్ అవుతాడని కనీసం వాటి కోసం కొడుకు ప్రయత్నించాల్సిందేనని ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాలోని తండ్రి మళ్లీ మనకు చెబుతాడు. అయితే ఆ సినిమాలోని కొడుకు ‘నా స్థాయి ఇంతే. నా బతుకు ఈ మాత్రమే. దానిని నువ్వు స్వీకరించు’ అని చివరి వరకూ డిమాండ్ పెడుతూనే ఉంటాడు.
ఫుల్ బనియన్,.. భుజాన టవల్
కాలం ఎంత మారినా ఒంటి మీద ఫుల్ బనియన్, భుజాన టవల్ ఉండే మధ్యతరగతి తండ్రి మారడు. ఆ తండ్రి తన ఇంటిని మర్యాదతో గౌరవంతో నడపడానికి అవస్థ పడక మానడు. పిల్లలు ఎదిగొచ్చి ఆ మధ్యతరగతి మర్యాదలను కొనసాగించాలని, నలుగురిలో ఉన్నంతలో పరువూ మర్యాదతో బతికేలా స్థిరపడాలని తాపత్రయ పడే తండ్రికి కాలదోషం ఉండదు. ఆ తండ్రి నిత్యసజీవుడు. తండ్రులకు కొడుకులు అర్థం కావడం, కొడుకులు తండ్రిని అర్థం చేసుకునే స్థాయికి ఎదగడం కొనసాగుతూనే ఉంటుంది. ఆ నడిమధ్యన కొన్ని పాత్రలు స్క్రీన్ మీద వారిని రిప్రజెంట్ చేసి తళుక్కున మెరుస్తుంటాయి. ఆ క్షణంలో మనకు మన పెరటి చెట్టు కాయ వొకటి తెంపి కొరికినట్టుగా మనసు రుచితో నిండుతుంది. ఇటీవల సినిమా తండ్రులను చూస్తే కలుగుతున్న భావన అదే. – సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment