Short movies
-
షార్ట్ కట్
-
బడా నిర్మాతలు...ఛోటా సినిమాలు!
గది నిండా కాసులే ! సరిగ్గా ఏడాది క్రితం రిలీజ్ అయిన ‘రాజుగారి గది’ గుర్తుందా? తన తమ్ముడు అశ్విన్‌ని హీరోగా పెట్టి ఓంకార్ డెరైక్ట్ చేసిన సినిమా ఇది. సినిమా అయితే బాగానే తీశాడు కానీ, రిలీజ్ చేయడం ఎలా? నిర్మాత సాయి కొర్రపాటి సీన్లోకి రావడంతో సమస్య సాల్వ్ అయిపోయింది. ఈ సినిమా మీద నమ్మకంతో ఆయన రిలీజ్ చేశారు. సినిమా సూపర్ హిట్. ‘రాజుగారి గది’లో డబ్బులే డబ్బులు. మరి, సాయి కొర్రపాటి ఏమైనా చిన్న నిర్మాతా? కాదు.. టెక్నికల్ వండర్ ‘ఈగ’ తీశారు. సూపర్ డూపర్ హిట్ సినిమా ‘లెజెండ్’ నిర్మాతల్లో ఆయనా ఒకరు. ఇలాంటి బడా చిత్రాల నిర్మాత అయినా ఛోటా సినిమాలంటే ఆయనకు మక్కువ. అందుకే తన వారాహి చలన చిత్రమ్ బేనర్లో స్మాల్, మీడియమ్ బడ్జెట్ సినిమాలు తీస్తుం టారు. ఇరవై, నలభై కోట్లతో సినిమాలు తీసే సాయి రెండు కోట్లలోపు స్మాల్ బడ్జెట్ సినిమాలూ తీస్తుండడం విశేషం. కొత్త ఊపిరి ఒక్క హిట్ చూశాక మనసు ఆగదు. ఆ హిట్‌ని కొనసాగించాలనుకుంటారు. అందుకే ‘రాజుగారి గది’కి సీక్వెల్ చేయాలనుకున్నారు ఓంకార్. మొదటి భాగానికి సాయి కొర్రపాటి అండగా నిలిస్తే... రెండో భాగానికి ఎవరి సపోర్ట్ దొరికిందో తెలుసా? పొట్లూరి వి. ప్రసాద్ (పీవీపీ). ఆయన తీసినవి మామూలు సినిమాలు కాదు. ‘బలుపు, వర్ణ, సైజ్ జీరో, ఊపిరి, బ్రహ్మోత్సవం’... ఇలా అన్నీ పెద్ద బడ్జెట్ సినిమాలే. ఇప్పుడేమో తెలుగు, హిందీ భాషల్లో ‘ఘాజి’ అనే సినిమా తీస్తున్నారు. భారతీయ భాషల్లో తొలి జలాంతర్గామి నేపథ్య సినిమా ఇది. మొత్తం నీటి లోపలే ఉంటుంది. చాలా పెద్ద బడ్జెట్. ఈ సినిమా తీస్తూనే కథ నచ్చి, చిన్న బడ్జెట్ ‘క్షణం’ చిత్రానికి అండగా నిలిచారు. తీసినవాళ్ళకీ, కొన్న పీవీపీకీ దిల్ ఖుష్ చేసిన సినిమా ఇది. అదే ఊపుతో ఇప్పుడు ‘రాజుగారి గది 2’కి పీవీపీ సపోర్ట్ చేస్తున్నారు. అలా చిన్న సినిమాలకు ఈ పెద్ద నిర్మాత ఊపిరి అవుతున్నారు. బిగ్ హెల్ప్ సరే.. సాయి కొర్రపాటి, పీవీపీ అంటే ఇప్పుడొచ్చినోళ్లు. ఎప్పట్నుంచో బడా నిర్మాతల్లో ఒకరిగా ఉంటున్న డి.సురేశ్‌బాబు కూడా చిన్న సినిమాపై మొగ్గు చూపడం విశేషం. ‘పెళ్లి చూపులు’ అనే చిన్ని సినిమాకి సురేశ్‌బాబు చేసిన సపోర్ట్ చాలా ఉపయోగపడింది. ఈ సినిమా విడుదలై దాదాపు మూడు నెలలవుతున్నా ఇంకా వార్తల్లోనే ఉంది. ‘పెళ్లి చూపులు’ స్ఫూర్తితో మరిన్ని చిన్న సినిమాలు మొదలయ్యాయి. రాజ్ కందుకూరి నిర్మించిన ఈ సినిమాకి సురేశ్ ప్రొడక్షన్స్ బేనర్ తోడవ్వడం పెద్ద హెల్ప్. ఈ బేనర్‌కి ఉన్న రేంజ్ అలాంటిది. ఈ బేనర్‌పై ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు వంటి పెద్ద పెద్ద హీరోలతో బిగ్ బడ్జెట్ మూవీస్ ప్రొడ్యూస్ చేశారు డి. రామానాయుడు. అలాగే చిన్న సినిమాలు కూడా తీశారు. ఇప్పుడు సురేశ్‌బాబు కూడా ఒకవైపు పెద్ద సినిమాలు, మరోవైపు చిన్న సినిమాలు తీసి, తండ్రిని ఫాలో అవుతున్నారు. దిల్ ఉన్న రాజు ‘వెళ్లిపోమాకే’... ఈ సినిమా రెండేళ్లుగా నిర్మాణంలో ఉంది. కానీ, వెలుగులోకి రాలేదు. ఉన్నట్టుండి రెండు రోజుల క్రితం లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. దానికి కారణం ‘మీ సినిమాని నేను రిలీజ్ చేస్తా’ అని ‘దిల్’ రాజు ముందుకు రావడమే. పంపిణీదారుడిగా పలు బిగ్, మీడియమ్, స్మాల్ మూవీస్‌ని విడుదల చేశారు ‘దిల్’ రాజు. నిర్మాతగా పెద్ద సినిమాలు తీశారు. ఇప్పుడు ‘వెళ్లిపోమాకే’ సినిమా మీద నమ్మకంతో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రనిర్మాతలకు పెద్ద దిల్‌తో సహాయం చేస్తున్నారు. అలా ఇప్పుడు ఛోటా సినిమాలెన్నో బడా నిర్మాతల అండతో బాక్సాఫీస్ దగ్గర బడా సందడి చేస్తున్నాయి. చిన్న సినిమా అంటే? చిన్న సినిమా అంటే ఏంటి? ఎంతలో తీస్తారు? అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఏమీ లేదండి.. కోటి రూపాయల నుంచి రెండు కోట్ల లోపు తీసేవాటిని చిన్న సినిమాలంటారు. ఈ బడ్జెట్ బడా నిర్మాతలకు చాలా ఛోటా. సునాయాసంగా తీసేస్తారు. అఫ్కోర్స్ డబ్బుంటే కొత్తవాళ్లైనా సులువుగానే తీసేస్తారు. కాకపోతే.. బడా నిర్మాత తీస్తే.. ప్రమోషన్ ఈజీ అవుతుంది. సినిమా విడుదలకు ముందే నలుగురికీ తెలుస్తుంది. అదే చిన్నవాళ్లు తీస్తే.. సినిమా రిలీజై, బాగుందనే టాక్ వస్తేనే.. అప్పుడు జనాలు థియేటర్‌కి వస్తారు. సో.. పెద్ద నిర్మాతలు చిన్న సినిమాలు తీయడం మంచిదే. ముఖ్యంగా లాభాలొచ్చే సినిమాలు తీస్తే.. కొన్నవాళ్ల పంట పండినట్లే. ‘ఉయ్యాల జంపాల’... రాజ్ తరుణ్, అవికా గోర్‌కు హీరో హీరోయిన్లుగా మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా. చిన్న సినిమా అయినప్పటికీ మంచి వసూళ్లు రాబట్టి, పెద్ద సినిమాగా నిలవడంతో.. ఆ తర్వాత చాలామంది చిన్న సినిమాలు నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ సినిమా నిర్మించింది చిన్న బేనరేం కాదు. అక్కినేని కుటుంబపు అన్నపూర్ణ స్టూడియోస్. సురేశ్ ప్రొడక్షన్స్‌కి ఉన్నంత పేరు అన్నపూర్ణకి ఉంది. కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే నాగార్జున చిన్న సినిమాలు కూడా తీస్తుంటారు. అలా పి. రామ్మోహన్‌తో కలసి ‘ఉయ్యాల జంపాల’ తీశారు. ‘అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూల్’ వంటి మంచి మంచి సినిమాలు తీసిన రామ్మోహన్ ఇప్పుడు ‘పిట్టగోడ’ తీస్తున్నారు. మరి.. ఈ సినిమా రిలీజ్‌కు కూడా ఏదో ఒక పెద్ద బేనర్ ముందుకొచ్చే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. - సినిమా డెస్క్ -
ప్రేమించాలా.. వద్దా?
‘‘చిన్న సినిమాలు విజయవంతం అయితేనే మరికొంత మంది నిర్మాతలు చిత్రాలు తీసేందుకు ముందుకు వస్తారు. వైజాగ్‌కు చెందినవారంతా ఈ చిత్రం నిర్మించారు. వైజాగ్ కూడా సినిమా హబ్ కావాలి’’ అని దర్శక- నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. జి. నౌషాద్ దర్శకత్వంలో జీకే సినిమాస్ పతాకంపై జీవీ రమణ, సి. సంతోష్ కుమారి నిర్మించిన చిత్రం ‘లవ్ చెయ్యాలా వద్దా?’. గౌతమ్ డానీ అందించిన ఈ చిత్రం పాటలను తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ‘‘చిన్న సినిమాలు సక్సెస్ అయితే చాలామంది స్ఫూర్తి పొంది మరిన్ని చిత్రాలు తీసేందుకు ముందుకొస్తారు’’ అని దర్శకుడు కల్యాణ్ కృష్ణ అన్నారు. హీరో కార్తీక్ మాట్లాడుతూ- ‘‘నేను పదో తరగతి చదువుతున్నప్పుడు వచ్చిన ‘ఇడియట్’ చిత్రం చూసి అమ్మాయిలతో ర్యాష్‌గా ప్రవర్తించేవాణ్ణి. అప్పుడు జరిగిన ఓ సంఘటన తర్వాత ఇక ర్యాష్‌గా ఉండటం మానేశా. ఇప్పుడీ చిత్రంలో అటువంటి పాత్రనే చేశా’’ అని చెప్పారు. -
మన్ పసంద్
ఓ చక్కని సాయంత్రం, వేడి వేడి సమోసాలు, మంచి ఇరానీ చాయ్.. వీటితో పాటు చక్కటి బుల్లి సినిమాలు వరుసగా ప్లే అవుతుంటే... ఇంక చెప్పేదేముంది... ఓ హైదరాబాదీకి నచ్చే మన్ పసంద్ ఈవెనింగ్ బుధవారం లామకాన్‌లో సాగింది. రెండున్నర గంటలపాటు తెలుగు, తమిళ, ఇంగ్లిష్ భాషల్లో ప్రదర్శించిన షార్ట్ఫిలింస్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఆక్టోపస్ స్టూడియోస్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఏ షార్ట్ ఈవెనింగ్ విత్ ఫిలింస్ - 15’ ప్రదర్శనలో మొత్తం 8 చిత్రాలను ప్రదర్శించారు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ఈ స్క్రీనింగ్ కోసం యూకే, అమెరికా నుంచి కూడా ఎంట్రీలు వస్తుంటాయని ఆక్టోపస్ స్టూడియోస్ ఫౌండర్ రాహుల్‌రెడ్డి తెలిపారు. ఈసారి దాదాపు 120 చిత్రాలు స్క్రీనింగ్ కోసం వచ్చాయని... అందులో 8 చిత్రాలను సెలెక్ట్ చేసి ప్రదర్శించావుని చెప్పారు. ప్రదర్శించిన వాటిలో ‘కాంట్రాక్ట్, హ్యపీ బర్త్‌డే, మదర్స్‌డే, అయ్యో’ చిత్రాలు వైవిధ్యంతో అలరించారుు. - సాక్షి, సిటీ ప్లస్ -
సంగీత వంశీ
కళ ఒక సంగీత దర్శకుడిగా ఎక్కువకాలం నిలబడాలంటే, సంగీతం మీద పిపాస, మంచి ట్యూన్స్ చేయాలనే ఆసక్తి, వృత్తి పట్ల నిబద్ధత, దీక్ష, కృషి, పట్టుదల ఇవన్నీ ఉండితీరాలి. వంశీకి ఇటువంటి బలమైన కోరికలు ఉంటే, ఉత్తమసంగీత దర్శకుడు అవడానికి అంతకన్నా ఇంకేం కావాలి. మ్యూజిక్... వెస్ట్రన్... రాక్... పాప్... నేటి తరానికి ఇదొక ప్యాషన్... ఇంటర్నెట్లో మ్యూజిక్ నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటూ... వాద్యపరికరాలను కూడా అందులోనే తీసుకుంటూ... స్వయంగా సంగీత దర్శకత్వం చేస్తున్నారు... పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే సంగీత ప్రపంచంలో... చిన్నదో పెద్దదో... తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నారు. లఘుచిత్రాలతో కెరీర్ ప్రారంభించి... చలనచిత్రాల స్థాయికి ఎదుగుతున్నారు... ‘ఓ సఖీ’ ఆల్బమ్ (టాప్ టెన్‌లో ఉంది) తో 2011లో సంగీత జీవితం ప్రారంభించి, చలనచిత్రాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేసే స్థాయికి ఎదిగాడు వంశీ. ‘‘నాకు చిన్నప్పటి నుంచి కీబోర్డ్ అంటే చాలా ఇష్టం. కీబోర్డులో సరిగమల అభ్యాసానికి నాన్నగారే శ్రీకారం చుట్టారు. నాకు చదువు మీద అంతగా శ్రద్ధ లేదు. అందువల్ల చదువు మానేసి హైదరాబాద్ వచ్చాను. హిందుస్థానీ, పాశ్చాత్యం... ఈ రెండు సంప్రదాయ సంగీతాలనూ నేర్చుకున్నాను. సంగీతంతో పాటు డిజిటల్ రికార్డింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ నేర్చుకున్నాను. సంగీతం మీద ఉన్న అభిరుచి కొద్దీ, కొద్దిమంది మిత్రులతో కలసి ‘వేవ్ బ్యాండ్’ అని ఒక మ్యూజికల్ బ్యాండ్ ఏర్పాటుచేశాను’’ అంటూ వంశీ తన సంగీత ప్రయాణాన్ని వివరించారు. ‘పెళ్లి పుస్తకం’ లోని పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది’’ అంటున్న వంశీ యూ ట్యూబ్‌లో ప్రముఖుల సంగీత కచ్చేరీలు చూసి పరిజ్ఞానం పెంచుకుంటున్నారు. ఇప్పటి వరకు అనేక చలనచిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేశాడు. కొన్ని చిత్రాలకు అసిస్టెంట్‌గానూ చేశాడు. ఒక పక్కన సంగీతం నేర్చుకుంటూనే మరో పక్క అతి కష్టం మీద పదవ తరగతి పూర్తి చేశాడు. ‘స్వామిరారా’, ‘ఉయ్యాలా జంపాలా’ వంటి చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన సన్నీ దగ్గర అసిస్టెంట్ ఆడియో ఇంజనీర్‌గా కొన్ని నెలలు పనిచేశాక, తాను చేస్తున్న పని పట్ల అంత సంతృప్తి కలగలేదు. ‘‘కీ బోర్డు నేర్చుకోవాలనే కోరిక నానాటికీ పెరుగుతూ వచ్చింది. దాంతో ఉద్యోగం వదిలేసి, పూర్తి సమయాన్ని కీ బోర్డు నేర్చుకోవడం కోసం కేటాయించాను’’ అని చెబుతాడు వంశీ. సినిమా సంగీతానికి ఎంతో అవసరమైన పాశ్చాత్య సంప్రదాయ సంగీతం తనకు తానుగా నేర్చుకున్నారు. పెద్దపెద్ద సంగీత దర్శకుల దగ్గర కీబోర్డు ప్లేయర్‌గా పనిచేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో... ఋషి, కెమిస్ట్రీ, సరదాగా అమ్మాయితో, రొమాన్స్, నువ్వలా నేనిలా, పట్టపగలు... చలనచిత్రాలకు నేపథ్య సంగీతం అందించారు. ‘‘పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే మంచి సంగీతం చేయాలి. నా వరకు నేను మెలొడీలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాను. సంగీతం, సాహిత్యం, ఆర్కెస్ట్రా... ఒకదాన్ని ఒకటి డామినేట్ చేయకుండా ఉండేలా చూస్తున్నాను. ఆర్కెస్ట్రా తగ్గించి, భావం అర్థమయ్యేలాగ చేస్తున్నాను’’ అని చెప్పే వంశీకి ఇళయరాజా అంటే చాలా ఇష్టం. పరోక్షంగా ఆయన ప్రభావం తన మీద ఉందనీ, త్వరలోనే తనకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేలాంటి పాటలు చేస్తానని అంటున్నారు. సంగీతం చేస్తున్నప్పుడు అందరితోనూ స్నేహంగా ఉంటూ తనకు కావలసిన విధంగా వాళ్ల దగ్గర నుంచి రాబట్టుకుంటున్నారు. ఎంఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన జనగణమన, పెళ్లి పుస్తకం, ప్రేమపకోడీ, హూ ఆర్ దే? పొసెసివ్‌నెస్, మధురమే, చిట్టితల్లి... లఘుచిత్రాలకు సంగీతం చేశారు వంశీ. ‘‘పెళ్లిపుస్తకం’ పాటకు 2.5 లక్షల హిట్స్ వచ్చాయి. నాకు మంచి పేరు కూడా వచ్చింది’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు వంశీ. - డా. వైజయంతి -
అన్ని రకాల పాటలు చేయాలని...
- అజయ్, యువ సంగీత దర్శకుడు లఘుచిత్రాల ప్రభంజనం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గీతరచయితలు, సంగీత దర్శకులు, లఘుచిత్ర దర్శకులు, హీరోహీరోయిన్లుగా... యువతీయువకులు అన్ని కళలలోనూ వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఈ కోవకు చెందిన యువకుడు అజయ్ అరసాడ. ఒకవైపు లఘుచిత్రాలకు సంగీతం అందిస్తూనే, మరోవైపు సినిమాలకూ సంగీతం సమకూరుస్తున్న హైదరాబాద్‌కు చెందిన అజయ్‌తో ఇంటర్వ్యూ... మీ గురించి... వైజాగ్ గీతమ్స్‌లో బిటెక్ (ఐటీ) చేసి, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాన్నగారు నా చిన్నతనంలోనే పోయారు. అమ్మ వైజాగ్, ఐటిఐ కాలేజీలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్నారు. సంగీతం మీద ఆసక్తి ఎలా మొదలైంది? మా అక్కయ్య, మేనత్తలు వీణ వాయిస్తారు. మా తాతగారు హార్మోనియం వాయించేవారు. అలా నాకు తెలియకుండానే సంగీతం అంటే ఆసక్తి పెరిగింది. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా? ఎవరిదగ్గరా నేర్చుకోలేదు. కొన్నిరోజులు గిటార్ మీద వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నాను. కొన్ని బ్యాండ్స్‌లో వాయించేవాడిని. సంగీతం నేర్చుకోకుండా పాటలకు ట్యూన్స్ చేయడం సాధ్యమేనా? నాకు చిన్నప్పటి నుంచి కొంత స్వరజ్ఞానం ఉండటం వల్ల మ్యూజిక్ చేయగలుగుతున్నాను. అలాగే గిటార్ నేర్చుకోవడం కొంత ఉపయోగపడింది. లఘుచిత్రాలకు మీ సంగీతం గురించి చెప్పండి... ఈ విషయంలో నాకు ఫేస్బుక్ బాగా ఉపయోగపడింది. షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్లు చాలామంది నన్ను ఆ విధంగానే కాంటాక్ట్ చేసి, వాళ్ల చిత్రాలకు నా చేత ట్యూన్ చేయించుకోవడం ప్రారంభించారు. ముందర ట్యూన్ ఇచ్చేయమంటారు. ఆ తరవాత వాళ్లు పాట రాసి ఇస్తుంటారు. ఇప్పటివరకు సుమారు పదిహేను లఘుచిత్రాలకు చేశాను. నాని అనే షార్ట్‌ఫిల్మ్ డెరైక్టర్ వల్ల నేను చాలామందికి పరిచయం అయ్యాను. మీరు చేసిన మొట్టమొదటి పాట, ఆ పాటకి లభించిన స్పందన... బాలభాస్కర్ రచించిన ‘నువ్వు పాడింది’ పాట నేను చేసిన మొట్టమొదటి గీతం. ‘లక్కీ’ షార్ట్‌ఫిల్మ్‌కి చేసిన ‘కిన్నెరసాని’ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట మెలడీలో చేశాను. ‘పవన్ కల్యాణ్ ప్రేమలో పడ్డాడు’ లఘుచిత్రానికి కూడా చేశాను. పాటలకు బాణీలు ఎలా కట్టుకుంటారు? ఎక్కువగా ఎటువంటి పాటలు చేస్తుంటారు? ముందుగా నా పాటలు గిటార్ మీద ట్యూన్ చేసుకుంటాను. ఆ తరవాత మిడీ కీ బోర్డ్, ప్లగిన్స్ జాయిన్ చేసి మొత్తం ట్యూన్ చేస్తుంటాను. ‘పవన్ కల్యాణ్ ప్రేమలో పడ్డాడు’ అనే లఘుచిత్రానికి ఒక మాస్ సాంగ్ చేశాను. అందులో కూడా సితార్ వంటి సంప్రదాయ సంగీతవాద్యాలు ఉపయోగించాను. నాకు ఎక్కువగా మెలడీ అంటే ఇష్టం. మీకు ఏయే సంగీత దర్శకులంటే ఇష్టం..? నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అబ్జర్వేషన్ ఎక్కువ. దేవిశ్రీ పాటలు బాగా వినేవాడిని. ఆయన చిన్నవాడుగా అంటే 18 సంవత్సరాలకే సంగీత ప్రపంచంలోకి ప్రవేశించి, యూత్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ట్యూన్స్ చాలా క్యాచీగా ఉంటాయి. దేవిశ్రీ చేసిన పాటలను విన్న ప్రతిపదిమందిలో ఏడుగురికి తప్పనిసరిగా ఆపాటలు నచ్చుతాయి. ఆయన టాలెంట్ నన్ను బాగా ప్రభావితం చేసింది. దేవిశ్రీ మొదట్లో చేసిన 30 ఆల్బమ్స్ విని నేను సంగీత దర్శకుడిని అయ్యాను. ఇళయరాజా, ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అంటే కూడా చాలా ఇష్టం. మీ లక్ష్యం... సస్పెన్స్, లవ్, కామెడీ... ఇలా ఎన్నో చిత్రాల కు పాటలు చేశాను. నా దృష్టి అంతా రకరకాల పాటలు చేయడం మీదే ఉంది. మంచి సంగీత దర్శకుడిగా నిలబడాలన్నదే నా లక్ష్యం. - డా. వైజయంతి నాకు సంగీతం అంటే చిన్నప్పటి నుంచి ప్రాణం. నా చిన్నప్పుడు అంటే పదవ తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి అనారోగ్యం కలిగింది. మా వాళ్లు నన్ను ‘‘నీకేం కావాలి?’’ అని అడిగితే నేను ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలోని పాట కావాలని అడిగాను. నా మాటలకు అందరూ నవ్వుకున్నారు. ఆ తరవాత తెలిసింది... ఆ పాటకు సంగీతం చేసింది దేవిశ్రీప్రసాద్ అని. ఆ పాటకు ట్యూన్ చేసింది ఎవరో తెలియకుండానే నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడిని అయ్యాను. - అజయ్